తూర్పుగోదావరి

ఉపాధి హామీకి నిధుల కొరత లేదు: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపచోడవరం, ఆగస్టు 4: ఉపాధి హామీ పథకం అమల్లో నిధులకు కొదవలేదని, గిరిజనుల జీవనోపాధి కల్పనకు అధికారులు సమన్వయంతో కృషిచేస్తూ వారి అభివృద్ధికి తోడ్పాడాలని జిల్లా కలెక్టర్ అరుణకుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం స్థానిక ఐటిడిఎ సమావేశపు హాల్లో వివిధ శాఖల జిల్లా, డివిజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ అనుసంధానంతో చేపడుతున్న ఉద్యానవన సాగు, ఎన్టీఆర్ జలసిరి-2, సేద్యపు నీటిగుంటల నిర్మాణ పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది 90శాతం ఉపాధి నిధులు, 10 శాతం పంచాయతీ నిధులతో గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్లు, రూ.11 కోట్లతో 325 పనులు గుర్తించామన్నారు. ఎన్టీఆర్ జలసిరి కింద గిరిజనులు వ్యవసాయ యోగ్యంగా మార్చుకున్న భూముల్లో బోరు బావులు మంజూరుచేస్తూ వాటిని సాగుకు అనుకూలించేలా తీర్చిదిద్దాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. ఆయా మండలాల పరిధిలో నిర్ధేశించిన మూడు గ్రామాలను ఎంపిడిఒ, తహసీల్దార్, ఉపాధి హామీ ఎపిడిలు దత్తత తీసుకోవాలని ఆదేశించారు. 2019 నాటికి జిల్లాను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఈతలపాడు గ్రామంలో ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న అంగన్‌వాడీ పోషకాహార కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఐటిడిఎ ఇన్‌ఛార్జి పిఒ రవి మాట్లాడుతూ ఉపాధి హామీ ద్వారా గిరిజనులకు మేలు చేకూర్చవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అనంతరం కలెక్టర్ గిరిజన మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్‌ఇడి బల్బుల తయారీ యూనిట్‌ను పరిశీలించారు. మరో బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చేందుకు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అధికారులతో సమాలోచన చేశారు. యూనిట్ ముందు భాగంలో ఉన్న ఆక్రమణలను తొలగించి స్థలాన్ని చదునుచేయించాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డ్వామా పిడి నాగేశ్వరరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ మూర్తి, ట్రాన్స్‌కో ఎస్‌ఇ ప్రసాద్, ఎడిఇ తిలక్‌కుమార్, ఇఇ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.