తూర్పుగోదావరి

దుఖఃసాగరం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 12: యానాం పట్టణానికి సమీపంలోని దరియాలతిప్పలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో కాకినాడ నగరంలోని డ్రైవర్స్ కాలనీ దుఖఃసాగరంగా మారింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందడం, ఒకరు గల్లంతు కావడంతో మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. కాట్రేనికోనలోని తమ రెండవ కుమార్తెను చూసేందుకు కొప్పాడి సత్తిరాజు కుటుంబం శుక్రవారం రాత్రి ఇండికా కారులో బయలుదేరి వెళ్ళారు. వీరంతా రాత్రి 9.30 గంటల వరకు డ్రైవర్స్ కాలనీలోని ఇంట్లోనే ఉన్నారు. శనివారం తెల్లవారే సరికి యానాం సమీపంలోని దరియాలతిప్ప వద్ద గోదావరి నదిలో కారుతో సహా శవాలై తేలారు. కాకినాడ నగర శివారు తూరంగి పంచాయతీ పరిధిలోని యానాం రోడ్డులో గల రాఘవేంద్రపురం (డ్రైవర్స్ కాలనీ)లో సత్తిరాజు కుటుంబం నివసిస్తోంది. సత్తిరాజు (70), భార్య ధనలక్ష్మి (65)లు తమ కుమారుడు పవన్‌కుమార్ (35), కోడలు పార్వతి (30), ఐదు, సంవత్సరాల వయస్సు గల మనుమరాళ్ళతో కలిసి రాత్రి 9.30 గంటల తరువాత ఎపి 5వి 201 అనే నెంబరు ఇండికా కారులో కాట్రేనికోన బయలుదేరి వెళ్లడాన్ని స్థానికులు గమనించారు.
దారి మళ్లిన కారు!
ఈ దుర్ఘటన జరిగిన విషయం కంటే వీరు ప్రయాణించిన కారు వేరే మార్గంలో ప్రయాణించడం ఆయా వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. కాకినాడ నుండి బయలుదేరిన తరువాత యానాం-ఎదుర్లంక వంతెన మీదుగా వీరు వెళ్లాల్సి ఉంది. అయితే వీరి కారు తాళ్లరేవు పెట్రోల్ బంకు పక్కనే గాడిమొగ మార్గం వైపు మళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి నుండి దరియాలతిప్ప మీదుగా ప్రయాణించి, మార్గం మధ్యలో ఘోర ప్రమాదానికి గురైంది.
కుమారుడే డ్రైవర్...
సత్తిరాజు కుమారుడు పవన్‌కుమార్ కాకినాడలోని కోరమాండల్ ఎరువుల కర్మాగారంలో కంప్యూటర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలను తీసుకుని తనే స్వయంగా కారును నడుపుతూ కాట్రేనికోన బయలుదేరాడు. కాకినాడ నుండి నేరుగా జాతీయ రహదారిపై ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ, వేరే రహదారిలో ప్రయాణించడంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. కుమార్తె ఇంటికి బయలుదేరి వెళ్తూ మార్గం మధ్యలో రాత్రి యానాంలో జరుగుతున్న క్రీస్తు సభలకు హాజరై వేకువజామున కాట్రేనికోన వెళ్తామని తమకు చెప్పినట్టు స్థానికులు పేర్కొన్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గోదావరి నదిలోకి దూసుకువెళ్ళి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు లభ్యం కాగా పవన్‌కుమార్ గల్లంతయ్యాడు. సత్తిరాజు పెద్ద మనుమరాలు మాత్రం కాకినాడ నగరంలోని గోళీలపేటలో గల అమ్మమ్మ ఇంట్లో ఉండిపోవడంతో ఈ ప్రమాదం నుండి బయటపడింది.
డ్రైవర్స్‌కాలనీలో విషాదం...
మృతుడు సత్తిరాజు మత్స్యశాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు. స్థానిక డ్రైవర్స్ కాలనీలో స్థిరపడిన ఈయన ఇంట్లోనే చిన్న కిరాణా దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కొడుకు పవన్‌కుమార్ ఇంజనీరింగ్ చదివి స్థానిక కోరమాండల్ ఎరువుల కర్మాగారంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం పొందాడు. కుటుంబంలో దాదాపు అందరూ ఈ దుర్ఘటనకు బలి కావడంతో డ్రైవర్స్ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇంటికి తాళం వేసింది వేసినట్టే ఉండగా, బంధు మిత్రులు, స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. యానాంలో పోస్ట్‌మార్టం నిర్వహించడంతో పలువురు అక్కడికి కూడా వెళ్ళారు.