మెయన్ ఫీచర్

నరేంద్రమోదీ ‘మారిన మనిషి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రెండు రోజులలో డా.బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలలో భాగంగా భారత రాజ్యాంగంపై జరిగిన చర్చను ముగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగం అందరినీ విస్మయపరచింది. ఆయన ‘మారిన మనిషి’ అని అందరూ భావిస్తున్నారు. ప్రధానమంత్రి అందరినీ కలుపుకుపోయే విధంగా సౌమ్యంగా, సమన్వయంతో ప్రసంగించారు.
కానీ ఈ విధంగా ప్రసంగించడానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాజయం ప్రధాన కారణం అని తెలుసు. తిరుగులేని రాజకీయ నాయకుడిగా సుమారు 18 నెలలపాటు ఆయన వెలుగొందారు. అయితే బీహార్ ఎన్నికలు ఈ ప్రభంజనాన్ని కుప్పకూలే విధంగా చేశాయి. ఈ సమయంలో ప్రధానమంత్రిగా ఆయన వ్యవహరించిన తీరు, ఆయన పరిపాలనా విధానం, నాయకత్వ ప్రభావం ఆయనను, ఆయన పార్టీని, ఆయన ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి సహకరింపలేదని ఇప్పుడు గ్రహించినట్లు భావింపవలసి వస్తున్నది.
అంటే 18 నెలల విలువైన సమయాన్ని, సుమారు మూడవ వంతు పదవీ కాలాన్ని ఆయన వృథాచేసుకున్నారనే అభిప్రాయం సహితం ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నది. పార్లమెంటులో ఆయన ప్రసంగం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని టీకి ఆహ్వానించడం వంటి చర్యలు పార్లమెంటులో కీలకమైన కొన్ని బిల్లులను ఆమోదింపచేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడగలవు. కానీ ‘మారిన మనిషి’గా ప్రతిపక్షాల నుండి ధృవపత్రం పొందడంవల్లనే ఆయన పాలన మెరుగుపడుతుంది అని భావించలేము.
బీహార్ ఎన్నికల ఫలితాలు రాగానే పరాజయం గురించి పార్టీలో సమీక్ష జరగాలనీ, అందుకు బాధ్యులు ఎవ్వరో గుర్తించాలని ఎల్.కె.అద్వానీ వంటి అగ్రనాయకులు డిమాండ్ చేశారు. పార్టీ ప్రధాన ప్రచారకర్తగా తానే బాధ్యత వహిస్తానని, ఈ పరాజయాన్ని ఒక సవాల్‌గా స్వీకరించి పార్టీని బలోపేతం చేస్తానని నరేంద్రమోదీ ప్రకటించి ఉంటే ఆయన సర్దార్‌పటేల్ వలే ‘ఉక్కుమనిషి’అని, సమర్ధుడైన నాయకుడు అని భావించేవాళ్ళు.
ఆమధ్యలో బాబర్ కట్టడాన్ని కూల్చివేసిన అనంతరం కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దుచేసింది. ఆరోజు శాంతి భద్రతల నియంత్రణలో విఫలమైన పోలీస్, రెవిన్యూ అధికారులకు కోర్టు సమన్లు జారీచేసింది. అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్‌సింగ్ హైకోర్టు ముందుకు వెళ్ళి ముఖ్యమంత్రిగా తాను ఇచ్చిన ఆదేశాలను మాత్రమే రెవిన్యూ, పోలీసు అధికారులు అమలుచేశారని స్పష్టంచేశారు. శిక్షవేస్తే తనకు వేయాలిగానీ అధికారులకు మాత్రం కాదని చెప్పారు. బహుశా స్వాతంత్ర భారతదేశంలో అటువంటి నాయకుడు మరెవ్వరూ లేరని చెప్పవచ్చు.
కానీ పరాజయం సమష్టి బాధ్యత అని పేర్కొనడం ద్వారా నరేంద్రమోదీ, అమిత్‌షాలు తమ నాయకత్వ పటిమ నిరూపించుకొనే ఒక సదవకాశాన్ని కోల్పోయారు. అయితే పరాజయంపై సమీక్ష జరపమని కోరే నైతిక అర్హత అద్వానీకి ఉందా? ఇంతవరకూ బిజెపి సమావేశాలలో ఎప్పుడైనా ఏ పరాజయం గురించయినా సమీక్ష జరిపారా?.
2008 ఎన్నికలలో కళ్యాణ్‌సింగ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కానీ బిజెపి ఘోర పరాజయం పొందింది. ఆ తర్వాత జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పరాజయంపై సమీక్ష జరపాలని కళ్యాణ్‌సింగ్ కోరారు. సమీక్ష మేము తర్వాత జరుపుతాములే అంటూ కర్కశంగా ఆయనను మాట్లాడనీయకుండా అద్వానీ అడ్డుకున్నారు.
అయితే నరేంద్రమోదీ తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి కూడా బీహార్ పరాజయంపై సమీక్ష జరుపవలసి ఉంది. కేవలం కులం కార్డుతో ఓటమి చెందామనడం ఆత్మహత్యా సదృశ్యం కాదు. బిజెపి కూటమి సహితం కులం గణాంకాల ప్రాతిపదికనే ఏర్పడింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించకపోవడంవల్లనే ఓటమి చెందామనుకొని ఇప్పుడు అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడుల ముఖ్యమంత్రి అభ్యర్థులను ముందుగా ప్రకటించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక జటిల సమస్యకు సున్నిత పరిష్కారం ఈ విధంగా యథాలాపంగా కనుగొనడంవల్లనే ఆశించిన ఫలితాలు సాధించలేరు. మహారాష్ట్ర, హర్యానా, జమ్ము, కాశ్మీర్‌లలో ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించి విజయం సాధించారా?
నరేంద్రమోదీ ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యతను కఠిన నిర్ణయాలకు, సంక్లిష్ట అంశాలపై పటిష్ట చర్యలు తీసుకోవడానికి ఇవ్వకపోవడంవల్లనే ప్రజలపై తగుప్రభావం చూపలేకపోతున్నారని ఈ సందర్భంగా గమనించాలి.
ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల దృష్టిలో రాహుల్‌గాంధీ ఒక విఫల నాయకుడు. ఎన్నికలలో పార్టీకి ఓట్లు, సీట్లు తీసుకురావడంలో ఘోరంగా విఫలమైనట్లు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఆయనను పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీకి అరిష్టం అని పలువురు పార్టీ నాయకులు బహిరంగంగా ప్రకటనలు చేశారు. అటువంటి రాహుల్‌గాంధీకి ‘సూట్-బూట్ రాజ్యం’ అంటూ ప్రధానమంత్రిని అవహేళన చేస్తూ మాట్లాడే ధైర్యం ఎట్లావచ్చింది.
పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సోనియాగాంధీ రాజకీయాల పట్ల ఎప్పుడు ఆసక్తి చూపినా ‘బోఫర్స్ కేసులో పురోగతి’ అంటూ వార్తలు వచ్చేవి. దానితో ఆమె నోరు పెగిలెడిది కాదు. యుపిఎ పదేళ్ళ పాలనలో జరిగిన పలు భారీ కుంభకోణాలను ఎన్నికల సమయంలో ప్రచార అస్త్రాలుగా చేసుకున్న బిజెపి నేడు అధికారంలోకి వచ్చి వాటిని రాజకీయ అస్త్రాలుగా ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నది.
బొగ్గు గనుల కేటాయింపు కేసులో ఒక ఉన్నత అధికారి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్ ఎవ్వరికి వాటిని కేటాయించాలా అంటూ స్లిప్‌లు పంపేవారని, వాటి ప్రకారం ప్రధానమంత్రి కార్యాలయం కేటాయించెడిదని బహిరంగ ఆరోపణ చేశారు. ఈ అంశంపై నరేంద్రమోదీ ప్రభుత్వం దర్యాప్తును ముందుకు తీసుకువెళ్ళి ఉంటే రాహుల్‌గాంధీ అంత దూకుడుగా ఆరోపణలు చేసి ఉండేవారా?
ఈ దర్యాప్తును ముందుకు తీసుకువెళ్ళవలసిందిపోయి ఈ కుంభకోణంలో ప్రధానమంత్రి కార్యాలయానికి అసలు సంబంధంలేదని, నాటి ప్రధానమంత్రి, డా.మన్‌మోహన్‌సింగ్‌ను విచారింపవలసిన అవసరం లేదని సిబిఐ కోర్టులో వాదించింది. ఆయన మంత్రివర్గంలో పనిచేసిన దాసరి నారాయణరావు సహితం అన్నినిర్ణయాలు ప్రధానమంత్రి కార్యాలయంలోనే తీసుకున్నారని కోర్టుకు నివేదించారు.
ఇటువంటి అనేక ఆరోపణలు, ఆధారాలు, కుంభకోణాల పట్ల నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం కారణంగా ఆయన ప్రభుత్వాన్ని బలహీనపరచే అవకాశాన్ని ప్రతిపక్షాలకు కల్పించినట్లు అవుతుందని గుర్తించలేకపోతున్నారు. అందుకనే ఈ ప్రభుత్వ పనితీరు పట్ల బిజెపి కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి నెలకొంటున్నది. ఈ అసంతృప్తి ఎన్నికల సమయంలో పార్టీకి పెనుప్రమాదంగా మారగలదని గ్రహించాలి.
ఈ ప్రభుత్వంలో భజనపరులు, అవకాశవాదులు, వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించే వారికి లభిస్తున్న ప్రాధాన్యత, గుర్తించి పార్టీ, సమాజం, సిద్ధాంతం పట్ల అంకిత భావంగలవారికి లభించకపోవడం కూడా మోదీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి మరో కారణం. అందుకనే తీవ్ర సవాళ్ళు ఎదురైనప్పుడు ఈ ప్రభుత్వం అతలాకుతలమవుతున్నది.
పార్టీలో, ప్రభుత్వంలో ప్రజలతో మంచి సంబంధాలు వుండి, ప్రజలను సమీకరింపగల శక్తిఉన్నవారికి స్థానం లభించడం లేదు ఈ ప్రభుత్వంలో 11 మంది కీలక మంత్రిత్వశాఖలను నిర్వహిస్తున్నది రాజ్యసభ సభ్యులు. అదే ఈ ప్రభుత్వపు నిజమైన బలహీనత అని చెప్పవచ్చు. వివిధ స్థాయిలలో ప్రజలతో మంచి సంబంధాలుగల నాయకులను ప్రోత్సహించకుండా, నరేంద్రమోదీ ఆకర్షణతోనే పార్టీ, ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ప్రయత్నించడం అసంభవం కాగలదు.
బీహార్ ఎన్నికలనుండి నేర్చుకోవలసిన మరో గుణపాఠం ప్రత్యర్థులు అందరూ కలిస్తే బిజెపి పట్టుకోల్పోతుంది. ప్రత్యర్థులలో చీలిక మాత్రమే బిజెపిని బలోపేతం చేయగలదు. అయితే నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యర్థులలో చీలిక తనకు కలిసివచ్చేవిధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించలేక పోతున్నది.
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బలంగాఉన్న రాష్ట్రాలలో బిజెపి నిలదొక్కుకోలేకపోతున్నది. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాలలో మాత్రమే బిజెపి ఘన విజయాలు సాధించగలుగుతున్నది. ఢిల్లీలో పరాజయానికి అక్కడ కాంగ్రెస్ కాకుండా ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రధాన ప్రత్యర్థి కావడంతో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్‌లో సహితం అదే జరిగింది.
అందుకనే ప్రాంతీయ పార్టీల విషయంలో బిజెపి భిన్నమైన ఎత్తుగడలను అనుసరించి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో అటువంటి ప్రయత్నం చేసినా ఎటువంటి ఫలితాలు సాధింపలేకపోతున్నది. ఈ అంశం నేడు నరేంద్రమోదీ ముందున్న జటిల సమస్య అని చెప్పవచ్చు.
నరేంద్రమోదీ మారవలసిందే. ‘మారిన మనిషి’కావడం అంటే ప్రతిపక్షాలను బలోపేతం చేయడానికి దారితీయకుండా జాగ్రత్తపడాలి. ప్రతిపక్షాలను విడగొట్టడం ద్వారానే తన ప్రభుత్వం మనుగడ సాగించగలదని గ్రహించాలి.

- చలసాని నరేంద్ర