ఫ్లాష్ బ్యాక్ @ 50

స్వప్నసుందరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేనికి నివాళిగా.. (20 సెప్టెంబర్ అక్కినేని పుట్టినరోజు )

=========================================

05-07-1906న నెల్లూరు జిల్లా పొట్టిపాడులో జన్మించారు శ్రీ ఘంటసాల బలరామయ్య. వారి అన్నయ్య ఘంటసాల రాధాకృష్ణయ్యగారితో కలిసి కలకత్తా, ముంబాయిలలో చిత్ర నిర్మాణ పద్ధతులు గ్రహించి, నెల్లూరుకు వచ్చి శ్రీరామా ఫిలిమ్స్ బేనర్‌పై ‘సతీ తులసి’(1936) నిర్మించారు. ‘మైరావణ’, ‘మార్కండేయ’ చిత్రాల తరువాత 1941లో ప్రతిభా సంస్థ ప్రారంభించి తొలుత ‘పార్వతీ కల్యాణం’, ఆ తరువాత ‘గరుడ గర్వభంగం’ (1943) నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావుగారిని చిత్రసీమకు తొలిసారి పరిచయం చేస్తూ 1944 ‘సీతారామ జననం’ తరువాత ‘ముగ్గురు మరాఠీలు (1946) నిర్మించి, ఆపైన ఘన విజయం సాధించి అక్కినేనికి ఎనలేని పేరు సంపాదించి పెట్టిన బాలరాజు (1948) నిర్మించారు. ఆ తరువాత 1950లో అక్కినేని, అంజలిదేవి కాంబినేషన్‌లో వీరు నిర్మించిన జానపద చిత్రం ‘స్వప్నసుందరి’. ఈ చిత్రం షూటింగ్ గాప్‌లో వీరిద్దరి కాంబినేషన్‌లో 1950లో ‘శ్రీలక్ష్మమ్మ కథ’ను నిర్మించారు.
అక్కినేని నాగేశ్వరరావు చిత్రసీమలో ప్రవేశించిన తొలి రోజుల్లో జానపద కథానాయకునిగా ఎక్కువ చిత్రాల్లో నటించి, రాణించారు. ఆ ఇమేజి దృష్టిలో వుంచుకొని నిర్మాత బలరామయ్య ఈ ‘స్వప్నసుందరి’ జానపద చిత్రానికీ అక్కినేని వారినే హీరోగా నిర్ణయించారు. సముద్రాల సీనియర్ చిత్రానికి పాటలు-మాటలు సమకూర్చారు. కాశీమజిలి కథలను అనుసరించి, చక్కని అల్లికతో చిత్రకథను రూపొందించారు. ఈ చిత్రానికి వీనులవిందైన సంగీతాన్ని సి.ఆర్. సుబ్బరామన్ సమకూర్చగా సంయుక్త సంగీత దర్శకునిగా ఘంటసాలవారు పనిచేశారు. టైటిల్స్‌లో వారి పేరు జి.వి.రావుగా ప్రకటించారు. నృత్యం-వేదాంతం రాఘవయ్య, ఛాయాగ్రహణం- శ్రీ్ధర్, ఎడిటింగ్- జి.డి.జోషి, స్టంట్స్- కత్తిసాధన, స్టంట్- సోము, స్వామినాథన్ అండ్ పార్టీ, నిర్మాణ నిర్వాహకుడు - ప్రతిభాశాస్ర్తీ (టి.వి.ఎస్.శాస్ర్తీ) నిర్మాత-దర్శకుడు: ఘంటసాల బలరామయ్య.
ప్రభు (అక్కినేని) తన మిత్రుడు అచ్చి (శివరావు)తో కలిసి, సృష్టిలోని వింతలను చూస్తూ దేశాటనం చేస్తుంటారు. ఓనాటి రాత్రి ప్రభు కలలో ఓ దివ్యసుందరి కన్పించి, తన నృత్యగానంతో మురిపిస్తుంది. ఆమెకోసం అనే్వషిస్తు ప్రభు, అచ్చి ఓ లేడిని కాపాడే ప్రయత్నంలో కోయరాణి (జి.వరలక్ష్మి)కి బందీ అవుతారు. ప్రభును ప్రేమించిన రాణి ప్రేమను తిరస్కరించిన ప్రభు అక్కడనుంచి తప్పించుకుంటారు. మరోచోట తిరిగి కలలో కాంచిన దేవసుందరి (అంజలి)ని ప్రభు కలుసుకోవటం, ఆమెతో వెళ్ళి కొంతకాలం తేజోలోకంలో గడపటం, వారి ప్రభువు తేజోధాముని ఆగ్రహానికి గురై భూలోకం వస్తారు. పిట్టలరాయుడు (ముక్కామల) అనే మాంత్రికుడు, కామవర్ధినిదేవిని ఉపాసిస్తుంటాడు. అంతులేని శక్తులు పొందటంకోసం, దేవకన్యను చేపట్టాలనే దేవి ఆదేశంతో, స్వప్నసుందరిని తన మందిరానికి తన శక్తులద్వారా రప్పిస్తాడు. స్వప్నసుందరికోసం విలపిస్తూ బయలుదేరిన ప్రభు, భేతాళుని సాయంతో మాంత్రికుని గుహచేరగా మాంత్రికుడు అతన్నీ బంధిస్తాడు. కోయరాణి ప్రభు జాడ అంజనంద్వారా తెలిసికొని, తన సైన్యంతో మాంత్రికుని గుహ చేరుకుని, ప్రభును రక్షిస్తుంది. ఆ పోరాటంలో కోయరాణి మరణించటం, మాంత్రికుడు ప్రభు చేతిలో హతంకావటంతో స్వప్నసుందరితో ప్రభు ఆనందంగా జీవిస్తాడు. ఈ చిత్రంలో కోయరాణి సేవకి, నాగినిగా సీత, కోయ పెద్దదొరగా కె.వి.సుబ్బారావు, గారడీవాడుగా గాడేపల్లి, మాయపిల్లగా బాలసరస్వతి నటించారు.
ఘంటసాల బలరామయ్య ప్రతి సన్నివేశాన్ని అర్ధవంతంగా, విపులంగా తీర్చిదిద్దటం, గీతాలను ఎంతో రమణీయంగా చిత్రీకరించగా, దానికి సముద్రాలవారి పదప్రయోగాలు, సుబ్బరామన్‌వారి స్వరాల మేళవింపుతో జనరంజకంగా స్వప్నసుందరి రూపొందింది. కోయరాణి, ప్రభును కలిపినందుకు బాణంతో ఓ నృత్యగీతం ‘‘నీ సరి నీవేనే జవానాలే నెరజాణవులే’ తన మనసులో భావాలు వెల్లడిచేయటం. కోయరాణి దర్పం తెలిసేలా సీత బృందంతో గీతం ‘ఓహోమారాజా’ యువతుల నృత్య విన్యాసం, హీరో, అచ్చి, రాణిల స్పందన, నృత్యం తరువాత జైలునుంచి తెలివిగా తప్పించుకున్నాక ప్రభు సుందరిని కలుసుకున్నాక అచ్చితో పాడే గీతం ‘‘నిజమాయే కల నిజమాయే’’ ఎంతో సహజంగా పూదోటలో, అమాయకంగా అచ్చికి చెప్పటం, స్వప్నసుందరితో ఓ అరుదైన యుగళగీతం, పూలవనం, పూల సజ్జపై సుందరి(అంజలి), ప్రభులతో(అక్కినేని) చిత్రీకరణ ‘ఈ సీమ వెలసిన హారుూ’(రావు బాలసరస్వతి, ఘంటసాల) వారిరువురి పైనే విరహగీతం సుందరిని వెతుకుతూ ప్రభు, చెరలో సుందరిపైన ‘కానగనైతినిగా ???????? ఓ స్వప్నసుందరీ’ (రావుబాలసరస్వతి, ఘంటసాల) శక్తులు లేని ప్రభూ, ఓ అవ్వ సలహాతో బేతాళుని ద్వారా మాంత్రికుని గుహచేరటం, బందీ కావటం, హింసలు పడడం, కోయిరాణి విడిపించాక, ముందు కామవర్ధిని విగ్రహం ధ్వంసంచేసాకే మాంత్రికునితో, ప్రభు యుద్ధం, సహజంగా ఒప్పేలా రూపొందించటం, ఒకరి త్యాగంతోనే మరొకరి ప్రేమ ఫలించటంకోసం కోయరాణి మృతి, ఆమె నిశ్చల ప్రేమ వెల్లడికావటం. దేవకాంత అయినా సుందరి శాపంవల్ల శక్తులు లేక సామాన్య యువతిగా నిలవటం వంటి అంశాలు చిత్రానికి బలం చేకూర్చాయి. ఓ చూపులో ఎనె్నన్నో భావాలను (చురుకుగా, నిశితంగా, ఆహ్లాదకరంగా సమ్మోహనంగా) ప్రదర్శించగల అక్కినేని నాగేశ్వరరావు, హీరో ప్రభుగా కోయరాణి ప్రేమను నిరాకరించటంలో నిశ్చలత్వం, స్వప్నసుందరికోసం ఆకాంక్ష, ఆమెను పొందాక ఆనందం, సంతోషం, చక్కని గీతాల్లో పరవశం, ఆమెకై విరహవేదన, మాంత్రికుని ఎదిరించటంలో కత్తిపోరాటాల్లో చురుకు, సాహసం, కోయరాణి ఆత్మత్యాగంతో, ఆమె ప్రేమ గుర్తించి వేదన, లక్ష్యసాధనకోసం యత్నించే వీరునిగా పలు సన్నివేశాలను తనదైన శైలిలో ఆవిష్కరించి ఆకట్టుకున్నారు.
బాలరాజు (1948) చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించిన అంజలిదేవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూర్తిస్థాయిలో నటించి, ఆ పాత్రకు పరిపూర్ణ న్యాయం చేయటమేకాక, గీతాల్లో ఎంతో అందంగా, చక్కని నృత్యంతో మెప్పించటం విశేషం.
కోయరాణిగా సమర్ధురాలైన నటి జి.వరలక్ష్మి ఎంతో ఈజ్‌తో నటించి అలరించగా, ఇక అచ్చిగా కస్తూరి శివరావు పాత్రోచితమైన నటనకు తన శైలి జోడింపుతో హాస్యాన్ని, సీరియస్‌నెస్‌ను కలిసి అలరించారు. మాంత్రికునిగా ముక్కామల ఆ పాత్ర పరిధిని తన నటనతో ఓ ప్రత్యేకత ఒప్పేలా కన్పరిచారు.
తొలి తెలుగు గాయని రావు బాలసరస్వతిదేవి ఈ చిత్రంలో అన్ని పాటలను ఆలపించారు. ఘంటసాలవారితో తొలిగా ఈ చిత్రంలో పాడడం విశేషం. (1944లో ఆమెకు కోలంక రాజావారితో వివాహం జరిగింది. పెళ్ళయ్యాక ఆమె పాటలు పాడడం తగ్గించారు. కాని ఆమె చేతనే, స్వప్నసుందరిలో పాడించాలనుకున్నారు నిర్మాత. అందుకోసం మధుసూధనరావుగారు అక్కినేని నాగేశ్వరరావుగారు, రాజావారి అనుమతి కోరటం, వారు అంగీకరించగా రావుబాలసరస్వతి ఈ చిత్రంలో అంజలిదేవికి ప్లేబాక్ పాడారు. జి.వరలక్ష్మి, కస్తూరి శివరావు తమ పాటలకు తామే పాడుకున్నారు. జి.వరలక్ష్మి గానం చేసిన గీతాలు 1) నీసరి నీవేనే జనానా’ 2) మరలిరావో మనసు లేదో కస్తూరి శివరావు, సీతతో గీతం ‘కోపమేల నాపై ఓ నాగిని’ (శివరావు, లీల), బాలసరస్వతి, శివరావులపై గీతం ‘పలుకే పిల్లా నాతో ఆజాడా’ (శివరావు, జిక్కి) తొలుత అక్కినేని కలలో స్వప్నసుందరి గీతం అంజలి, అక్కినేనిలపై ‘‘ఓ పరదేశి మరే జాడలా’ దేవలోకంలో మరో గీతం ‘నటనలు తెలిసెనులే’ అక్కినేని, అంజలిలపై మరో గీతం ‘నినే్న వలచె కొనరా తొలివలపు’ (అంజలి, అక్కినేనిలపై) ఈ 3 గీతాలు గానం (రావుబాలసరస్వతి). ‘ఈ సీమ వెలసిన హాయి కానగ నైతినిగా’ (ఘంటసాల, రావుబాలసరస్వతిదేవి) అక్కినేని, అచ్చిలపై గీతం ‘నిజమాయే కల నిజమాయే’ (గానం-ఘంటసాల) ‘ఒహ్హోహో మారాజా’ గీతం (గానం-లీల బృందం). సంగీతపరంగా, గీత సాహిత్యపరంగా ‘స్వప్నసుందరి’ విశేషప్రజాదరణ పొందింది. ఈ చిత్ర ప్రారంభంలోని గీతం ‘సాగుమా సాహిణి ఆగని వేగమే జీవితము ఎవరికోసమో ఏ దరికో ఎరుగక అడుగక వేసరక’ (గానం- ఘంటసాల) నిత్యసత్యాలకి అద్దంపడుతూ నిత్య నూతనంగా నిలిచి ప్రశంసనీయమయింది. ‘స్వప్నసుందరి’చిత్రం విజయవంతం కావటం, ఆ తరువాత చింతామణి రామసుబ్బరామన్ (సి.ఆర్. సుబ్బరామన్) మరెన్నో చిత్రాలకు మధుర సంగీతాన్ని అందించడం విశేషం. ఈ చిత్రం నృత్యదర్శకులు వేదాంతం రాఘవయ్య. ఆ తరువాత అక్కినేని, అంజలిదేవిల కాంబినేషన్‌లోని సువర్ణసుందరి (1957) చిత్రానికి దర్శకత్వం వహించటం ఓ విశేషం.
‘‘స్వప్నసుందరి’’ చిత్రాన్ని తమిళంలో ఆ పేరుతోనే డబ్బింగ్ చేశారు. అక్కడవారు ఈ చిత్రాన్ని అభిమానించారు. చక్కని మధురానుభూతిని, హాయిని కలిగించే చిత్రం ‘‘స్వప్నసుందరి’’.

- ఎస్.వి.రామారావు -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి