తూర్పుగోదావరి

రసాబాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 21: ప్రశ్నోత్తరాల సమయంలో కార్పొరేటర్ల మధ్య జరిగిన చర్చ వాగ్వివాదంగా మారి శనివారం జరిగిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సమావేశం రసాభాసగా మారింది. సమావేశాన్ని వాయిదావేస్తూ రెండుసార్లు సమావేశం నుంచి మేయరు బయటకు వెళ్లారు. చివరికి వైఎస్సార్ సిపి సభ్యులను సమావేశం నుంచి బహిష్కరించారు. మేయరు పోడియం ముందు కదలకుండా వ్యతిరేక నినాదాలు చేస్తున్న వైసిపికి చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్లను బలవంతంగా బయటకు పంపించారు. ఈ సందర్భంగా దఫేదార్లే మార్షల్‌గా మారారు. ఒక దశలో ఉమెన్ పిసిలు కూడా సమావేశంలోకి చొరబడ్డారు. సమావేశం ప్రారంభంలో తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ గాంధీపార్కులో వాటర్ ఫౌంటెన్ పనిచేయడం లేదని తెలిపారు. వార్డు సమస్యలను ప్రస్తావించారు. తరువాత వైఎస్సార్ సిపి ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ చెత్త సేకరణలో సింగపూరు తరహా విధానాలను అవలంబించాలని, తాను అక్కడ చూసిన విషయాలను తెలియజేశారు. కార్పొరేటర్లు కోరిన సమాచారాన్ని అధికారులు ఇవ్వాలని చెబుతుండగా తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరుపక్షాల మధ్య పరస్పరం విమర్శించుకుంటూ వర్రే శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని వైసిపి సభ్యులు మేయరు పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. డ్రైనేజీల్లో సిల్టు తీయడం లేదని నినాదాలు చేస్తూ ఇందుకు కారణాలు చెప్పాలని కమిషనర్‌ను ప్రశ్నించారు. ఈక్రమంలో ఫ్లోర్ లీడర్ కలుగజేసుకుని రాజమహేంద్రవరం నగరంలో ఎక్కడైనా ముంపు సమస్య వచ్చిందా అని ప్రశ్నించారు. వేరే సభ్యులు మాట్లాడుతుండగా అధికారులు సమాధానమిస్తున్నపుడు వర్రే శ్రీనివాసరావు జోక్యం ఏమిటని వైఎస్సార్ సభ్యులు నిలదీశారు. దీంతో వారిమధ్య మళ్లీ వాగ్వివాదం చోటుచేసుకుంది. తనను బయటకు వెళ్లమని వర్రే శ్రీనివాసరావు అన్నారని వైసిపి సభ్యుడు కిలపర్తి శ్రీనివాసరావు అభ్యంతరం తెలిపారు. వర్రేని సస్పెండ్ చేయాలంటూ వైసిపి కార్పొరేటర్లు పోడియం ముందు బైఠాయించారు. దీంతో మేయరు సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు. తెలుగుదేశం ఫ్లోర్ లీడరును సస్పెండ్ చేయాలని, మేయరు నిరంకుశ వైఖరి నశించాలంటూ వైఎస్సార్ సిపి ఫ్లోర్ లీడరు షర్మిలా రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడరు గుత్తుల మురళీధర్, కార్పొరేటర్లు మింది నాగేంద్ర, బొంతా శ్రీహరి, సుధారాణి, నూకరత్నం, పిల్లి నిర్మలాకుమారి పోడియం ముందు బైఠాయించారు. అరగంట తరువాత మేయరు సమావేశ మందిరంలోకి వచ్చారు. సభ్యులందరూ ఎవరి స్థానాల్లో వారు ఆశీనులు కావాలని కోరారు. మళ్లీ సమావేశం మొదలైంది. వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను ఎవరినీ కించపరచలేదన్నారు. మళ్లీ గందరగోళం మొదలైంది. అజెండా అంశాలు చర్చించాలని తెలుగుదేశం సభ్యులు, వైసిపి సభ్యుల నిరసనలకు సమాధానం చెబుతూ ప్రతిగా కేకలు వేశారు. దీంతో మేయరు రెండోసారి సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు. తెలుగుదేశం సభ్యులు భోజన విరామం కోసం వెళ్లారు. వైసిపి సభ్యులు పోడియం వద్దే నిరసన కొనసాగించారు. కొద్దిసేపటి తరువాత మేయరు తిరిగి సమావేశ మందిరానికి వచ్చారు. దీంతో వైసిపి సభ్యులు యథావిధిగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించడంతో కౌన్సిల్ విధులకు ఆటంకం కలుగుతోందని, సెక్షన్ 29 ప్రకారం వైసిపి సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు మేయరు ప్రకటించారు. వారిని బయటకు పంపించాలని కమిషనర్‌ను ఆదేశించారు. మహిళా కానిస్టేబుళ్లు వచ్చి వైసిపి మహిళా కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీస్ జులుం నశించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వైసిపి సభ్యుల సస్పెన్షన్ అనంతరం ఎట్టకేలకు అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తూ చర్చ కొనసాగించారు. నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎంపి మాగంటి మురళీమోహన్ ఒక్కరే సమావేశానికి హాజరై కొద్దిసేపు ఉండి ఆయన కూడా మధ్యలోనే వెళ్లిపోయారు.

ఇక ఓపెన్ డ్రెయిన్ల నిర్మాణాలకు చెల్లు!
భూగర్భ డ్రెయినేజీలనే నిర్మించాలి: కలెక్టర్ అరుణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మే 21: జిల్లాలో ఇక ఓపెన్ డ్రెయిన్ల నిర్మాణాల జోలికి వెళ్ళవద్దని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. భూగర్భ డ్రెయినేజీలను మాత్రమే నిర్మించాలని పంచాయితీరాజ్ ఇంజనీర్లను ఆయన ఆదేశించారు. కాకినాడ జిల్లాపరిషత్ సమావేశ హాలులో శనివారం పంచాయితీరాజ్ ఇంజనీర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం సమన్వయంతో గ్రామాల్లో చేపట్టిన సిసి రోడ్లు, మార్కెట్ కమిటీల నిధులతో రైతుల ప్రయోజనార్ధం నిర్మించే పుంత రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ఉపాధి హామీ, పంచాయితీరాజ్ శాఖల సమన్వయంతో సుమారు 500 కిలోమీటర్ల నిడివిన సిమెంటు రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామని, ఈ రహదారులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా, పూర్తి పారదర్శకతతో పనులు చేపట్టాలని పిలుపునిచ్చారు. సిసి రోడ్లతో పాటు భూగర్భంలో సాగే అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను మెరుగైన రీతిలో చేపట్టాలన్నారు. ప్రతి పంచాయితీరాజ్ డిఇ తన పరిధిలో కనీసం 2 గ్రామాల్లో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీతో సహా సిసి రోడ్లు నిర్మించాలని సూచించారు. జిల్లాలో పంచాయితీరాజ్, ఉపాధి హామీ నిధులతో రైతుల ఉపయోగార్ధం వారి పంట ఉత్పత్తులను తరలించుకునేందుకు అవసరమైన పుంత రోడ్లను గ్రావెల్, మెటల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు రూ. 19 కోట్ల 41 లక్షల అంచనాతో 458 పనులు చేపట్టినట్టు తెలిపారు. ఈ పనులు సత్వరమే పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పనిని ప్రారంభించేటపుడు, పనులు జరుగుతున్నపుడు పని పూర్తయిన తరువాత తప్పనిసరిగా డిజిటల్ కెమేరాలతో చిత్రీకరించాలని, డాక్యుమెంటేషన్ ప్రక్రియ అంతా సక్రమంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో పంచాయితీరాజ్ ఎస్‌ఇ వి వెంకటేశ్వరరావు, ఇఇలు ఎం నాగరాజు, బి సత్యనారాయణరాజు, మార్కెటింగ్ ఎడి కెవిఆర్‌ఎన్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
మెడిసిన్‌లో జిల్లాకు ర్యాంకుల పంట
కొత్తపేట, మే 21: మండల పరిధిలోని వాడపాలెం గ్రామ టిడిపి అధ్యక్షుడు చీకట్ల అబ్బు కుమార్తె భార్గవి అనూహ్య మెడిసిన్‌లో 232వ ర్యాంకు సాధించింది. శనివారం విడుదల చేసిన ఎమ్‌సెట్ ఫలితాల్లో భార్గవి రాష్టస్థ్రాయిలో 232వ ర్యాంకు సాధించగా ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 86వ ర్యాంకును సాధించింది. పదవ తరగతి వరకూ కొత్తపేట విశాలి కానె్వంట్‌లో చదివిన భార్గవి ఇంటర్ కాతేరు తిరుమల కాలేజిలో చదివి మెడిసిన్‌కు అక్కడే లాంగ్ టెర్మ్ కోచింగ్ తీసుకున్నట్టు భార్గవి తెలిపింది. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ మెడిసిన్ చేయాలన్నది తన జీవిత లక్ష్యమని, ఇందుకోసం ఎంతో కష్టపడినట్టు తెలిపింది. తన కృషికి తల్లిదండ్రులు ఎంతో సహకరించారని తెలిపింది. తనకు శిక్షణ ఇచ్చిన గురువులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. మెడిసిన్ చదివి పేదలకు సేవ చేయటమే లక్ష్యంగా పనిచేస్తానని భార్గవి తెలిపింది. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించిన భార్గవిని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, నియోజవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు సత్యానందరావు, జడ్పీటీసీ ధర్నాల రామకృష్ణ, ఎంపిపి రెడ్డి అనంతకుమారి, మండల టిడిపి అధ్యక్షుడు కంఠంశెట్టి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు వెంకట సత్తిబాబు, సర్పంచ్ అజ్జరపు అర్జున్ తదితరులు అభినందించారు.
మండపేట: పట్టణానికి చెందిన కర్రి చినబాబు, కాశీ అన్నపూర్ణ దంపతుల కుమారుడు శివరామకృష్ణ శనివారం విడుదలైన ఎంసెట్ మెడిసిన్ ఫలితాల్లో 329 ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా శివరామకృష్ణ విలేఖరులతో మాట్లాడుతూ పదవ తరగతి వరకు పట్టణంలోని పలు పాఠశాలల్లో చదువుకోగా పదవ తరగతిలో 10.8 శాతం మార్కులతో విజయం సాధించానన్నారు. విజయవాడలోని గోశాలలో గల చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ బైపిసి చదువుతున్నట్టు తెలిపాడు. శశి వేలివెన్నులో లాంగ్‌టెర్మ్ కోచింగ్ తీసుకుని 329 ర్యాంకు సాధించానన్నాడు. తల్లిదండ్రులు పదవ తరగతి వరకు చదువుకున్నా వారి ప్రోత్సాహం మరువలేనిదని చెప్పాడు. ఎంబిబిఎస్ అనంతరం కార్డియాలజీ విభాగంలో పిజి చేసి గుండెవ్యాధి నిపుణుడు కావాలన్నదే లక్ష్యమని శివరామకృష్ణ తెలిపాడు. తాతయ్య కర్రి రామారావు, పెదనాన్న వెంకటరమణ, కుటుంబ సభ్యులు శివరామకృష్ణకు స్వీట్లు తినిపించారు. ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆలమూరు: మండల పరిధిలోని చింతలూరుకు చెందిన బొబ్బా ఉదయకిరణ్ ఎంసెట్ మెడిసిన్‌లో రాష్టస్థ్రాయి 358 ర్యాంకు సాధించాడు. సాధారణ రైతయిన కృష్ణ, సుజాత దంపతుల కుమారుడు ఉదయకిరణ్ పాఠశాల విద్య నుండి ఉన్నతమైన ర్యాంకులు సాధించాడు. పదో తరగతిలో పది ర్యాంకు, ఇంటర్‌లో 982 మార్కులు సాధించాడు. ప్రస్తుతం ఎంసెట్ మెడిసిన్‌లో 358 ర్యాంకు సాధించడం పట్ల మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.
రావులపాలెం: రావులపాలెంకు చెందిన బావిశెట్టి జాని జితిన్ ఎంసెట్ మెడిసిన్ విభాగంలో రాష్టస్థ్రాయిలో 132వ ర్యాంకు సాధించాడు. 160కు 141 మార్కులు సాధించి 91.01 శాతంతో ఈ ఘనత సాధించాడు. శనివారం విడుదలజేసిన ఎంసెట్ మెడిసిన్ ఫలితాల్లో జానీ జితిన్ 132వ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు పెద్దిరావు, వాణి, సోదరి రాగస్రవంతి సంతోషం వ్యక్తం చేశారు. రావులపాలెం డాన్ బాస్కో స్కూల్లో టెన్త్‌లో 9.7 జిపిఎతో ఉత్తీర్ణత సాధించిన జానీ జితిన్ కాతేరు తిరుమల జూనియర్ కళాశాలలో వెయ్యికి 983 మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. అదే కళాశాలలో ఎంసెట్ కోచింగ్ తీసుకుని ఈ ఏడాది ఏప్రిల్ 29న కాకినాడలో ఎంసెట్ రాశాడు. ఇతని సోదరి రాగస్రవంతి కూడా 2014 ఎంసెట్‌లో మెడిసిన్ విభాగంలో 2544వ ర్యాంకు సాధించి ప్రస్తుతం అమలాపురం కిమ్స్‌లో ఎంబిబిఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమె మొదటి సంవత్సరం పరీక్షల్లో 80.2 శాతం మార్కులతో కళాశాల ద్వితీయ స్థానం సాధించింది. తండ్రి పెద్దిరావు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర పిహెచ్‌సిలో ఎంపిహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్నారు. కుటుంబంలో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ కుమార్తె, కుమారుడు కూడా వైద్యవృత్తివైపు అడుగులు వేయడం విశేషం. ప్రస్తుతం జానీ జితిన్ ఎయిమ్స్, జిప్నర్‌లో సీటు పొందేందుకు అవసరమైన పరీక్షల్లో పాల్గొనేందుకు శిక్షణ పొందుతున్నాడు. న్యూరో సర్జన్ కావాలన్నదే తన లక్ష్యమని విద్యార్థి తెలిపాడు. జిల్లాలోని ఏజన్సీ ఏరియాలో ప్రజలకు వైద్యసేవలందించాలన్నది తన ఆశయమని జానీ జితిన్ తెలిపాడు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబిబిఎస్ పూర్తిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
రామచంద్రపురం: పట్టణంలోని కవలవారి సావరంలో నివాసముంటున్న డ్రెయినేజి శాఖ సాంకేతిక సహాయకులు కలిగినీడి శేషగిరి రావు (గిరి) కుమారుడు సాయివెంకట్ శనివారం ప్రకటించిన ఎమ్‌సెట్ పరీక్షా ఫలితాల్లో 184వ ర్యాంకు సాధించాడు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి చెందిన శేషగిరిరావు ఉద్యోగ రీత్యా రామచంద్రపురంలో స్థిరనివాసులయ్యారు. కలిగినీడి శేషగిరిరావు, అరుణ దంపతుల జ్యేష్ఠ కుమారుడు కలిగినీడి సాయివెంకట్ రామచంద్రపురంలోని జివి అండ్ కెబిఎమ్ ఇంగ్లీష్ మాధ్యమ ఉన్నత పాఠశాలలో ఎల్‌కెజి నుండి పదోతరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు. అనంతరం 2014-15లో వేలివెన్ను గ్రామంలోని శశి విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేరి, 2015-16 సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ పరీక్షల్లో 1000 మార్కులకు 985 మార్కులు సాధించాడు. వైద్యవిద్యాకోర్సును చదవాలన్న లక్ష్యంతో ఎమ్‌సెట్ పరీక్షకు షార్ట్ టెర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. తొలి యత్నంలోనే 139 మార్కులు సాధించి, రాష్టస్థ్రాయిలో 184వ ర్యాంకును సాయివెంకట్ సాధించి, రామచంద్రపురం పట్టణానికి ఒక గుర్తింపు తెచ్చాడు. పరీక్షా ఫలితాలు వెల్లడైన వెంటనే సాయివెంకట్‌ను జివి అండ్ కెబిఎమ్ ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాల కరస్పాండెంట్ వల్లూరి గంగాభవానీతో పాటు పలువురు అభినందించారు. రామచంద్రపురం ఆర్డీఓ కె సుబ్బారావు, డిఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మేడిశెట్టి సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ నూకల మురళీకృష్ణ, ఎంఇఒ అడపా సత్తిరాజు, ఎఎంసి ఛైర్మన్ గరిగిపాటి సూర్యనారాయణమూర్తి, టిడిపి పట్టణ అధ్యక్షుడు నందుల సూర్యనారాయణ (రాజు), ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ కొవ్వూరి తాతారెడ్డి తదితరులు సాయివెంకట్‌ను, అతని తల్లిదండ్రులను అభినందించారు. తన తల్లిదండ్రుల కృషి, విద్యాసంస్థలు తనకందించిన ప్రోత్సాహం కారణంగానే తాను ఈ ర్యాంకును సాధించినట్టు సాయివెంకట్ వెల్లడించాడు. కాగా డ్రెయినేజి శాఖ అధికారులు సాయివెంకట్‌ను అభినందించారు.
పట్టణానికి చెందిన అక్కల ఠాగూర్ కుమారుడు అక్కల సతీష్‌రాయ్ శనివారం వెల్లడించిన ఎమ్‌సెట్ ఫలితాల్లో 267వ ర్యాంకు సాధించాడు. విజయవాడ, రాజమండ్రి, తణుకులోని చైతన్య విద్యాసంస్థల్లో చదివిన సతీష్‌రాయ్ తొలి యత్నంలోనే 267వ ర్యాంకు సాధించాడు. పట్టణంలో రాజకీయ నేతగా ఉన్న అక్కల ఠాగూర్ ముచ్చిమిల్లి రోడ్డులో పశుసంబంధ మందుల షాపును నిర్వహిస్తున్నారు.

పార్టీ పటిష్టత పైనే ప్రభుత్వ మనుగడ
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
- కార్యకర్తలే అభివృద్ధికి ప్రచార సారథులు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, మే 21: పార్టీ పటిష్టంగా ఉన్నప్పుడే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించగలదని, అందుకు కార్యకర్తలు, నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. అమలాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన శనివారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో జరిగింది. సమావేశంలో రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో స్థానిక ఎమ్మెల్యేలు దృష్టిసారించాలన్నారు. ఇంకుడు గుంతలు తవ్వుకుంటే ప్రతీ ఇంటికి రెండు వేల రూపాయలు ఇస్తామన్న విషయాన్ని గ్రామీణ ప్రజలకు తెలియజెప్పాలన్నారు. గ్రామాల్లో రెవెన్యూ డ్రెయిన్ల తవ్వకాలకు చర్యలు చేపట్టామన్నారు. అమలాపురం నుండి రావులపాలెం వరకూ రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నల్లవంతెన నుండి ఈదరపల్లి రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దివంగత నేత మెట్ల సత్యనారాయణరావు ఆశయం మేరకు గడియార స్తంభం సెంటర్‌ను ఆధునీకరించేందుకు ప్రణాళిక సిద్ధంచేయాలని రాజప్ప మున్సిపల్ ఇన్‌చార్జి చైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మికి సూచించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ఈ నెల 23న కాకినాడలో జరిగే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలన్నారు. అలాగే 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతానికి సహకరించాలని కోరారు. అంతకుముందు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు, మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి చిత్రపటాలకు రాజప్ప పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమావేశంలో పార్టీ పరిశీలకుడిగా మంతెన సత్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, మూడు మండలాల పార్టీ అధ్యక్షులు మల్లుల పోలయ్య, నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి, దాట్ల గోపిరాజు, పట్టణ టిడిపి అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ, ఎంపిపిలు బొర్రా ఈశ్వరరావు, గుబ్బల మాతాకస్తూరి తదితరులు పాల్గొన్నారు.
ఎంపి మాగంటి ప్రతిపాదనను తిరస్కరించిన కౌన్సిల్
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, మే 21: రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థకు చెందిన రెండెకరాల స్థలాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు లీజుకు ఇవ్వాలని రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ చేసిన ప్రతిపాదనపై టేబుల్ అజెండాగా వచ్చిన అంశాన్ని శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశం తిరస్కరించింది. ఈ అంశాన్ని వాయిదా వేసినట్టుగా కౌన్సిల్ అధికారులు వెల్లడించారు. లాలాచెరువు, క్వారీ మార్కెట్ మధ్యలో 177/2 ఎల్‌పి నెం.32/74లో రెండెకరాల మున్సిపల్ పార్కును గోకరాజు గంగరాజు గౌరవ జనరల్ సెక్రటరీగా ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు లీజుకు ఇవ్వాలని ఎంపి మాగంటి మురళీమోహన్ ప్రతిపాదించారు. ఈ అంశంపై కౌన్సిల్ సమావేశం రెండుసార్లు వాయిదా పడటంతో ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు. సమావేశం చివరిలో ఈ అంశం చర్చకు వచ్చింది. స్వతంత్ర సభ్యుడు గొర్రెల సురేష్ మాట్లాడుతూ రాజమండ్రి క్రికెట్ అసోసియేషన్‌కు తాను సెక్రటరీగా ఉన్నానని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు అనుబంధంగా ఉన్నానని, అయితే ఈవిషయం తమకు తెలియదని చెప్పారు. తాము కూడా రాజమండ్రి క్రికెట్ అసోసియేషన్ తరఫున స్థలం కోసం లేఖ ఇచ్చామన్నారు. రెవెన్యూ స్థలం పదెకరాలు ఇవ్వాలన్నారు. నగరపాలక సంస్థ స్థలం రెండెకరాలు సరిపోదని చెప్పారు. తెలుగుదేశం ఫ్లోర్ లీడరు వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ స్థలాలను ఎవరికైనా ఇస్తే ప్రభుత్వం నుండి అనుమతులు రావడం లేదని, గతంలో తిరస్కరించారని, ఈ అంశం తిరస్కరిస్తున్నామన్నారు. మురళీమోహన్ తమ పార్టీ వారే అయినప్పటికీ గోకరాజు గంగరాజు తమ మిత్రపక్షమైన బిజెపి ఎంపి అయినప్పటికీ తిరస్కరించక తప్పడం లేదన్నారు.
రాజమహేంద్రవరంలో ప్లాస్టిక్ నిషేధం ఖచ్చితంగా అమలు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, మే 21: రాజమహేంద్రవరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని ఇక నుంచి ఖచ్చితంగా అమలు చేయనున్నారు. డ్రైనేజీల్లో వేసిన ప్లాస్టిక్ వల్ల వాటిని తీయడం ఇబ్బందిగా ఉండటమేగాక అనారోగ్యాలు ప్రబలేందుకు కారణమవుతున్నందున ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. గృహాలు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద భోజనాలకోసం ఉపయోగించే ధర్మోకోల్, ప్లాస్టిక్ డిస్పోజబుల్ వస్తువుల వాడకాన్ని నిషేధించారు. ప్లేట్లు, స్పూన్లు, కప్పులు, గ్లాసుల అమ్మకం, వాడకం, రవాణా జరగకుండా చూడాలని నిర్ణయించారు. ఇటువంటి వస్తువులు అమ్మే వారికి నోటీసులు ఇవ్వాలని, అపరాధ రుసుం విధించాలని, అవసరమైతే ట్రేడ్ లైసెన్సులను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. దీనిపై విస్తృతమైన ప్రచారం నిర్వహించి, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని నిర్ణయించారు. మేయరు పంతం రజనీ శేషసాయి స్పందిస్తూ కొద్దిపాటి సవరణలతో తీర్మానం చేస్తున్నామని తెలిపారు.

ఘనంగా సత్యదేవుని శ్రీ చక్రస్నానోత్సవం
శంఖవరం, మే 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారి శ్రీ చక్రస్నానోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకుని కొండ దిగువన గల పంపా సరోవరం తీరాన ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో రత్నగిరి క్షేత్ర పాలకులు, పెళ్ళి పెద్దలైన శ్రీ సీతారాములతోపాటు స్వామి, అమ్మవార్లను సుందరంగా పరిమళ పుష్పాలతో అలంకరించిన ఆసనాలపై ఆశీనులు గావించారు. స్వామి, అమ్మవార్లతో దేవస్థానం వేద పండితులు తొలుత విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, ప్రత్యేక పూజాలు గావించారు. అనంతరం స్వామివారితో పాటు శంఖు, చక్రాలతో వేద పండితుల వేద మంత్రోచ్ఛరణలతో పవిత్ర పంపా సరోవరంలో మూడుసార్లు స్నానం చేయించి, భక్తులపై తీర్థం చల్లారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు మహదాశీర్వచనం, స్వస్తితో కార్యక్రమం ముగించి, భక్తులకు స్వామి వారి తీర్థ, ప్రసాదాలు వితరణ గావించారు.
శిక్షణల పట్ల నిర్లక్ష్యం తగదు
కలెక్టర్ సతీమణి శ్రీదేవి
సామర్లకోట, మే 21: శిక్షణల పట్ల నిర్లక్ష్యం తగదని, పూర్తిస్థాయిలో శిక్షణలు సద్వినియోగం చేసుకుని స్వచ్ఛ సంకల్పం గ్రామాలను తీర్చిదిద్దేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ సతీమణి, మహిళా శిశు సంజీవని ప్రాజెక్టు డైరెక్టర్ హెచ్ శ్రీదేవి పిలుపునిచ్చారు. స్వచ్ఛ సంకల్ప గ్రామాల సర్పంచ్‌లు, సామాజిక కార్యకర్తలకు రెండు రోజులుగా సామర్లకోట టిటిడిసిలో డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణా తరగతులు శుక్రవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ సతీమణి శ్రీదేవి 23 గ్రామాల సర్పంచ్‌లు, సామాజిక కార్యకర్తలు హాజరు కావల్సి ఉండగా, కేవలం 16 మంది మాత్రమే ఉండడంతో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అని ప్రశ్నించారు. తదుపరి ఇచ్చే శిక్షణలకు పూర్తిస్థాయిలో అందరూ హాజరవ్వాలని ఆమె ఆదేశించారు. బహిరంగ మలవిసర్జన వల్ల వచ్చు అనర్ధాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ప్రథమ పౌరుడైన సర్పంచ్ స్థాయి వ్యక్తి అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే ఈ విషయంలో అంగన్‌వాడీల సహకారం తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎంపిక చేసిన 23 మండలాలకు చెందిన 23 గ్రామాల్లో పూర్తిస్థాయిలో బహిరంగ మలవిసర్జనను నిర్మూలించి స్వచ్ఛ సంకల్ప గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తమవంతు సహకారం అందిచాలని కలెక్టర్ సతీమణి కోరారు. 50 అంగన్‌వాడీ కేంద్రాలను తాను దత్తత తీసుకుని అభివృద్ధికి చేపడుతున్న చర్యలను ఆమె వివరించారు. ఈ సమావేశంలో జడ్పీ సిఇఒ కె పద్మ పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛ సంకల్పం ఆశయ సాధనకు అందరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పలు అంశాలపై స్వచ్ఛ సంకల్పం ప్రాజెక్టు జిల్లా కో-ఆర్డినేటర్ నిహారిక అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో డిఆర్‌డిఎ వెలుగు డిపిఎం విబిఆర్ రాయ్, కాట్రేనికోన ఎపిఎం ఎంవిఆర్ సుబ్బలక్ష్మి, ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీల్లో పన్నుల విధానం సరళీకృతం చేయాలి
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ, మే21: జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారులను కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో శనివారం ఆయన పంచాయతీ శాఖ అధికారులతో గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న పన్నుల విధానంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పన్నులు వసూలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ పరిపాలన పటిష్ఠపరిచేందుకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోంచి మెరుగైన పరిపాలన సాధించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల ఎంపిడిఒ ఏ విధంగా సంబంధిత మండలంలో పంచాయతీల్లో పరిపాలన చేస్తున్నారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. ఆస్తి పన్నులు వసూలు, శానిటేషన్ తదితర పనులను ఆన్‌లైన్‌లో నమోదుచేయడం జరుగుతోందని తెలియజేశారు. ఆదే విధంగా మన జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గ్రామ పంచాయతీల్లో వారు అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేయాల్సిందిగా ఆదేశించారు. మండల ప్రధాన కేంద్రాల్లోని మేజర్ పంచాయతీల్లో నూతన సాంకేతిక విధానాన్ని అమలుచేయాలని స్పష్టం చేశారు. పంచాయతీ జారీచేసే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలకుని అన్ని ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. సమావేశంలో డిపిఒ శర్మ, ఎండిఒలు సుబ్బారావు, చినబాబు తదితరులు పాల్గొన్నారు.