ఫ్లాష్ బ్యాక్ @ 50

వింత కాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ, మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
సంగీతం: మాస్టర్ వేణు
స్టంట్స్: రాఘవులు అండ్ పార్టీ
కళ: ఎస్ కృష్ణారావు
ఛాయాగ్రహణం: పిఎస్ సెల్వరాజ్
నృత్యం: తంగప్ప
సహాయకులు: రాజు, తార
టైటిల్స్ డిజైన్: కెఎస్ మణి
స్క్రీన్‌ప్లే: పి పుల్లయ్య
నిర్మాత: వి వెంకటేశ్వర్లు
దర్శకత్వం: వివి సుబ్బారావు (అబ్బి)
=========================================
ప్రముఖ దర్శకుడు పోలిదాసు పుల్లయ్యకు (పి పుల్లయ్యగా ప్రసిద్ధులు) చిన్ననాటి నుంచి కళలు, నటనపట్ల మక్కువ ఎక్కువ. ఆంధ్ర దేశమంతటా తిరిగి నాటక, పద్యాల ప్రదర్శనలతో అనుభవం సంపాదించారు. తొలుత స్టార్ కంబైన్స్ అనే ఫిలిం కంపెనీతో కొల్హాపూర్‌లో ‘సత్యహరిశ్చంద్ర’ నిర్మించారు. తరువాత ‘సారంగధర’ (1937) చిత్రానికి దర్శకత్వం వహించి మంచి పేరు సంపాదించారు. ఆ సినిమాలో చిత్రాంగిగా నటించిన శాంతకుమారిని వివాహం చేసుకున్నారు. తరువాత షిరాజ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర మహత్మ్యం (1939) నిర్మించారు. ఆపై రాగిణీ ఫిలింస్ పతాకంపై 1948లో ‘్భక్తజనా’ తమిళ చిత్రం, తెలుగులో ‘తిరుగుబాటు’(1950), ‘్ధర్మదేవత’ (1952), తెలుగు, తమిళ భాషల్లో ‘అర్ధాంగి’ (1955) నిర్మించారు. పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై తిరిగి శ్రీ వెంకటేశ్వర మహత్మ్యం (1960), సిరిసంపదలు (1962), మురళీకృష్ణ (1964), ప్రేమించి చూడు (1965), ప్రాణమిత్రులు (1967) నిర్మించారు. అదే పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై 1968లో పుల్లయ్య బావమరిది వెంకటేశ్వర్లు నిర్మాతగా, మరో బంధువు వివి సుబ్బారావు (అబ్బి) దర్శకత్వంలో నిర్మించిన చిత్రమే ‘వింతకాపురం’. 1968 నవంబర్ 3న విడుదలైంది. ‘వింత కాపురం’ చిత్రం టైటిల్స్ వైవిధ్యంగా ప్రదర్శించారు. తొలుత కృష్ణ, కాంచన కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనటం, ఆ తరువాత కామెడీ టైపు బొమ్మలపై మిగిలిన నటీనటుల పేర్లు, టెక్నీషియన్ల పేర్లు చూపించి ఆకట్టుకున్నారు.
బర్మా ఇండస్ట్రీ అధినేత శ్రీనివాసరావు (నాగభూషణం). అతని గారాల కూతురు విజయ (కాంచన). ఆఫీసులో హెడ్ గుమాస్తా గరుడ వాహనం (అల్లు రామలింగయ్య), అతని భార్య ధనం (రాధాకుమారి), అతని కుమర్తె రమణమ్మ (రమాప్రభ). సీతానగరంలో రాయకోటి రాఘవయ్య (రావి కొండలరావు) రిటైర్డ్ ఉపాధ్యాయుడు. అతని కుమారుడు రాజశేఖర్ (కృష్ణ). అతనికి బర్మా కంపెనీ నుంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూ వస్తుంది. దానికోసం తన డొక్కు కారుతో పట్నం వెళ్ళిన రాజు, దారిలో కలిసిన విజయ, స్నేహితులతో చిన్న గొడవ పడతాడు. రాజుకు శ్రీనివాసరావు కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అయితే రాజుకు ఆ ఉద్యోగం ఇవ్వటానికి విజయ వ్యతిరేకిస్తుంది. కాని రాజు, తన మిత్రుడు ఆంజనేయుడు (పద్మనాభం), గరుడవాహనం సాయంతో ఓ నాటకం ఆడి ఉద్యోగం నిలబెట్టుకుంటాడు. రాజుతో విభేదిస్తూనే అతన్ని ప్రేమిస్తుంది విజయ. రంగరాజు (ప్రభాకర్‌రెడ్డి) అనే వంచకుడు, దుర్మార్గుడు, పల్లెటూరిలో రాంబాణమ్మ (సూర్యకాంతం) కూతురు కమల (సంధ్యారాణి)ను ప్రేమించానని నమ్మబలికి మోసంతో లేవదీసుకువస్తాడు. ఓ గ్యాంగ్ సాయంతో అక్రమాలు చేస్తుంటాడు. అందగత్తె, ధనవంతురాలైన విజయను పొందాలనే ఆశతో, కమల అడ్డు తొలగించుకోవాలని తన అనుచరుడు పులి (నెల్లూరు కాంతారావు)కి పురమాయిస్తాడు. అతడు, ఆమెను రంగరాజు తల్లివద్దకు చేరుస్తాడు. విజయ, రాజులు ఒకరినొకరు ప్రేమించుకోవటంతో శ్రీనివాసరావు వారిద్దరికీ వివాహం జరిపిస్తాడు. ఆ పెళ్లికానుకగా రంగరాజు, కమల తనకు పంపిన ఫొటోను రాజుకు పంపుతాడు. ఆ ఫొటోను చూసిన విజయ అపార్ధం చేసుకోవటంతో, రాజు ఇల్లువదిలి వెళ్లిపోతాడు. ఆంజనేయులు సాయంతో రంగరాజు కుట్రను ఛేదించటంతో పోలీసులు రంగరాజును అరెస్ట్ చేస్తారు. అతని తల్లి శాంతకుమారి వచ్చి కొడుకును మందలించడంతో, అపార్థాలు తొలగి భార్యాభర్తలు తిరిగి ఏకమవుతారు. ఆ సన్నివేశంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో ఇంకా విజయ స్నేహితురాలు కల్పనగా విజయలలిత నటించారు.
తల్లిలేని కూతురిని గారాబంగా పెంచి ఆమె క్షేమం కోసం తపించే తండ్రి.. తెలివి, మంచితనం, ఆవేశం, కొంత మొండితనంతో గారాబంగా పెరిగిన యువతి.. తెలివి, సమర్ధత, ఓర్పుగల మధ్యతరగతి యువకుడు.. తమ సుఖం కోసం అమాయకులను వంచిస్తూ సంఘ విద్రోహ చర్యలు సాగించే దుష్టులూ.. వీరందరితో అల్లుకున్న తమాషా, సీరియస్, అపార్థ సన్నివేశాలతో కథ, అందుకు తగిన సంభాషణలను ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ ఆకట్టుకునేలా రాశారు. దర్శకులు వాటికి అనుగుణంగా సన్నివేశాలు రూపొందించి అద్భుతంగా చిత్రీకరించారు.
తొలుత హీరో రాజు తమాషాగా ఆడపిల్లలను ఆట పట్టించి ఆ కారణంగా ఉద్యోగం పోగొట్టుకోవటం, తిరిగి యజమాని కోరికపై ఉద్యోగం పొందటానికి ఆడిన తమాషా నాటకంలో కృష్ణ పరిణితితో నటించాడు. కోరిన యువతితో వివాహం జరగడంతో ఆనందం, తొలిరేయినాడే ఆమె అనుమానించినపుడు విచారం, నిజం నిరూపించటం కోసం భార్యకు దూరమైన వైనం, ఆవేశకావేషాలు, అవమానాలు సహించి నిజం వెల్లడించటం కోసం చేసే సాహసం.. ఇలా కృష్ణ నటన ఆకట్టుకుంటుంది. అలాగే హీరో హీరోయిన్లకు తగిన సన్నివేశాల్లో కృష్ణ, కాంచన భావయుక్తమైన, పరిపూర్ణతతో కూడిన నటనతో మెప్పించారు. అమాయకత్వంతో విలన్‌ని నమ్మి వచ్చి, అతని క్షేమం కోరే యువతిగా సంధ్యారాణి మంచి నటన ప్రదర్శించింది. రౌడీయే అయినా ఉప్పుతిన్న విశ్వాసానికి యజమానికి మాటరాకుండా, శిక్షపడకుండా చేయాలన్న నిబద్ధతగల రౌడీగా నెల్లూరి కాంతారావు తన నటనతో పాత్రోచితంగా సన్నివేశాలకు బలం చేకూర్చాడు. రంగరాజు తల్లిగా క్లైమాక్స్‌లో తనయుడిని మందలిస్తూ హెచ్చరించే సన్నివేశంలో శాంతకుమారి, రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా రావికొండలరావు, విజయ తండ్రి శ్రీనివాసరావుగా నాగభూషణం, కమల తల్లి రాంబాణమ్మగా సూర్యకాంతం, గరుడవాహనంగా అల్లు రామలింగయ్య పాత్రోచితమైన నటనను చూపారు.
చిత్ర గీతాలు: కాంచన, ఆమె స్నేహితురాళ్లను ఉడికిస్తూ హీరో కృష్ణ అల్లరిగా పాడే గీతం -చూడు తడాఖా కాదు మజాకే (రచన: ఆరుద్ర, గానం: ఘంటసాల, పి సుశీల) అవుట్‌డోర్‌లో షూట్ చేశారు. స్విమ్మింగ్‌పూల్ వద్ద కాంచన బృందంతో కృష్ణ పాడే మరో గీతం -చూపుల్లోనే కోపం’ (రచన: దాశరథి, గానం: ఘంటసాల). లేడీస్ క్లబ్‌లో విజయలలిత, కాంచన పాడే నృత్యగీతం -ఎంత వాళ్ళు, ఎంత వాళ్ళు ఈ మగవాళ్లు ఎంతకయినా చాలినోళ్లు (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, పి సుశీల). భార్యలు, మహిళల ఔన్నత్యం, గొప్పతనం తెలియచేస్తూ సాగుతుంది గీతం. మధ్యలో దీపావళి, సతీసావిత్రి, పాండవ వనవాసం, వీరాంజనేయ చిత్రాల్లోని స్టిల్స్ చూపిస్తూ సత్యభామ, సతీసావిత్రి, ద్రౌపది, సీత గురించి ఉదహరిస్తారు. ఆయా చిత్రాల్లోని స్టిల్స్ ఉపయోగించినందుకు సినిమా ప్రారంభంలో నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేయటం ఓ మంచి విషయం. పద్మనాభం, రమాప్రభలపై చిత్రీకరించిన గీతం -ఎందుకు ఈ బిగువులు/ ఏమిటి ఈ పరుగులు (గానం: పిఠాపురం, స్వర్ణలత). విజయలలిత, ప్రభాకర్‌రెడ్డిలపై చిత్రీకరించిన గీతం -రావోయి పొందవోయి ఈ రేయి (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి). ఈ చిత్రంలో అలరించే గీతం -అటు పానుపు ఇటునువ్వు (రచన: సినారె, గానం: ఘంటసాల, పి సుశీల). కృష్ణ, కాంచనల తొలిరేయి గీతంగా చిత్రీకరించిన ఈ గీతం నేటికీ నవ్యత నొలికించటం విశేషం. ‘వింతకాపురం’ ఓ చక్కని కుటుంబ కథాచిత్రంగా మన్ననపొందింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి