తూర్పుగోదావరి

ఎడమ గట్టుపై ఏటిపట్టు ఎత్తిపోతల పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 15: అఖండ గోదావరి నది ఎడమ గట్టును ఆనుకుని ఏటిపట్టున రూపుదాల్చిన ఎత్తిపోతల పథకం టెండర్ల దశకు చేరుకుంది. పోలవరం ఎడమ కాల్వ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేంత వరకు సత్వర వినియోగానికి పట్టిసీమ మాదిరే ఈ పథకం రూపుదాల్చింది. దీనికి తోడు ఏలేరు వాగుతో గోదావరి నదిని అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా ఈ పథకం ప్రత్యేకత సంతరించుకుందని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామానికి సమీపంలో ఈ పథకం రూపుదాల్చుతోంది కాబట్టి ఏటిపట్టు ఎతిపోతల పథకంగా అంకురార్పణ జరుగుతోంది. ప్రాజెక్టు డిటైల్డ్ రిపోర్టు సిద్ధం కావడంతో ఇక టెండర్లు పిలవడమే తరువాయిగా రంగం సిద్ధమైంది. కృష్ణా పుష్కరాల అనంతరం ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధంచేస్తున్నారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొదటి దశలో హెడ్ వర్స్క్, రెండో దశలో పంపింగ్ స్టేషన్లు నిర్మించనున్నారు. మొత్తం ఈ ప్రాజెక్టు విలువ రూ.1710 కోట్లుగా అంచనావేశారు. మొదటి దశలో రూ.1080 కోట్లతోనూ, రెండో దశలో రూ.630 కోట్ల విలువైన పనులతో ఈ పథకం పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుంది. పురుషోత్తపట్నం వద్ద అఖండ గోదావరి ఎడమ గట్టు నుంచి ప్రెజర్ మెయిన్ రూపొందిస్తారు. ఇక్కడ మొత్తం పది పంపులను రెండేసి పంపులు ఒక లైన్‌గా రూపొందిస్తారు. ఈ ప్రెజర్ మెయిన్‌కు ఒక్కో పంపు నుంచి 350 క్యూసెక్కుల నీటిని మొత్తం పది పంపుల నుంచి 3500 క్యూసెక్కుల నీటిని తోడుతారు. 10 కిలోమీటర్ల మేర పైపులైన్ ద్వారా నీటిని గ్రావిటీ ద్వారా పంపుచేసేలా రూపొందించారు. ఈ విధంగా తీసుకెళ్ళే నీటిని పోలవరం ఎడమ కాల్వ 18వ కిలోమీటరు వద్ద పైపులైన్‌లో వదులుతారు. అక్కడ నుంచి ఈ నీటిని పోలవరం ఎడమ కాల్వ 57వ కిలోమీటరు వద్ద క్రాస్‌చేస్తున్న ఏలేరు వాగులోకి 1000 క్యూసెక్కుల నీటిని వదులుతారు. రెండో దశలో ఏలేరు రిజర్వాయర్ వద్ద పంపింగ్ స్కీమ్ నిర్మిస్తారు. ఇందుకు రూ.630 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ నీటిని పంపింగ్ ద్వారా ఏలేరు రిజర్వాయర్‌లోకి పంపిస్తారు. గోదావరి జలాలను ఏలేరుతో ఈ విధంగా అనుసంధానం చేయడంవల్ల ఏలేరు పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు నీటిని స్టోరేజి చేసుకునే అవకాశం చిక్కడంతో ఇటు విశాఖ తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, అటు ఏలేరు ఆయకట్టు స్థిరీకరణ లభించనుంది. దీంతో పూర్తిస్థాయిలో పోలవరం ఎడమ కాల్వను కూడా ప్రత్యామ్నాయంగా సద్వినియోగంలోకి తెచ్చినట్టవుతుందని ఇంజనీర్లు ఆలోచన చేశారు. 2017 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఏదేమైనప్పటికీ నదుల మధ్యే కాకుండా ఏర్లు, వాగులు కూడా గోదావరి నదితో అనుసంధానం చేయొచ్చని ఈ పథకం ద్వారా నిరూపించనున్నారు.