ఫ్లాష్ బ్యాక్ @ 50

నేనే మొనగాణ్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ: షణ్ముగం
కెమెరా: బాబు
నృత్యం: చిన్ని, సంపత్
కళ: తోట
కూర్పు: గోవిందస్వామి
స్టంట్స్: సాంబశివరావు
సంగీతం: టీవీ రాజు
ఫొటోగ్రఫీ: కెఎస్ ప్రసాద్
నిర్మాత: కెఎస్ ప్రసాద్.
దర్శకత్వం: ఎస్‌డి లాల్
***
కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు ఎస్‌డి లాల్. సినిమాలు, నాటకాల పట్ల అభిమానం. దర్శకులు ఎల్‌వి ప్రసాద్ తోడ్పాటుతో మద్రాస్ వెళ్లి శేలంలోని మోడరన్ థియేటర్స్ సంస్థలో దర్శకత్వపు శాఖలో అనుభవం సంపాదించారు. మోడరన్ థియేటర్స్ సంస్థ అధినేత టిఆర్ సుందరం తొలిసారిగా 1960లో నిర్మించిన ‘సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి’ చిత్రానికి దర్శకునిగా ఎస్‌డి లాల్‌కు అవకాశమిచ్చారు. ఆ నాటినుంచి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్‌డి లాల్, తనదైన శైలితో రాణించారు. వీరు దర్శకత్వం వహించిన అనేక చిత్రాలు, హిందీ నుంచి తెలుగులోకి రూందించబడినవి కావటం విశేషం. యాక్షన్, థ్రిల్లింగ్ కలబోసిన చిత్ర దర్శకుడిగా ఎస్‌డి లాల్ మంచి గుర్తింపు పొందారు. వాటిలో చాలాభాగం చిత్రాలను హీరో ఎన్.టి. రామారావువే కావటం ఓ ప్రత్యేకాంశం.
ప్రతిమా ఫిలింస్ బ్యానర్‌పై 1968లో లాల్ రూపొందించిన చిత్రమే -నేనే మొనగాణ్ని. ఎన్టీ రామారావు, షీలా జంటగా నటించారు.
కథ:
చిత్ర ప్రారంభంలో క్షామ నివారణ కోసం బియ్యం లారీలను పోలీసులు ఎస్కార్ట్‌తో తీసుకెళ్తుంటారు. బందిపోటు బెజవాడ భద్రయ్య (రాజనాల) పోలీస్ ఎస్కార్ట్‌ను అడ్డగించి, ఇన్‌స్పెక్టర్ ముత్యాలరావు (్ధళిపాళ)ను పిస్తోలుతో గాయపరుస్తాడు. భద్రయ్యను పసిగట్టిన స్పెషల్ డిఎస్పీ నందనరావు బందిపోటును బంధించాలని ఒక ప్లాను వేస్తాడు. భద్రయ్యను, అతని కొడుకు నానీ (బేబీరాణి)ని ఒక షాపులో అటాక్ చేస్తాడు. ఎదురుకాల్పుల్లో నందనరావు (సత్యనారాయణ)ను దుండగులు తీవ్రంగా కాల్చటంతో, అతను మరణిస్తాడు. భద్రయ్య తప్పించుకుని పారిపోగా, గాయాలతో నానీ పోలీసులకు చిక్కుతాడు. నానీని పోలీసులు ఆస్పత్రిలో చేరుస్తారు. నందనరావు భార్య యశోద (శాంతకుమారి), నానీని ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్దచేస్తుంది. వంశీధర్ (ఎన్టీ రామారావు)గా పెరిగి పెద్దవాడయిన నానీ.. యశోద, నందనరావులనే తల్లిదండ్రులుగా భావిస్తుంటాడు. ఉత్తమ వ్యక్తిగా మన్ననలు పొందుతూ, మేనమామ (యశోద తమ్ముడు) ముత్యాలరావు కుమార్తె నీల (షీల) ప్రేమలో పడతాడు. ఈ ప్రేమను ఇష్టపడని ముత్యాలరావు, వంశీధర్‌ను దొంగ కొడుకుగానే పరిగణిస్తుంటాడు. వంశీధర్ నందనరావు కొడుకేనని, తన కొడుకు నానీ పోలీసు కాల్పుల్లో మరణించాడన్న భ్రమతో, వంశీధర్‌ను అంతం చేసేందుకు బందిపోటు భద్రయ్య ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోవైపువిదేశీ శక్తులతో చేతులు కలిపి దేశంలో అనేక మారణకాండలు జరిపిస్తుంటాడు. వంశీధర్ వీటినన్నిటినీ చాకచక్యంగా ఎదుర్కొంటుంటాడు. వేలమంది జనానికి ప్రాణాధారమైన ప్రాజెక్టును ధ్వంసం చేయబోయిన దుండగులను అడ్డుకుని, భద్రయ్య ప్రయత్నాలను భంగం చేస్తాడు. ఆ కాల్పుల్లో భద్రయ్య మరణిస్తూ వంశీధరే తన కుమారుడని నిజం గ్రహించడం, వంశీధర్‌లోని నిజాయితీ, మంచితనం గుర్తించిన ముత్యాలరావు నీలతో పెళ్లి నిశ్చయించటం, వంశీధర్‌కు పోలీస్ ఆఫీసర్‌గా పోస్టింగ్ రావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
చిత్రంలో అపవాదు వారపత్రిక ఎడిటర్‌గా అల్లు రామలింగయ్య కనిపిస్తాడు. విలేఖరులుగా రాజ్‌బాబు, సంధ్యారాణి, వైద్యుడిగా డా.శివరామకృష్ణయ్య, నౌకరు దేవయ్యగా రమణారెడ్డి, భద్రయ్య అనుచరులుగా అర్జా జనార్ధన్‌రావు, పెమ్మసాని రామకృష్ణ, ఆనందమోహన్, సీతారాం, నృత్య తారలుగా గీతాంజలి, సుబ్బు, రాజేశ్వరి, జ్యోతిలక్ష్మి నటించారు.
దర్శకుడు ఎస్‌డి లాల్ యాక్షన్, థ్రిల్స్, సెంటిమెంటు కలిసిన చిత్ర కథకు తగినట్టు సన్నివేశాలను తీర్చిదిద్దారు. వంశీ, నీల తొలుత రైలు పట్టాలపై బాంబులు తొలగించి, దుండగులతో ఫైట్, తరువాత ప్రణయ గీతం ఆకట్టుకుంటుంది. భద్రయ్య అనుచరుడిని వంశీ అనుసరించిన విధానం, తల్లి, మేనమామల మాటలతో తాను యశోద కొడుకును కానని వంశీ తెలుసుకోవడం, తల్లిని కలిసి తన నిర్ధోషిత్వం తెలియచేయటం, తన పెంపకంపై తనకు నమ్మకముందని యశోద చెప్పటం లాంటి సన్నివేశాలు రక్తికట్టిస్తాయి. రాజ్‌బాబుతో కలిసి వంశీ మారువేషంలో నీలను రక్షించటం, ఆ సమయంలో పెమ్మసాని, ఆనందమోహన్‌ల డాన్స్, చివరలో మల్లు గ్యాంగ్‌తో పోరాటాలు, నదిపై కడుతున్న ఆనకట్టను పేల్చివేయబోయిన ముఠాను వంశీ సాహసంతో అంతం చేయటం, గాయాలతో మరణానికి చేరువైన భద్రయ్యకు వంశీయే తన కుమారుడని తెలియడంతో, కొడుకు చేతి మంచినీళ్లు తాగటం, విదేశీ శక్తులతో చేతులు కలిపిన నాయకుడు ‘బాలయ్య’ను గాంగ్‌తో సహా అంతకుముందే వంశీ అంతం చేయటం... ఇలా యాక్షన్, సెంటిమెంట్ మధ్యలో క్లబ్ డాన్స్‌లు కలగలిపి రూపొందించి దర్శకుడు లాల్ ఈ చిత్రంలో ఓ వెరైటీ చూపించారు. వీటికితోడు వంశీ పెంపుడు కుక్క కదలికలు, విన్యాసాలు, గుర్రంపై చివర ఎన్టీఆర్ స్వారీ చేస్తూ లక్ష్యం చేరుకోవటం.. లాంటి సన్నివేశాలతో సామాన్య జనరంజకంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు.
చిత్రంలో యశోదగా శాంతకుమారి చెప్పుకోదగ్గ స్థాయి నటన చూపారు. పిల్లలులేని స్ర్తి, ఓ బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్ది అతనికై తపించే తల్లిగా, మాతృమూర్తిగా ఆమె నటనలో పరిపూర్ణత కనిపిస్తుంది. హీరో వంశీగా ఎన్టీ రామారావు అలవోకగా తన పాత్రను పోషించి సన్నివేశాలను రక్తికట్టించారు. షీలా పాత్రోచిత నటన, ప్రేమ గీతాలు, తండ్రిని ఎదిరించే సన్నివేశంలో యుక్తమైన నటన చూపారు. అల్లు రామలింగయ్య, రమణారెడ్డి పాత్రలకు తగ్గ ప్రత్యేక హావభావాలతో మెప్పించారు.
చిత్ర గీతాలు:
షీలా, ఎన్టీఆర్‌పై చిత్రీకరించిన ఆహ్లాద గీతం -నిన్ను చూసింది మొదలు కలలే కలలు (మాటలు: ఎన్టీఆర్, గానం: పి సుశీల). రాజ్‌బాబు (ఆడవేషంలో రౌడీలను కవ్వించటం), సంధ్యారాణిపై చిత్రీకరించిన గీతం -చూస్కో నా రాజా చూస్కో (రచన: కొసరాజు, గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి). ఎన్టీఆర్, రాజ్‌బాబు, రౌడీలపై చిత్రీకరించిన తమాషా గీతం -గారడీ చేసేస్తానే నే గమ్మత్తు చేసేస్తా (గానం: ఘంటసాల, కెఎల్ రాఘవులు, బృందం, రచన: దాశరధి). మారువేషంలో ఎన్టీఆర్, గీతాంజలి బృందంతో పాడే క్లబ్ పాట (్ధళిపాళ, రాజనాల కన్పిస్తారు) -షోకిలా పిల్లా నినే్న నినే్న మెచ్చుకుంటుంది (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, పి సుశీల, ఘంటసాల).
-నేనే మొనగాడ్ని చిత్రం కమర్షియల్ అంశాలన్నింటితో కూడి జన రంజకంగా ఓవర్గం ప్రేక్షకులను అలరించేలా నిలిచింది. ఎన్టీఆర్ అభిమానులు మెచ్చే చిత్రంగా మంచి ఆదరణ పొందింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి