తూర్పుగోదావరి

ముద్రగడకు పెరుగుతున్న మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపులకు బిసి రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రథాన డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు జిల్లాలోని కాపు సామాజికవర్గం నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. గత రెండు రోజుల్లో వివిధ గ్రామాల్లో నిరాహార దీక్షలు/రిలే దీక్షలు జోరందుకున్నాయి. మధ్యాహ్నం సమయంలో నిరసన కారులు ఖాళీ కంచాలు, గరిటెలతో ప్రదర్శన నిర్వహించారు. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసంలో ఖాళీ కంచాలను, గరిటెలతో వాయిస్తూ కాపు సోదరులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా జిల్లాలోని కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు నిరాహార, రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ప్రాంతాలలో రిలే నిరాహార దీక్షలు ఆయా గ్రామాల్లో జరుగుతున్నాయి. ముమ్మిడివరం, రాజోలు, రామచంద్రపురం, కాజులూరు, కరప, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, గండేపల్లి, రాజానగరం ప్రాంతాల్లో నిరసన దీక్షలను ప్రారంభించారు. జిల్లాలోని కాపు ప్రజాప్రతినిధుల ఇళ్ళ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అమలాపురంలో ఉప ముఖ్యమంత్రి, హోంమత్రి నిమ్మకాయల చినరాజప్ప నివాసానికి శనివారం నుండి మరింత భద్రత పెంచారు. కిర్లంపూడి, ప్రత్తిపాడు గ్రామంతో పాటు జాతీయ రహదారిలో సాయుధ దళాలు మొహరించాయి. సామర్లకోట నుండి దివిలి గ్రామం మీదుగా కిర్లంపూడికి వెళ్ళే మార్గంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుండి ఎవరూ ముందుకు వెళ్ళకుండా నిలువరిస్తున్నారు. కార్లు, జీపులు, ఇతర వాహనాల రాకపోకలను నిషేదించారు. కిర్లంపూడికి మరిన్ని అదనపు సాయుధ బలగాలను శనివారం సాయంత్రానికి తరలించడం గమనార్హం! ఉదయం నుండి సాయంత్రం వరకు పోలీసులు ముద్రగడ నివాసంలోకి ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ముద్రగడను పరామర్శించేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులు సి రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్ తదితరులను ప్రత్తిపాడులోనే పోలీసులు నిలువరించారు. దీంతో వారు స్థానిక అల్లూరి సీతారామరాజు విగ్రహం సెంటర్‌లో ధర్నా చేశారు. ఎంతకూ పోలీసులు వీరి వాహనాలను కదలనివ్వకపోవడంతో చేసేది లేక వెనుదిరిగారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ టి రత్నాబాయి తదితరులను కిర్లంపూడి వెళ్ళకుండా ప్రత్తిపాడు వద్దే సాయుధ దళాలు అడ్డుకోవడంతో వారు కూడా వెనుదిరిగారు. కిర్లంపూడి పరిసర ప్రాంతాల ప్రజలు ముద్రగడను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున తరలిరాగా శనివారం సాయంత్రం 4 గంటల తరువాత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన పిమ్మట పోలీసులు అనుమతించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రథాన కార్యదర్శి పంతం నానాజీ, కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వివై దాసు తదితరులు ముద్రగడ వెంట ఉన్నారు.

ఇసుక వేలం
విధానంలో
అంతా గందరగోళం!
* వేలం నిర్వహిస్తూనే పాత స్టాకు అమ్మకాలకు అనుమతి* విధానం అర్ధంకాక అధికారుల్లో అయోమయం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6: రాష్ట్రప్రభుత్వం కొత్తగా అమలుచేయనున్న ఇసుక విధానం గందరగోళంగా సాగుతోంది. పాత విధానాలకు స్వస్తి చెప్పి, ఇ వేలం, ఇ టెండరు విధానంలో వేలం నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. ఈ విధానం పట్ల అటు వేలంలో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న వారికిగానీ, ఇటు అధికారులకు కూడా పూర్తి అవగాహన ఉండటం లేదు. ఈ ప్రక్రియలో ఏదైనా అనుమానం వచ్చినపుడు, దానిని ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వేలం ఫీజు చెల్లించేందుకు గడువు 4న ముగిసినప్పటికీ, శనివారం వరకు ఇంకా వేలం ఫీజును దరఖాస్తుదారులు చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం పట్ల అవగాహన లేకపోవటం వల్ల ఎవరు ఎలా కావాలంటే అలా చేసుకునేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేలంలో ఎంత వరకైనా వెళ్లవచ్చా? అలా వెళితే చెల్లుతుందా అనే ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. ఎవరైనా లాభం ఉండేలా వ్యాపారం లేదా కాంట్రాక్టు చేస్తారు. కానీ ఇసుక వేలంలో లాభం లేకపోయినా, నష్టం వచ్చినాగానీ వేలంలో రీచ్ దక్కించుకునేందుకు ఎవరైనా ముందుకొస్తే, వేలాన్ని ఖరారుచేస్తారా? అనే ప్రశ్నకు కూడా సమాధానం లేదు.
ఒక పక్క కొత్త విధానంలో ఇసుక రీచ్‌లకు వేలం నిర్వహించేందుకు రంగం సిద్ధంచేస్తూనే 2012-13సంవత్సరంలో వివిధ కారణాలతో సీజ్ చేసిన ఇసుక నిల్వలను ఇపుడు అమ్ముకునేందుకు రాష్ట్రప్రభుత్వం అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఇలాంటి ఇసుక నిల్వలు ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 9లక్షల క్యూబిక్ మీటర్లు వరకు ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త విధానంలో వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూనే ఇలా పాత నిల్వలను అమ్ముకునేందుకు గతంలోని సంబంధిత లీజుదారులకు అవకాశం కల్పించటం వెనుక కొంత మంది పెద్దలు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది.
పట్టా భూముల్లోని ఇసుకను తవ్వుకునేందుకు సంబంధిత వ్యక్తులపై రాష్ట్రప్రభుత్వం అధిక భారాన్ని మోపినట్టు తెలుస్తోంది. పట్టా భూములకు పక్కన ఉన్న రీచ్‌ల వేలం ధర ఎంత పలికితే, అంత మొత్తాన్ని పట్టా భూముల్లో ఇసుక తవ్వుకునేందుకు దరఖాస్తుచేసిన వారు చెల్లించాలన్న నిబంధనను రాష్ట్రప్రభుత్వం విధిస్తోంది. పరిస్థితి చూస్తుంటే పాత విధానాన్ని తలదనే్న రీతిలో కొత్త ఇసుక విధానంలో మరిన్ని అక్రమాలు చోటుచేసుకునే కనిపిస్తున్నాయి.

పోలీసుల నిర్భంధంతో మాజీ మంత్రి వట్టి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య
బైఠాయింపు
ప్రత్తిపాడు, ఫిబ్రవరి 6: కాపులను బిసిల్లో చేర్చాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భార్య పద్మావతితో కలిసి గత రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండడంతో వారికి సంఘీభావం తెలిపేందుకు బయల్దేరిన మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యలను కిర్లంపూడి వెళ్లనీయకుండా ప్రత్తిపాడులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆ నాయకులు ఇరువురు ప్రత్తిపాడు అల్లూరి సీతారామరాజు జంక్షన్‌లో రెండు గంటలపాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాపుల ఓట్లతో ముఖ్యమంత్రైన చంద్రబాబునాయుడు కాపుజాతిని అణగదొక్కుతున్నారని వారు విమర్శించారు. ఏళ్ల తరబడి కాపులు పేదరికంలో మగ్గుతున్నారని, ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలంటూ ముద్రగడ ఆమరణ నిరాహారధీక్ష చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ముద్రగడను తక్కువ అంచనా వేస్తున్నారన్నారు. ముద్రగడ ఇచ్చిన ఒక్క పిలుపుకే లక్షలాదిగా కాపుజాతి తుని సభకు హాజరయ్యారనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకోవాలన్నారు. కాపులు ఆగ్రహిస్తే ముఖ్యమంత్రి పీఠం కదులుతుందన్నారు. వెంటనే ముద్రగడ డిమాండ్ల మేరకు కాపులను బిసిల్లో చేర్చాలని ఆ నాయకులు ముఖ్యమంత్రిని హెచ్చరించారు. పోలీసులు చంద్రబాబు తొత్తులుగా మారారని, ఈ క్రమంలో కాపు జాతి ఆగ్రహాన్ని పోలీసులు తట్టుకోలేరని, ఇది పోలీసు సిబ్బంది గ్రహించాలన్నారు. గాంధీ మార్గంలో ఆమరణ దీక్ష చేస్తున్న నాయకుడు ముద్రగడను స్వయంగా కలిసి సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన లక్షలాది మంది కాపుజాతి తరలివస్తున్నారని, వారిని పోలీసులు నిర్భందిస్తే కాపులకు ముద్రగడపై మరింత అభిమానం పెరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని జిల్లాలోనూ ముద్రగడకు మద్దతుగా రిలే దీక్షా శిబిరాలు, కంచాల శబ్ధాలు ద్వారా ముద్రగడకు సంఘీభావం తెలుపుతున్నారని, ముఖ్యమంత్రి తన నిఘా విభాగం చేత ఈ విషయాన్ని దర్యాప్తు చేసుకుంటే అందరి హృదయాల్లో ముద్రగడ ఉన్నారనే వాస్తవం గ్రహించగలుగుతారన్నారు. కాపు జాతిని ముద్రగడకు దూరం చేయాలని చంద్రబాబు ఎన్ని ట్రిక్కులు చేసినా అది జరిగే పనికాదన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు చర్యలు ఇప్పటికే ప్రజలను బాధిస్తున్నాయని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు మంచివి కాదని ఆ నాయకులు హితవు పలికారు. ధర్నా అనంతరం కూడా ఈ నాయకులను పోలీసులు కిర్లంపూడి వెళ్లనీయలేదు. దీంతో ఇక చేసేదిలేక పోలీసులను ఆ నాయకులు హెచ్చరించి తమతమ వాహనాల్లో వెనుతిరిగారు.
అభిమానులను నియంత్రిచొద్దు
మాజీ మంత్రి ముద్రగడ
ప్రత్తిపాడు/జగ్గంపేట, ఫిబ్రవరి 6: గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్న తనను చూసేందుకు వస్తున్న కిర్లంపూడి సమీప గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆమరణ దీక్ష చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం పెద్దాపురం ఆర్డీవో విశే్వశ్వరరావుకు చెప్పారు. తాను ఇప్పటికే సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి ఎవ్వరూ తన వద్దకు రావద్దని కోరుతూ ప్రకటనలు ఇచ్చానన్నారు. అయినప్పటికీ కిర్లంపూడి సమీప గ్రామాల అభిమానులు, ప్రజలు గత 40 ఏళ్లుగా తనతో ఉన్న స్నేహభావంతో తమ దంపతులను చూసేందుకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడం మంచి పద్ధతికాదని ముద్రగడ ఆర్డీవోకు చెప్పారు. ఇదే క్రమంలో తన దగ్గరకు వచ్చే నేతలను, ప్రజాప్రతినిధులను ప్రత్తిపాడు వద్ద మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వంటి వారిని సైతం పోలీసులు నియంత్రించడం సైతం భావ్యంగా లేదన్నారు. గతంలో తాను ప్రజా సమస్యల కోసం దీక్షలు చేసినప్పుడు కూడా ప్రభుత్వాధికారులు ఎవ్వరూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదన్నారు. ప్రజలను, అభిమానులను రెచ్చగొట్టవద్దని ఆయన ఆర్డీవోకు చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పెద్దాపురం ఆర్డీవో విశే్వశ్వరరావుకు ముద్రగడ సూచించారు.
వైద్య పరీక్షలకు నిరాకరించిన ముద్రగడ దంపతులు
కాపులను బిసిల్లో చేర్చాలనే డిమాండుతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం దంపతులు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించారు. తాము ఆరోగ్యంగానే ఉన్నామని, తమకు ఎటువంటి వైద్య పరీక్షలు అవసరంలేదని ముద్రగడ శనివారం మధ్యాహ్నం వైద్యులకు తెలియజేశారు. శుక్రవారం దీక్ష చేపట్టిన తర్వాత రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నాలుగుసార్లు వైద్య బృందం ముద్రగడ దంపతుల బరువు, బిపి, బ్లడ్ షుగర్లను పరీక్షిస్తున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం మాత్రం ముద్రగడ వైద్య పరీక్షలు వద్దని చెప్పడంతో వైద్య బృందం వెనుతిరిగింది. కాగా స్థానిక వైద్యాధికారిని ఆంధ్రభూమిని ప్రశ్నించగా ముద్రగడ దంపతుల వైద్య పరీక్షల వివరాలు జాయింట్ కలెక్టర్‌కు మాత్రమే వివరించవలసి ఉందని, ఇతరులెవ్వరికీ పరీక్షల సమాచారం తెలియరాదని పై అధికారుల చెప్పారన్నారు.
ముద్రగడ దీక్షకు పంతం సంఘీభావం
రాజమండ్రికు యుసిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్, కాపు సంఘం ప్రముఖుడు పంతం కొండలరావు కిర్లంపూడిలో ముద్రగడ దంపతులను శనివారం కలిసి దీక్షకు సంఘీభావం తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గం వైసిపి నేత తోట సుబ్బారావునాయుడు కుటుంబ సమేతంగా దీక్షా శిబిరాన్ని సందర్శించి ముద్రగడకు మద్దతు తెలిపారు.
అర్ధనగ్నంగా కాపుల కంచాల మోత
ప్రత్తిపాడు, ఫిబ్రవరి 6: కాపులను బిసిల్లో చేర్చాలని ముద్రగడ దంపతులు ఆయన నివాసంలో ఆమరణ నిరాహారధీక్ష చేస్తూండగా ప్రభుత్వం రెండు రోజులైనా పట్టించుకోకపోవడంపై ఆయన అభిమానులు, కాపు యువత, కాపు నాయకులు కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి ఆవరణలో శనివారం చొక్కాలను విప్పి అర్ధనగ్నంగా దీక్షా ఆవరణ చుట్టూ తిరుగుతూ కంచాలను చేతపట్టి గరిటెలతో శబ్ధాలు చేస్తూ నిరసన తెలిపారు. చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ తమ నాయకుడు ముద్రగడ ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారన్నారు. రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన కాపుజాతికి ఇది ఆఖరి పోరాటమని, పేద కాపుల భవిష్యత్తు కోసం చంద్రబాబు ప్రభుత్వం వెంటనే దిగివచ్చి తమ ధీర్ఘకాల డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండు చేశారు.
అనపర్తి
రైల్వే స్టేషన్లో
సమస్యల పరిష్కారానికి కృషి
ఎంపి మురళీమోహన్
అనపర్తి, ఫిబ్రవరి 6: అనపర్తి రైల్వే స్టేషన్లోని సమస్యల పరిష్కారానికి, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలుపుదలకు సంబంధించి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్ పేర్కొన్నారు. అనపర్తి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు శనివారం అనపర్తి విచ్చేసిన ఆయన స్థానిక రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపి మురళీమోహన్ బాలుర ఉన్నత పాఠశాల వైపు ఉన్న మూసివేసిన రైల్వేగేటు స్థానే నిర్మించవలసి ఉన్న ఫుటోవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని ఆర్‌అండ్‌బి అధికారులు, స్థానికులు ఎంపి, ఎమ్మెల్యేలకు వివరించారు. గతంలో వంతెన నిర్మాణానికి 50 శాతం నిధులు ఆర్‌అండ్‌బి, మిగిలిన 50 శాతం నిధులు రైల్వే శాఖలు వెచ్చించి నిర్మించేందుకు ఒప్పందం జరిగిందని, ఇందుకు సంబంధించి రైల్వే అధికారులు వంతెన నిర్మాణ నమూనాను ఆర్‌అండ్‌బి శాఖకు పంపించారన్నారు. అయితే ఈ నమూనాలో చిన్నపాటి మార్పులను చేసి రైల్వే శాఖకు తిరిగి నమూనాను పంపించారని, తదనంతర క్రమంలో దీనిపై ఉత్తర ప్రత్యుత్తరాలు నిలిచిపోయిన విషయాన్ని ఆర్‌అండ్‌బి అధికారులు వివరించారు. బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ.3 కోట్లు వ్యయం కాగలదని అధికారులు అంచనా వేశారని, పెరిగిన ధరలను అనుసరించి ఈ అంచనా వ్యయం మూడున్నర కోట్లు కాగలదని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎంపి మురళీమోహన్‌కు వివరించారు. దీనిపై ఎంపి మురళీమోహన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వాటాకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి తీసుకోవడంతోపాటు రైల్వే శాఖ నిధులు కేటాయింపుపై ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని, అవసరమైతే ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. ఇదిలా ఉండగా అనపర్తిలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు సంబంధించి రైల్వే ఉన్నతాధికారులకు ఎంపి మురళీమోహన్ రాసిన లేఖకు స్పందిస్తూ అధికారులు తిరిగి ఎంపికి పంపిన లేఖలో పేర్కొన్న అంశాలు అవాస్తవాలని స్థానికులు ఎంపికి వివరించారు. అనపర్తిలో 500 కిలోమీటర్లకు పైబడి ప్రయాణించే వారు లేరని రైల్వే అధికారులు పేర్కొనడం తప్పని, అనపర్తి పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది ప్రయాణికులు ప్రతి రోజు ఇతర స్టేషన్ల నుండి పొరుగు రాష్ట్రాలకు ప్రయాణిస్తున్నారని ఎంపికి వివరించారు. రైల్వే అధికారులు పేర్కొన్న అంశాలనే పరిగణలోనికి తీసుకుంటే అంతంత మాత్రంగా ప్రయాణికుల రాకపోకలు సాగించే నూజివీడులో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ఏ విధంగా ఇచ్చారో రైల్వే శాఖే చెప్పాలన్నారు. దీనిపై ఎంపి మురళీమోహన్ స్పందించి అధికారులతో చర్చించి ప్రజాభీష్టం మేరకు అనపర్తిలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నిలుపుదలకు కృషిచేస్తానని ఎంపి తెలియజేశారు.
సంస్కతికి ప్రతిబింబాలే హరికథలు
*అభ్యుదయ ఫౌండేషన్ ఛైర్మన్ బాదం
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఫిబ్రవరి 6: తెలుగు సంస్కృతికి హరికథలు చక్కని ప్రతి బింబాలని అభ్యుదయ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బాదం మాధవరావు అన్నారు. అభ్యుదయ ఫౌండేషన్ హరికథా సప్తాహ మహోత్సవంలో భాగంగా స్వర్గీయ బాదం అప్పారావు గుప్తా భాగవతార్ శత జయంతిని పురస్కరించుకుని కాకినాడ నగరంలోని శ్రీ సూర్య కళామందిరంలో శనివారం రాత్రి ప్రముఖ హరికథా భాగవతార్ వై వేంకటేశ్వర్లు ప్రదర్శించిన ‘గజేంద్ర మోక్షం’ హరికథ ఆద్యంతం ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకుంది. భాగవతార్ వేంకటేశ్వర్లు తనదైన శైలిలో గజేంద్రమోక్షం కథను వీనులకు విందుగా వివరించారు. కథావిధానాన్ని రాగయుక్తంగా ఆలపించిన తీరు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ అంతరించిపోతున్న హరికథ, బుర్రకథలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో ప్రముఖ భాగవతార్‌లను ఈ హరికథా సప్తాహం సందర్భంలో సత్కరించుకోవడం ఆనందంగా ఉన్నదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హరికథా విద్వాంసులు డి శివరామకృష్ణ శర్మ భాగవతార్‌ను ఫౌండేషన్ ఛైర్మన్ బాదం మాధవరావు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, కళాభిమానులు పాల్గొన్నారు.
మందపల్లిలో పోటెత్తిన భక్తులు
కొత్తపేట, ఫిబ్రవరి 6: మండల పరిధిలోని మందపల్లి మందేశ్వర (శనేశ్వర) స్వామి దేవస్థానం శనిత్రయోదశి సందర్భంగా శనివారం భక్తులతో కిటకిటలాడింది. శనిదోష నివారణార్ధం భక్తులు ఆలయానికి తరలివచ్చి తైలాభిషేకాలు నిర్వహించారు. శుక్రవారం అర్థరాత్రి నుంచే భక్తులు ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. ఆలయాన్ని సుమారుగా 60వేల మంది భక్తులు దర్శించుకున్నారు. టిక్కెట్ల ద్వారా ఆలయానికి రూ.18 లక్షల 78వేల 280, వ్యక్తిగత రశీదుల ద్వారా రూ.27వేల 188, ఎంవోల ద్వారా రూ.9, 397, ఆన్‌లైన్ ద్వారా రూ.56,045 ఆదాయం వచ్చినట్లు ఇఒ వెత్సా దేముళ్ళు తెలిపారు. అమావాస్య ముందు శనిత్రయోదశి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చినట్లు తెలిపారు. భక్తుల రాక సందర్భంగా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సత్యసాయి సేవాసమితి సభ్యులు కూడా భక్తులకోసం సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు.
ప్రముఖుల సందర్శన
శనిత్రయోదశి సందర్భంగా ఆలయాన్ని పవన్ కళ్యాణ్ మిత్రుడు, ప్రముఖ నిర్మాత శరత్‌మరార్ భార్యతో కలిసి ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. అలాగే పలువురు ప్రముఖులు సైతం ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి పూజలు జరిపారు.
వైద్య పరీక్షలు తిరస్కరించిన ముద్రగడ దంపతులు
*రాత్రి ఏడు గంటలకే తలుపులు మూసి నిద్రపోయిన వైనం*వెనుదిరిగిన వైద్యబృందం
ప్రత్తిపాడు, ఫిబ్రవరి 6: కాపులను బిసిల్లో చేర్చాలంటూ మాజీ మంత్రి, కాపునేత ముద్రగడ పద్మనాభం గత రెండు రోజులుగా సతీసమేతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ నివాసానికి శనివారం మధ్యాహ్నం వైద్య బృందం పరీక్షలు నిర్వహించేందుకు వచ్చింది. అయితే ముద్రగడ ఆ వైద్య పరీక్షలను తిరస్కరించారు. తామిద్దరం ఆరోగ్యంగానే ఉన్నామని, ఎటువంటి వైద్యపరీక్షలు చేయనవసరం లేదన్నారు. రాత్రి 8గంటల ప్రాంతంలో మరోసారి వైద్య బృందం ముద్రగడ నివాసానికి వచ్చేటప్పటికే ఆ దంపతులు 7 గంటలకే తలుపులు మూసివేసి నిద్రపోయారు. గుమ్మం వద్ద పది నిముషాల పాటు వైద్య బృందం వేచి చూసి వెనుతిరిగింది. మరో 20 నిముషాల తర్వాత జెసి సత్యనారాయణ, పోలీసు ఉన్నతాధికారులు భారీ పోలీసు బందోబస్తుతో నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ ఇంటికి వచ్చారు. తలుపులువేసి ఉండడంతో ముద్రగడతో మాట్లాడేందుకు జెసి ఫోను చేశారు. ముద్రగడ ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. కొద్దిసేపు జెసి ముద్రగడ దీక్షా శిబిరం బయట ఉండి, వెనుతిరిగారు. ఈ ఘటన జరిగిన మరో అర్థగంట తర్వాత పోలీసు అధికారులు భారీ బందోబస్తుతో ముద్రగడ నిద్రపోతున్న గది వద్ద కిటికీ వద్దకు వచ్చాక ముద్రగడతో మాట్లాడాలని పట్టుబట్టారు. తలుపు కూడా మూడుసార్లు కొట్టారు. అప్పటికే గాఢ నిద్రలో ముద్రగడ దంపతులు ఉన్నారు. ఆయన నివాసం వందలాది మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులంతా ముద్రగడ నిద్రలో ఉన్నారని, దయచేసి ఆయన నిద్రను ఆటంకపరచవద్దని కోరారు. దీంతో పోలీసు అధికారుల యత్నాన్ని అభిమానులు అడ్డుకున్నారు. పోలీసు అధికారులు జెసితో సంప్రదించమని ముద్రగడ అభిమానులకు చెప్పారు. వెంటనే ముద్రగడ అభిమానులు అదే ప్రాంగణంలో ఉన్న జెసి సత్యనారాయణతో 20 నిముషాల పాటు మాట్లాడారు. రెండు రోజులుగా తమ నేత ముద్రగడ, ఆయన సతీమణి పద్మావతి నిరాహార దీక్షలో ఉండడంతో శనివారం రాత్రి 7గంటలకే నిద్రపోయారన్నారు. ఆదివారం ఉదయం వచ్చి ముద్రగడతో మాట్లాడుకోవచ్చునని, ఈ రాత్రికి మాత్రం డిస్ట్రబ్ చేయవద్దని జెసి సత్యనారాయణను కోరారు. దీంతో పోలీసు అధికారులకు జెసి వెనుతిరిగి వెళ్లమని ఆదేశించారు. జెసి హుకుం జారీ చేయడంతో పోలీసు అధికారులు వెళ్లిపోవడంతో అభిమానులు శాంతించారు. శనివారం రాత్రి ముద్రగడ ఇంటి ప్రాంగణంలో కిర్లంపూడి, సింహాద్రిపురం, చిల్లంగి, జగపతినగరం సమీప గ్రామాలకు చెందిన వేలాది మంది అభిమానులు ముద్రగడ కోసం ఈ రాత్రికి ఇక్కడే పహారా కాసేందుకు నిర్ణయించుకున్నారు.

