తూర్పుగోదావరి

రైలు ప్రయాణీకులకు కాస్త ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 31: తునిలో చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కాకినాడ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన రైలు ప్రయాణీకులను రెవెన్యూ అధికార్లు ఆదుకున్నారు. కాకినాడ డివిజన్‌లోని పిఠాపురంలో సికింద్రాబాద్-గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. సామర్లకోటలో సికింద్రాబాద్-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్, మేడపాడులో ఢిల్లీ-విశాఖ ఎపి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి. ఊహించని విధంగా రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణీకుల ఇక్కట్లు అలవిగానివిగా మారాయి. అసలు రైళ్లు ఎప్పుడు బయలుదేరతాయో తెలియని పరిస్థితి కావడంతో మూడు రైళ్లలోని సుమారు ఆరు వేల ప్రయాణీకులు అల్లాడిపోయారు. ఈ సమాచారం అందుకున్న కాకినాడ ఆర్డీవో బిఆర్‌అంబేద్కర్ అప్రమత్తమయ్యారు. మూడు రైళ్లలోని ప్రయాణీకులకు అప్పటికప్పుడు మంచినీళ్ల ప్యాకెట్లు, బిస్కెట్లు, పాలు అందించారు. రాత్రికి మొత్తం ప్రయాణీకులందరికీ భోజనాలు ఏర్పాటుచేయించారు. రాత్రికి స్టేషన్లలో పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఆర్డీవో ప్రయాణీకులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపించడానికి కృషిచేశారు.

విధ్వంస గర్జన
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 31: కాపుల ఐక్య గర్జనలో విధ్వంసం యధేచ్ఛగా సాగింది. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా తన వ్యూహాన్ని మార్చడం ఇందుకు ప్రధాన కారణంగా మారింది. ఐక్యగర్జన విధ్వంస గర్జనగా మారింది. వాస్తవానికి ఈ కాపుల ఐక్యగర్జనలో రాష్ట్రావ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన నేతలు తమ డిమాండ్లను తెలియజేస్తారని అందరూ భావించారు. చివరిగా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ద్వారా ఐక్యగర్జనను వినిపిస్తారని అంతా అనుకున్నారు. అందుకు విరుద్ధంగా ఈ ఉద్యమాన్ని అన్నీ తానై నడిపించిన ముద్రగడ సంయమనం కోల్పోవడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడి ఆగ్రహ జ్వాలలు చెలరేగి పెను విధ్వంసం ఏర్పడింది. ఈ విధ్వంస కాండ మొదలైన తర్వాత రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగింది. ఆందోళనకారులు ముందుగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను తగలబెట్టి, అక్కడితో ఆగకుండా పోలీసులు, మీడియా ప్రతినిధులపై రాళ్ల వర్షం కురిపించారు. అప్పటికే పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. జాతీయ రహదారిని పూర్తిగా దిగ్బంధించి పోలీసులను పరుగులు పెట్టించారు. బహిరంగ సభాస్థలికి సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పార్కింగ్ చేసిన పోలీసు వాహనాలను తగులబెట్టారు. జూనియర్ డిగ్రీ కళాశాలకు చెందిన ఆస్తులకు నిప్పంటించారు. అక్కడ నుండి సమీపంలోనే ఉన్న తుని రూరల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి దాడిచేశారు. దీంతో పోలీసులు అక్కడ నుండి పరారుకావడంతో పోలీసు స్టేషన్‌కు నిప్పంటించారు. అదే సమయంలో తుని పట్టణంలోని టౌన్ పోలీసు స్టేషన్‌ను, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయానికి కూడా నిప్పంటించారు. ఎక్కడ పడితే అక్కడ కనిపించిన ప్రతిచోట విధ్వంసానికి పాల్పడడంతో తుని పట్టణం, పరిసర ప్రాంతాలలో భయానక వాతావరణం నెలకొంది. ఈ హింసాత్మక సంఘటనలో సుమారు 50 వరకూ పోలీసు వాహనాలు దగ్ధం కాగా వందలాది మంది పోలీసు సిబ్బందికి, అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. రత్నాచల్ విధ్వంసంతో సుమారు 20 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థను పునరుద్ధరించేంత వరకూ రైళ్లను నడిపే అవకాశం లేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. రత్నాచల్ రైలు దిగిన వేలాది మంది ప్రయాణీకులు తుని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రయాణీకులకు రైల్వే అధికారులు డబ్బు వాపస్ చేస్తున్నారు. తునిలో జరిగిన విధ్వంసంపై పోలీసు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఓ ప్రాథమిక నివేదిక సమర్పించారు. హింసాత్మక సంఘటనలకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ చెప్పారు. విధ్వంసానికి పాల్పడిన వారిలో కొందరు ముసుగులు ధరించి ఉన్నారని, కాపు ఐక్యగర్జన పేరుతో కొందరు విద్రోహశక్తులు ఈ విధ్వంసానికి పాల్పడ్డారని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తుని ఘటనల వెనుక వైసిపి నేత జగన్ హస్తం ఉందంటూ జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాగా ఈ దుర్ఘటన రీత్యా పలు రైళ్లను దారి మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డిఆర్‌ఎం అశోక్‌కుమార్ ప్రకటించారు. ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏ విధమైన సమాచారం కావాలన్నా ఆయా రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశామని, రాజమండ్రి, విశాఖపట్టణం, అనకాపల్లి, శ్రీకాకుళం, తుని తదితర రైల్వే స్టేషన్లలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటుచేసినట్టు తెలిపారు.

మీడియాపై ఆందోళనకారుల దాడి
-కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు ధ్వంసం-
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జనవరి 31: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో రైల్‌రోకోలో పాల్గొన్న యువకులు కొంత మంది తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ విధి నిర్వహణలో ఉన్న వివిధ టివి చానళ్ల కెమెరామెన్, ప్రెస్ ఫోటోగ్రాఫర్లపై దాడులకు దిగారు. దాదాపు 9మంది కెమెరామెన్, ఫోటోగ్రాఫర్లపై దాడి చేసి, కెమెరాలను ధ్వంసంచేసినట్టు తెలుస్తోంది. యువకుల దాడిలో ఆంధ్రభూమి ఫోటోగ్రాఫర్ ఎస్‌బి రాజేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులు ఆయన కెమెరాను, లేప్‌టాప్‌ను ధ్వంసంచేసి, కాలుతున్న రైలు బోగీల్లో వేశారు. ఎక్కడికక్కడ విలేఖర్లు కనిపిస్తే దాడి చేసే పరిస్థితి కనిపించింది. దీనితో పలువురు బతుకుజీవుడా అనుకుంటూ పరుగులు తీశారు.
మెరుపు ఉద్యమంతో షాక్
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, జనవరి 31: కాపు ఐక్య గర్జన సభలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులకు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మెరుపు ఆందోళనకు పిలుపునిస్తూ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ పెద్ద షాక్ ఇచ్చింది. ఆదివారం తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన బహిరంగ సభకు వైసిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు హాజరైన సంగతి విదితమే. లక్షలాది మంది పాల్గొంటున్న ఈసభలో కాపులను బిసి జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌ను గట్టిగా వినిపించటం ద్వారా తమ పార్టీకి కాపుల మద్దతును కూడగట్టుకోవాలని భావించిన నాయకులకు కనీసం మాట్లాడే అవకాశం కాదు కదా, సభకు పరిచయమయ్యే అవకాశం కూడా రాలేదు. సభకు వైసిపి నాయకుడు బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నాయకుడు సి రామచంద్రయ్య, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు, మాజీ మంత్రి వట్టి వసంత తదితర నాయకులతో పాటు జిల్లాకు చెందిన చాలా మంది ముఖ్యనాయకులు సభకు హాజరయ్యారు. వేదికపై కుర్చీలు వేయకూడదని ముందే నిర్ణయించటంతో పార్టీల ముఖ్యనాయకులంతా వేదికపై కుర్చీలు లేకపోయినాగానీ అలాగే కూర్చున్నారు. సభ ప్రారంభమైన తరువాత ముందుగా తమకు మాట్లాడే అవకాశం ఇస్తారని భావించిన ఈ నాయకులు చూస్తుండగానే సభ ముగిసిపోవటం, కాపు ఆందోళనకారులంతా ముద్రగడ వెనుకే రైల్‌రోకో, రాస్తారోకో కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిపోవటంతో అలాగే చూస్తూ ఉండిపోయారు. అక్కడికీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మైకు తీసుకుని కాపులను బిసిల్లో చేర్చాలని, ఈ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని రెండు మాటలు చెప్పి సంతృప్తిపడ్డారు. సభలో మాట్లాడిన వారంతా చెప్పిన అభిప్రాయాలను, సలహాలను పరిగణలోకి తీసుకుని ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారని భావించిన వారంతా ముద్రగడ మెరుగు ఆందోళన కార్యాచరణ ప్రకటనతో కంగారుపడ్డారు. పెద్దలు తనను క్షమించాలని చెబుతూనే, ‘ఇప్పుడే మనం రాస్తారోకో, రైల్‌రోకోతో ఉద్యమ కార్యాచరణను ప్రారంభించాలి. జిఓలు వచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగించాల్సిందే’, అని ముద్రగడ ప్రకటించే సరికి ఒక నిమిషం ఎవరికీ ఇది అర్ధంకాలేదు. తాము పొరపాటు వింటున్నామా? అని సరిచూసుకునే లోపునే ముద్రగడ వేదిక దిగి ఉద్యమంలోకి దూకేసారు. ఆ తరువాత పార్టీల నాయకులు ఎలా వెళ్లారో, ఎక్కడికి వెళ్లారో ఎవరూ పట్టించుకోలేదు.

నిఘా వైఫల్యం
-ముద్రగడ వైఖరిని అంచనావేయలేకపోయిన ఇంటిలిజెన్స్-
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జనవరి 31: ‘ఆలోచనలకు ఇది సమయం కాదు... ఆఖరి పోరాటానికి సిద్ధం కండి’ అంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెండు నెలలు క్రితం నుండి ఇచ్చిన పిలుపును అంచనా వేయడంలో నిఘావర్గాలు ఘోరంగా విఫలమవడంతో ఆదివారం తునిలో జరిగిన కాపు ఐక్య గర్జనలో విధ్వంసాన్ని నిలువరించలేకపోయారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ ఐక్యగర్జన సభను కేవలం బహిరంగ సభతో సరిపెడతారని పోలీసు, నిఘావిభాగం భావించాయి. నామమాత్రపు బందోబస్తుతో సరిపెట్టాయి. అయితే అనూహ్యంగా లక్షల సంఖ్యలో ప్రజలు తరలిరావడం ఒక ఎత్తయితే, అప్పటికప్పుడు బహిరంగ సభను రోడ్డుకంరైలు రోకోలుగా మార్చివేయడంతో పోలీసు, నిఘావర్గాలు నివ్వెరపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను పట్టించుకోకుండా వదిలివేయడంతో తుని - కత్తిపూడి జాతీయ రహదారిపై వేలాది వాహనాలు ట్రాపిక్‌లో చిక్కుకుపోయాయి. విద్యుత్తు సరఫరా కూడా నిలిపివేయడం వల్ల సభకు వచ్చి తిరిగి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచినీరు, అహారం అందక అనేకమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మైళ్ల కొలది నిలిచిపోయిన ట్రాపిక్ ఎప్పటికి క్లియర్ అవుతుందో తెలియక సుదూర ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చిన ఉద్యమకారులు ఆకలితో అలమటించారు. ముద్రగడ దీక్షా శిబిరానికి సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆందోళన కొనసాగిస్తుండగా, వేదిక వద్ధ ఉన్న కాపునాయకులు సభా వేదిక పక్కనే ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన దీక్షలు ఏక కాలంలో నిర్వహించడంతో అటు రైలు, ఇటు రహదారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. ముద్రగడ కేవలం కాపు ఐక్యగర్జన కోసమే విస్తృత ప్రచారం నిర్వహించి, ఆయన అంతరంగాన్ని కేవలం సభా వేదిక వద్ధే ప్రకటించడం రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. తన మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టకుండా ఉద్యమాన్ని అనూహ్యంగా మార్చివేసి ముద్రగడ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఈ ఉద్యమం ఇంకా ఎనెన్ని మలుపులు తిరుగుతుందోననే ఉత్కంఠ అన్ని వర్గాల్లో నెలకొంది.
200 కిలోల గంజాయి స్వాధీనం: 14మంది అరెస్టు
- వ్యాన్‌తోపాటు మూడు బైకులు స్వాధీనం
అడ్డతీగల, జనవరి 31: తూర్పు మన్యంలోని వై రామవరం మండలంలో మరోసారి భారీ ఎత్తున రవాణా అవుతున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అడ్డతీగల సిఐ ముక్తేశ్వరరావు నేతృత్వంలో పక్కా పథకం ప్రకారం నిఘా ఉంచి ఆదివారం వై రామవరం మండలం లోతట్టు ప్రాంతమైన పూతిగుంట వద్ద 200 కిలోల గంజాయితోపాటు రవాణాకు ఉపయోగిస్తున్న బొలేరో వ్యాన్, 3 మోటారు సైకిళ్లు స్వాధీనపర్చుకుని గంజాయి రవాణా చేస్తున్న 14 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సిఐ ముక్తేశ్వరరావు విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. వై రామవరం మండలం ఎగువ ప్రాంతం నుండి గంజాయిని సేకరించి తెలంగాణా తదితర ప్రాంతాలకు రవాణాచేసి సులభంగా డబ్బు సంపాదించాలని అత్యాసతో కొందరు ఈ పనికి పూనుకున్నారన్నారు. ప్రత్యేకంగా ధాన్యం బస్తాలను సిద్ధం చేసుకుని వాటి తీరులోనే గంజాయిని పాలిథిన్ కవర్లలో ప్యాక్‌చేసి ధాన్యం బస్తాల మాదిరిగా ఒకే చోట ఉంచి రవాణా చేయడానికి వ్యూహరచన చేశారన్నారు. తూర్పుకు సరిహద్దు ప్రాంతాలైన విశాఖ, ఒరిస్సా సరిహద్దుల నుండి సేకరించిన ఈ గంజాయిని వై రామవరం మండలం అటవీ ప్రాంతం గుండా మైదాన ప్రాంతాలకు తరలించడానికి తీసుకువస్తూ పూతిగుంట ప్రాంతం వద్ద పోలీసులకు చిక్కారు. ఈ గంజాయి రవాణాలో తిరుమలాయపాలెంకు చెందిన వొత్తెం శ్రీనివాస్, గంగవరం మండలం అడ్డపల్లి ప్రాంతానికి చెందిన కడబాల శివకుమార్‌రెడ్డి, రాములుకొండ నరసింహరెడ్డి, యాట్ల అరవిందరెడ్డి, ఏలేశ్వరానికి చెందిన వల్లీ దుర్గాప్రసాద్, అనుసూరి వెంకటరమణ, శరభవరానికి చెందిన బొగ్గుల ఎరికిరెడ్డి, బొగ్గుల బాలురెడ్డి, తీగలమెట్టకు చెందిన కుర్తాటి రఘునాధ్, నీలవరానికి చెందిన పంపా దామోదర్, తీగలమెట్టకు చెందిన తాలాపు ధీనరాజు, నీలవరానికి చెందిన కొర్రాసు ధర్మన్, కొర్రా జగన్నాధ్, పంపా శివలు కీలకపాత్ర వహించారన్నారు. వీరందర్నీ అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. గోకవరానికి చెందిన డ్రైవర్ ఎ అప్పారావు పరారీలో వున్నాడన్నారు. ఈ దాడిలో వై రామవరం ఎస్సై అప్పన్నతో పాటు కానిస్టేబుల్స్ రెడ్డి, శ్రీనివాస్ తదితర్లు పాల్గొన్నారు.

‘కోట’లో ఆగిపోయిన ప్రధాన రైళ్లు
సామర్లకోట, జనవరి 31: తునిలో ఐక్య కాపుగర్జన దారితప్పి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడం వంటి హింసాత్మక సంఘటనల నేపథ్యంలో విశాఖపట్నం-విజయవాడ స్టేషన్ల మద్య రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఆందోళనల కారణంగా సామర్లకోట రైల్వే స్టేషన్‌లో రత్నాచల్‌కు మందుగా వచ్చిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి పోలీసు బందోబస్తు నడుమ విజయవాడ వైపు పంపించారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రాత్రి వరకు రైల్వే స్టేషన్‌లో ఉండిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే విశాఖపట్నం వైపు వెళ్ళవలసిన కోణార్క్, సత్రాగచ్చి సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్, గరీబ్థ్,్ర ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్ రైళ్ళను పలు స్టేషన్లలో ఆపివేశారు. అయితే తుని రైల్వే స్టేషన్‌కు జిల్లాలో అన్ని స్టేషన్లతో సమాచార వ్యవస్థ లింకు తెగిపోయింది. దాంతో ఫోనులు పనిచేయక రైల్వే అధికారులు ఇబ్బందులకు గురయ్యారు. తుని సంఘటన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుండి సామర్లకోట రైల్వే స్టేషన్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిఆర్పీ, ఆర్‌పిఎఫ్ పోలీసులతోపాటు, సామర్లకోట పోలీసులు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా తాగునీరు తదితర సదుపాయాలు ఏర్పాటు చేశారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో సామర్లకోటలో చిక్కుకుపోయిన విశాఖపట్నంకు వెళ్ళవలసిన ప్రయాణీకులకు ఆదివారం రాత్రి సామర్లకోట రైల్వే స్టేషనులో సామర్లకోట శ్రీ భీమేశ్వర లయన్స్‌క్లబ్ ఆద్వర్యంలో ఉచితంగా బోజనాలు అందచేశారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దారు డి సునీల్‌బాబు, ఎస్‌ఐ ఆకుల మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ నాయకులు చిత్తులూరి వీర్రాజు (రాజా), అమలకంటి శ్రీనివాసరావు, కర్రి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు:ఒకరు మృతి

రావులపాలెం, జనవరి 31: దట్టంగా అలుముకున్న పొగమంచు, నిర్లక్ష్యం వెరసి ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాయి. 16వ నంబరు జాతీయ రహదారిపై రావులపాలెం మండలం ఈతకోట వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన టోల్‌గేటు వద్ద టోల్ చెల్లించేందుకు ఆగివున్న ఆయిల్ ట్యాంకరును ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొనగా వెనుకనే వస్తున్న మరోకారు ఆ బస్సును వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవరు మృతి చెందగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలావున్నాయి. హైదరాబాద్‌కు చెందిన పూర్ణిమా ట్రావెల్స్ బస్సు శనివారం రాత్రి హైదరాబాద్ నుండి సుమారు 40 మంది ప్రయాణికులతో కాకినాడకు బయలుదేరింది. ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లతోపాటు ఒక క్లీనరు కూడా ఉన్నాడు. ఈ బస్సు ఆదివారం ఉదయం సుమారు 8 గంటల సమయానికి ఈతకోట టోల్‌గేటు వద్దకు చేరుకుంది. అయితే రహదారిపై దట్టంగా పొగమంచు అలుముకుని ఉండటంతో డ్రైవరుకు స్పష్టత కరువై టోల్‌గేటు ఉందన్న విషయాన్ని, టోల్‌గేటు వద్ద ఆగివున్న వాహనాలను గుర్తించలేక పోయాడు. దీంతో టోల్‌గేటు సమీపంలో రహదారిపై ఉన్న స్పీడు బ్రేకర్లపైకి వచ్చేసరికి గుర్తించినా వాహనం అదుపులోకి రాలేదు. అతివేగంతో బస్సు టోల్‌గేటు వద్ద ఆగివున్న ఆయిల్ ట్యాంకర్‌ను వేగంగా ఢీకొట్టింది. అయితే వెనుకనే వస్తున్న సాంత్రో కారు కూడా అదే బస్సును వెనుక నుండి ఢీకొట్టి కిందిభాగంలోకి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ వై సత్యనారాయణ, పక్కనే ఉన్న మరో డ్రైవరు సుబ్బారావుతోపాటు డ్రైవరు వెనుక సీట్లలో కూర్చున్న అవిరెడ్డి శ్రీవిద్య, ఆచంట దుర్గాదేవిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్లీనర్ ప్రభాకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అలాగే కారులో తుని కాపు గర్జనకు వెళ్తున్న విజయవాడకు చెందిన రవ్వ మోహనరావు, డ్రైవరు పత్తి రంగనాయకులు, పొలిమేర సూరిబాబు, కూరాకుల అశోక్, చాగంటి రాజేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ పివి త్రినాథ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని, హైవే, 108 అంబులెన్సుల్లో క్షతగాత్రులను కొత్తపేట, తణుకు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. అయితే బస్సు డ్రైవరు వై సత్యనారాయణ (23) తణుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన వారిని కొత్తపేట ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులోని వారంతా నిద్రలో జోగుతూ ఉండగా పెద్ద శబ్దంతో బస్సు నిలిచిపోవడంతో ఏమి జరిగిందో తెలియక ప్రయాణికులు హాహాకారాలు చేశారు. బస్సు డ్రైవరు వెనుక సీట్లో కూర్చున్న శ్రీవిద్య, దుర్గాదేవి ప్రమాదధాటికి క్యాబిన్ నుజ్జునుజ్జయి సీట్లలోనే ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసేందుకు హైవే సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మృతి చెందిన సత్యనారాయణది హైదరాబాద్ కాగా, ఇటీవల పూర్ణిమా ట్రావెల్స్‌లో డ్రైవరుగా చేరాడు. మొదటి డ్యూటీగా కాకినాడ వస్తూ మృత్యువాత పడ్డాడు. అలాగే శ్రీవిద్య, దుర్గాదేవిలది హైదరాబాద్ కాగా వారు కాతేరు, పిఠాపురంలలో ఉన్న పుట్టిళ్లకు వెళ్తూ ప్రమాదం బారిన పడ్డారు. దుర్గాదేవి హైదరాబాద్‌లో ఆర్కిటెక్చర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు.
కాపు గర్జనకు వెళ్తూ..
అలాగే సాంత్రో కారులో విజయవాడ నుండి రవ్వ మోహనరావు ఆధ్వర్యంలో తునిలో జరుగుతున్న కాపు గర్జనకు వెళ్తూ అయిదుగురు ప్రమాదంలో గాయపడ్డారు. ముందు వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా ఆగడంతో అదుపుతప్పి కారు బస్సును ఢీకొట్టింది.
అంతులేని నిర్లక్ష్యం
ఈతకోట టోల్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన టోల్‌గేటు నిర్వహణలో మొదటి నుండి నిర్లక్ష్యం కన్పిస్తోంది. ఆదరాబాదరాగా టోల్‌గేటు ఏర్పాటు చేసిన నిర్వాహకులు భద్రతా చర్యల విషయంలోనూ నిర్లక్ష్యం వహించారు. ఇక్కడ టోల్‌గేట్ ఉన్నదన్న విషయాన్ని చెబుతూ హైవేపై కొంతదూరంలో ముందుగానే బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ ఏర్పాట్లు చేయలేదు. అలాగే జాతీయ రహదారిపై వేసిన స్పీడ్‌బ్రేకర్లకు రేడియం పెయింట్లు వేయకపోవడంతో వేగంగా వచ్చే వాహనదారులు వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈనేపధ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రమాదంలో బస్సు, కారు తీవ్రంగా దెబ్బతినడంతో చెల్లాచెదురుగా పడిన వాహనాల భాగాలతో ప్రమాద స్థలం భీతావహంగా మారింది. బస్సు, కార్లలో క్షతగాత్రులు గాయపడి వారి రక్తంతో వాహనాలు భయానకంగా మారాయి. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న ఎస్‌ఐ పివి త్రినాధ్ తెలిపారు.

ఒక యువకుని ఆలోచనతోనే మెగా జాబ్‌మేళా

మండపేట, జనవరి 15: ఒక యువకుడు మదిలో నుంచి వచ్చిన ఆలోచనే ఈ మేగా జాబ్‌మేళా నిర్వహించే విధంగా చేసిందని మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. స్థానిక జూనియర్ కాలేజీ క్రీడా ప్రాంగణంలో నియోజకవర్గస్థాయి మెగా జాబ్‌మేళాను మండపేట మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ అధ్యక్షతన ఆదివారం రాత్రి వరకు జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ఒక నిరుద్యోగ యువకుడు నుంచి వచ్చిన ఆలోచనను జాబ్‌మేళా నిర్వహించే విధంగా చేసిందని, వెంటనే ఆలోచించకుండా జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి మెగాజాబ్‌మేళా నిర్వహించామన్నారు. అధికారులు అందించిన సహాయసహకారాలకు ఎమ్మెల్యే వేగుళ్ల కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా వికాస్ ప్రాజెక్ట్ పిడి విఎన్‌రావు మాట్లాడుతూ రెండు వేల నూటయాభై కుటుంబాల నిరుదోగ యువతీయువకులకు ఉద్యోగాలు అందజేసి వారి కుటుంబాలలో ఎమ్మెల్యే వేగుళ్ల వెలుగులు నింపారన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరై నిరుద్యోగ యువతీయువలకు ఇంటర్వ్యూలు జరిపి, వారికి నియామక పత్రాలను ఎమ్మెల్యే వేగుళ్ల చేతులు మీదుగా అందజేశారు. ఈ మెగాజాబ్‌మేళాను ఆర్డీవో కె.సుబ్బారావు పర్యవేక్షణలో జాబ్‌మేళాను సమర్దవంతంగా నిర్వహించిన మున్సిపల్ డిఇ పి.కనకారావు, ఎఇ దుగ్గిరాల దుర్గాప్రసాద్, మూడు మండలాల తహశీల్దార్లు, ఎంపిడివో ఎ.శాంతి. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, ఎస్సై వి.సురేష్, వివిధశాఖల అధికారులు, దూరప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగ యువతీయువకులకు భోజనాలు సజావుగా అందేవిధంగా ఏర్పాట్లు చేయడంతో వారందరికి ఆర్డీవో కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు వంక సాయికుమార్‌బాబు, ఎఎంసి చైర్మన్ రమేష్‌రాజా, కౌన్సిలర్లు, వివిధశాఖల సిబ్బంది పాల్గొన్నారు.