రాష్ట్రీయం

ఆరుగురు మావోల ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
సంఘటన స్థలంలో నాలుగు మృతదేహాలు
కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్

భద్రాచలం, నవంబర్ 22: చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ దండకారణ్యంలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలంలో నలుగురు మహిళా నక్సల్స్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఇద్దరి మృతదేహాల కోసం పోలీసు బలగాలు వెతుకుతున్నాయి. ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దర్బా డివిజన్ కార్యదర్శి ఐతూ తప్పించుకున్నాడని, అతని కోసం బలగాలు గాలిస్తున్నాయని దంతెవాడ, సుక్మా ఎస్పీలు కమలోచన్ కశ్యప్, శ్రావణ్ మీడియాకు తెలిపారు. ఘటనా స్థలంనుంచి 303 రైఫిల్స్ 4, ట్వల్వ్ బోర్ తుపాకులు 2, విప్లవ సాహిత్యం, నిత్యావసర వస్తువులు, మందుపాతరలను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
మూడు బృందాలుగా విడిపోయి..
సుక్మా, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో సుక్మా జిల్లా గాదిరాజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని నాగల్‌గూడ గుట్టల్లో మల్కన్‌గిరి మావోయిస్టు కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సమాచారాన్ని విశే్లషించుకున్న రెండు జిల్లాల పోలీసు అధికారులు సిఆర్‌పిఎఫ్, డిఆర్‌జి, ఎస్టీఎఫ్ బలగాలను రంగంలోకి దించాయి. దంతెవాడ ఎఎస్‌ఐ సంగ్రం, హెడ్ కానిస్టేబుల్ భద్రు, మరో 40మందితో డిఆర్‌జి బలగాలు పల్నార్ అనే గ్రామం నుంచి మావోల సమావేశ ప్రదేశానికి బయలుదేరాయి. రెండో బృందం ఎస్టీఎఫ్, డిఆర్‌జి బలగాలతో సామేలీ గ్రామంనుంచి, సిఆర్‌పిఎఫ్, కోబ్రా బలగాలు అరణ్‌పూర్ నుంచి నాగల్‌గూడ గుట్టలను చేరుకున్నాయి. వీరు మూడు వైపుల నుంచీ గుట్టపైకి ఎక్కి మావోయిస్టులను చుట్టుముట్టారు. పోలీసు బలగాలను చూసిన మావోయిస్టు సెంట్రీలు కాల్పులు ప్రారంభించారు. మూడువైపుల నుంచి బలగాలు కాల్పులు జరపడంతో మావోయిస్టులు చెల్లాచెదురయ్యారు. పోలీసు బలగాలపై ఎదురుకాల్పులు జరుపుకుంటూ పారిపోయారు. దర్బా డివిజన్ కార్యదర్శి ఐతూకు బుల్లెట్ గాయాలైనట్టు దంతెవాడ, సుక్మా ఎస్పీలు ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సల్స్ మృతి చెందారని, వీరిలో నలుగురు మహిళా నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గాయపడ్డ వారితోపాటు మిగిలిన ఇద్దరి మృతదేహాలను మావోయిస్టులు తీసుకెళ్లినట్టు చెప్పారు.
వెతుకులాట
గాయపడ్డ నక్సల్స్ కోసం చత్తీస్‌గఢ్ పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. దర్బా డివిజన్ కార్యదర్శి ఐతూ కోసం తీవ్రస్థాయిలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇంకా బలగాలు నాగల్‌గూడ గుట్టల ప్రాంతంలోనే ఉన్నాయని దంతెవాడ, సుక్మా ఎస్పీలు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. (చిత్రం) నాగల్‌గూడ గుట్టల్లో ఎన్‌కౌంటర్ మృతులు