తూర్పుగోదావరి

బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 2: 2019 నాటికి తూర్పుగోదావరి జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో ఎంపిడిఒలు, మండల ప్రత్యేకాధికారులు, జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతీ మండలంలో నెలకు 200 వ్యక్తిగత మరుగుదొడ్లను స్వచ్ఛ్భారత్, ఉపాధి హామీ కార్యక్రమాల ద్వారా ఉద్యమ స్థాయిలో నిర్మించాలన్నారు. గత మూడు నెలల కాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో గోకవరం, యు కొత్తపల్లి, కిర్లంపూడి, మండపేట, సామర్లకోట మండలాలు పురోగతి సాధించాయన్నారు. సఖినేటిపల్లి, అల్లవరం, ఏజన్సీ మండలాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించటంలో విఫలమయ్యామన్నారు.
అపారిశుద్ధ్యం, పిల్లల్లో ఎదుగుదల సమస్య, వికాశాన్ని నిరోధించే స్టంటింగ్ అనే ఆరోగ్య సమస్య మన జిల్లాలో ఉండడం చాలా బాధాకరమన్నారు. ఈ సమస్యలను పరిశుభ్రత, మంచి అలవాట్ల ద్వారానే నివారించగలమన్నారు. వర్షాలు విస్తారంగా కురవడంతో కోటి మొక్కలు నాటే లక్ష్యాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని 24 మండలాల నుండి కావాల్సిన మొక్కల ఇండెంట్లు అందలేదన్నారు.
సమావేశంలో జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, జడ్పీ సిఇఒ కె పద్మ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రాజేశ్వరరావు, డ్వామా పిడి ఎ నాగేశ్వరరావు, డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు, డిపిఒ శర్మ తదితరులు పాల్గొన్నారు.
హెడ్‌వర్క్స్ ఇఇగా కృష్ణారావు
ధవళేశ్వరం, జూలై 2: ఇరిగేషన్ సర్కిల్ హెడ్ వర్క్స్ ఇఇగా ఎన్ కృష్ణారావు శనివారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఇఇగా పనిచేస్తున్న తిరుపతిరావు బదిలీపై విశాఖపట్టణం ఇరిగేషన్ డివిజన్‌కు వెళ్లడంతో ఆయన స్థానే సామర్లకోట డ్రెయినేజీ సబ్ డివిజన్ డిఇగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణారావు హెడ్ వర్క్స్ ఇఇగా బాధ్యతలు చేపట్టారు.

నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా
ఆచార్య పొట్టి శ్రీరమేష్ బాధ్యతల స్వీకరణ
రాజానగరం, జూలై 2: రాజానగరం మండలం రాజరాజనరేంద్రనగర్‌లో ఉన్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ఆచార్య పొట్టి శ్రీరమేష్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించినట్టు ఉప కులపతి ఆచార్య ముత్యాల నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2007 నుండి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న శ్రీరమేష్ విశ్వవిద్యాలయ గత పాలన, అభివృద్ధి పనులు తదితర వాటిపై అవగాహన కలిగివున్నందున ఆయనకు రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించినట్టు విసి వెల్లడించారు. యూనివర్సిటీ అభివృద్ధికి శ్రీరమేష్ పాటుపడతారని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ శ్రీరమేష్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు విసి ముత్యాలనాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

గడప గడపకు వైసిపి విజయవంతం చేయాలి
కార్యకర్తలకు జిల్లా అధ్యక్షుడు కన్నబాబు పిలుపు

రావులపాలెం, జూలై 2: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజెప్పి చైతన్య పరిచేందుకు ఈ నెల 8వ తేదీ నుండి చేపట్టే గడప గడపకు వైసిపి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన రావులపాలెం వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ మహానేత వైఎస్ జయంతి రోజున ప్రారంభించే ఈ కార్యక్రమం ద్వారా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేసి, ప్రత్యామ్నాయ వ్యవస్థను నడుపుతూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. వ్యవసాయ విధానాలు సక్రమంగా లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటే సాక్షాత్తూ మంత్రే వారిని బెదిరిస్తున్నారన్నారు. అబద్ధాలతో మాయచేస్తూ చంద్రబాబు వాటిని నిజాలుగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముద్రగడ దీక్ష చేసినా, రైతులు ధర్నాలు చేసినా అన్నిటి వెనుక జగన్ ఉన్నారని ఆరోపణలు చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ప్రభుత్వ విధానాలతో కష్టాలు ఎవరు ఎదుర్కొన్నా వారి వెనుక జగన్ ఉంటారని ఆయన పేర్కొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ప్రోటోకాల్ విధానంపై కన్నబాబు మాట్లాడుతూ ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా బాధ్యతలు, హక్కులు ఒకేలా ఉంటాయన్నారు. ఎమ్మెల్యేలను కాదని ఎమ్మెల్సీలను పైన పెట్టాలనుకుంటే ప్రభుత్వం జిఒ ద్వారా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. సభాధ్యక్షుడుగా ఎప్పుడూ ఎమ్మెల్యేకే ప్రాధాన్యత ఉంటుందని, ఈ వ్యవస్థను ఎవరూ మార్చలేరని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ జిల్లా అంతటా ఒకటే ప్రోటోకాల్ ఉండాలన్నదే తన డిమాండ్ అని స్పష్టం చేశారు. తన పేరు ఎక్కడ వేసినా తనకు అభ్యంతరం లేదని, ఎమ్మెల్యేకు ప్రతి చోట ఏ స్థానం కేటాయిస్తున్నారో తనకూ ఆ స్థానం కేటాయించాలని కోరారు. సమావేశంలో ఎంపిపి కోట చెల్లయ్య, జడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, గొల్లపల్లి డేవిడ్‌రాజు, మార్గాన గంగాధరరావు, గొలుగూరి మునిరెడ్డి, కముజు సత్యనారాయణ, వైస్-ఎంపిపి దండు వెంకట సుబ్రహ్మణ్యవర్మ, ముత్యాల వీరభద్రరావు, తమ్మన శ్రీను, ఎంపిటిసిలు కొండేపూడి రామకృష్ణ, బొక్కా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పోరాడితేనే సమస్యలకు పరిష్కారం
గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణమూర్తి, కార్యదర్శి మిడియం
రాజవొమ్మంగి, జూలై 2: రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యల పోరాటం ద్వారానే పరిష్కరించుకోవాలని సిపిఎం అనుబంధ సంస్థ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణమూర్తి, కార్యదర్శి మిడియం బాబూరావు అన్నారు. గిరిజన సంఘం డివిజన్ 4వ మహాసభలు రాజవొమ్మంగిలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు కావస్తున్నా నేటికీ రక్షిత మంచినీటికి గిరిజనుడు నోచుకోలేదంటే అభివృద్ధి ఏమేరకు జరిగిందో తెలుస్తుందన్నారు. చాల గ్రామాలకు రహదారులు, వైద్యం, విద్య లేక గిరిజనుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన్యంలో వౌలిక సదుపాయాలు కల్పించడంతో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. మన్యంలో అంటువ్యాధులు ప్రబలి ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు. 70 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, వీరికి సరైన వైద్య సహాయం అందడంలేదని, పౌష్టికాహారం అందరికీ అందజేయాలని వారు డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవి బిడ్డలకు ఇవ్వాల్సిన లక్షలాది ఎకరాల భూమి ఇచ్చేంతవరకు తాము పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. తక్కువ మంది విద్యార్థులున్నారనే నెపంతో పాఠశాలల్ని ఎత్తివేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతుందన్నారు. రెవెన్యూ, అటవీ అధికారులు గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేదిలేదని, తాము ఉద్యమంతోనే బుద్ధి చెబుతామన్నారు. గిరిజనులంతా కలిసికట్టుగా హక్కులకై పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయవద్దని అన్నారు. రాజవొమ్మంగి పురవీధుల్లో గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సింగిరెడ్డి అచ్చారావు, తెడ్ల అబ్బాయి, లోతా రాంబాబు, పలు గ్రామాల నుండి వచ్చిన గిరిజనులు పాల్గొన్నారు.