ఆటాపోటీ

13 సెకన్లకే ముగిసిన ఫైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* లాస్ వెగాస్: యుఎఫ్‌సి 194 ఫెదర్‌వెయిట్ టైటిల్‌ను కానర్ మెక్‌గ్రెగర్ గెల్చుకున్నాడు. అందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేకపోయినా, జోస్ ఆల్డోను అతను కేవలం 13 సెకన్లలో నాకౌట్ చేయడం విశేషమే. ప్రేక్షకులు ఇంకా కుర్చీల్లో సరిగ్గా కూర్చోక ముందే, ఫైటర్లు రింగ్‌లోకి అడుగుపెట్టినందుకు కొడుతున్న కేరింతల నుంచి స్టేడియం కోలుకోకముందే ఫైట్ ముగిసింది. మెక్‌గ్రెగర్ విసిరిన బలమైన పంచ్ ముఖానికి బలంగా తగలడంతో ఆల్డో కుప్పకూలిపోయాడు. ఆతర్వాత అతను నిలబడలేకపోయాడు.

ఇంగ్లీష్‌తో కష్టమే!
* ఇంగ్లీష్‌లో మాట్లాడడం చాలా మందికి ఇబ్బందులను సృష్టిస్తున్నది. క్రీడాకారులు, సెలబ్రిటీలు ఇందుకు అతీతం కారని ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ నిరూపించాడు. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్)లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) రాయల్స్ తరఫున ఆడేందుకు భారత్‌కు వచ్చిన అతను ఇండియన్ ఏసెస్ ఆటగాడు, తన చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌తో తీవ్రంగా పోటీపడ్డాడు. ఆ మ్యాచ్‌లో నాదల్ గెలిచినప్పటికీ, యుఎఇకి ఏసెస్ చేతిలో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ సందర్భంగా ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో ఫెదరర్, నాదల్, టోర్నీ నిర్వాహకుడు మహేష్ భూపతి పాల్గొన్నారు. నాదల్‌ను ముందు మట్లాడాలని ఫెదరర్ సూచించడంతో ఇద్దరి మధ్య ఆకర్షణీయమైన సంభాషణ జరిగింది. ‘అందరి కంటే ముందు మాట్లాడడం నాకు కష్టం. అందుకే ముందు నవ్వు మాట్లాడు’ అంటూ రఫాకు చెప్పాడు. ఈ ప్రతిపాదనపై వెనకడుగు వేసిన నాదల్ తనకు ఇంగ్లీషు సరిగ్గా రాదని అన్నాడు. ‘ఇంగ్లీషులో మాట్లాడడం నాకు సరిగ్గా రాదు. చాలా ఇబ్బందిగా మాట్లాడాల్సి వస్తుంది’ అన్నాడు. ఫెదరర్ వెంటనే అందుకొని ‘నువ్వు తడబడుతూ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వినడం నాకు సరదా’ అనడంతో సమావేశంలో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. నాదల్ కూడా వారితో జత కలిశాడు.

క్యాచ్ పడితే డబ్బు!
మ్యాచ్‌లు ఆడినందుకు క్రికెటర్లకు భారీ మొత్తాలు లభిస్తాయి. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లభించినా, లభించకపోయినా కాంట్రాక్టు సొమ్ము వారికి కచ్చితంగా వస్తుంది. దీనికితోడు తుది జట్టులో ఉండే మ్యాచ్ ఫీజు ఉంటుంది. వ్యక్తిగత స్పాన్సర్‌షిప్స్, అండార్స్‌మెంట్స్ అదనం. క్రికెటర్లు కోట్లకు పడగలెత్తుతుంటే, వారిని ప్రోత్సహించే అభిమానులకు మాత్రం టికెట్లు కొనుక్కోవడానికి, స్టేడియానికి వెళ్లిరావడానికి, స్నాక్స్ తదితరాల పేరుతో భారీగానే ఖర్చవుతాయి. అందుకే దేశవాళీ పోటీలను తిలకించేందుకు ప్రేక్షకులు చెప్పుకోదగ్గ సంఖ్యలో హాజరుకావడం లేదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కొత్త మార్గాన్ని అనే్వషించింది. బ్యాట్స్‌మెన్ స్టాండ్స్‌లోకి కొట్టే భారీ సిక్సర్లను ఒంటి చేత్తో ఒడిసి పట్టుకునే ప్రేక్షకునికి పది లక్షల ర్యాండ్స్ (సుమారు 43 లక్షల రూపాయలు) ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన రామ్ శ్లామ్ టి-20 టోర్నీలో ఒకరుకాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పది మంది ఈ విధంగా స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌ని తిలకిస్తూ, బ్యాట్స్‌మెన్ భారీ సిక్సర్లు కొట్టినప్పుడు బంతిని ఒంటి చేత్తో పట్టుకున్నారు. దీనితో నిర్వాహకులు ఈ మొత్తాన్ని పది మందికి పంచారు. మొత్తానికి ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మంచి మార్గానే్న ఎంచుకుంది. మిగతా దేశాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తాయేమో!

- శ్రీహరి