తూర్పుగోదావరి

నేడు రఘువీరా, చిరంజీవి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 7: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం దంపతులను పరామర్శించేందుకు పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సోమవారం ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం వారిద్దరూ కాంగ్రెస్ నాయకులతో కలిసి కిర్లంపూడి వెళ్లే విధంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు పర్యటనను ఖరారుచేసారు. అయితే కిర్లంపూడికి ఏ రాజకీయ పార్టీ నాయకుడిని అనుమతించకుండా చెక్‌పోస్టుల వద్దే పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో ముద్రగడ వద్దకు రఘువీరారెడ్డి, చిరంజీవి వెళ్లగలరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు విమానాశ్రయం నుండి బయటకు రాకుండానే చిరంజీవి, రఘువీరారెడ్డిని అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోపక్క కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు కూడా వేరే విమానంలో రఘువీరారెడ్డి, చిరంజీవి కన్నా ముందుగానే రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారని ప్రచారం జరుగుతోంది.
యుద్ధ వాతావరణం
ప్రత్తిపాడు, ఫిబ్రవరి 7: ముద్రగడ దంపతులతో మాట్లాడటానికంటూ శుక్రవారం రాత్రి జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ రావడం తీవ్ర కలకలం రేపింది. రాత్రి 8 గంటల సమయంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ పోలీసు అధికారులతో కలిసి ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేసేందుకు వచ్చామని జెసి చెప్పినప్పటికీ ముద్రగడ తిరస్కరించారు. ముద్రగడ నివాసంలో మఫ్టీలో పోలీసులు చుట్టుముట్టి ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మొహరించి ఉండడం, ప్రభుత్వ పరంగా ఎటువంటి సంప్రదింపులు లేకపోవడంతో దీక్ష భగ్నం చేసే దిశగానే పోలీసులు ప్రయత్నాలు ఉన్నాయని అందరూ భావించారు. ముద్రగడ కూడా తాను దీక్ష చేస్తున్న హాలుకు లోపలి నుండి తాళాలు వేసి ఎవర్నీ అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కిటికీ నుండి ముద్రగడ దంపతులను చూసి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. అరుగులపై మహిళలు పెద్ద ఎత్తున కూర్చుని మద్దతుగా నిలిచారు. రాత్రి సమయంలో కూడా ముద్రగడ అనుచరులు ఆవరణలో నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ముద్రగడ నివాసానికి మూడు వైపులా ఉన్న ద్వారబంధాలకు బయట అరుగులపై కార్లను అడ్డుగా నిలిపారు. ఎవరూ లోనికి వెళ్లకుండా అవి అడ్డుగా ఉండే విధంగా ముందస్తు వ్యూహం రూపొందించారు. ఆదివారం రాత్రి జెసి సత్యనారాయణ ముద్రగడ నివాసానికి రావడంతో పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ముద్రగడ అనుచరులు నినాదాలు చేయడంతో ఆయన వెనుతిరిగారు. వచ్చిన పోలీసులు కూడా వెనక్కి తగ్గారు. పరిస్థితిని పరిశీలించేందుకు వారు వచ్చి ఉంటారని ముద్రగడ అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ముద్రగడ సతీమణి పద్మావతి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఏ విధంగానైనా దీక్ష భగ్నం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్లు ప్రసార మాధ్యమంలో ప్రచారం ఊపందుకుంది. ఏ నిముషానికి ఏమి జరుగుతుందోనని కిర్లంపూడి, దాని పరిసర గ్రామాలలోని ప్రజలు భారీ ఎత్తున ఆదివారం రాత్రి కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. రాత్రి ఏ సమయంలోనైనా పోలీసులు ముద్రగడ దంపతుల దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే తామంతా ప్రతిఘటించడానికి సిద్ధపడే ఉన్నామని వారంటున్నారు. బయట ప్రజానీకం ఏం జరుగుతుందోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
నేటి నుండి ఆందోళనలు ఉద్ధృతం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 7: కాపులను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారానికి నాలుగో రోజుకు చేరుకోనున్న నేపథ్యంలో ఆందోళనలను మరింత ఉద్ధృతంచేయాలని కాపు సంఘాల నాయకులు భావిస్తున్నారు. ముద్రగడ దంపతుల దీక్ష పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తున్న తీరు పట్ల కాపు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనికి తోడు తెలుగుదేశం రాష్ట్ర నాయకులు, మంత్రులు ముద్రగడ దంపతులు చేపట్టిన దీక్షను తప్పుపడుతూ విమర్శలు చేయటం పట్ల కాపు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముద్రగడతో చర్చలు జరిపేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పంపినట్టే పంపి, తాము చేయదలచుకున్న పనిని మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసుకుపోతున్నారని కాపు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోపక్క ముద్రగడను పరామర్శించేందుకు వెళుతున్న నాయకులను పోలీసులు అడ్డుకోవటం, ముఖ్యనాయకులను గృహనిర్బంధంలో ఉంచటం తదితర పరిణామాలు కాపు సామాజికవర్గానికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. రాజమహేంద్రవరంలో జక్కంపూడి విజయలక్ష్మిని, ఎంపి హర్షకుమార్‌ను గృహనిర్బంధంలో ఉంచటంతో పాటు మాజీ కేంద్రమంత్రి పల్లంరాజును విమానాశ్రయంలోనే అడ్డుకునే ప్రయత్నాన్ని పోలీసులు చేయటాన్ని కాపు నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సోమవారం పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, దాసరి నారాయణరావు వంటి నాయకులు కిర్లంపూడి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం అందటంతో, నాయకుల పర్యటనలకు పోలీసులు అనుమతినిస్తారా? లేదా? అనే అంశాలపై దృష్టికేంద్రీకరించారు.
మూడో రోజు కొనసాగిన ఆందోళనలు
ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ దంపతులకు మద్దతుగా మూడో రోజు ఆదివారం గోదావరి జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. ప్రతి గ్రామంలో కాపు సామాజికవర్గానికి చెందిన మహిళలు, యువకులు, పిల్లలతో సహా కంచాలపై గరిటెలతో కొడుతూ నిరసన ప్రదర్శనలు చేసారు. పోలీసులు అడ్డుకుంటున్నాగానీ రిలేదీక్షా శిబిరాలను ఏర్పాటుచేస్తూ ఆందోళనలు చేపట్టారు.
కాపు ప్రజాప్రతినిధుల
ఇళ్ల ముందు ధర్నాలకు యోచన
కాపు ఉద్యమానికి మద్దతుగా బయటకు రాని తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని కాపు నాయకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణను సోమవారం నాటి పరిస్థితులను చూసిన తరువాత ఖరారుచేస్తామని కాపు నాయకులు చెప్పారు.

మూడో రోజుకు నల్లా సోదరుల ఆమరణ దీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, ఫిబ్రవరి 7: కాపులను బిసిల్లో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా నల్లా పవన్, నల్లా అజయ్‌లు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఆదివారం మూడవ రోజుకు చేరింది. ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించగా బిపి లెవెల్స్ పెరిగి సుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ దీక్షలో నల్లా పవన్ సతీమణి రేఖ కూడా పాల్గొన్నారు. వీరి దీక్షకు మద్దతుగా సుమారు 40 మంది మహిళలు, కాపు నాయకులు, విద్యార్థులు, వివిధ మండలాల నుండి సర్పంచ్‌లు ఎంపిటిసిలు పాల్గొన్నారు. అదే విధంగా జనుపల్లె గ్రామంలో కాపు మహిళలు ఆదివారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మధ్యాహ్నం కంచం గరిటెలతో శబ్దం చేస్తూ నినాదాలు చేశారు.కార్యక్రమంలో టిబికె అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, కాపు నాయకులు ముత్యాల వీరభద్రరావు, బండారు రాజా, మాజీ సర్పంచ్‌లు వాకపల్లి శ్రీనివాస్, వేమన వీరవెంకట సత్యనారాయణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా దీక్షలకు మద్దతుగా ఆదివారం రాత్రి అమలాపురంలో భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కోనసీమ నలుమూలల నుండి వచ్చేసిన కాపు నాయకులు, యువత, మహిళలు కొవ్వొత్తులు వెలిగించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ ర్యాలీకి కొత్తపేటకు చెందిన ముత్యాల వీరభద్రరావు, బండారు రాజా, దళిత నాయకుడు నెల్లి లక్ష్మీపతి మద్దతు తెలిపారు.
