తూర్పుగోదావరి

అటవీ భూములపై పె(గ)ద్దల కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 2: జిల్లాలో కోట్ల విలువజేసే అటవీ భూమిపై కొంతమంది పెద్దల కన్నుపడింది. రాజమహేంద్రవరానికి అతి సమీపంలోని రాజానగరం మండలం దివాన్ చెరువువద్ద 16వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూమిని కాజేయడానికి ఈ పెద్దలు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలియవచ్చింది. ఈ భూమిని ఏదోవిధంగా తన్నుకుపోయేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి అటవీ శాఖాధికార్లు తమ వంతు కృషిచేస్తున్నారు. రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్‌చెరువు పెట్రోలు బంకు నుండి 16వ నెంబరు జాతీయ రహదారి వెంబడి సుమారు 250 హెక్టార్ల అటవీ భూమి ఉంది. జాతీయ రహదారిని ఆనుకుని దాదాపు 15 కిలోమీటర్ల వెడల్పున లోపలికి ఈ భూమి ఉంది. అటవీ శాఖకు చెందిన ఈ భూములు ఆధారంగానే రాష్ట్ర విభజన సమయంలో రాజధాని రేసులో రాజమహేంద్రవరం సైతం నిలిచింది. శ్రీకృష్ణ కమిటీ కూడా ఈ భూములను పరిశీలించింది. ఈ భూములకు సమీపంలోనే దివాన్ చెరువు ప్రాంతంలో 16వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఇరువైపులా వేలాది హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయి. ఈ భూములు రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటాయని అప్పట్లో భావించారు. ఇదంతా గతం.. ఇప్పుడు ఆ పరిశీలన నేపథ్యం నుండే ఈ అటవీ భూములపై అధికార పార్టీ నేతల దృష్టిపడింది. విభజన అనంతరం పోలీసు అకాడమీ ఏర్పాటుకు ఈ భూములను పరిశీలించారు. ఇప్పుడు అకాడమీ పేరుతో ఈ భూములను అటవీ పట్టు నుండి వదిలించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సుమారు 250 హెక్టార్ల భూమిని ఏకమొత్తంగా తన్నుకుపోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు నేతలు ఈ భూములపై కనే్నసి, పావులు కదిపి, దాదాపుగా విజయవంతమైనట్టు తెలిసింది. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఎంతో విలువైన ఈ భూములను కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒకసారి అటవీ రక్షణ నుండి భూములు బయటికివస్తే ఇక రకరకాల పేరుతో అన్యాక్రాంతమైపోవడం తథ్యమని అధికారులు ఆక్రోశిస్తున్నారు. తొలుత ప్రభుత్వ సంస్థల స్థాపన అనే తాయిలం చూపినా, ముందు ముందు ఆ సంస్థలకు బదులుగా లీజుల పేరుతో ప్రైవేటుపరమైపోతాయనేది వారి ఆవేదన.
అటవీ భూములను ఇతరత్రా అవసరాలకు వినియోగించడం సాధారణ పరిస్థితుల్లో సాధ్యం కాదు. అటవీ చట్టాల నుండి ఈ భూములను స్వాధీనం చేసుకోవడం కష్టసాధ్యమే. అయితే విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి అవసరమైన రీతిలో భూభాగాన్ని వినియోగించుకోవడానికి అవసరమైన అటవీ భూములను డీ నోటిఫై చేసుకునే వెసులుబాటు కల్పించారు. సరిగ్గా ఈ వెసులుబాటును వినియోగించుకుని తమకు అవసరమైన రీతిలో భూములను సొంతం చేసుకునేందుకు ఈ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ భూమి విలువ ఎకరా సుమారు రూ.2 కోట్లు వరకూ ఉంటుందని అంచనా. రాష్టస్థ్రాయిలోనే పావులు కదిపి సంబంధిత అధికారులను ఇరకాటంలో పెడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే
ఈ భూముల్లో వివిధ సంస్థలు వస్తాయనే ముందస్తు అంచనాలతో చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు భూములను సైతం నేతల అనుయాయుల పేరిట కొనుగోళ్లు జరిపినట్టు సమాచారం.
ఇదే తరహాలో రాజమహేంద్రవరంలోని కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆధీనంలోని భూములను కూడా స్వాధీనం చేసుకోవడానికి పావులు కదిపారని తెలిసింది. సెంట్రల్ జైలుకు చెందిన భూములు కూడా స్వాధీనం చేసుకోవడానికి పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ భూములపై గత కాంగ్రెసు ప్రభుత్వం నుండీ ప్రయత్నాలు సాగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూపంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు ఈవిధంగా ప్రభుత్వ భూములపై కనే్నస్తే, ముందు ముందు అత్యవర పరిస్థితుల్లో సెంటు భూమి కూడా లభ్యం కాదనే అవేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

అడుగడుగునా నిఘా!
ముద్రగడ ప్రతి కదలికపై ఆరా-పర్యటనల చిత్రీకరణ
కడియం, జూన్ 2: కాపు గర్జనకు సంఘీభావం తెలిపిన ముఖ్య నేతలను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రతి కదలికపై పోలీసు నిఘా వర్గాలు డేగ కనే్నశాయి. పోలీసు వలయం మధ్య ముద్రగడ పర్యటన కొనసాగుతోంది. గురువారం మాజీ ఎంపి గిరజాల వెంకటస్వామినాయుడును కలిసేందుకు కడియం విచ్చేసిన ముద్రగడ పద్మనాభం కదలికలను గమనించేందుకు సిఐ, ఎస్సై కేడర్ అధికారులతోపాటు మఫ్టీ పోలీసులు పది మందికి పైగా ఆయన చుట్టూ కనిపించారు. ముద్రగడ ప్రతీ చర్యలను వారు వీడియో కెమెరాల్లో బంధించడంతోపాటు పలువురి నేతలతో ముద్రగడ జరుపుతున్న అంతరంగిక చర్చలపైనా ఆరాతీస్తున్నారు. ముద్రగడ పర్యటన ప్రారంభం నుండి ఆయన కదలికలను గురించి, చర్చలు, ప్రకటనల గురించి మీడియా కంటే ముందుగానే ఎప్పటికప్పుడు ఎస్‌బి, ఐబి పోలీసు ఉన్నతాధికారులకు నిఘా వర్గాలు సమాచారాన్ని చేరవేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలపైనే ఇలా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
రోడ్డెక్కించింది చంద్రబాబే
తాను గద్దెనెక్కడానికి కాపుజాతికి హామీల జల్లు కురిపించి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులను రోడ్డెక్కించారని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. గురువారం మాజీ ఎంపి గిరజాల వెంకట స్వామినాయుడును కలిసేందుకు ముద్రగడ కడియం విచ్చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కాపులను బిసిల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నామని, అంతకు మించి డిమాండ్లు ఏమీ లేవన్నారు. మాజీ ఎంపి గిరజాలతో మాట్లాడిన అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన కాపునేత, మాజీ ఎంపిపి తోరాటి సత్యనారాయణ కుటుంబాన్ని కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముద్రగడ వెంట రాష్ట్ర కాపునేతలు నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, రామినీడి మురళి ఉన్నారు. ముద్రగడను కలిసిన వారిలో కాపు నాయకులు గిరజాల బాబు, గట్టి నర్సయ్య, ఆదిమూలం సాయిబాబా, తాడాల చక్రవర్తి, మందపల్లి త్రిమూర్తులు, కల్యాణం సూరిబాబు, దొడ్డా శ్రీను, ముద్రగడ మహేష్, పసల నాయుడు, ముద్రగడ చిట్టిబాబు, ముద్రగడ బాబు, తిరుమలశెట్టి శ్రీను, గట్టి సుబ్బారావు, సాపిరెడ్డి సూరిబాబు తదితరులు ఉన్నారు.