కమిషన్ల పేరుతో కాలయాపన తగదు
కాంగ్రెసు సీనియర్ నేత
హనుమంతరావు
కడియం, ఫిబ్రవరి 6: కాపులను బిసిల్లో చేరుస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం తగదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా రెండవ రోజు శనివారం కడియంలో కాపు ఐక్యవేదిక నాయకులు రిలే దీక్షలు కొనసాగించారు. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన విహెచ్ మాట్లాడుతూ 1910 నుండి 1956 వరకూ కాపులు బిసిల్లోనే ఉన్నారని, అటువంటి కాపులను బిసిల్లో చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాలో కాపు ఓటు బ్యాంకు రాజకీయాలలో కీలకంగా మారిందన్నారు. ఆ విషయం గ్రహించిన చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బిసిల్లో చేరుస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నా జాప్యం చేస్తూ కాపులను రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు. అనంతరం డిసిసి అధ్యక్షుడు కందుల దుర్గేష్, మాజీ ఎంపి గిరజాల వెంకట స్వామినాయుడు మాట్లాడారు. కాపులను బిసిల్లో చేర్చేవరకూ నిరంతర ఉద్యమం కొనసాగుతుందన్నారు. ముద్రగడ ఆరోగ్యం క్షీణించకముందే ప్రభుత్వం హామీలను నెరవేర్చాలని కాంగ్రెసు నేతలు డిమాండు చేశారు. కార్యక్రమంలో వైసిపి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మాజీ సర్పంచ్‌లు గట్టి నర్సయ్య, దూడల నాగేశ్వరరావు, సాపిరెడ్డి సూరిబాబు, అఖిలపక్షం నాయకులు గిరజాల బాబు, వెలుగుబంటి అచ్యుతరాం, ఆదిమూలం సాయిబాబా, తాడాల చక్రవర్తి తదితరులు ఉన్నారు.
కాపు నాయకుల కదలికలపై ఖాకీల నిఘా
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6: కాపు ఐక్యగర్జన సందర్భంగా చెలరేగిన విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకుని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష నేపథ్యంలో కాపు నాయకులు, చురుగ్గా ఉండే కాపు యువకుల కదలికలపై పోలీసులు నిఘా వేశారు. ప్రముఖ కాపు నాయకుల ఇళ్లు, కార్యాలయాలతో పాటు, కాపు యువకులు, వైఎస్సార్‌సిపి శ్రేణుల కదలికలను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కిర్లంపూడి వెళ్లరాదని నాయకులపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. జిల్లావ్యాప్తంగా జరుగుతున్న కాపుల నిరసన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిందిగా ఆయా మండలాల తహశీల్దార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో తిలక్‌రోడ్డులోని కాపుల రిలే దీక్షలను పరిశీలించేందుకు రాజమహేంద్రవరం తహశీల్దార్ పివివి గోపాలకృష్ణ దీక్షా శిబిరాన్ని సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ముద్రగడ దీక్ష చేస్తున్న కిర్లంపూడి వెళ్లే వారిని నిరోధించేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా లాలాచెరువు జాతీయ రహదారిపై చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాలు, కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.
ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడకు సంఘీభావం తెలిపి, పరామర్శించేందుకు ఆదివారం ఉదయం వైఎస్సార్‌సిపి కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కిర్లంపూడి వెళ్లనున్నారు. శనివారం సాయంత్రం ఆమె ఈవిషయాన్ని ప్రకటించారు.