గృహ నిర్బంధంలో జక్కంపూడి, హర్షకుమార్
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 7: కాపులను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు కిర్లంపూడి బయలుదేరిన మాజీ ఎంపి జివి హర్షకుమార్, వైఎస్సార్‌సిపి కేంద్రకమిటీ సభ్యురాలు జక్కంపూడితో సహా పలువురు నాయకులను అర్బన్‌జిల్లా పోలీసులు ఆదివారం నిరోధించారు. వారిని వారి నివాసాల్లోనే గృహనిర్భంధం చేసి, భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు కిర్లంపూడి వెళ్లనున్నట్లు జక్కంపూడి విజయలక్ష్మి శనివారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆదివారం ఉదయమే డిఎస్పీలు ఎవిఎల్ ప్రసన్నకుమార్, పి సౌమ్యలత, సిఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు ప్రకాష్‌నగర్‌లోని విజయలక్ష్మి నివాసానికి వెళ్లి కిర్లంపూడి వెళ్లేందుకు వీలులేదని స్పష్టం చేశారు. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి ముందు కాపుకాశారు. ఇరుపక్కలా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయలక్ష్మితో పాటు, ఆకుల వీర్రాజు పలువురు నాయకులు గంటల తరబడి ఇంట్లోనే ఉండిపోయారు. చివరకు రాజానగరంలోని రిలే దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపేందుకు వెళుతున్నానని చెప్పి విజయలక్ష్మి బయటకు వచ్చారు. వారిని నిలువరించడంతో పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించి, ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముద్రగడ ఇచ్చిన పిలుపుమేరకు కంచాలమోత మోగించారు. అరగంట గడిచినా ఆందోళన విరమించకపోవడంతో నగరంలోని పోలీసు ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు, సుంకర శ్రీను, చిన్ని, బొంతా శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, మానే దొరబాబు, మంచాల బాబ్జి, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, వెంట్రప్రగడ ఉమామహేశ్వరి సహా 36 మందిని అరెస్టు చేసి, ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసి మళ్లీ విజయలక్ష్మి తదితరులను ఇంటికి తరలించారు. ఆమె ఎటూ వెళ్లకుండా గట్టి పోలీసుబందోబస్తును ఏర్పాటుచేసి, గృహనిర్భంధంలో ఉంచారు. మరోవైపు మాజీ ఎంపి జివి హర్షకుమార్ కిర్లంపూడిలో ముద్రగడ దీక్షలకు సంఘీభావంగా దీక్షల్లో కూర్చున్న వారికి మద్దతు ప్రకటించేందుకు వెళుతుండగా ప్రత్తిపాడు వద్ద అరెస్టు చేశారు. డిఎస్పీ పి సోమశేఖర్ హర్షకుమార్‌ను పోలీసు వాహనంలో బ్రదరన్‌చర్చి వద్దగల ఆయన ఇంటి వద్దకు తీసుకుని వచ్చారు. గృహనిర్భంధం చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మధ్యమండలం డిఎస్పీ జె కులశేఖర్, త్రీటౌన్ సిఐ సిహెచ్ శ్రీరామకోటేశ్వరరావు హర్షకుమార్ ఇంటికి చేరుకుని ఆయన కిర్లంపూడికి వెళ్లకుండా కాపుకాశారు.
ఎమర్జెన్సీ కన్నా దారుణం- విజయలక్ష్మి
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షా ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసుల సహాయంతో ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సిపి కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. పోలీసుల తీరు ఎమర్జెన్సీ రోజుల కన్నా దారుణంగా ఉందని ఆరోపించారు. ఉద్యమాన్ని ఎంత అణగదొక్కితే అంత ఉవ్వెత్తున పైకి లేస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు.
కాపు మంత్రులు రాజీనామా చేయాలి:హర్షకుమార్
కాపు రిజర్వేషన్లు సాధించేందుకు తెలుగుదేశం ప్రభుత్వంలోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మాజీ ఎంపి జివి హర్షకుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబే ఈసమస్యను సృష్టించారని, దాన్ని సామరస్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందన్నారు. పోలీసుల తీరు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ధ్వజమెత్తారు. ఉద్యమాన్ని చంద్రబాబునాయుడు కర్కశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
గన్నవరంలో కదం తొక్కిన మహిళలు
డి గన్నవరం, ఫిబ్రవరి 7: మాజీ మంత్రి, కాపునేత ముద్రగడ పద్మనాభం దంపతుల ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా పి గన్నవరంలో కాపు సామాజిక వర్గీయులు వేలాదిగా కదంతొక్కి, నిరసన గళం విప్పారు. ఆదివారం స్థానిక మూడురోడ్ల కూడలిలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాపు సామాజిక వర్గీయులు తరలివచ్చారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా మధ్యాహ్నం ఖాళీ కంచాలు, గరిటెలతో శబ్ధాలుచేస్తూ నినాదాల సునామీ సృష్టించారు. స్థానిక మూడు రోడ్ల జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిష్టి బొమ్మను దగ్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో కోనసీమ టిబికె అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడ్డగళ్ల వెంకట సాయిరాం, కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు నల్లా విష్ణులు మాట్లాడుతూ కాపుల హక్కులు సాధనకు పార్టీలకు అతీతంగా కాపు నాయకులందరూ ఏకమై పోరాడవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీగా పోలీసు స్టేషన్‌కు చేరుకుని వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో టిబికె అధ్యక్షుడు కొమ్మూరి మల్లిబాబు, కర్రి బాబూరావు, ఉలిశెట్టి బాబి, కుంపట్ల నాగభూషణం, పినిశెట్టి వెంకటేశవ్వరరావు, యడ్ల ఏసుబాబు, గనిశెట్టి ఈస్వరరావు, తెలగారెడ్డి అగ్ని సుబ్బారావు, అడ్డాల వీరన్న, తాటికాయల లక్ష్మీనరసింహాదేవి మధు, తాటికాయల శ్రీనివాసరావు, బందెల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
హోరెత్తిన నిరసన
రావులపాలెం: ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరిన నేపథ్యంలో ఆదివారం మండలంలో నిరసనలు హోరెత్తాయి. మండలంలోని పొడగట్లపల్లిలో రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాపు ఎమ్మెల్యే, ఎంపి, మంత్రులు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తోటకూర సత్యనారాయణ, గోపిశెట్టి రామచంద్రుడు, తోట దుర్గారావు, రాగి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే రావులపాలెం కాపు యువత ఆధ్వర్యంలో యువకులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. రిలే దీక్షల శిబిరాల వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. అమలాపురం రోడ్డులో దీక్షా శిబిరం ఎదురుగా మోకాళ్లపై నిలబడి కంచాలపై గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. కొమరాజులంక వద్ద కూడ అమలాపురం రోడ్డుపై కాపు నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో సాదనాల శివకుమార్, బడేటి ఆఖిలేష్‌బాబు, మద్దాల రవికిశోర్, పి వెంకటకృష్ణ పాల్గొన్నారు.
రైల్వే రక్షణ దళం
అప్రమత్తం
సామర్లకోట, ఫిబ్రవరి 7: ఇటీవల తునిలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని రైల్వే ఆర్పీఎస్‌ఎఫ్ అడిషనల్ చీఫ్ సెక్యూరిటీ కమాండర్ జిఎం ఈశ్వరరావు ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా రైల్వే స్టేషన్ల తనిఖీల్లో భాగంగా ఆదివారం స్థానిక రైల్వేస్టేషనులోని విఐపి విశ్రాంతి గదిలో ఆర్పీఎస్‌ఎఫ్ ఫోర్స్ బెటాలియన్ కమాండర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కిర్లంపూడిలో ముద్రగడ దీక్షల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తుని, పిఠాపురం, సామర్లకోట రైల్వే స్టేషన్లతోపాటు పలు స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కొనేందుకు కమాండర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక స్టేషన్ మేనేజర్ కార్యాలయం, ఆర్పీఎఫ్ పోలీసు స్టేషన్, సిగ్నలింగ్ వ్యవస్థ, టికెట్ బుకింగ్ కౌంటర్లు, ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంటు సెక్యూరిటీ కమాండర్ నగేష్ నౌటియల్, సిఐలు హీరాసింగ్, ఆర్‌ఎస్ సింగ్, ఏలూరు ఇన్‌ఛార్జి వీరా సింగ్, స్థానిక ఆర్పీఎఫ్ ఎస్సై రవిశంకర్ సింగ్, ఎఎస్సైలు నరసింహారావు, గిరియ్య తదితరులు పాల్గొన్నారు.

ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఇంటికి భారీ భద్రత
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, ఫిబ్రవరి 7: ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇంటిని ముట్టడిస్తామంటూ కాపు ఉద్యమ నాయకులు ఇచ్చిన పిలుపుమేరకు ముందస్తు జాగ్రత్తగా ఆదివారం అమలాపురంలోని చినరాజప్ప ఇంటిని పోలీసులు దిగ్బంధనం చేశారు. ఆయన ఇంటకి వెళ్లే అన్ని దారుల్ని మూసివేశారు. నల్లవంతెన, ఎర్రవంతెన, హౌసింగ్ బోర్డు కాలనీ, తదితర మార్గాలన్నీ మూసివేయటంతో సామాన్యులు హౌసింగ్ బోర్డు కాలనీలోకి వెళ్లడానికి అష్టకష్టాలు పడ్డారు. అమలాపురం పట్టణ సిఐ వైఆర్‌కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో మోహరించిన పోలీసులు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇంటికి వెళ్లే మార్గాన్ని సైతం మూసివేశారు. ఉప ముఖ్యమంత్రి ఇంటిని ఎలాగైనా ముట్టడిస్తామని కాపు ఉద్యమ నాయకులు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. హోంమంత్రి చినరాజప్ప ఇంటిని ముట్టడిస్తామని కాపులు, ఎలాగైనా అడ్డుకుంటామని పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో ఆదివారం అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల ఏర్పాట్లు!
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 7: కాపులను బిసిల జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో గత మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను ఆదివారం అర్ధరాత్రి సమయం దాటిన అనంతరం పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించనున్నారనే అనుమానాలు కనిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు సమాచారంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రి కార్డియాలజీ విభాగంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ విషయాలను ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించడంలేదు. పలువురు సిఐలు, ఎస్సైలు ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి వచ్చి వైద్యులతో కలిసి కార్డియాలజీ విభాగంలో పరిశీలించినట్టు సమాచారం.