Others

శ్రీమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ, నిర్వహణ: బిఎస్ రాయుడు
నృత్యం: చిన్ని, సంపత్
మాటలు: వేటూరి
కూర్పు: జగదీష్
కళ: వి రంగారావు
కెమెరా: వరదరాజన్, శ్రీకాంత్
సంగీతం: నిత్యానంద్
సమర్పణ: ఎస్‌సి నాగిరెడ్డి
దర్శకత్వం: విజయానంద్
**
దర్శకులు విఠలాచార్య వద్ద పలు చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు విజయారెడ్డి. కన్నడ చిత్రరంగంలో దర్శకునిగానూ రాణించారు. 1966లో శ్రీనిలయం పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం -‘శ్రీమతి’. తరువాత తెలుగులో ‘చలాకిరాణి కిలాడిరాజా’, ఎంఎస్ రెడ్డి రూపొందించిన ‘ఏకలవ్య’ పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. శ్రీమతి చిత్రం 1966 డిసెంబర్ 9న విడుదలయింది. ఈ చిత్రానికి నిత్యానంద్ తొలిసారి సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు.
***
హైద్రాబాద్ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ చదివిన రవి (కాంతారావు), సరోజ (శారద) ప్రేమించుకుంటారు. వైజాగ్‌లో ధనవంతుడైన పరంధామయ్య (కెవిఎస్ శర్మ) కూతురు సరోజ. ఆమె సవతి తల్లి సూర్యకళ, తన తమ్ముడు శేషు (సత్యనారాయణ)తో సరోజ వివాహం జరపాలని అనుకుంటుంది. కానీ సరోజ, రవిల ప్రేమకు తండ్రి అంగీకరిస్తాడు. దీంతో తమ్ముడు శేషుతో సూర్యకళ ప్రణాళిక వేసి, సరోజకు వేరే పెళ్ళి జరిగినట్టు తప్పుడు సాక్ష్యాలు చూపటంతో రవికి మతి చలిస్తుంది. రవి పరిస్థితి చూసి తల్లి సీతమ్మ (నిర్మల) కుమిలిపోతుంది. పద్మ (వాసంతి) ఓ విధివంచిత. రవి స్నేహితుడు వెంకట్ (చలం) వల్ల రక్షించబడి, రవికి చేరువై అతనిలో మార్పు తెస్తుంది. రవికి మతి చలించిన విషయం తెలియని సరోజకు అతడు ఓ యాక్సిడెంటులో మరణించినట్టు పేపరులో చూస్తుంది. అప్పటికే గుడిలో దండలు మార్చుకోవటం ద్వారా మానసికంగా రవినే భర్తగా భావించిన సరోజ, మరో పెళ్లి చేసుకోటానికి అంగీకరించక వితంతువుగా రూపం మార్చుకుని ఓ అనాథ శరణాలయం నడుపుతుంటుంది. శేషు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. వెంకట్ సహాయంతో రవి జీవించే ఉన్నాడని, తనను సొంతం చేసుకోవడానికి శేషు కుట్ర పన్నాడని సరోజ తెలుసుకుంటుంది. ఇవేమీ తెలియని రవి తల్లి, పద్మతో రవికి వివాహం నిశ్చయిస్తుంది. అక్కడకు చేరిన సరోజను పద్మ పెళ్లిపీటల మీద కూర్చోబెట్టటం, ఆశ్చర్యపడిన రవికి వెంకట్ ద్వారా నిజం తెలియటం, సరోజను ఆనందంతో స్వీకరించటంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో వెంకట్ జంటగా మీనాకుమారి, ఆమె తండ్రిగా అల్లు రామలింగయ్య, శేషు మోజుపడిన నర్తకిగా గీతాంజలి, శేషు సహాయకుడిగా రామన్న పంతులు నటించారు. చిత్రంలో రవిగా కాంతారావు ఓ చురుకైన మంచితనం కలిగిన యువకునిగా కనిపిస్తాడు. సరోజ ప్రేమతో ఆమెపట్ల ఆరాధన, ఆమెకు మరొకరితో వివాహం జరిగిందని తెలిసి మతిభ్రమించి పిచ్చివాడు కావటం, తిరిగి పద్మ సేవలతో పూర్వపు రవిగా మారటం, పెళ్ళిపీటలపైకి పద్మ బదులు సరోజ వచ్చినపుడు ఏమీ తేల్చుకోలేని సందిగ్ధం.. ఇలా సన్నివేశానికి తగిన భావాలను పరిణితితో ఆకట్టుకునేలా ప్రదర్శించారు.
ప్రేమించిన ప్రియుని పట్ల ఆరాధన, అతని క్షేమం కోరుకోవడం, అతడు దూరమైనపుడు పడే మనోవ్యధ, ఒంటరిగా జీవించాలనే స్థిర నిశ్చయం, ప్రియుడిని కలిసి వివాహం చేసుకోబోయే తరుణంలో కలిగిన సంక్షోభంలో అసహాయత.. ఇలా సన్నివేశాలకు తగిన ఉదాత్తమైన నటనతో శారద మెప్పించింది. పద్మగా వాసంతి, తన జీవితంపట్ల విరక్తి, రవిని ప్రాజ్ఞునిగా మార్చటంలో అంకితభావం, విజ్ఞతగల యువతిగా ఓ స్థిర నిశ్చయానికి రావటం లాంటి సన్నివేశాల్లో ఆకట్టుకుంది. పాలిష్డ్ విలన్‌గా సత్యనారాయణ, ఓ మంచి మిత్రునిగా చలం పాత్రోచిత నటన ప్రదర్శించారు.
కన్నడ దర్శకులు విజయారెడ్డి తెలుగు చిత్రం ‘శ్రీమతి’కి దర్శకత్వం వహిస్తూ, టైటిల్స్‌లో విజయానంద్‌గా ప్రకటించుకున్నారు. భారత స్ర్తి ఔన్నత్యాన్ని, మనసారా ప్రేమించిన వ్యక్తి ఆరాధనలో జీవితాన్ని నిబ్బరంగా గడపగల స్ర్తి మనస్థైర్యాన్ని వెల్లడించే అంశంతో రూపొందిన శ్రీమతి చిత్రంలో దర్శకులు సున్నితమైన అంశాలను పరిణితితో చిత్రీకరించారు. రవి, సరోజ ప్రేమ లేఖల కోసం ఒకరికొకరు ఎదురుచూడటం, నిరాశా నిస్పృహకు గురైన రవి సరోజల పరిస్థితిని శేషు తనకు అనుకూలంగా మార్చుకోవటం, ఒక కళాకారిణిగా పద్మ రవి జీవితంలోకి ప్రవేశించి స్ర్తిపట్ల అతని భావాలు మార్చటంలాంటి సన్నివేశాలు అర్ధవంతంగా తీర్చిదిద్దారు. రవి తల్లి సీతమ్మ అంతర్మథనం, సరోజ తండ్రి పరంధామయ్య కూతురిపై చూపే వాత్సల్యాన్ని ఎంతో సహజంగా, ఆర్ద్రతతో, కరుణ ఉట్టిపడేలా చిత్రీకరించారు. సన్నివేశాలకు తగిన బరువైన, సున్నితమైన సంభాషణల్లో వీటూరి రచన అలవోకగా సాగింది.
కాంతారావు, చలం బృందంపై కాలేజీలో జరిగిన నాటకంలోని ఓ గీతం -విజయం, విజయం ఎవరిది. అణు విధ్వంసం, రాకెట్ ప్రయోగాల వల్ల సంభవించే లాభనష్టాలను వివరిస్తూ సందేశాత్మకంగా సాగే గీతాన్ని శ్రీశ్రీ రచించగా, ఘంటసాల, పిఠాపురం, వి సూర్యనారాయణ బృందం గానం చేశారు. పూలదండలు మార్చుకున్న రవి, సరోజలపై గుడిలో, తోటలో చిత్రీకరించిన యుగళగీతం -మ్రోగింది గుడిలోన గంట (పి సుశీల, ఘంటసాల -రచన ఆరుద్ర). పెళ్లికి తండ్రి అంగీకరించాక సరోజ ఊహలో రవితో వారి కాపురాన్ని తలపోస్తూ పాడుకునే గీతం -కోరికలా కుటీరములో చేరియుందమ ప్రియా’ (ఘంటసాల, పి సుశీల-ఆరుద్ర). రవిలో మార్పు తెస్తూ పద్మ, ఆశ్రమంలో రవి ఫొటో చూస్తూ సరోజలపై చిత్రీకరించిన సందేశాత్మక గీతం -చెలరేగు చీకటిలోనే ప్రకాశించు దీపము (పి సుశీల- శ్రీశ్రీ) అర్థవంతగా సాగుతుంది. చలం, మీనాకుమారిలపై చిత్రీకరించిన గీతం -మన్నించవే ఈ వేళ (పిఠాపురం, స్వర్ణలత -ఆరుద్ర).
గీతాంజలిపై చిత్రీకరించిన రెండు నృత్యగీతాలు -ఈరోజు మళ్ళీ రాదు (యల్‌ఆర్ ఈశ్వరి-ఆరుద్ర), -తమాషాలకే కోపాలా (ఎస్ జానకి -శ్రీశ్రీ). నూతన సంగీత దర్శకులు నిత్యానంద్ సమకూర్చిన స్వరాలు అలరించేలా సాగాయి. మ్రోగింది గుడిలోన, కోరికల కుటీరం, చెలరేగు గీతాలు శ్రోతలను నేటికీ ఆనందింపచేస్తూ ‘శ్రీమతి’ చిత్రాన్ని గుర్తుచేస్తుండటం విశేషం. శ్రీమతి చిత్రం షూటింగ్ హైద్రాబాద్ సారథీ స్టూడియో పరిసరాల్లో సాగింది. ‘శ్రీమతి’ చిత్రం విజయం సాధించకున్నా, ఓ చక్కని ఆశయం, అభిరుచితో రూపొందిన చిత్రంగా పలువురి ప్రశంసలందుకుంది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి