Others

సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన: ఆచార్య ఆత్రేయ
కళ: బి నాగరాజన్
ఛాయాగ్రహణం: సిఎఎస్ మణి
పాటలు: ఆత్రేయ, కొసరాజు
సంగీతం: కెవి మహదేవన్
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
ఎడిటింగ్: బాలు
దర్శకత్వం: ఎస్‌డి లాల్
నిర్మాత: టిఆర్ సుందరం.
**
కోయంబత్తూరు వస్త్ర పరిశ్రమలో రాణిస్తున్న కుటుంబానికి చెందిన వ్యక్తి టిఆర్ సుందరం (తిరుచెంగోడు రామలింగం సుందరం). ఇంగ్లండులో టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ చదివారు. 1933లో ఏంజిల్ ఫిలింస్‌లో చేరి, 1937 దాన్ని కొనుగోలు చేసి మోడరన్ థియేటర్స్‌గా మార్చారు. నిర్మాతగా తొలుత వేలాయుధంతో కలిసి రెండు తమిళ చిత్రాలు రూపొందించారు. మలయాళంలో తొలి టాకీ చిత్రం ‘బాలన్’ (1938), తమిళంలో తొలిసారిగా (గేవాకలర్) ‘ఆలీబాబా నా పదుతిరుడర్‌గళ్’ (1956) నిర్మించారు. దానిని తెలుగులో ఆలీబాబా నలభైదొంగలు పేరిట అనువదించారు. మొదటి మలయాళ రంగుల చిత్రం ‘కడంబేచ్చకొట్టు’ నిర్మించారు.
తెలుగులో సర్వాధికారి (1951), అత్తింటి కాపురం (1952), సవతి పోరు (1952), వీరకంకణం (1957), సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి (1960) నిర్మించారు. సర్వాధికారి, సవతిపోరు చిత్రాలకు సుందరమే దర్శకత్వం వహించారు. దక్షిణ భారతదేశంలో వంద చిత్రాలు (మోడరన్ థియేటర్స్) ఒకే పతాకంపై నిర్మించిన వ్యక్తిగా గుర్తింపుపొందారు. తరువాత ఆ రికార్డు సాధించిన వ్యక్తి డి రామానాయుడు.
దక్షిణ భారత చలనచిత్ర మండలి (చెన్నై) సావిత్రికి సుందరం ఎవెన్యూ పేరిట గౌరవించబడుతోంది.
తమిళంలో వీరు నిర్మించగా విజయం సాధించిన చిత్రం ‘అయిరామ్‌తలై వాంగేయ అపూర్వ చింతామణి’ (1947). తమిళ జానపద కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రానికి మాటలు- భారతీదాసన్, సంగీతం- జి.రామనాథన్. ఆ తరువాత 13ఏళ్లకు ఈ చిత్రాన్ని తెలుగులో ‘సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి’గా రూపొందించారు. ఈ చిత్రానికి తొలుత హీరో వేషానికి జగ్గయ్యను బుక్ చేశారు. వారితో కొంత షూటింగ్ జరిగాక, సెట్స్‌లో సిగరెట్ కాల్చవద్దన్న నిర్మాత సూచనను జగ్గయ్య పాటించకపోవడంతో ఆయనను తప్పించి ఆ వేషానికి కాంతారావును ఎన్నుకొని చిత్రీకరణ జరిపించారు నిర్మాత.
***
అణిమాది, అష్టసిద్దులకై కుటిల మాత్రికుడు (గుమ్మడి) సాధన చేయగా కాపాలికుడు ప్రత్యక్షమై తనకు ఆ శక్తిలేదని, వాటిని ఆదిత్యపుర రాకుమారి చింతామణి (దేవిక) ద్వారా సాధించుకొమ్మని సెలవిస్తాడు. విద్యాసౌందర్యాలతో కీర్తికాంక్షగల యువరాణి చింతామణిని మాంత్రికుడు తన తెలివితేటలతో శిష్యురాలిగా చేసుకుంటాడు. ఆమెను వివాహం చేసుకోగోరు యువకులకు అసాధ్యమైనవి, తన గత జీవిత దుష్కృత్యాలకు చెందినవి అయిన మూడు ప్రశ్నలు అడిగించి సరైన జవాబు చెప్పలేని వారిని చింతామణిచే తలలు ఖండింపచేస్తుంటారు. అలా ఆమె తొలుత తన మేనమామ పురుంధర మహారాజు (హరనాథ్)తో మొదలుపెట్టి 999 మందిని హతమారుస్తుంది. విద్యాభ్యాసం ముగించిన కైవల్యపుర రాకుమారుడు ప్రతాపసేనుడు (కాంతారావు), యువరాణి క్రతువులో తన సోదరులు ఆరుగురు బలైనారని తెలిసికొంటాడు. దీంతో ఆదిత్యపురం వెళ్ళి తోటమాలిగా చేరతాడు. తన స్నేహితుడు కాళి (రమణారెడ్డి) సాయంతో చింతామణి ఆంతరంగిక సఖి కమలాక్ష్మి (గిరిజ) ప్రేమతో ప్రశ్నలు తెలిసికొంటాడు. జవాబులు లభించే నగరాలు మతివదనపురం, సంపంగిపురం, నదీశీలపురం వెళ్ళి విజయుడై తిరిగివచ్చి చింతామణి ప్రశ్నలకు జవాబులు ప్రత్యక్షంగా చూపుతాడు. దీంతో మతిమంతుడు (రాజనాల) చేతిలో మాంత్రికుడు అంతమొందగా, చింతామణి ప్రతాపుని క్షమాపణ కోరుతుంది. మంత్రజలంతో ప్రతాపుడు రాకుమారులను బ్రతికిస్తాడు. ఆ తరువాత పురంధరుని చింతామణి, కమలాక్షిని ప్రతాపుడు వివాహం చేసుకోవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
**
ఈ చిత్రంలో ఉప కథలలో వచ్చే పాత్రలలో శీలవతిగా (బిఎస్ సరోజ), రాకుమార్తెలుగా జయంతి, రాజశ్రీ, అమ్మాజీ నటించారు. సత్యశీల మహారాజుగా సత్యనారాయణ, చింతామణి తండ్రిగా మిక్కిలినేని, రమణారెడ్డి జంటగా ఛాయాదేవి, ఇంకా దొరస్వామి, అల్లు రామలింగయ్య, లంక సత్యం, బాలకృష్ణ ఇతర పాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో ప్రతాపసేనునిగా కాంతారావు ఆకట్టుకునే నటన ప్రదర్శించారు. హుషారైన శౌర్య పరక్రమాలు, చెరలో శిక్షలు అనుభవిస్తున్నపుడు మొక్కవోని ధైర్యం, నిర్భయత్వం సన్నివేశాల్లో పరిణితి చెందిన నటన కనబర్చారు.
చింతామణిగా దేవిక విద్యాసౌందర్య అతిశయంతో కీర్తికాంక్షగల యువరాణిగా మెప్పించారు. గురుభక్తితో కరవాలం చేబూని, జవాబులు సక్రమంగా చెప్పని వారి శిరస్సులు ఖండించే వీర వనితగా నటనలో ప్రత్యేకత చూపారు.
సాత్విక పాత్రల పోషణలో పేరుమోసిన గుమ్మడి వెంకటేశ్వరరావు ఈ చిత్రంలో.. ‘అవ్యకాత్మ వ్యక్తవౌతోంది’ అంటూ పలుసార్లు ప్రవచిస్తూ పాలిష్డ్ విలనీని చూపించారు. కుటిల మాంత్రికునిగా, గురువుగా విచిత్ర వేషధారణలో ప్రతిభావంతంగా మెప్పించారు.
మోడరన్ థియేటర్స్ నిర్మించిన పలు చిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేసిన సయ్యద్‌లాల్ (ఎస్‌డి లాల్) ఈ చిత్రానికి తొలిసారి దర్శకపగ్గాలు చేపట్టారు. తమిళ చిత్రం (1947) నాలుగు గంటల నిడివితో రూపొందగా, దాన్ని చక్కగా కుదించి క్లిష్టమైన కథను సంక్షిప్తంగా చిత్రీకరించారు. కాంతారావు జవాబులు పొందే సందర్భాలలో హాస్య నటులు లంక సత్యం, అల్లు రామలింగయ్యలచే కథను చెప్పించటం, వాటిని ఇంటర్ కట్స్‌లో చూపటం, లంక సత్యం ఆ కథలో లీనమై ఆవేశకావేశాలను ప్రదర్శించటం, చివర సభాస్థలిలో తెరవెనుక వ్యక్తులనుంచటం, తైలభాండంలో ఖండిత దేహాలను భద్రపర్చటం లాంటి సన్నివేశాలను ఎంతో అర్ధవంతంగా చిత్రీకరించారు. ఈ చిత్రం తరువాత ఎస్‌డి లాల్ పలు విజయవంతమైన చిత్రాల దర్శకునిగా, ఎక్కువగా ఎన్టీ రామారావు చిత్రాలకు పనిచేయటం విశేషం. వీరి సోదరులు ఎస్‌ఎస్ లాల్ ఈ చిత్రానికి సహాయ కెమెరామెన్‌గా పనిచేయగా, వీరి కుమారులు ఎస్ మీర్ కూడా తరువాత ప్రముఖ కెమెరామెన్‌గా రాణించి, నటుడు నాగభూషణం, నటి సీతల కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకోవటం జరిగింది.
కెవి మహదేవన్ సంగీతంతో ఈ చిత్రంలోని గీతాలు ఎంతో అలరించాయి. చింతామణి దేవికపై సభలో చిత్రీకరించిన నృత్య గీతం -ఎవరూ నను జయించువారెవరూ (పి సుశీల- ఆత్రేయ), రాజశ్రీ, చెలులపై చిత్రీకరించిన బృంద నృత్యగీతం -అందాలున్నవి కన్నులలో/ అవి అల్లరి చేసేను వెనె్నలలో (పి సుశీల- ఆత్రేయ) చక్కని ఉద్యానవనంలో, వెనె్నలలో చిత్రీకరించి రక్తికట్టించారు. తోటమాలిగా కాంతారావు, రమణారెడ్డిలపై గీతం -గూటిలోన చిలకా గూడువదలిరాదు (పిబి శ్రీనివాస్, పిఠాపురం- ఆత్రేయ), ఛాయాదేవి, రమణారెడ్డిలపై గీతం -ఎక్కడోడివెక్కడోడివి ఓ చినవాడా (స్వర్ణలత, పిఠాపురం- ఆత్రేయ), ఛాయాదేవి ప్రేమతో పాడే గీతం -రాకురాకు రాకు దగ్గరకు రాకు (స్వర్ణలత- ఆత్రేయ) ఆకట్టుకుంటాయి. ఇక -రంజైన బంగారుబొమ్మ (మాధవపెద్ది, జమునారాణి -కొసరాజు), కాంతారావుపై చిత్రీకరించిన పద్యం -హే భద్రకాళి జగన్మోహిని (మాధవపెద్ది- కొసరాజు). పాతాళ గంగలో సెట్టింగుల మధ్య బిఎస్ సరోజ, రాజేశ్వరిపై చిత్రీకరించిన చక్కని యుగళ గీతం -అనురాగానికి కనులే లేవని ఆర్యులు అన్నారు (పి సుశీల, ఎస్ జానకి-ఆత్రేయ). చిత్రంలో టైటిల్స్‌తో పాటువచ్చే గీతమిది. సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడి, సంగీతపరంగా (గూటిలోని, అందాలున్నవి, అనురాగానికి) నేటికీ శ్రోతలను రంజింప చేస్తుండటం విశేషం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి