ఫ్లాష్ బ్యాక్ @ 50

బంగారు పిచిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

======================
పాటలు: ఆరుద్ర
సంగీతం: కెవి మహదేవన్
కెమెరా: కన్నప్ప
కూర్పు: సంజీవి
స్టంట్స్: మాధవన్
రచన: ముళ్ళపూడి వెంకటరమణ
దర్శకుడు: బాపు
======================

కథకుడిగా, సినీ విమర్శకుడిగా పరిచయం చేయాల్సిన పనిలేని వ్యక్తి ముళ్లపూడి వేంకటరమణ. వ్యాసకర్తగా, అనువాద రచయితగానూ అనుభవజ్ఞుడు. దాగుడుమూతలు, రక్తసంబంధం, గుడిగంటలు, మూగమనసులు వంటి పలు చిత్రాలకు తన కలాన్ని అందించి సినీ రచయితగానూ వాసికెక్కిన వ్యక్తి. ఆల్ ఇన్ వన్ -ముళ్లపూడి వేంకటరమణ. ఆయన సహచరుడు, ప్రియమిత్రుడు -బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ). లా చదువుకున్నా, బొమ్మలపైనా గీతలపైన మక్కువతో పబ్లిసిటీ ఆర్టిస్టుగా, పత్రికలకు ఇలస్ట్రేటర్ పనిని ఎంచుకున్నారు. అలా పనిచేస్తూ తొలిసారి -అత్తా ఒకింటి కోడలే చిత్రానికి కామిక్ స్టోరీ రైటర్‌గా (బొమ్మలతో) పని చేశారు. ఆపైన ముళ్లపూడి రచన చేసిన ‘గుడి గంటలు’, ‘రక్తసంబంధం’, ‘మూగమనసులు’ చిత్రాలకు పోస్టర్ డిజైనర్‌గా వ్యవహరించారు. అలా వీరిద్దరి స్నేహబంధం పటిష్టమైంది. వీరిరువురూ కలిసి నిర్మాతలుగా రూపొందించిన తొలి చిత్రం 1967లో వచ్చిన -సాక్షి. మరుసటి సంవత్సరమే 1968లో రూపొందించిన రెండో చిత్రం -బంగారు పిచిక. అలా మొదలైన వీరి ప్రయాణంలో ఇద్దరూ కలిసి బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, భక్తకన్నప్ప, సీతాకల్యాణం, శ్రీనాథ కవి సార్వభౌమ (మచ్చుకు మాత్రమే) వంటి పలు విజయవంతమైన చిత్రాల నిర్మించారు. వీరువురి ప్రతిభను గుర్తించి ఆంధ్ర యూనివర్సిటీ ‘గౌరవ డాక్టరేట్’ను, రాష్ట్ర ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారాన్ని ఉమ్మడిగా ప్రదానం చేసి సత్కరించాయి. ఇలా ఒక అవార్డు ఉమ్మడిగా పొందటం వీరి స్నేహభావానికి, సినీ చరిత్రకు ఓ అరుదైన విశేషం నిలిచింది.
1967లో -త్రీ బైట్స్ ఆఫ్ ది యాపిల్ (ఇంగ్లీష్) అనే కామెడీ సినిమా విడుదలైంది. డేవిడ్ మెక్‌కాలమ్ (జూనియర్) చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆధారంగా ఫుల్ లెంగ్త్ కామెడీతో, ఎక్కువ భాగం అవుట్‌డోర్‌లో ఉండేలా నిర్మించిన చిత్రం -బంగారు పిచిక. శ్రీ గణేష్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో విజయనిర్మల, చంద్రమోహన్ జంటగా నటించారు. తొలుత ఈ చిత్రానికి ‘స్వయంవరం’ అనే టైటిల్ నిర్ణయించినా, తరువాత ‘బంగారు పిచిక’గా మార్చారు.

కథ:
ఆస్తి అంతస్తు కలిగిన ధనవంతురాలు రాణీ రాజేశ్వరీదేవి (శాంతకుమారి). ఆమె భర్త సన్యాసిరాజు (రామన్న పంతులు). ఏకైక పుత్రరత్నం వరహాలరాజు (చంద్రమోహన్). మేనేజర్ మల్లయ్య (సాక్షి రంగారావు), ఇంటినిండా పనివాళ్లు, వంటవాడు, డ్రైవర్లు కలిగిన భారీ సంస్థానంవంటి కుటుంబం వీళ్లది. భర్తను, కుమారుడిని, అందరినీ అదుపులోవుంచే నేర్పరి రాజేశ్వరిదేవి.
భర్త సన్యాసిరాజు పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేస్తుంది రాజేశ్వరీ దేవి. ఊరిలోని ధనవంతులు, వారి కుమార్తెలను ఆహ్వానించి వరహాలరాజుకు స్వయంవరం లాంటిది ఏర్పాటు చేస్తుంది. పార్టీకి వచ్చిన ధనవంతులు తనకంటే తల్లికి వత్తాసు పలకటం, తండ్రి నిస్సహాయంగా నిలబడటం రాజుకు కష్టంగాతోస్తుంది. పార్టీ అనంతరం రాత్రి స్వతంత్రంగా బ్రతికి, ఇష్టమైన పిల్లని పెళ్లాడమని తండ్రి ఇచ్చిన సలహాతో వరహాల రాజు ఇల్లొదిరి వెళ్తాడు. ఆ వూరిలో ఓ మధ్యతరగతి తండ్రి వడ్లమాని విశ్వనాథం, కూతురు రాధ (విజయనిర్మల). వాళ్ల ఇల్లు అప్పుల్లో ఉంటుంది. అప్పుల ఊబినుంచి బయటపడి ఇల్లు తిరిగి పొందాలంటే ధనవంతుడైన వరాహాల రాజును రాధ ప్రేమించి పెళ్లాడాలని పురోహితుడు కాకరాల, మరో మిత్రుడు సలహానిస్తారు. పథకం ప్రకారం వారిని ఒప్పించి, రాజును రాధ కలుసుకునే ఏర్పాటు చేస్తారు. అలా కలిసిన రాధ తాను జమీందారు బిడ్డనని రాజుకు చెబుతుంది. తాను పేదింటి కొడుకునని రాజు చెబుతాడు. అలా ఇద్దరూ కలిసి హైద్రాబాద్‌కు ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో ఒకరిపై ఒకరికి ప్రేమ పుడుతుంది. ఇదిలావుంటే, ఇంటినుంచి వెళ్లిపోయిన కొడుకును వెదకమని రాజేశ్వరి పంపిన నౌకర్లు జల్సాగా తిరగుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరీ దేవి, కొడుకును వెతికేందుకు స్వయంగా బయలు దేరుతుంది. జరిగినదంతా ఓ కుట్ర అని తెలుసుకుని, 50 వేలు చెల్లిస్తుంది. కుట్రకు కారకుడు తన మేనేజర్ మల్లయ్యేనని తెలుసుకుని, కొడుకును రాధనుండి దూరంగా తీసికెళ్లాలనుకుంటుంది. కాని రాధలోని నిజాయితీ తెలుసుకున్న వరహాలరాజు డబ్బు తీసుకున్న మల్లయ్య, బృందాన్ని చావతన్ని రాధను కలుసుకుంటాడు. ఆమెతో పెళ్లికి తల్లి అంగీకారం పొందటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో ఇంకా రాజ్‌బాబు, ప్రసన్నరాణి, జగ్గారావు తదితరులు నటించారు.
ఈ చిత్రంలో అవుట్‌డోర్ సన్నివేశాలు హైదరాబాద్ దగ్గరలోని వికారాబాద్ వద్ద తీశారు. బాపూ రమణల తొలి చిత్రం ‘సాక్షి’ సెంటిమెంటు, స్వార్థం, మోసం, దౌర్జన్యంలతో ఎక్కువ భాగం సీరియెస్‌నెస్‌తో కూడినది కాగా, ‘బంగారు పిచిక’ మానవ స్వభావాలను సున్నితంగా వ్యక్తీకరిస్తూ, హాస్యంతో రంగరించి సన్నివేశాలను తీర్చిదిద్దారు దర్శకులు. తొలుత రాజేశ్వరిదేవి తన భర్తను, కుమారుని పంజరంలో వుంచి వారి దినచర్య పర్యవేక్షించే సన్నివేశంతోనే సినిమా కథను విశదీకరించారు. వారికి పెట్టిన బిస్కెట్ల క్రింద చాటుగా ఇడ్డెన్లు వంటివి వుండడం, డైనింగ్ టేబుల్‌వద్ద బ్రెడ్, బటర్, జామ్ వంటివే కావటం, మిగిలిన ఫలహారాల కోసం పేపర్లు అమ్ముకొని నౌకర్ల ద్వారా చాటుగా తెప్పించుకుని తండ్రి, కొడుకు తినటంలాంటి సన్నివేశాలతో అద్భుతమైన ఆరంభాన్ని చూపిస్తారు. సన్యాసిరాజు పుట్టినరోజున అతన్ని కాక, రాజేశ్వరినే హ్యాపీ బర్త్‌డే అని పెద్ద మనిషి శివరామకృష్ణయ్య పలుసార్లు విష్ చెయ్యటం, వారితో షేక్‌హాండ్ కోసం ఖాళీ చేతిని రాజుగారు చాపి వుంచటంలాంటి సన్నివేశాలతో కథలోకి ప్రేక్షకుడిని లాక్కెళ్లగలిగారు. అమాయకురాలైన రాధ, రాజువద్ద అతితెలివిగా, జాగ్రత్తగా వ్యవహరించటం, వరహాలరాజు కూడా అందుకు తగ్గట్టు అమాయకంగా తెలివిగా స్పందించటం, నమ్మిన పనివారే వంటవాడు, మేనేజర్ యజమానిపై కుట్రకు పాల్పడటం వంటి సన్నివేశాలు ఎంతో ఈజ్‌తో రూపొందించి చిత్రీకరించారు. ఇక హాయియైన, సున్నితమైన రెండు గీతాలను వెరైటీగా చిత్రీకరించటం బంగారు పిచికలో కనిపిస్తుంది. -అంటున్నది రాధా కృష్ణా (గీతం) ఏం చేసుకునేది ఇంత వెనె్నలా’ (గానం:పి సుశీల). విజయనిర్మల, చంద్రమోహన్‌పై రాత్రిపూట గడ్డివాముపై చిత్రీకరించారు. మరో గీతాన్ని తోటలో ఓ వరండా గట్టుపై వీరిరువురిపైనే రూపొందించిన -పోపో నిదురపో నిదురవచ్చినా రాకున్నా’ (గానం: పి సుశీల). ఇవికాక, చంద్రమోహన్ విజయనిర్మలను ఆటపట్టిస్తూ పాడే టైటిల్ సాంగ్ -ఓహో హో బంగారు పిచ్చుకా’ (గానం: ఎస్పీ బాలు), విజయనిర్మల, చంద్రమోహన్‌లపై యుగళ గీతం -మనసే గని తరగని గని తగ్గని గని (ఎస్పీ బాలు, బి వసంత) గీతాలు ఆరుద్ర రచనతో, కెవి మహదేవన్ స్వరాలతో అలరించేలా సాగుతాయి.
విజయనిర్మల, చంద్రమోహన్ తమ పాత్రల పరిధిమేరకు పరిపూర్ణమైన నటన చూపించారు. జమీందారిణిగా శాంతకుమారి దర్పాన్నీ, హోదాను, కన్న కొడుకుపై వాత్సల్యాన్ని, నమ్మకద్రోహం చేసిన నౌకర్ల ప్రవర్తనకు విచారాన్ని సన్నివేశానుగుణంగా నటించి మెప్పించారు. రామన్నపంతులు, భార్య చాటు భర్తగా కొంత బాధ, అమాయకత్వం, అతి తెలివిని సన్నివేశాలకు అనుగుణంగా నటించి మెప్పించారు.
అప్పట్లో ఈ చిత్ర నిర్మాణానికి 2.5 లక్షలు ఖర్చయ్యింది. విచిత్రమైన విశేషం ఏమిటంటే -మొత్తం బడ్జెట్‌లో 50 వేల రూపాయలు నటులకు ఇచ్చిన సిగరెట్లు, తదితరాలకు ఖర్చయినట్టు తెలిసింది. అనవసర బడ్జెట్ లెక్కతేల్చిన రమణ, తరువాత నుంచి వారు నిర్మించిన చిత్రాలకు ఊరికే సిగరెట్లు ఇవ్వటం ఆపివేశారుట. బంగారు పిచిక (1967) కథాంశంతోనే బాపూ, రమణలు తిరిగి రంగుల చిత్రంగా -పెళ్ళికొడుకు (1994)ను రూపొందించారు. ఆ చిత్రంలో నరేష్, దివ్యవాణిలు ప్రధాన పాత్రలు పోషించారు. సంగీత, ఏవీఎస్ నరేష్ తల్లితండ్రులుగా నటించారు. -బంగారుపిచిక ఆర్థికంగా విజయవంతం కాకపోయినా, హార్దిక విజయాన్ని సాధించింది. నిర్మాతలకు నష్టం కలిగించలేదు. తరువాత తీసిన పెళ్ళికొడుకు చిత్రం మాత్రం నిరాశపర్చింది.

-- సివిఆర్ మాణిక్యేశ్వరి