ఫ్లాష్ బ్యాక్ @ 50

నమ్మినబంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారంచేడు గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకన్నచౌదరి చిత్ర నిర్మాణంపట్ల ఆసక్తితో శంభూ ఫిలింస్ పతాకంపై 1960లో నిర్మించిన చిత్రం -నమ్మినబంటు. తరువాత వీరు ‘పూజాఫలం’, ‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు’ చిత్రాలు రూపొందించారు. నమ్మినబంటు చిత్ర ప్రారంభంలో టైటిల్స్‌కి ముందు నటుడు కెవియస్ శర్మ గొంతుతో -ఈ నేలమీద గాలి, నీరు, భూమి ఏ ఒక్కరి సొత్తు కాదు. సృష్టిలో ప్రతి జీవికి వీటిని అనుభవించే అధికారం ఉంది’ అంటూ చిత్ర కథాసారాన్ని సింపుల్‌గా చెప్పారు. సోషలిస్టు భావాలు ప్రధానాంశంగా ప్రముఖ రచయిత సుంకర సత్యనారాయణ వ్రాసిన కథతో నమ్మినబంటు చిత్రం రూపొందింది. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో 1909లో జన్మించారు సుంకర సత్యనారాయణ. ప్రజానాట్య మండలి రచయితగా కమ్యూనిస్టు పార్టీలో ప్రముఖ పాత్ర పోషించారు. సత్యాగ్రహ ఉద్యమంలో జైల శిక్ష అనుభవించారు. స్టాలిన్ గ్రాడ్ యుద్ధం, కష్టజీవి, సీతారామరాజు వంటి పలు బుర్రకథలు వ్రాసారు. వాసిరెడ్డితో కలిసి సినిమారంగంలో ‘పుట్టిల్లు’, ‘పరివర్తన’, ‘పల్లెటూరు’ చిత్రాలకు సంభాషణలు సమకూర్చారు. ‘నమ్మినబంటు’ చిత్రానికి కథ, పదునైన సంభాషణలు వ్రాసారు. రచనలో వీరికి తాపీ ధర్మారావు సహకరించారు. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంది. 1960 జనవరి 7న విడుదలైన ఈ చిత్రం 60ఏళ్లు పూర్తి చేసుకుంది.
కథ: సుంకర సత్యనారాయణ, పాటలు: కొసరాజు, మాటలు: సుంకర, తాపీ ధర్మారావు, ఫొటోగ్రఫీ: బిఎస్ జాగీర్ధార్, కళ: కృష్ణారావు, సుబ్బారావు, ఎడిటింగ్: సంజీవి, సంగీతం: ఎస్ రాజేశ్వరరావు, మాస్టర్ వేణు, నేపథ్య సంగీతం: మాస్టర్ వేణు, నృత్యం: ఎకె చోప్రా, సుకుమారి, శశి, నిర్మాణ, నిర్వహణ: కుర్రా వెంకట సుబ్బారావు, నిర్మాత: యార్లగడ్డ వెంకన్న చౌదరి, దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు. చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు 3 పాటలకు స్వరాలు సమకూర్చారు. తరువాత తమిళ రచయిత ఉడుమతై నారాయణస్వామితో వచ్చిన మాట పట్టింపుతో ఈ సినిమా నుంచి విరమించుకున్నారు. మిగిలిన పాటలు, నేపథ్య సంగీతం మాస్టర్ వేణు సమకూర్చటం జరిగింది.
పేద రైతు చంద్రయ్య (ఎస్‌వి రంగారావు), కూతురు లక్ష్మి (సావిత్రి), రాముడు అనే వానితోకలిసి షావుకారు, మోతుబరి అయిన భుజంగరావు (గుమ్మడి) ఊరు వస్తారు. తన మామిడి తోటనుపెంచి పోషించినందుకు చంద్రయ్యకు 2 ఎకరాలు మాగాణి భూమి ఇస్తానని భుజంగరావు మాటిస్తాడు. భుజంగారావు నమ్మినబంటు ప్రసాద్ (అక్కినేని). తల్లిలేని భుజంగరావు కుమార్తె సరళ (గిరిజ)ను సోదరిలా, భుజంగరావును కన్న తండ్రిలా అభిమానిస్తుంటాడు. కుటిల స్వభావియైన భుజంగరావు తోటను పెంచిన చంద్రయ్యకు మాగాణికి బదులు బంజరు భూమిస్తాడు. భుజంగరావు కుమార్తె సరళ, ఆమె బావ దేవయ్య (రేలంగి) సాయంతో బంజరులో బావి త్రవ్వించి.. ఎడ్ల పందాలలో తన కూతురు లక్ష్మి గెలిచిన డబ్బుతో మోటారుకొని వ్యవసాయం చేయడానికి సిద్ధపడతాడు చంద్రయ్య. ఇది ఓర్వలేని భుజంగరావు -చంద్రయ్య ఎద్దులు రాముడు, లక్ష్మణులకు విషం పెట్టమని ప్రసాద్‌కు పురమాయిస్తాడు. నమ్మినబంటు ప్రసాద్ ఎదురు తిరగటంతో వేరే వారితో బావి, మోటారును ప్రేల్చివేయబోగా ప్రసాద్ అడ్డుపడి వాటిని భగ్నం చేస్తాడు. ప్రసాద్ నిజాయితీని గ్రహించిన లక్ష్మి అతన్ని ప్రేమిస్తుంది. ఇది సహించలేని భుజంగరావు -ఎద్దులను హింసించటం.. వాటిని చంపివేయమని పురమాయించటం.. ప్రసాద్‌పై పోలీసు కేసు పెట్టడంవంటి దారుణాలకు ఒడిగడతాడు. భుజంగరావు ఆగడాలను లక్ష్మీ, ప్రసాద్‌లు సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. చివరికి ప్రసాద్‌ను అంతంచేయాలని ప్రయత్నించిన భుజంగరావే ఊబిలోపడి మరణిస్తాడు. లక్ష్మీ-ప్రసాద్, సరళ- దేవయ్యలు జంటగా రైతులతో కలిసి సమిష్టి వ్యవసాయం చేస్తుండటంతో చిత్రం ముగుస్తుంది. చిత్రంలో చంద్రయ్య తమ్ముడు సూరయ్యగా చదలవాడ, మరదలుగా హేమలత, ప్రసాద్ తల్లిగా విజయలక్ష్మి (సీనియర్).. ఇంకా లంక సత్యం, నృత్య నాటికలో ఇవి సరోజ, సుకుమారి తదితరులు నటించారు.
సహజత్వంతో కూడిన సన్నివేశాల్లో కొత్తదనం చూపుతూ.. పాటల చిత్రీకరణలో నూతనత్వాన్ని, వైవిధ్యాన్ని చూపించటంలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు మంచి పేరుంది. అలా ఆయన పనితనం నమ్మినబంటు చిత్రంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రారంభంలోనే చంద్రయ్య, లక్ష్మి, ప్రసాద్‌ల పాత్రల స్వభావాన్ని పరిచయం చేస్తాడు దర్శకుడు. భుజంగరావు లక్షణాలను సూరయ్య పాత్రతో చెప్పించాక, చంద్రయ్యతో భుజంగరావు నయవంచన మాటలు పలికించటం విలనీకి ప్రత్యేకత తీసుకొచ్చారు. భుజంగరావు మాటలకు చంద్రయ్య సౌమ్యంగా రియాక్ట్ కావటం, మాటతప్పిన భుజంగరావువద్దకు ఆవేశంతో చంద్రయ్య వెళ్లే సన్నివేశాలను ఉత్సుకత రేకెత్తేలా రూపొందించారు. చివరకు సౌమ్యంగా చిత్రం పూరె్తై చంద్రయ్య భావాలకు హీరో స్పందన చూపటంతో నిండుదనం అనిపిస్తుంది. ఎస్‌విఆర్, గుమ్మడి కాంబినేషన్ సీన్స్‌లో ఎస్వీఆర్ నిండుతనం, గుమ్మడి కౌటిల్యాన్ని చూపించి.. ఇద్దరు మేటినటులు తమ నటనతో సినిమాను రక్తికట్టించారు. అన్యాయాన్ని ఎదిరించే సన్నివేశంలో తప్పుచేశాడేమోనని హీరోను నిందించటం, నిజం తెలిసి అతన్ని ప్రేమించటం, తండ్రికోసం ఆవేదన, కామందుపై కోపం, తరువాత అతనింటికెళ్లి వేడుకోవడం.. ఇలా భిన్నమైన సన్నివేశాల్లో లక్ష్మి పాత్రగా మహానటి సావిత్రి ఎంతో ఈజ్‌తో మెప్పించారు. చిత్రం టైటిల్‌కు తగినట్టుండే సన్నివేశాల్లో ప్రసాద్‌గా అక్కినేని మంచి నటన కనబర్చారు. యజమాని ఆజ్ఞలను శిరసావహించి రైతులపై దౌర్జన్యం చేయటం, రైతు పొలాలకు నీరందకుండా అడ్డువేయటం, ఎడ్ల పందాలలో శాయశక్తులా ప్రయత్నించి విఫలమైనపుడు యజమాని వేసిన నిందలకు స్పందన, ఆ ఎడ్లకు విషంపెట్టి చంపమన్నపుడు మనిషిగా చూపించే స్పందన, లక్ష్మిని బలవంతం చేస్తున్నపుడు యజమానికే తుపాకి గురిచూపటం, చివరకు ఊబిలో పడిన యజమాని కోసం తన ప్రాణాలు లెక్కచేయక ఊబిలోకి దూకి కాపాడే ప్రయత్నం చేయటంలాంటి సన్నివేశాల్లో అక్కినేని సమర్ధవంతమైన, ప్రశంసనీయమైన హీరోయిజం నటనతో ఆకట్టుకున్నారు. హాస్య జంట గిరిజ, రేలంగి తమ పాత్రలకుతగిన పరిపక్వతతో సన్నివేశాలకు హుషారు తీసుకొచ్చారు. దర్శకులు పాటల చిత్రీకరణలోనూ తన శైలిని ఆవిష్కరించటం విశేషం. సాలూరి రాజేశ్వరరావు స్వరాలు కూర్చిన -తెలతెలవారెను లేవండమ్మ పాటలో అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరించారు. సావిత్రి.. తోటి చెలులు, అక్కినేని కావడి నీళ్లు మోస్తూ.. ఇలా పాటలో తెలవారుఝాము వెలుగునీడల దృశ్యాలు నేటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా చక్కని అనుభూతి అందచేస్తాయి. అక్కినేని ఎడ్లబండిపై నిలబడి బండి ముందు కూర్చున్న సావిత్రిని ఉడికిస్తూ పాడే ఘంటసాల గీతం -పొగరుమోతు పోట్లగిత్తరో.. ఎంతో హుషారుగా సాగుతుంది. ఎద్దుల జంట రాముడు, లక్ష్మణుడుతో సావిత్రి పాడే గీతం -చెంగు చెంగునా గంతులు వేయండి (గానం: పి సుశీల). సావిత్రి నడిపే గడ్డిబండిని లాగే ఎద్దులపై చిత్రీకరించారు. ఇక్కడ విశేషమేమంటే -పాట బుర్రకథ శైలిలో ఉంది, చిత్రానికి అంత ప్రయోజనం ఉండదు, పాట వద్దని ఆదుర్తి అసిస్టెంట్లు సలహా ఇచ్చారట. ఈ విషయం సాలూరికి చెప్పడంతో ఆయన కూడా సరే తీసేద్దామన్నారు. రచయిత కొసరాజు మాత్రం -పాట ఉంచమనే సలహా ఇచ్చారు. సావిత్రి దూడలను ఆడిస్తూ పాడే పాట కనుక రైతులకు నచ్చుతుందని చెప్పడంతో.. ఆదుర్తి ఆ సలహా పాటించారు. తరువాత అదే -జాతి వనె్న బుజ్జాయిల్లారా అంటూ జాతీయభావం ప్రేరేపించిన గీతంగానూ మన్నన పొందటం విశేషం. మిగిలిన గీతాలకు మాస్టర్ వేణు స్వరాలుకూర్చారు. రేలంగి, గిరిజలపై చిత్రీకరించిన గీతం -అందాల బొమ్మ శృంగారంలో (గానం: మాధవపెద్ది, జిక్కి). నృత్య నాటక గీతం -ఆలు మొగుడు పొందు (గానం: పి సుశీల, స్వర్ణలత, టివి రత్నం, కోరస్). ఈ పాటలో సుకుమారి నాగకన్య నృత్యం, దానికి ధీటుగా శక్తిరూపిణిగా ఇవి సరోజ అలరిస్తారు. సావిత్రి, అక్కినేనిలపై యుగళగీతం -ఎంత మంచి వాడవురా (గానం: పి సుశీల, ఘంటసాల బృందం). రేలంగిపై గీతం -నాజూకు కుచ్చుటోపి (గానం: మాధవపెద్ది). రేలంగి, సావిత్రిలపై -ఘుమఘుమ (గానం: మాధవపెద్ది, పి లీల). ఘంటసాల గానం చేయగా అక్కినేనిపై చిత్రీకరించిన పద్యం -మాట పడ్డావురా. సమష్టి వ్యవసాయం చేస్తూ అక్కినేని, సావిత్రి, రేలంగి, ఎస్‌విఆర్ లపై గీతం -రైతు మేడిపట్టి సాగాలిరా (గానం: ఘంటసాల, పి.సుశీల బృందం). నమ్మినబంటు చిత్రం విజయం సాధించింది. పలు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. తమిళ చిత్రం కూడా శత దినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం ప్రచార పోస్టర్లలో మేటి నటీనటులకన్నా మిన్నగా నటించారు రాముడు లక్ష్మణుడు అని ఎద్దుల బొమ్మలు వేయడం స్పెషాలిటీ. అయితే, దీనిపై కొన్ని విమర్శలూ వచ్చాయంటారు. చిత్రవిజయంలో రాముడు, లక్ష్మణుడు చేసిన విన్యాసాలు ప్రేక్షకులను అలరించటం ఆ రోజుల్లో విశేషమే మరి. సినిమాకు సంబంధించి అవుట్‌డోర్‌లో సాగిన ఎద్దుల పందేలు లాంటివి దగ్గుబాటి రాఘవయ్యచౌదరి స్థలంలో అని డప్పు వేయించటం... నటీనటుల వసతి మొదలగునవి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు పర్యవేక్షించటం, కలెక్టర్ వేషం ధరించటం జరిగింది. తరువాత రామానాయుడు మద్రాస్ వెళ్లి నిర్మాతయ్యారు. అలా సురేష్ ప్రొడక్షన్స్ ఏర్పడింది.
నమ్మినబంటును స్పెయిన్‌లోని శాన్‌సెబాస్టియన్‌లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. అలాగే రష్యా, రంగూన్, మలేషియా దేశాల్లో ప్రత్యేకంగా సినిమా ప్రదర్శించారు. నమ్మినబంటుకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్టప్రతి రజిత పతకం దక్కింది. చక్కని సంగీత, సాహిత్య మేళవింపుతో కూడిన చిత్ర గీతాలు నేటికీ శ్రోతలను పరవశింప చేస్తున్నాయి. సన్నివేశాలూ ఈ చిత్రాన్ని గుర్తు చేసేలా ఉండటం ఆనందదాయకం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి