తూర్పుగోదావరి

ఈ బంద్ ‘ప్రత్యేకం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 2: ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలిచ్చిన బంద్ పిలుపునకు జిల్లా ప్రజానీకం పూర్తిగా సహకరించింది. ఇది మనందరి బాధ్యత అంటూ హోదాకై గళమెత్తింది. ప్రజల సహకారంతో ప్రతిపక్షాలు బంద్‌ను సక్సెస్ చేశాయి. హోదాపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం జిల్లాలో బంద్‌ను ఆయా వర్గాలు విజయవంతం చేశాయి. మంగళవారం తెల్లవారగానే జిల్లా కేంద్రం కాకినాడలో రాజకీయ పక్షాల ప్రతినిధులు పార్టీ జెండాలతో బంద్‌కు శ్రీకారం చుట్టారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న కమ్యూనిస్టు పార్టీల నేతలు బస్సులను డిపోల నుండి కదలకుండా ముట్టడించారు. కాంప్లెక్స్ ఆవరణలో టైర్లకు నిప్పుపెట్టి నిరసన నినాదాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పవరం, భానుగుడి జంక్షన్, కలెక్టరేట్ తదితర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిపారు. కలెక్టరేట్ వద్దకు చేరుకున్న ప్రతిపక్ష పార్టీ శ్రేణులతో ఆ ప్రాంతం హోరెత్తింది. నగరంలోని మెయిన్‌రోడ్, టూటౌన్, మసీదు సెంటర్, జగన్నాథపురం తదితర ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. బంద్ నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కలెక్టరేట్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆవరణల్లో పోలీసు పహారా ఏర్పాటుచేశారు. పోలీసులు చూస్తుండగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఆయా డిపోలలో ఉదయం బయలుదేరాల్సిన 815 ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించాయి. సాయంత్రానికి ఆయా డిపోల నుండి రాకపోకలు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఆటోలు, ప్రైవేటు వాహనాలను చాలావరకు స్వచ్ఛందంగా నిలిపివేశారు. జిల్లా కేంద్రం కాకినాడలోని సినీ థియేటర్లలో ఉదయం ఆటలను రద్దుచేశారు. వాణిజ్య సముదాయాలు, వ్యాపార దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెట్రోల్ బంకులను మూసివేశారు. కొన్నిచోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్దకు నిరసనకారులు వెళ్ళి నినాదాలు చేస్తూ మూసివేయించారు. కలెక్టరేట్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయాలను వైఎస్సార్ కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు మూసివేయించారు. నగరంలోని భానుగుడి జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ముత్తా శశిధర్, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, సిపిఎం నేతలు దువ్వా శేషుబాబ్జీ, పలివెల వీరబాబు, సిహెచ్ అజయ్‌కుమార్, సిపిఐ నుండి తాటిపాక మధు, నక్కా కిశోర్, టి ప్రసాద్, పప్పు ఆదినారాయణ, కె ఆదినారాయణ, కాంగ్రెస్ నుండి తూము కృష్ణచైతన్య, చంద్రవౌళి తదితరులు ఆయా ప్రాంతాల్లో బంద్‌కు నాయకత్వం వహించారు.
కురసాలతో మాలకొండయ్య మాటా మంతీ
కలెక్టరేట్‌లో ఆందోళన చేస్తున్న వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి పలకరించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏమీ చేయలేని మీరు ఇపుడు హోదా పేరుతో ఆందోళన చేయడం సమంజసంగా లేదని మాలకొండయ్య వ్యాఖ్యానించగా, ఎన్నికల్లో హామీలిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపిన ఘనత మీ పార్టీకే దక్కిందంటూ కన్నబాబు చురకవేశారు.