విజయనగరం

నేటి నుంచి‘ఆపరేషన్ గజ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, డిసెంబర్ 27: కురుపాం అటవీ ప్రాంతం కొండపై సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అటవీశాఖాధికారి ఎ.వి రమణమూర్తి తెలిపారు. ఆదివారం కురుపాంలో విలేఖర్లతో మాట్లాడుతూ దీని కోసం బెంగుళూరు నుంచి ఏనుగుల తరలింపులో నైపుణ్యం ఉన్న డాక్టర్ రుద్రాదిత్యను రప్పిస్తున్నామన్నారు. చిల్లి ఎరోమాటిక్ పద్ధతి ద్వారా వీటిని పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వీటిని ఒడిషాకు పంపాలా, వచ్చిన చోటకే పంపించాలన్నది ఆయన పరిశీలించాక తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు విశాఖ నుంచి అదనపు ఫారెస్టు కన్సర్వేటర్ ఎన్.ప్రదీప్‌కుమార్ రానున్నట్టు తెలిపారు. 2007లో 11 ఏనుగుల గుంపు ఒడిషా నుంచి రాగా కొన్నింటిని తరలించగా మరి కొన్ని చనిపోయినట్టు తెలిపారు. వీటిలో నాలుగు ఏనుగులు మిగిలి ఉన్నాయని ఇవన్ని ఆడ ఏనుగులు కావడంతో ప్రమాదం లేకపోయినా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రాణ, పశు నష్టం లేకుండా గిరిజనులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఏనుగుల వల్ల నిరాశ్రయులైన గిరిజన కుటుంబాలకు సోమవారం నుంచి ఆహారాన్ని పంపిస్తామన్నారు. అవసరం అయితే గ్రామం చుట్టూ ఏలిఫెంట్ ఫ్రూఫ్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. ఏనుగులు దాడిలో ధ్వంసం అయిన ఇళ్లు, పంటలు నష్టానికి తగిన పరిహారాన్ని అందిస్తామన్నారు. కోర్టు తీర్పుల వల్ల మత్తుమందు ఇచ్చి ఏనుగులను తరలించే అవకాశం లేదనన్నారు.

జన్మభూమి నిర్వహణకు ఏర్పాట్లు
*నగర పాలక సంస్థ కమిషనర్ జి.నాగరాజు
విజయనగరం ,డిసెంబర్ 27: నగరంలో వచ్చేనెల రెండవ తేదీ నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. ఆదివారం తన ఛాంబర్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శిక సూత్రాల ప్రకారం గ్రామసభలను నిర్వహిస్తామని చెప్పారు. జన్మభూమి గ్రామసభ నిర్వహణ నాలుగు ప్రత్యేక బృందాలను నియమించామని, ఆయా బృందాల ఆధ్వర్యంలో గ్రామసభలు జరుగుతాయని అన్నారు. ప్రతిరోజు నాలుగు వార్డులలో గ్రామసభలను నిర్వహిస్తామని తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో మొబైల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా స్మార్ట్‌వార్డుల అభివృద్ధిపై జన్మభూమి గ్రామసభలలో చర్చిస్తామని, ప్రజల భాగస్వామ్యం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గత జన్మభూమిలో వచ్చిన అర్జీలను పరిష్కరించి ఆయా వివరాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఎంఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పచ్చచొక్కాలకే ప్రభుత్వ సంక్షేమం
*నియోజకవర్గ వై ఎస్ ఆర్ పార్టీ నాయకుల విమర్శ
విజయనగరం,డిసెంబర్ 27: ప్రభుత్వ సంక్షేమకార్యక్రమాలలో పచ్చ చొక్కాలకే ప్రాధాన్యత నిస్తున్నారని విజయనగర నియోజకవర్గ వై ఎస్ ఆర్ పార్టీ నాయకులు విమర్శించారు. ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలోనియోజక వర్గ నాయకులు ఆశపువేణు, నడిపేనశ్రీనివాసరావు, ఎస్‌వివి రాజేష్, బంగారునాయుడులు మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో అర్హులపేరుతో కేవలం వారి పార్టీకార్యకర్తలకే పథకాలు కట్టబెడుతూ నిజమైన లబ్ధిదారులకు మెండిచేయి చూపుతున్నారని ఆరోపించారు. ఏడాదిన్నర పాలనలోప్రజలకు చేసింది ఏమీ లేకపోగా జనచైతన్య యాత్రల పేరిట గ్రామాల్లో తిరిగి పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసామని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. పట్టణం గంటం స్తంభం కూడలినుండి పాత బస్టాండ్ వరకు రెండు లైన్ల రహదారి అభివృద్ధికి కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు శంకుస్థ్ధాపన చేసినా ఇరవైపులా కనీసం స్తంభాలు సైతం తొలగించకపోవడం చిత్తశుద్ధిని తెలియజేస్తున్నదని వారు పేర్కొన్నారు. పట్టణం స్ధాయి నగరంగా పెరిగితే సంబరాలు చేసుకుని బాణసంచా కాల్చుకున్న పాలకవర్గం పగ్గాలు చేపట్టిన తరువాత చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ అధ్వర్యంలో అన్ని వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తామని వివరించారు. ఈనేపథ్యంలో 29వతేదీ సాయంత్రం నియోజకవర్గ స్ధాయి సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో పార్టీ నాయకులు రెడ్డిగురుమూర్తి, బోడసింగినారాయణరావు, మారోజు శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.
కథాసాహిత్యంలో స్ర్తి పాత్రలకు ప్రాధాన్యత
విజయనగరం,డిసెంబర్ 27: ఆధునిక కథాసాహిత్యంలో స్ర్తి పాత్రలకు విశేష ప్రాధాన్యత ఉందని రిటైర్డు అసోసియేట్ ప్రొఫెసర్ కందాళ కనకమహాలక్ష్మి అన్నారు. గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం రాత్రి విజయభావన ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య సభా కార్యక్రమంలో ఆమె ముఖ్యవక్తగా పాల్గొని ‘ ఆధునిక కథాసాహిత్యంలో స్ర్తిపాత్ర చిత్రణ ’అనే విషయంపై ప్రసంగించారు.తమ రచనల్లో స్ర్తి పాత్రలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దిన రచయితలు ఉన్నారని చెప్పారు. విజయభావన కార్యదర్శి గోపాలరావు మాట్లాడుతూ కనకమహాలక్ష్మి తన రచనల్లో స్ర్తి పాత్రలను ఉదాత్తంగా చిత్రీకరించారని అన్నారు. వక్త ప్రసంగానికి ముందు సంస్ధ సభ్యులు కనకమహాలక్ష్మిని ఘనంగా సత్కరించారు.సభకు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ బురిడి అనురాధ అధ్యక్షత వహించారు. సన్మాన కర్తగా లలితాశంకర్ వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి, పివినరసింహరాజు, పలువురు రచయితలు కవులు పాల్గొన్నారు.
వికసించిన క్రీడా కుసుమాలు
శృంగవరపుకోట, డిసెంబర్ 27: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు క్రీడల పట్ల అసక్తి చూపుతున్నారు. వ్యాయామ ఉపాధ్మాయులు మెళుకువలు నేర్పడం, పోటీలకు సిద్దం చేయడం ప్రభుత్వం కూడా ప్రోత్సహించడంతో క్రీడా రంగానికి ఇటీవల ప్రాధాన్యత పెరిగింది. మండల స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు క్రీడ పోటీలు నిర్వహించడంతో విద్యార్థులు కూడా క్రీడల పట్ల అసక్తి పెంచుకుంటున్నారు.
మండలంలోని ధర్మవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వాలీబాల్ షెటీల్ బ్యాడ్మింటన్ కబడ్డీ పోటీల్లో పాల్గొనడంతో పాటు జాతీయ, రాష్ట్ర జిల్లా స్థాయిల్లో విజేతలుగా నిలిచి పాఠశాలలకు మంచి గుర్తింపు తెస్తున్నారు. వాలీబాల్ పోటీల్లో కుమారి, సోములు జాతీయ స్థాయిలో బహుమతులు సాదించారు. రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో తేజ, షటీల్ బ్యాడ్మింటన్‌లో చత్రపతి, శ్రావన్ కుమారులు జిల్లా స్థాయిలో ప్రసాద్ బహుమతులు సాధించారు.

‘చంద్రన్న సంక్రాంతి’ కానుక పంపిణీ
విజయనగరం , డిసెంబర్ 27: నగరంలోని 15, 16 వార్డులలో రేషన్ డిపోల ద్వారా సంక్రాంతి చంద్రన్న కానుకలను మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు ప్రజలు అత్యంత పవిత్రంగా జరుపుకునే సంక్రాంతి పండుగను పేదలు కూడా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేషన్ సరకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. తెలుపురేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ చంద్రన్న సంక్రాంతి కానుకలు అందుతాయని, ప్రతి ఒక్కరూ రేషన్‌షాపులకు వెళ్లి తెచ్చుకోవాలని చెప్పారు.
రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్నప్పటికీ, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రైస్తవులకు చంద్రన్న క్రిస్మస్, తెలుగువారికి చంద్రన్న సంక్రాంతి కానుకలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రసాదుల కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అస్తవ్యస్తం.. షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహణ
విజయనగరం , డిసెంబర్ 27: నగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఐడిఎస్‌ఎంటి షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహణలో నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతో లక్షలాది రూపాయల ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లో మొత్తం 157 షాపులు ఉండగా, సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని షాపుల నిర్మాణం సగంలోనే నిలిచిపోయింది. ఇక్కడ ఎన్నిషాపులు ఉన్నాయో, ఎంతమంది లీజుదారులు ఉన్నారో, ఎంతమంది అద్దె చెల్లిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకుంది. కనీసం నెలవారీ డిమాండ్ రిజిస్ట్రర్ (ఎండిఆర్) కూడా నిర్వహించడం లేదు. ఈ కారణంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహణ అతీగతీ లేకుండా పడి ఉంది. అదేవిధంగా 2013వ సంవత్సరం నుంచి షాపుల లీజు రెన్యువల్ జరగడం లేదు. షాపుల నుంచి ప్రతి నెల అద్దె కూడా సక్రమంగా వసూలు కావడం లేదు. దీనికితోడు సర్వీసు టాక్స్ చెల్లించాలని కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు షాపుల యజమానులు చెల్లించవలసిన టాక్స్‌ను నగర పాలక సంస్థ అధికారులు చెల్లించారు. 2007వ సంవత్సరం నుంచి టాక్స్ చెల్లించాలని వచ్చిన ఆదేశాల ప్రకారం 16.78 లక్షల రూపాయల సర్వీసు టాక్స్‌ను చెల్లించారు.
ఈ మొత్తాన్ని లీజుదారుల నుంచి వసూలు చేసేందుకు నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేసినా లీజుదారులు కనీసం పట్టించుకోవడం లేదు. లీజుదారుల నుంచి సర్వీసుటాక్స్ వసూళ్లు నగర పాలక సంస్థకు భారంగా మారింది.
ఐడిఎస్‌ఎంటి షాపింగ్ కాంప్లెక్స్
నిర్వహణపైప్రత్యేక దృష్టి:
ఐడిఎస్‌ఎంటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని నగర పాలకసంస్థ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహణ గురించి కమిషనర్ దృష్టికి ఆంధ్రభూమి తీసుకువెళ్లగా ఇక నుంచి రెగ్యులర్‌గా అద్దె వసూళ్లు చేస్తామని చెప్పారు. అదేవిధంగా షాపులీజు కాలపరిమితిని కూడా రెన్యువల్ చేస్తామని అన్నారు.

రైల్వేస్టేషన్‌లో సమస్యల కూత!
గజపతినగరం, డిసెంబర్ 27: గజపతినగరం రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన కనీస సదుపాయాలు కరువయ్యాయి. ప్రతి రోజు వందలాది మంది ప్రయాణికులు ఇక్కడ రైల్వే స్టేషనుకు వస్తుంటారు. చత్తీష్ ఘాట్‌లోని రాయపూర్ వరకు అలాగే విజయవాడ తదితర ప్రాంతాలకు ప్యాసింజర్ రైళ్లు తిరగడంతో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రైల్వే స్టేషన్లో మరుగుదొడ్లు మంచినీటి సదుపాయం నామమాత్రమే. టికెట్లు విక్రయించే బుకింగ్ ఎదురుగా గల మరుగుదొడ్డి ఎప్పుడు చూసిన మూసి ఉంటుంది. రైలు వచ్చే ముందు తెరిచి తరువాత మూసి వేస్తారు. ఫ్లాట్ ఫారాలపై కొళాయిలు ఉన్న నీరు పడదు. ఆది, బుధ వారాలలో రాయగడ వెళ్లడానికి అత్యధికంగా యాత్రికులు వస్తుంటారు. విజయవాడ ప్యాసింజర్ రాయగడ వరకు పొడిగించిన తరువాత విశాఖపట్నం- కోరాపుట్ ల మధ్య డి ఎం యు రైలు నడపడంతో పాటు పలు ఫ్యాసింజర్ రైళ్లు నడుస్తున్న ఇక్కడ రైల్వే స్టేషన్‌లో ఎ ఒక్క ఎక్స్‌ప్రెస్ రైలు ఆగదు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలంటు గజపతినగరంలోని అన్ని స్వచ్ఛంద, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పలుసార్లు వినతిపత్రాలు అందజేసిన ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. బొకారో, హిరాఖండ్, బిలాస్‌పుర్ తదితర ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణించడానికి ఇక్కడ ప్రయాణికులు విజయనగరం వెళ్లవలసి వస్తున్నది. కనీసం బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు నిలపాలని స్థానికులు కోరుతున్నారు.
వారానికి ఒకసారి తిరుపతి- బిలాస్‌పూర్ రైలు నిలపాలని కోరుతున్నారు. వ్యయ ప్రయాసాలకు గురవుతున్న ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.