ఫ్లాష్ బ్యాక్ @ 50

వరకట్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడు నందమూరి తారక రామారావుది కృష్ణా జిల్లా నిమ్మకూరు. గుంటూరులో పట్ట్భద్రులయ్యారు. మన దేశం చిత్రంతో నటునిగా ప్రస్థానం ప్రారంభించి శత చిత్రాలు పూర్తి చేసుకున్నాక దర్శకత్వంపై దృష్టిసారించి 1961లో సీతారామకల్యాణం, 1962లో గులేబకావళి కథ చిత్రాలకు సారథ్యం వహించారు (దర్శకుడిగా పేరు మాత్రం వేసుకోలేదు). దర్శకుడిగా పేరు వేసుకున్న తొలి చిత్రం ‘శ్రీకృష్ణపాండవీయం’ (1966). తరువాత 13 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. నిర్మాతగా ఎన్‌ఏటి సంస్థపై కొన్ని చిత్రాలు రూపొందించారు. కుమారుడు ‘రామకృష్ణ’ మృతి చెందిన తరువాత అతని పేరు కలిపి ‘రామకృష్ణ ఎన్‌ఏటి’ నిర్మాణ సంస్థపై చిత్రాలు నిర్మించారు. శ్రీకృష్ణపాండవీయం, ఉమ్మడి కుటుంబం తరువాత 1969లో శ్రీ రామకృష్ణ ఎన్‌ఏటి బ్యానర్‌పై నిర్మించిన చిత్రం వరకట్నం. శ్రీ రామకృష్ణా సినీ స్టూడియోస్‌పై 1969 జనవరి 10న ఈ చిత్రం విడుదలైంది.

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌టి రామారావు
సంగీతం: టివి రాజు
నృత్యం: వెంపటి సత్యం
కూర్పు: జిడి జోషి
స్టంట్స్: సాంబశివరావు
కళ: ఎస్ కృష్ణారావు
కెమెరా: రవికాంత్ నగాయిచ్
మాటలు: మద్దిపట్ల సూరి, సముద్రాల (జూ)
నిర్మాత: టి త్రివిక్రమరావు

వరకట్నం -రెండు గ్రామాలకు చెందిన కథ. మీసాల సుబ్బయ్య ఓ గ్రామానికి మోతుబరి రైతు (నాగభూషణం). కొడుకు దేవసింహ (ఎన్‌టి రామారావు), భార్య కాంతమ్మ (హేమలత). పక్క గ్రామానికి చెందిన మరో మోతుబరి భద్రయ్య (మిక్కిలినేని). అతని కొడుకు బలరామయ్య (సత్యనారాయణ), కోడలు సుభద్ర (సావిత్రి), కుమార్తె సుజాత (కృష్ణకుమారి). సుబ్బయ్య కుమారునికి భద్రయ్య కుమార్తెకు వివాహం నిశ్చయమవుతుంది. పెళ్లిలో సుబ్బయ్య గ్రామానికి చెందిన పేచీకోరు అచ్చయ్య (అల్లు రామలింగయ్య) తెచ్చిన మాట పట్టింపుతో దేవసింహ సుజాతకు తాళి కట్టకుండా వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అదే గ్రామంలో శ్రీరాములు (పెరుమాళ్లు) సాధారణ రైతు. అతని కూతురు లక్ష్మి (చంద్రకళ). చుక్కమ్మ- రంగయ్య (రేలంగి)ల కుమారుడు దేవయ్య (పద్మనాభం). దేవయ్య -లక్ష్మి పెళ్లిలోనూ కట్నం కారణంగా గొడవలు తలెత్తుతాయి. అయినా లక్ష్మికి దేవయ్య తాళికట్టడంలో, అత్తింటివారు ఆమెను తమతో తీసుకెళ్తారు. కట్నం పేచీ నేపథ్యంలో కొడుకు దేవయ్యను లక్ష్మి కలవకుండా చుక్కమ్మ వేధింపులకు గురి చేస్తుంటుంది. కట్నం కోసం ఆమెపైన, ఆమె తండ్రిపైన నిందలు వేయటంతో లక్ష్మి, శ్రీరాములు ఇబ్బందులు పడుతుంటారు. లక్ష్మి అన్న సుబ్బన్న (ప్రభాకర్‌రెడ్డి) వేలుకు దెబ్బ తగలడం వలన చెల్లెలి కోసం ఆరాట పడుతుంటాడు. ఈ క్రమంలో తండ్రి ఆంక్షలు పెట్టినా దేవసింహ మాత్రం సుజాతే తన భార్య అని నిశ్చయించుకుంటాడు. తల్లి దీవెన తీసుకుని, సుజాతను ఆమె వదిన సుభద్ర సాయంతో కలుసుకుంటాడు. ఆమెకు తాళికట్టి భార్యగా స్వీకరిస్తాడు. బలరామయ్య తన మిత్రుడు మల్లయ్యదొర (రాజనాల)తో తిరిగి, సుజాతకు పెళ్లిచేయ నిశ్చయించటం, దేవసింహ మల్లయ్యదొర గొడవ పడటం, బలరామయ్య వలన దేవసింహ గాయపడటం, మనసు చెదిరిన సుజాత ఆత్మహత్య ప్రయత్నం చేసి మామగారింటికి చేరటం, వారంతా తిరిగి సుజాత ఇంటికి వచ్చి భద్రయ్య, బలరామయ్యతో కలిసి దేవసింహ, సుజాతలను ఆశీర్వదించటం, దేవయ్య తన తల్లితో నాటకమాడి బుద్ధివచ్చేట్టుచేసి, లక్ష్మిని, తండ్రిని కలపటం, ఈ రెండు జంటలు ఒకచోట ఆనందంగా నిలవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
‘అత్తా ఒకింటి కోడలే’, ‘ఆడ పెత్తనం’ వంటి పాత చిత్రాలు, మరికొన్ని చిత్రాల్లో అత్తలు కోడళ్లను ఆరడిపెట్టడం, కట్నం కోసం పెళ్లిళ్లు ఆగిపోవటం వంటి పలు అంశాలు దృష్టిలో వుంచుకొని ఈ చిత్రకథను మరికొంత వైవిధ్యంగా రూపొందించారు. దానికితగ్గట్టుగా సన్నివేశాలు చిత్రీకరించి చిత్రానికి ఓ ప్రత్యేకత కలిగించారు ఎన్‌టి రామారావు.
తొలుత చిత్రంలో మేజువాణి దృశ్యాలు, పాటలు వివరంగా చూపటం, ఆ ఆడంబరం చూసిన పేచీకోరు అచ్చయ్య మాటలువిని, ఇరువురు పెద్దలు పెళ్లిని నిలుపుదల చేయించటం, దానిలో భాగంగానే బంగారం పరీక్ష చేయించటం, మరోచోట దేవయ్య భార్య లక్ష్మితో సరసాలు, తల్లి ఆమెను శిక్షించటం, మామగారు వౌనంగా వుండటం, అత్తగారి ఆరళ్లు తీవ్రంగా చూపటం, ఇక ఎన్‌టిఆర్ తన భార్య అనుకున్న సుజాతను కలవటానికి ముసుగులో వెళ్లి దెబ్బలు తినటం, మరోసారి వూరు చివర భార్యను, ఆమె వదినను కలిసి తన నిశ్చయం వెల్లడించి వారింటికి వెళ్లి సుజాత మెడలో తాళికట్టడం, సుజాతను చాటుగా కలుసుకుంటున్న దేవసింహతో సుభద్ర, చాటుమాటు రాకపోకలవలన కలిగే నష్టాలు చూచాయగా, సున్నితంగా వెల్లడించటంలాంటి సన్నివేశాలను ఎంతో పరిపక్వతతో చిత్రీకరించారు. తన భర్తకు జరిగిన అవమానానికి సున్నిత హృదయంగల సుజాత ఆత్మహత్యకు పాల్పడటం, మరోచోట చంద్రకళ డబ్బులేని కారణంగా పుట్టింటి ఆదరణ పొందలేకపోవటం వంటి సాధారణ విషయాలను దర్శకుడు పట్టుతో నడిపించటం కనిపిస్తుంది. రాజనాలతో ఎన్టీఆర్ ఎడ్లబండిని వేగంగా నడిపి అతన్ని ఢీకొట్టడం, నది ఒడ్డున వారిద్దరి మధ్య కర్ర యుద్ధం, సుజాత గదిలో వారిద్దరి మధ్య వట్టి చేతులతో సాగిన పోరాటాలను ఎంతో విపులంగా ఉత్సుకత కలిగించేలా చిత్రీకరించారు. ఇక క్లైమాక్స్‌లోనూ ఎంతో సున్నితంగా పెద్దలమధ్య రాజీ మాటలు, అంతకుముందు రెండు వైపులా నౌకర్లు ఒకరినొకరు కర్రలతో తీవ్రంగా కొట్టుకోవటం ద్వారా సన్నివేశానికి బలం చేకూర్చటంలాంటి సన్నివేశాలను దర్శకునిగా, నిర్మాతగా యన్‌టి రామారావు చక్కని విశే్లషణతో వీటిని రూపొందించి ఆకట్టుకున్నారు.
చూడచక్కని చిరునవ్వు, కొంత చిలిపిదనం, ఒకింత గాంభీర్యం, తక్కువ మాటలు ఎక్కువ భావ ప్రకటనతో దేవసింహ పాత్రలో యన్‌టి రామారావు సంయమనంతో కూడిన నటన ప్రదర్శించారు. సుభద్రగా సావిత్రి సమర్ధవంతురాలైన ఇల్లాలిగా, కోడలిగా, అక్కగా పొందికైన నటనను ప్రదర్శించారు. సత్యనారాయణ, మిక్కిలినేని, ఎన్‌టిఆర్‌లతో, మరదలుతో చిలిపితనం.. ఇలా పలు భావాలను ఈజ్‌తో ప్రదర్శించిన అద్భుతమైన నటనను చూపారు. అమాయకత్వం, పెద్దల మాటను ఎదిరించలేని నిస్సహాయత, కావాలనుకున్న భర్తపట్ల అనురాగం, ప్రేమ, అత్తమామల పట్ల గౌరవం, ఇలా కృష్ణకుమారి సుజాతగా సున్నితమైన భావాలతో కూడిన నటనతో అలరించింది. అటు లక్ష్మిగా చంద్రకళ పాత్రోచితమైన భావాలను నిండైన నటనలో చూపగా, మిగిలిన పాత్రధారులంతా తమ పాత్రలను అంతే ఈజ్‌తో పోషించి మెప్పించారు. రాజనాల సహాయకునిగా రావికొండలరావు పాత్ర ప్రాధాన్యతబట్టి మధ్యలో పద్యాలు, సూక్తులను వల్లిస్తూ ప్రత్యేకత చూపించారు. ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణ తమ పాత్రోచితమైన నటనను అలవోకగా ప్రదర్శించి చిత్రాన్ని రక్తికట్టించారు.
చిత్ర గీతాలు:
సి నారాయణరెడ్డి రచనతో ఘంటసాల, పి సుశీల ఆలాపనతో యన్‌టిఆర్, కృష్ణకుమారిలపై చిత్రీకరించిన రసవత్తర యుగళ గీతం -అడుగు అడుగులో మదమరాళములతో.. మొదలై, ఎన్నాళ్ళకు నా నోము పండింది’ అంటూ సాగుతుంది. వరకట్న దురాచారంపై మరో గీతం -ఇదేనా మన సంప్రదాయమిదేనా (రచన: సినారె, గానం: ఘంటసాల). సావిత్రి, కృష్ణకుమారిపై సాగే తమాషా గీతం -మరదల మరదల తమ్ముని పెండ్లమా (రచన: సినారె, గానం: పి సుశీల, జిక్కి). ఈ చిత్రంలో కొసరాజు రచించిన గీతాలు నాగుల చవితి గీతం -పుట్టలోని నాగన్నా లేచి రావయ్యా (గానం: పి సుశీల, జిక్కి). చంద్రకళ, పద్మనాభంలపై గీతం -గిలకల మంచం ఉంది, చిలకల పందిరి (గానం: కె జమునారాణి, పిఠాపురం). వారిరువురిపై మరో గీతం -మల్లెపూల పందిట్లోనా (బి గోపాలం, జమునారాణి). రావి కొండలరావుపై చిత్రీకరించిన రెండు పద్యాలు -్భగవతి అమృతమాతగా, ధరసింహాసనమై నభంబు (గానం: మాధవపెద్ది). రాజనాలపై చిత్రీకరించిన ఎడ్లబండి పాట -సైసై జోడెడ్లబండి షోకైన దొరలబండి (గానం: ఘంటసాల, మాధవపెద్ది). రావికొండలరావు, రేలంగిపై చిత్రీకరించిన తత్వగీతం -ఎవరు చేసిన కర్మ (గానం: మాధవపెద్ది). ఇల్లువాకిలిరోసె ఈ తీరున (గానం: మాధవపెద్ది). మేజువాణితో పాట -ఎందుకే తొందర సుందరాకారా (పి సుశీల, తిలకం).
‘వరకట్నం’ చిత్రం ప్రజాభిమానంతోపాటు విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ‘బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ ఇన్ తెలుగు’గా నేషనల్ ఫిలిమ్ అవార్డ్ పొందింది. కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా, దర్శకునిగా యన్‌టి రామారావుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అంతేకాదు, తల్లా పెళ్లామా? కోడలుదిద్దిన కాపురం వంటి మహిళా కోణంలోని చిత్రాలు రూపొందించి విజయం సాధించేందుకు వరకట్నం ఆలవాలమైంది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి