ఫ్లాష్ బ్యాక్ @ 50

అప్పుచేసి పప్పుకూడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి సోదరుడు బి నాగిరెడ్డి. వీరు 1912 డిసెంబరు 2న పొట్టిపాడులో జన్మించారు. చక్రపాణి అసలు పేరు ఆలూరి వెంకట సుబ్బారావు. 1908లో తెనాలిలో జన్మించారు. రచయితగా చక్రపాణిగా ప్రాచుర్యం పొందారు. 1944లో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. నాగిరెడ్డి వీరి భాగస్వామ్యంతో వాహిని స్టూడియోను లీజుకు తీసికొని విజయా ప్రొడక్షన్స్ స్థాపించి చక్రపాణి కథతో తొలి చిత్రం ‘షావుకారు’ నిర్మించారు. ‘పాతాళభైరవి’ పరంపరలో వీరు 1957లో మాయాబజార్ తరువాత (తెలుగు, తమిళ, కన్నడం) 1959లో రూపొందించిన సాంఘిక చిత్రం -అప్పుచేసి పప్పుకూడు. 1959 జనవరి 14న విడుదలై 60ఏళ్లు పూర్తి చేసుకుంది.
‘గృహప్రవేశం’తో దర్శకత్వం మొదలుపెట్టి, నటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేతగా తెలుగు, హిందీ చిత్ర రంగాల్లో విజయాలు సాధించిన లక్ష్మీవరప్రసాదరావు (యల్‌వి ప్రసాద్) విజయావారి ‘షావుకారు’, ‘పెళ్లిచేసి చూడు’, ‘మిస్సమ్మ’, ‘అప్పుచేసి పప్పుకూడు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాల తమిళ వర్షన్‌కూ వీరే దర్శకత్వం వహించటం ఓ విశేషం కాగా, ‘కళాప్రపూర్ణ’ రఘుపతి వెంకయ్య అవార్డు, భారత ప్రభుత్వ పురస్కారం, దాదా ఫాల్కేవంటి అవార్డు పొందిన కళాకారునిగానేకాక, యల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణం వీరిని చిరస్మరణీయం చేసింది.
కథ: చక్రపాణి, యల్‌వి ప్రసాద్, వెంపటి సదాశివబ్రహ్మం; మాటలు: సదాశివబ్రహ్మం; పాటలు: పింగళి నాగేంద్రరావు; సంగీతం: ఎస్ రాజేశ్వరరావు; కళ: గోఖలే- కళాధర్; ఫొటోగ్రఫీ: మార్కస్ బారెట్లే; ఎడిటింగ్: కల్యాణ సుందరం, కె రాధాకృష్ణ; నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి; దర్శకత్వం: యల్‌వి ప్రసాద్; నిర్మాతలు: నాగిరెడ్డి, చక్రపాణి.
ఈ చిత్రంతోపాటే తమిళం చిత్రం ‘కదన్ వాంగి కల్యాణం’ మొదలుపెట్టి 1958 సెప్టెంబర్ 17న విడుదల చేశారు. ఆ చిత్రంలో రాజాగా జెమిని గణేశన్ (ఎన్టీఆర్ వేషం), జగ్గయ్య పాత్రలో టిఆర్ రామచంద్రన్, రేలంగి పాత్రలో తంగవేలు, గిరిజ పాత్రలో ఇవి సరోజ నటించారు. యస్వీ రంగారావు తమిళంలోనూ ముకుందరావుగా నటించగా, సిఎస్సాఆర్ పాత్రలో టిఎస్ బాలయ్య, ఆర్ నాగేశ్వరరావు రౌడీ రాంసింగ్ పాత్రనూ పోషించారు. తమిళ చిత్రానికి మాటలు, పాటలు తాంజై ఎన్ రామదాసు సమకూర్చారు. విజయావారే రెండు చిత్రాలూ ఏకకాలంలో రూపొందించి ముందుగా తమిళ చిత్రం, తరువాత జనవరి 14, 1959లో తెలుగు చిత్రాన్నీ విడుదల చేశారు. తమిళం, తెలుగులోనూ సావిత్రి, జమునలే వాళ్ల పాత్రలు పోషించారు.
దివాన్ బహద్దూర్ ముకుందరావు (యస్వీ రంగారావు) లక్షాధికారి. అతని మనుమరాలు మంజరి (సావిత్రి). ఆమెను జమిందారుకో, ఏ రాజావారికో, ఉన్నత కుటుంబ వ్యక్తికో ఇచ్చి వివాహం చేయాలనే కోరికతో ఉంటాడు ముకుందరావు. దురాశాపరుడు, సంఘంలో గొప్పగా బతకాలనే ఆశతో అప్పులుచేసి అయినా దర్జా చూపాలనుకునే వ్యక్తి రామదాసు (సీఎస్సాఆర్). అతని కుమారుడు రఘు (జగ్గయ్య) ఇంగ్లండులో డాక్టరీ చదివాడు. అతనికి రాజా (యన్టీ రామారావు) చెల్లెలు లీల (జమున)తో చిన్నతనంలోనే వివాహం జరిగింది. జాతీయోద్యమంలో రాజా జైలుకెళ్లడంతో, రామదాసు వారింటిని ఆక్రమించుకుంటాడు. లీలను ఇంటినుంచి వెళ్లగొట్టి, ఆమె చనిపోయిందని రఘుకు చెబుతాడు. అతనికి డబ్బున్న మరో అమ్మాయితో వివాహం చేయాలనుకుంటాడు. రామదాసుకు రావుబహద్దూర్ బిరుదు వచ్చిన సందర్భంలో, మంజరిని రఘుకు ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని ముకుందరావు మనసులో ఆశిస్తాడు. కాని, మంజరి, రాజాను ప్రేమించటంచేత లీలను కాపాడుతుంది. రాజా వచ్చి రామదాసును హెచ్చరిస్తాడు. కట్నం కోసం బాధించారని కేసు పెడతానని, పేపర్లో వేయిస్తానని, తన చెల్లెలు లీలను ఇంట్లో ఉంచుకొమ్మని బెదిరిస్తాడు. దానికి భయపడిన రామదాసు, పనిమనిషిగా, మూగదానిగా అయితేనే ఇంట్లో ఉంచుకుంటానని చెప్పగా లీల అంగీకరించటంతో రాజా ఆమెను వదిలివెళ్తాడు.
భజగోవిందం (రేలంగి) మేనమామ రామలింగం (రమణారెడ్డి) ఆటలుకట్టించి, అతని కూతురు ఉష (గిరిజ)తో భజగోవిందానికి వివాహం నిశ్చయింపచేస్తాడు. పనిమనిషి తన భార్య లీలేనని గ్రహించిన రఘు, రాజాకు సాయపడతాడు. చివరకు అంతాకలిసి ‘రామదాసు’కు బుద్ధివచ్చేలా చేస్తారు. జరిగినదంతా గ్రహించిన ముకుందరావు పేదవాడైనా రాజాకే తన మనుమరాలిని ఇచ్చి వివాహం చేస్తాననటంతో -రామదాసే రాజా, మంజరిల చేతులు కలపుతాడు. కథ శుభంగా ముగుస్తుంది. రామదాసు తండ్రిగా ముక్కామల, రమణారెడ్డి భార్యగా సూర్యకాంతం, ఉష పెళ్లి చూపులకు వచ్చిన వరులుగా పద్మనాభం, మరో హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న పొట్టిప్రసాద్, రేలంగి నాటక సమాజం సభ్యులుగా శివరావ్, నల్లరామ్మూర్తి, వడ్డీ వ్యాపారిగా అల్లు రామలింగయ్య, ముకుందరావు నౌకరు అవతారంగా బాలకృష్ణ నటించారు.
ఆల్ టైమ్ హిట్ సాధించిన నవరస భరిత పౌరాణిక చిత్రం మాయాబజార్ (1957) రూపొందించిన తరువాత విజయావారు నిర్మించిన హాస్యరస ప్రధాన చిత్రం -అప్పుచేసి పప్పుకూడు. సంఘంలో ఫాల్స్ ప్రెస్టేజీతో బ్రతికేవారికి కనువిప్పు కలిగేలా దర్శకుడు యల్‌వి ప్రసాద్ చిత్రాన్ని తీర్చిదిద్దారు. తొలుత చిత్రాన్ని ఘంటసాల గానంలో సాగే అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గీతంపై ప్రారంభించారు. పాటపై -వన్ రూపీ కాయిన్ చూపుతూ టైటిల్స్ చిత్రీకరించటంతో మొదలుపెట్టి వేలిముద్రలు, సంతకాలుపెట్టి అప్పు తీసుకోవడం, కోర్టుకు వెళితే ఐపీ పెట్టమన్న సలహాతో పాట ముగించారు.
ఇంగ్లండు నుంచి వచ్చిన రఘు మంజరికి హ్యాండ్‌షేక్ ఇచ్చి చెంప తట్టాడని తెలిసిన రాజా చిన్నబోవటం, పాలుతెచ్చిన నౌకరు బాలకృష్ణ చెంప తట్టడం, అది గమనించిన మంజరి నవ్వుకోవటం, రాజా -మంజరి ఒకరికొకరు ఎదురుగా బాల్కనిలో దూరంగా నిలబడి ఆలపించే యుగళగీతం (ఎచటినుంచి వీచెనో)లో ప్రకృతి రమణీయత, విజయావారి చంద్రుని వెనె్నల ప్రకాశంలాంటి దృశ్యాలు దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారు.
చిత్రంలో మరో విశేషం -చిత్రమైన ఫైటు సీన్లు. రాంసింగ్ (ఆర్ నాగేశ్వరరావు మెడమీద రాజా ఒకనొక్కు నొక్కి, వీపుపై దెబ్బవేయటం (ఇదే చిత్రంలో రెండుసార్లు రిపీట్ అవుతుంది) ‘అదే దెబ్బ, అదే పట్టు’ అన్న మ్యానరిజం డైలాగ్ అద్భుతంగా ఉంటాయి. చక్కని నృత్యనాటిక ‘ఆత్మత్యాగం’ గేవా కలర్‌లో చూపటం (రాజుగా మిక్కిలినేని, నర్తకి ఇవి సరోజ నృత్యంతో అలరించేలా సాగుతుంది), రాజా ఊహలో నల దమయంతుల ప్రణయం, వివాహం (నలునిగా ఎన్టీఆర్, దమయంతిగా సావిత్రి, ఇంద్రుడిగా జగ్గయ్యను చూపటం) అలరించే సన్నివేశాలలో చిత్రంలో యుక్తమైన పాటలు, మాటలు, సంగీతంతో ఆకట్టుకునేలా రూపొందించారు. యల్‌వి ప్రసాద్ మార్కు సన్నివేశాలతో సస్పెన్స్ ప్రేక్షకుడికి అర్ధంకావటం (మారిన వేషాలు ప్రేక్షకుడికి తెలియటం)తో ఓ చక్కని అనుభూతి కలిగి వీక్షకులు ఆనందించటం ఓ విశేషాంశం. నటీనటులంతా పాత్రోచితంగా, సహజంగా సన్నివేశానుగుణమైన నటనతో మెప్పించారు.
చిత్ర గీతాలు: రాజా జైలునించి విడుదలైన ఆనందంతో తన భావాలను, చెలి ఉషతో మంజరి పంచుకునే గీతం (సావిత్రి పాటకు తగిన భావప్రకటనను కంటిచూపుతో అద్భుతంగా ప్రదర్శిస్తే, తగిన నృత్యాభినయాన్ని ముచ్చటగా గిరిజ చేస్తుంది) -కాలంకాని కాలంలో’ (గానం: లీల, సుశీల). ఇంట్లో దేవునిముందు లీల (జమున) పాడే భక్తిగీతం (నౌకరు చంచయ్య (చదలవాడ) రామదాసులపై రియాక్షన్) -రామరామశరణం భద్రాద్రి రామ (గానం: లీల). జగ్గయ్య, జమునలపై గీతాలు -మూగవైన నేమిలే’ (గానం: ఎఎం రాజా), మరోగీతం -చిన్నారి చూపులకు ఓ చందమామా’ (గానం: ఎఎం రాజా). వీరువురూ ఆడుతూపాడుతూ పాడే గీతం -చేయి చేయి కలుపరావే హాయి (గానం: ఎఎం రాజా, సుశీల). రేలంగి, గిరిజలపై గీతాలు -ఓ మరదలా నా మదిలో (గానం: ఘంటసాల, స్వర్ణలత), మరో గీతం -కాశీకి పోయాను రామాహరే (గానం: ఘంటసాల, స్వర్ణలత). మిస్సమ్మ చిత్రంలోని ‘బృందావనమది’ పాట స్వరాల్లో బాణీకట్టిన గీతం (ఎన్టీఆర్, సావిత్రి, జగ్గయ్యలపై ముచ్చటగా చిత్రీకరించారు) -సుందరాంగులను చూచిన వేళల (గానం: ఘంటసాల, ఎఎం రాజా, లీల). ఎన్టీఆర్, సావిత్రి, యస్వీ రంగారావులపై తోటలో (ఎన్టీఆర్ సాధువు వేషంలో) చిత్రీకరించిన గీతం -ఆనందం, పరమానందం (గానం: ఘంటసాల, లీల). ఎన్టీఆర్‌పై పద్యం -కప్పను బట్టిన పామును (గానం: ఘంటసాల), రేలంగికి ఘంటసాల గానంతో -నవ కళాసమితిలో. ఇది మాయాబజార్‌లోని ‘అష్టదిక్కుంచి కుంభాగ్రాల’ గుర్తుకుతెస్తుంది.
అప్పుచేసి బ్రతకటంలోని నీతి, నష్టాలు, సాధుసన్యాసుల అనుగ్రహం కోసం ప్రాకులాడేవారికి సందేశంగా రూపొందిన చిత్రం సంక్రాంతి కానుకగా 60ఏళ్ల కిందట విడుదలై మొదటి నాలుగు వారాలు అంత లాభం సాధించకపోయినా, తరువాత విజృంభించి లాభాలబాట పట్టడం, తరువాత రిపీటెడ్ రన్స్‌లో మరింత పేరు సాధించటం, విజయవారి, విజయపరంపరకు దోహదపడటం విశేషం. చిత్ర గీతాలు, చిత్రం నేటికీ హాస్యప్రియులను, సంగీతాభిమానులను మరింతగా రంజింపచేయటం, సందేశాత్మకంగా నిలవటం మరింత మెచ్చదగ్గ అంశం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి