విజయనగరం

ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, జనవరి 1: నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దు చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని టిడిపి నాయకులు నిలబెట్టుకోవాలని నగర పంచాయతీ వ్యతిరేక కమిటీ సభ్యులు కోరారు. మండలంలోని జరజాపుపేట పంచాయితీ కార్యాలయంలో కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడు నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దు చేయించి నెల్లిమర్ల, జరజాపుపేట గ్రామాలను పంచాయితీలుగా మార్పు చేస్తామని హామీ ఇచ్చారని ఆ హామీ నేటికీ నెరవేర లేదన్నారు. నగర పంచాయతీని రద్దు చేసి పంచాయతీలుగా మార్పు చేయాలని కోరుతూ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. రాజకీయ లబ్ధికోసమే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు గ్రామాలను నగర పంచాయతీలుగా మార్పు చేసారని అన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు రామారావు, సత్యనారాయణ ముత్యాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
నెల్లిమర్ల, జనవరి 1: మండలంలో కొండవెలగాడ గ్రామంలో శనివారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న వ్యాయామ శాలకు అన్ని హంగులు అమర్చారు. వ్యాయామ శాలకు వెళ్లే రహదారి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేయించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ పార్కింగ్‌కు స్థలం ఏర్పాటు చేసారు. అలాగే వ్యాయామ శాలకు రంగులు వేసారు. జెసి శ్రీకేష్ లఠ్కర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సి ఎం సభా వేదిక పరిసరాలను పోలీసులు శుక్రవారం ఆధీనంలోకి తీసుకున్నాయి. డాగ్ స్వాడ్ పరిసర ప్రాంతాలను ఇప్పటికే తనిఖీ చేసారు. ముఖ్యమంత్రి వ్యాయామ శాలను ప్రారంభించడంతో పాటు విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం , బోస్టన్ పాఠశాలకు శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. ఎంపిడి ఓ రాజ్‌కుమార్, తహశీల్దార్ కృష్ణమోహన్, సి ఎం పర్యటన ఏర్పాట్లు చేసారు. కొండకరకాం గ్రామ రెవెన్యూ పరిధిలో హెలిఫ్యాడ్ ఏర్పాటు చేసారు.
అథ్లెటిక్స్‌లో ప్రసన్న కుమారి ప్రతిభ
గజపతినగరం, జనవరి 1: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఇటీవల ఎపి మాష్టర్స్ అండ్ అథ్లెటిక్స్ - 2015 36వ ఛాంపియన్ షిప్ సందర్భంగా జరిగిన పోటీలలో గజపతినగరం -2 ఎంపిటిసి నగర ప్రసన్న కుమారి తన ప్రతిభ చూపారు. లాంగ్ జంప్‌లో ప్రథమ స్థానం, షాట్‌పుట్‌లో ద్వితీయ బహుమతి , హమార్ త్రోలో ద్వితీయ బహుమతి, రీల్ 4*100లో ద్వితీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా కోచ్ సత్యారావు, స్పాన్సర్స్ ఇందుకూరి రఘురాజు, పివివి గోపాలరాజు అభినందించారు.

ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి
విజయనగరం, జనవరి 1: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లాకలెక్టర్ ఎంఎం నాయక్ అన్నారు. జాతీయస్థాయిలో ఉత్తమ యువజన సంఘం పురస్కారం అందుకున్న చీపురుపల్లి మండలం జి.అగ్రహారం గ్రామానికి చెందిన ఆశయ యూత్ అసోయేషన్ అధ్యక్షుడు రెడ్డి రమణ, కార్యదర్శి మీసాల లక్ష్మణ్‌లను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆశయ యూత్ అసోసియేషన్‌ను మిగతా యువజన, మహిళా సంఘాలు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలులో జాతీయస్థాయిలో విజయనగరం జిల్లాకు మంచి పేరుప్రఖ్యాతులు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.దుర్గారావు, సెట్విజ్ మేనేజర్ కె.సత్యం తదితరులు పాల్గొన్నారు.

బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యూఇయర్ వేడుకలు
విజయనగరం, జనవరి 1: బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్, ఎమ్మెల్యే మీసాల గీత, జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గనియా రాజకుమారిలకు పుష్పగుచ్ఛాలను అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొట్నూరు భాస్కరరావుమాట్లాడుతూ జిల్లాలో బిసిలంతా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం ప్రొత్సాహం ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ముద్దాడ మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిలి నాగభూషణం, బిసి విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు బివికె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల్లో నూతన సంవత్సర వేడుకలు
విజయనగరం, జనవరి 1: నూతన సంవత్సర సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉడాకాలనీ,రింగ్‌రోడ్డు, వివేకానందకాలనీ, శివాలయంవీధిలలో కొలువుతీరిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లోశుక్రవారం నూతన సంవత్సర పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు స్వామివారికి అర్చన, విశేష పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వివేకానంద కాలనీలోని శ్రీవేంకటేశ్వర ధ్యాన మందిరంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి ఎస్ టిపి రామానుజార్యులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి అర్చన పూజలు నిర్వహింపచేసారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణచేసి భక్తులకు దర్శనం కల్పించారు. కుటుంబాలతో సాంప్రదాయ దుస్తులలో భక్తులు ఆలయాలకు చేరుకుని పూజాదికాల్లో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఉడాకాలనీలోని బాబా ఆలయంలో పూజారి శంకరం పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి హారతిసేవ నిర్వహించారు. స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి భక్తులు కోర్కెలు చెల్లించుకున్నారు. పూజాదికాలు అనంతరం స్వామివార్ల ప్రసాదవితరణ చేసారు. అందరు సౌఖ్యంగా ఉండాలని భక్తులు కోరుకున్నారు.

నేడు వేపాడ చెరకు కాటా ప్రారంభం
వేపాడ, జనవరి 1: మండల కేంద్రమైన వేపాడలోని చెరుకు కాటాను శనివారం ప్రారంభించేందుకు భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. అయితే కాటాలో కనీస సౌకర్యాలు లేకుండా పోయాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కాటా చుట్టు గతంలో ఏర్పాటు చేసిన ఇనుప కంచె పేరుకే తప్ప ఎక్కడికి అక్కడ తెగిపోయి ఉండడం వల్ల దాని వలన రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదని అంటున్నారు. ఇక కాటా ఆవరణ పిచ్చి మొక్కలతో నిండి ఉందని ఎక్కడ ఏ విషపురుగు ఉంటుందో తెలియని అయోమయం నెలకొందని అన్నారు. తూకం వేసే యంత్రాంగం సక్రమంగా లేదన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాటాలో ప్రారంభించే యాజమాన్యం కాటా గుర్తుకని పరిశీలించి రైతులకు అనువుగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందోలేదో గమనించాలని అంటున్నారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం కాటా అధికారులు రైతుల శ్రేయస్సు కోరుతూ ముందుగా తూనిక యంత్రంతో పాటు కాటా ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి రైతాంగానికి అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే పశువులకు, రైతులకు తాగునీరు వసతి కల్పించాలని రాత్రి పూట ఉండేవారికి విశ్రాంతి గది ఉండేందుకు గది ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ ఏడాది చెరకు రవాణా విషయం వేపాడ కాటా నుండి 6,684 టన్నులుగా ఉన్నట్లు రైతులు పేర్కొన్నారు. కాటా పరిధిలో 370 ఎకరాల్లో కార్సి మొక్క తోటలు ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం వలన చెరకు పంట అశాజనకంగా ఉందని రైతులు వ్యక్తం చేసారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రోజుకు 150 టన్నుల రవాణాకు అనుమతులు ఇవ్వాలని రైతాంగం కోరుతుంది.