కృష్ణ

రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, డిసెంబర్ 21: గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఐదో నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు దుర్మరణం పొందాడు. ఆత్కూరుకు చెందిన ఇట్టాల చలమయ్య, భార్య నీలిమ, తమ్ముడు సతీష్, కుమారుడు సందీప్‌తో కలిసి గన్నవరం నుండి విజయవాడ వైపు ద్విచక్ర వాహనంపై పయనిస్తుండగా ఆటో ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు. అదే మార్గంలో వస్తున్న లారీ సందీప్ మీదుగా వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. సందీప్ (5) మృతి చెందగా వాహనం నడుపుతున్న సతీష్ (20)కు తీవ్రగాయాలయ్యాయ. అపస్మారక స్థితిలో ఉన్న క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించిన సిఆర్‌డిఎ అధికారులు

బహుళ అంతస్తు భవనంపై అక్రమ కట్టడం కూల్చివేతకు చర్యలు

నందిగామ, డిసెంబర్ 21: స్థానిక పాత కరెంటు ఆఫీసు రోడ్డులో అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆపార్ట్‌మెంట్‌లోని గదుల కూల్చివేత కార్యక్రమానికి సిఆర్‌డిఎ అధికారులు బుధవారం శ్రీకారం చుట్టారు. మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని ఐదు అంతస్తుల నిర్మాణం జరుగుతుండగా బుధవారం సిఆర్‌డిఎ జాయింట్ డైరెక్టర్ చక్రపాణి, ప్లానింగ్ అధికారులు సాయిబాబు, వెంకటేశ్వరరావులు వారి సిబ్బంది, స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారి రాబర్ట్ క్లైవ్‌తో అక్కడకు చేరుకున్నారు. పూర్తి యంత్ర సామాగ్రితో అక్కడకు చేరుకొన్న సిఆర్‌డిఎ అధికారులు ఐదవ ఫ్లోర్‌లోని శ్లాబ్‌ను, గోడలను కూల్చివేశారు. ఈ సందర్భంగా జెడి చక్రపాణి మాట్లాడుతూ జి ప్లస్ 3 నిర్మాణాలకు అనుమతులు తీసుకుని అక్రమంగా అదనపు అంతస్తుల నిర్మాణాలు చేపట్టారన్నారు. నందిగామ పట్టణంలో 20 వరకూ అక్రమ కట్టడాలు గుర్తించామని తెలిపారు. వాటిపైనా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఆపార్ట్‌మెంట్‌లో పై అంతస్తు శ్లాబ్, గోడలను సిఆర్‌డిఎ సిబ్బంది కూలుస్తుండటంతో అక్కడకు పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. నిర్మాణాలు జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్న అధికారులు ఒక్క సారిగా అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేతకు పూనుకోవడం వల్ల అందులో కొనుగోలు చేసిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వైకాపా నేతలు పేర్కొన్నారు. స్థానిక వైకాపా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్లొర్ లీడర్ మహమ్మద్ మస్తాన్, డెప్యూటి ప్లోర్ లీడర్ కత్రోజు శ్రీనివాసాచారి తదితరులు అధికారుల చర్యలను తప్పుబట్టారు. అక్రమ నిర్మాణాలు జరగకుండా ముందుగానే అధికారులు అడ్డుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

ఉత్కంఠభరితంగా స్టేట్ స్పోర్ట్స్ మీట్
గుడ్లవల్లేరు, డిసెంబర్ 21: గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాల వేదికగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 21వ అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. క్రీడా పోటీలతో పాటు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బాలుర విభాగం కబడ్డీ పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టుపై నెల్లూరు, అనంతపురం జట్టుపై చిత్తూరు, కర్నూలు జట్టుపై విజయనగరం, తూర్పు గోదావరి జట్టుపై కడప, పశ్చిమ గోదావరిపై శ్రీకాకుళం జిల్లాలు తలపడి విజయం సాధించాయి. వాలీబాల్ పోటీల్లో కడపపై కృష్ణా, కర్నూలుపై చిత్తూరు, శ్రీకాకుళంపై గుంటూరు, అనంతపురంపై నెల్లూరు, ప్రకాశంపై తూర్పు గోదావరి జట్లు విజేతగా నిలిచాయి. బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పశ్చిమ గోదావరి జట్టుపై కడప, తూర్పు గోదావరిపై అనంతపురం, నెల్లూరుపై గుంటూరు, విజయనగరంపై ప్రకాశం జిల్లాలు తలబడి విజయాన్ని అందుకున్నాయి. బాలికల విభాగంలో తూర్పు గోదావరిపై కడప, గుంటూరుపై కర్నూలు, విజయనగరంపై పశ్చిమ గోదావరి జిల్లాలు, ఖోఖోలో కృష్ణాపై శ్రీకాకుళం, విజయనగరంపై కడప, అనంతపురంపై గుంటూరు, ప్రకాశంపై నెల్లూరు, టెన్నికాయిట్ డబుల్స్‌లో శ్రీకాకుళంపై కృష్ణా, కర్నూలుపై పశ్చిమ గోదావరి, అనంతపురంపై నెల్లూరు, తూర్పు గోదావరిపై విశాఖపట్నం, విజయనగరంపై గుంటూరు జట్లు విజయకేతనం ఎగుర వేసి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. టెన్నికాయిట్ సింగిల్స్‌లో తూర్పు గోదావరిపై గుంటూరు, ప్రకాశంపై చిత్తూరు, శ్రీకాకుళంపై అనంతపురం, విశాఖపట్నంపై పశ్చిమ గోదావరి జట్లు విజయం సాధించాయి. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల్లో విద్యార్థులు కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రాంతీయ సాంకేతిక విద్యా సంచాలకుడు బికె సూర్య ప్రకాష్ క్యాంప్ ఫైర్‌ను ప్రారంభించారు. అసిస్టెంట్ డైరెక్టర్లు ఎ మురళి, పి సుజాత, పిడి అసోసియేట్ కార్యదర్శి రఘునాధరెడ్డి, అబ్బాస్ బేగ్, ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌ఎన్‌వి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

వ్యాపార సంస్థల్లో నగదు రహిత సేవల పరిశీలన
మోపిదేవి, డిసెంబర్ 21: మండల పరిధిలోని 46 వ్యాపార సంస్థలలో జరుగుతున్న నగదు రహిత లావాదేవీలను బుధవారం ప్రత్యేక బృందం పరిశీలించింది. బృంద నాయకుడు, సీనియర్ ఆడిటర్ కె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ బృందం వ్యాపార సంస్థల్లో పోస్ యంత్రాల వినియోగం జరుగుతుందా..? లేదా..? అనే అంశాన్ని పరిశీలించారు.
పేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం
జగ్గయ్యపేట, డిసెంబర్ 21: జగ్గయ్యపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలోని ఆర్‌టిసి గ్రౌండ్‌లో ఆయన స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుమహిళ ఆచంట సునీత, ప్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, పలువురు కౌన్సిల్ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదంలో 8 పూరిగుడెసలు దగ్ధం
ఓ బాలికకు తీవ్రగాయాలు
గన్నవరం, డిసెంబర్ 21: సూరంపల్లిలో బుధవారం అగ్నిప్రమాదంలో 8 పూరి గుడిసెలు ఆహుతి కాగా 3 సంవత్సరాల చిన్నారి ఇల్లా నాగమణి తీవ్ర గాయాలకుగురై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అజిత్‌నగర్ ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ జిఆర్ మోహనరావు తన సిబ్బందితో హాజరయ్యారు. సూరంపల్లి ముసలమ్మ బావి మలుపులో నున్న ఆగిరిపల్లి రహాదారి పక్కన యానాది సామాజిక వర్గానికి చెందిన వారు పూరి గుడెసలు వేసుకుని 40 ఏళ్లుగా నివాసాలుంటున్నారు. వీరంతా కూలీనాలీ చేసుకుని జీవిస్తున్నారు. బుధవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో సింగంశెట్టి హనుమంతరావు, పొట్లూరి సీతయ్య, నాగరాజు, లింగయ్య, దుర్గారావు, కృష్ణ, ఆంజనేయులు, పొట్టియ్యలకు చెందిన పూరి గుడెసలు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. గన్నవరం తహశీల్దార్ ఎం మాధురి, సర్పంచ్ దేవరపల్లి కోటేశ్వరరావు, కార్యదర్శి నామేశ్వరరావులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. వైఎస్సార్సీ నేతలు కె శ్రీనివాసరావు, సీతారామయ్య, శంకరరావు, రాంబాబు, బాధిత కుటుంబాల్ని పరామర్శించారు. సింగ్‌నగర్ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటల్ని అదుపులో పెట్టారు. ఆస్తి నష్టం దాదాపు రూ. 4 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.