తూర్పుగోదావరి

ప్రత్యేక బంద్‌కు సంపూర్ణ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బంద్‌కు కోనసీమలో ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించింది. కోనసీమలోని ప్రధాన మండలాల్లో వర్తక, వాణిజ్య సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు మద్దతు ప్రకటించగా, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యా సంస్థలను నిరసనకారులు మూయించివేశారు. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. వైసిపి ఆధ్వర్యంలో నియోజకవర్గ కన్వీనర్ పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టిబ్బాయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిండగుదిటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, మట్టపర్తి నాగేంద్ర, బొంతు గోవిందుశెట్టి, మట్టపర్తి మురళీకృష్ణల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు విశ్వరూప్, చిట్టబ్బాయిలతో పాటు పలువురు వైసిపి నాయకులను అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక టౌన్ స్టేషన్ ఎదుట నిరసనకారులు కొద్దిసేపు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
పిసిసి రాష్ట్ర కార్యదర్శి కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో స్థానిక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్ధ రాస్తారోకో నిర్వహించి రాకపోకలను అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, యేడిద శ్రీను, కుడుపూడి శ్రీను, ములపర్తి సత్యనారాయణ, నూకల బుల్లియ్యనాయుడు, అర్నపల్లి ముత్యం, తోపెల్ల సుబ్రహ్మణ్యం, యార్లగడ్డ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఎం రాజశేఖర్, కె వెంకటేశ్వరరావు, పి వసంతకుమార్, బి శ్రీనివాస్, కె కృష్ణ, కె సత్తిబాబు తదితరులు బంద్‌లో పాల్గొన్నారు. కాపు యువసేన ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిమ్మకాయల సురేష్, కన్వీనర్ బోడపాటి గోపాలకృష్ణమూర్తి, మురమళ్ళ శివవీరారెడ్డినాయుడు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జెఎసి ఆధ్వర్యంలో బండారు రామోహన్‌రావు, మంత్రిప్రగడ వేణుగోపాల్, డాక్టర్ మధుర నరసింహమూర్తి, ఉండ్రు బాబ్జి, కరాటం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
రాజవొమ్మంగిలో...
రాజవొమ్మంగి: బంద్ మండలంలో ప్రశాంతంగా జరిగింది. స్థానిక బస్టాండు సెంటర్‌లో మోటారు బైక్‌లు రహదారికి అడ్డుగా ఉంచి వాహనాల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆర్టీసి బస్సులు తిరగలేదు. పాఠశాలలు, ప్రభుత్వ క్యాలయాలు, బ్యాంకులు పనిచేయలేదు. రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను రోడ్డు పైనుండి వెళ్లిపోవాలని ఎస్సై స్వామినాయుడు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో అదుపులోకి తీసుకొని పోలీస్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోదొడ్డి సర్పంచ్ లోతా రామారావు, జడ్డంగి సర్పంచ్ మురళి, తంటికొండ సర్పంచ్ శుభలక్ష్మి, స్థానిక ఉపసర్పంచ్ చంద్రరావుతో బాటు పలువురు వైసిపి, సిపిఎం, కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గోకవరంలో...
గోకవరం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్ గోకవరంలో విజయవంతమైంది. జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బంద్‌లో షాపులు, కార్యాలయాలు, స్కూళ్లు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. వైసిపి నేతలు తెల్లవారుజామున 4 గంటలకే బస్ డిపోకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వైసిపి నాయకులు బస్సులను అడ్డుకోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు దగ్గరుండి ఆర్టీసి బస్సులను రోడ్డెక్కించారు. ఈ ఆందోళనలో వైసిపి నాయకులు మంగరౌతు శ్రీనివాస్, నరాలశెట్టి నర్సయ్యకాపు, పల్లెల బాబి, ముత్యం నాని, ఎలుగుబంటి దుర్గాప్రసాద్, పోసిన రాజీదొర, కుమ్మరిపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
కోరుకొండలో...
కోరుకొండ: మండల కేంద్రమైన కోరుకొండలో బంద్ సంపూర్ణంగా జరిగింది. మంగళవారం ఉదయం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వ్యాపార సంస్థలను మూయించి వేశాయి. ఈ సందర్భంగా వివిధ ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయి. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో ఉల్లి బుజ్జిబాబు, చింతపల్లి చంద్రం, వాకా నరసింహారావు తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోరుకొండ సిఐ మధుసూదనరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాంబాబు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సామర్లకోటలో...
సామర్లకోట: ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసిపి, వామపక్షాలు తదితర పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపు మంగళవారం సామర్లకోటలో పూర్తిగా విజయవంతమైంది. వైసిపి పెద్దాపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో ఉదయం పట్టణంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. స్థానిక పెద్దాపురం రోడ్డులో మెహర్ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహిస్తున్న వైసిపి రాష్ట్ర కార్యదర్శి, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు ఆవాల లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు కాళ్ళ లక్ష్మీనారాయణలను, స్టేషన్ సెంటర్‌లో ఆందోళన నిర్వహిస్తున్న సిపిఎం నాయకులను రోడ్లపై ఆందోళన చేయవద్దని రంపచోడవరం అడిషనల్ ఎస్పీ నయిమ్ అస్మీ, పెద్దాపురం సిఐ కె శ్రీ్ధర్‌కుమార్, సామర్లకోట ఎస్సై ఆకుల మురళీకృష్ణ తదితరులు హెచ్చరించారు. సిపిఎం, సిపిఐల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు అడ్డగించారు. పోలీసులు దిష్టిబొమ్మ దహనానికి అడ్డుతగలడంతో సిపిఎం, సిపిఐ నాయకులు వినూత్నంగా శవయాత్ర అనంతరం దిష్టిబొమ్మను పిబిసి కాల్వలో నిమజ్జనం చేశారు. ఈ సంఘటన కారణంగా సుమారు 10 మంది వామపక్ష పార్టీల నాయకులను సామర్లకోట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిపిఐ న్యూడెమాక్రసీ ఆధ్వర్యంలో సుమారు 200 మంది బంద్‌కు మద్దతుగా పట్టణ వీధుల్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళనలో వైసిపి నాయకులు మద్దాల శ్రీనువాసు, కాళ్ళ లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజెస్, పితాని సూర్యనారాయణ, లింగం శివకుమార్, శెట్టిబత్తుల దుర్గారావు, మంచెం సాయి, కానేటి ఎలిజబెత్‌రాణి, మేకా శ్రీనువాసు, కె విజయకృష్ణ, పాలిక చంటి, ముమ్మితి రమణ, నూతలపాటి జగ్గారావు, సిపిఎం నాయకులు కరణం ప్రసాదరావు, డి సింహాచలం, విప్పర్తి కొండలరావు, కరణం గోవిందరాజు, సిపిఐ నాయకులు పెదిరెడ్ల సత్యనారాయణ, ఎఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఉప్పలపాటి చంద్రయ్యదాసు, సిపిఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ నాయకులు డి కృష్ణార్జున, ఎస్ సత్యనారాయణ, వి శాంతి, కృష్ణవేణి, జ్యోతుల రాము, దుర్గ, ప్రసాద్, ఐ గంగ తదితరులు పాల్గొన్నారు.
విలీన మండలాల్లో...
చింతూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకోసం వైఎస్సార్ కాంగ్రెస్ మంగళవారం ఇచ్చిన పిలుపుమేరకు చింతూరు, ఎటపాక విలీన మండలాల్లో మంగళవారం బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు చింతూరు ప్రధాన సెంటర్లో ఆందోళన చేపట్టారు. రహదారిపై ఆందోళన చేపట్టడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఎస్‌ఐ గజేంద్రకుమార్ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రాస్తారోకో చేస్తున్న నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నాయకులు ఎండి మూసా, చిన్ని, కోట్ల కృష్ణ, పల్లపు వెంకట్ తదితరులు బంద్ నిర్వహణలో పాల్గొన్నారు.
తునిలో...
తుని: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ టిడిపి, బిజెపియేతర పార్టీలు మంగళవారం తలపెట్టిన బంద్ విజయవంతమైంది. వైసిపి నేత, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు తెలపడంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పట్టణంలో బంద్ సందర్భంగా వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు.