తూర్పుగోదావరి

మహానాడుకు వడ దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 26: ‘స్వామి కార్యం.. స్వకార్యం’ రెండూ నెరవేరుతాయన్న ఆనందంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి వేదికగా శుక్రవారం జరిగే మహానాడుకు హాజరుకావాలని ఆశించిన తెలుగు తమ్ముళ్ళ ఆశలపై అధిక ఉష్ణోగ్రత, వడ గాలులు నీళ్ళు జల్లాయి. మహానాడుకు హాజరయ్యేందుకు ఎంతో ఉత్సాహం చూపిన తెలుగు తమ్ముళ్ళకు ప్రతికూల వాతావరణం అవరోధంగా నిలిచింది. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, ఈదురుగాలులతో కార్యకర్తలు మహానాడుకు హాజరయ్యేందుకు వెనుకడుగు వేశారు. ఫలితంగా జిల్లా నుండి పెద్ద ఎత్తున శ్రేణులను తిరుపతి నగరానికి తరలించాలని భావించిన పార్టీ నేతలు డీలా పడ్డారు. ప్రసిద్ధ క్షేత్రం తిరుపతి నగరంలో జరిగే మహానాడుకు సుమారు 6 వేల మంది జిల్లా నుండి హాజరుకానున్నట్టు ఆ పార్టీ నేతలు కాకినాడలో జరిగిన మినీ మహానాడు సందర్భంగా ప్రకటించారు. పార్టీ శ్రేణులను తరలించేందుకు అవసరమైన బస్సులను జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఏర్పాటుచేశారు. ఈ వాహనాలన్నీ గురువారం మధ్యాహ్నం నుండి సాయంత్రంలోగా ఆయా ప్రాంతాల నుండి బయలుదేరాల్సి ఉంది. అయితే అధిక ఉష్ణోగ్రతలతో ముందుగానే పలువురు తెలుగు తమ్ముళ్ళు ప్రయాణాన్ని విరమించుకున్నారు. చిత్తూరు జిల్లాలో కూడా ప్రస్తుతం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొని ఉండటంతో మహానాడుకు వెళ్ళిన పక్షంలో అడ్డంగా దొరికిపోయే ప్రమాదం ఉన్నదని పలువురు కార్యకర్తలు భావించారు. అధిక ఉష్ణోగ్రతలకు వేడి గాలులు తోడుకావడంతో మార్గం మధ్యలో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నదని, ఈ కారణంగానే పలువురు పార్టీ కార్యకర్తలు తమ ప్రయాణాన్ని విరమించుకున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే గురువారం రాత్రి చల్లబడిన తరువాత తిరుపతి బయలుదేరేందుకు ప్రయత్నించిన వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఈదురుగాలుల ఉద్ధృతితో రాత్రి ప్రయాణాన్ని కూడా అనేక ప్రాంతాల్లో కార్యకర్తలు విరమించుకున్నారు. సామర్లకోట-రాజమహేంద్రవరం ఎడిబి రోడ్డులో ఈదురుగాలుల ధాటికి చెట్లు రోడ్డుపై పడటం, ఇతర ప్రాంతాల్లో కూడా ప్రయాణానికి వాతావరణం అనుకూలంగా లేనట్టు గ్రహించిన తెలుగు తమ్ముళ్ళు మొత్తంమీద మహానాడుకు వెళ్ళేందుకు వెనుకడుగు వేశారు. జిల్లా నుండి కేవలం వెయ్యి లోపు మాత్రమే కార్యకర్తలు మహానాడుకు తరలివెళ్ళినట్టు తెలుస్తోంది. కార్యకర్తలను తరలించేందుకు వివిధ ప్రైవేట్ విద్యా సంస్థలు, ట్రావెల్స్ ఏజన్సీలకు చెందిన బస్సులను ఏర్పాటుచేసినప్పటికీ కార్యకర్తలు నిర్దేశిత ప్రదేశానికి చేరుకోకపోవడంతో సదరు వాహనాలను అనేకచోట్ల వెనక్కి పంపారు. ఈ ఏడాది మహానాడు తిరుపతి పుణ్యక్షేత్రంలో జరుగుతుండటంతో పలువురు కార్యకర్తలు హాజరయ్యేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. మహానాడుతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందని ఆశించారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు కావడంతో శ్రీవారి దర్శనం కోసం ముందుగా ఏర్పాట్లు చేసుకున్నారు.