ఫ్లాష్ బ్యాక్ @ 50

నిండు సంసారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1920లో పాలకొల్లులో జన్మించారు పినిశెట్టి శ్రీరామమూర్తి. 1946లో ఆదర్శజ్యోతి నాటకం ద్వారా ప్రముఖుల ప్రశంసలు పొందారు. 1950లో వీరు రచించిన ‘పల్లెపడుచు’ నాటకం సంచలనం సృష్టించింది. ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి ప్రోత్సాహంతో రచయితగా సినీరంగంలోకి ప్రవేశించారు. అలా పినిశెట్టి రచించిన ‘పల్లెపడుచు’ నాటకాన్ని బోళ్ల సుబ్బారావు చలనచిత్రంగా రూపొందించారు. రాజూ- పేద, సంతానం, ఇలవేల్పు చిత్రాలతో గుర్తింపు సాధించిన పినిశెట్టి, ఆ తరువాత 50కి పైగా చిత్రాలకు రచన చేశారు. ఈయన మాటలు సమకూర్చిన చిత్రమే నవశక్తి ఫిలిమ్స్ రూపొందించిన ‘నిండు సంసారం’. 1968 డిసెంబర్ 5న విడుదలైంది.

కథ, స్క్రీన్‌ప్లే: నవశక్తి యూనిట్
కళ: సూరన్న
కూర్పు: ఎస్‌పి వీరప్ప
నృత్యం: చిన్ని, సంపత్
మాటలు: పినిశెట్టి
ఛాయాగ్రహణం: కె సత్యనారాయణ
స్టంట్స్: సాంబశివరావు అండ్ పార్టీ
సంగీతం: మాస్టర్ వేణు
దర్శకత్వం: సిఎస్ రావు
నిర్మాత: పి గంగాధరరావు

డిగ్రీ చదివిన నిరుద్యోగి భాస్కర్ (ఎన్టీ రామారావు). అతని తండ్రి బ్రహ్మయ్య (నాగయ్య) చూపులేనివాడు. అతని తల్లి సరస్వతమ్మ (హేమలత). అన్నా వదినలు రంగనాధం (ప్రభాకరరెడ్డి), తులసమ్మ (ఎస్ వరలక్ష్మి), వారి కుమారుడు శంకరం. భాస్కర్ చెల్లెలు శాంత (అనిత) కాలు అవిటిది. నిజం నిక్కచ్చిగా మాట్లాడే భాస్కర్ పలుచోట్ల ఉద్యోగాలు చేసి వాటిని వదులుకుంటాడు. అతని నిజాయితీ మెచ్చిన సుబ్బారాయుడు (జగ్గారావు), అతని చెల్లెలు సీత (డబ్బింగ్ జానకి) ఇంట్లో అతనికి ఓ డ్రైవర్ ఉద్యోగంతోపాటు ఆశ్రయం కల్పిస్తాడు. అన్న రంగనాథం మెతకతనం, వదిన తులసమ్మ గయ్యాళితనంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు, చెల్లెలిని భాస్కర్ తనతో తీసుకొచ్చి బ్రహ్మయ్య స్నేహితుడు సోమయ్య (రమణారెడ్డి) ఇంట్లో అద్దెకు దిగుతాడు. అనుకోకుండా పరిచయమైన ఆ ఊరి ధనవంతుడు, వ్యాపారి ఉమాకాంతరావు (రేలంగి) కుమార్తె జ్యోతి (కృష్ణకుమారి) భాస్కర్ మంచితనం గుర్తించి తన తండ్రి ఆఫీసులో లారీ డ్రైవర్‌గా ఉద్యోగం ఇప్పిస్తుంది. అన్న రంగనాథం అదే ఆఫీసులో మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తులసమ్మ తమ్ముడు, మోసగాడైన ఎస్ మయ్యా (పద్మనాభం) జ్యోతిని పెళ్లాడి, ఆస్తి కాజేయాలని పలు ప్రయత్నాలు చేస్తాడు. ఈక్రమంలో భాస్కర్‌పై దొంగతనం నేరంమోపి అతని ఉద్యోగం పోయేలా చేస్తాడు. ఉమాకాంతారావు అతని చెల్లెలు పెళ్లి ఆపటానికి బాకీకోసం సోమయ్య ఇంటిని స్వాధీనం చేసుకునే యత్నాలు చేయిస్తాడు. మయ్యా అంతకుముందే సీతను పెళ్లాడి వదిలేశాడని ఋజువవుతుంది. కారు రేసులో గెలిచి 10వేలు తెచ్చి సోమయ్య బాకీ తీర్చాలని భాస్కర్ ప్రయత్నిస్తాడు. అతన్ని చంపించటానికి తులశమ్మ రౌడీలను ప్రయోగిస్తుంది. నిజం తెలిసిన రంగనాథం భార్యను దండించి, భాస్కర్‌ను కాపాడే యత్నంలో గాయపడతాడు. చివరకు తులశమ్మలో పరివర్తన కలిగి జ్యోతి, భాస్కర్; శాంత, మోహన్ (జయకృష్ణ)కు వివాహాలు జరగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో జ్యోతి ఇంటి పనిమనిషి సుబ్బులుగా రమాప్రభ, ఆమెతోడుగా అప్పన్న (బాలకృష్ణ), భాస్కర్ తొలుత ఉద్యోగ ప్రయత్నాలు చేసిన రెడీమేడ్ కంపెనీలో రామచంద్రరావు భార్యగా జూ భానుమతి, మరోచోట ‘బొడ్డపాటి’ మరో షాపులో రామకోటి యజమానులుగా నటించారు.
నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఎక్కడా పని దొరక్కపోయినా, కష్టాల్లోనూ స్థిర నిశ్చయంతో తన పద్ధతి మార్చుకోని సగటు మధ్యతరగతి వ్యక్తిగా ఎన్టీ రామారావు తన అభినయంతో మెప్పించారు. ధనవంతురాలు, మంచి మనసుకల యువతి తనను ప్రేమించినా పరిధులు దాటని యువకునిగా, కుటుంబంపట్ల బాధ్యత, అన్నగారిపై అభిమానంతో మాటకు కట్టుబడడం, తండ్రి చివరి కోరిక తీర్చటానికి అన్న రంగనాథాన్ని బలవంతంగా తీసుకురావటం, తండ్రి మరణం వంటి సన్నివేశాల్లో నిండుతనం, కొన్నిసార్లు మొక్కవోని గంభీరత ప్రదర్శించి ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. యుగళ గీతంలో జ్యోతితో ‘నా కన్నులు నీతో కథ చెప్పాలి’, ‘నా మనసుకు వేరే పనులున్నాయి’ అంటూ చరణాన్ని ఎంతో సున్నితంగా ఆకట్టుకునేలా నటించి మెప్పించారు. ఎన్టీఆర్‌కు తగిన జోడీ అనిపించింది కృష్ణకుమారి. ప్రేమ, ఆప్యాయత, హుందాతనం, మంచితనం, తెలివి, చురుకుగల అమ్మాయిగా నిబద్ధతతో కూడిన లక్షణాలను ఈజ్‌తో ప్రదర్శించి మెప్పించారు. తొలి చిత్రమే అయినా అనిత తన పాత్ర పరిధిమేరకు మెచ్చుకోదగ్గ స్థాయి నటన చూపి ప్రేక్షకుల అభిమానం చూరగొంటే, మిగిలిన పాత్రధారులు పాత్రోచితంగా ఆకట్టుకున్నారు. గయ్యాళి వదినెగా ఎస్ వరలక్ష్మి ఆ దాష్టికతను తగినవిధంగా ప్రదర్శించటం, ప్రభాకర్‌రెడ్డి ఆమెకు తగిన భర్తగా కొంతసేపు, తండ్రి మరణించిన సమయంలో ఆయన చెప్పులు తనతో తెచ్చుకుని, దానికి కోపించిన భార్యపై ఆగ్రహించిన భర్తగా ఆకట్టుకున్నారు. తమ్మునిపై తన భార్య కుట్ర పన్నినందుకు తానే దానికి బలికావటానికి సిద్ధపడటం, భార్యను వదులుకోవటానికి సిద్ధపడే సన్నివేశాల్లో తనదైన ప్రత్యేకత చూపటం అలరిస్తుంది.
చిత్రంలోని సన్నివేశాలను, గీతాలను సమర్ధవంతంగా తీర్చిదిద్ది చక్కని కుటుంబ కథాచిత్రంగా రూపొందించిన దర్శకులు సిఎస్ రావు ప్రశంసనీయులు. చిత్రం ప్రారంభంలో కోడలు మామగారికి -కిరోసిన్ కలిపిన పాయసం ఇవ్వటం, తనవంతు టిఫిన్‌ను అనాధలకు పెట్టిన ఆడబడుచును బాధించటంలాంటి సన్నివేశాలతో కంటతడి పెట్టించారు. జ్యోతి వద్ద ఉంగరం తీసుకున్నందుకు అన్న భాస్కర్ మందలించగా, చెల్లెలు శాంత కుంటిదైనా గోడ కుర్చీవేయటం, తిరిగి తన పెళ్లి ఆగిపోగా శాంత ఆత్మహత్యకు ప్రయత్నించటం, గట్టు ఎక్కలేక నదిలో దూకలేకపోయానని అన్న భాస్కర్‌కు చెప్పటం, చెల్లెలుగా భావించే సీత కాపాడబడిందని భాస్కర్ ఆమెకు చెప్పటంలాంటి సన్నివేశాలు చిత్రానికి ఆయువుపట్టులా అనిపిస్తాయి. చివర భాస్కర్ కార్ రేసులో పాల్గొన్నంతసేపూ అతని తల్లి, చెల్లెలు దేవునిముందు నిలిచి ప్రార్థించటం, ఈ రెండు సన్నివేశాలు ఒకదానివెంట మరోటి సమాంతరంగా చూపిస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించారు.
మాస్టర్ వేణు సంగీతంతో అలరించిన చిత్ర గీతాలు చెప్పుకోదగ్గవి. చిత్రం ప్రారంభంలో ఎన్టీ రామారావుపై చిత్రీకరించిన ప్రభోదాత్మక గీతం -ఎవరికీ తలవంచకు/ వేరెవరినీ యాచించకు (గానం: ఘంటసాల, రచన: సినారె). గీతానికి తగ్గట్టుగా టైటిల్స్ పడుతుంటే, ఎన్టీఆర్ తన అభినయంతో అలరించారు. మరో సినారె రచనతో సాగే గీతం -వయసుతో పని ఏముంది మనసులోనే (గానం: పి సుశీల). విజయలలిత నృత్యంతో ఓ ఫంక్షన్‌లో చిత్రీకరణ సాగింది. ఎన్టీఆర్, కృష్ణకుమారిలపై సాగిన యుగళగీతం -ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే (గానం: పి సుశీల, ఘంటసాల, రచన: దాశరథి). వీరిదే మరో యుగళ గీతం -నా కన్నులు నీతో కథ చెప్పాలి (రచన: ఆరుద్ర, గానం: పి సుశీల, ఘంటసాల). మరో విషాద గీతం -దేవుడున్నాడా ఉంటే నిదురపోయాడా (గానం: పి సుశీల). పద్మనాభంపై చిత్రీకరించిన పద్యం -జోరుజోరుగా సాగు కారువే’. పద్మనాభంపై వరలక్ష్మి వద్ద సాగే గీతం -మైడియర్ తులసమ్మక్క/ లక్కీ ఛాన్స్ కొట్టేశా (గానం: పిఠాపురం). కృష్ణకుమారి, స్నేహితులపై చిత్రీకరించిన బృంద గీతం -యవ్వనమేకద అందం/ ఆ అందమే మధురానందం (గానం: పి సుశీల బృందం).
‘నిండు సంసారం’ చిత్రం విజయం సాధించింది. శత దినోత్సవాలు జరుపుకుంది. మహిళా ప్రేక్షకులనుంచి విశేష మన్ననలు అందుకుంది. ‘ఎవరికి తలవొంచకు’ ఓ ప్రబోధ గీతంగా, వ్యక్తిత్వ వికాస గీతంగా, చిరస్మరణీయ గీతంగా నిలవటాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాట వింటున్నపుడు ఇప్పటికీ రచయిత సి.నారాయణరెడ్డి, గాయకులు ఘంటసాల, నటుడు ఎన్టీ రామారావులు మనోఫలకంపై సాక్ష్కాత్కారమవుతారు. శ్రోతలను నేటికీ ఉత్తేజితులను చేస్తుండటం ఆనందించతగ్గ విషయం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి