ఫ్లాష్ బ్యాక్ @ 50

భలే అబ్బాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన తోట సుబ్బారావు తొలుత బస్ సర్వీసులు నడిపేవారు. తరువాత చిత్రరంగంలోకి ప్రవేశించి నిర్మాతగా ‘దొంగను పట్టిన దొంగ’ డబ్బింగ్ చిత్రం తీశారు. శ్రీదేవి కంబైన్స్ పతాకంపై 1966లో ‘పరమానందయ్య శిష్యులకథ’, ‘67లో భువనసుందరి కథ, ‘68లో చుట్టిరికాలు సినిమాలు తీశారు. ఆక్రమంలో 1969లో వీరు నిర్మించిన చిత్రమే -భలే అబ్బాయిలు. ఈ చిత్రానికి పేకేటి శివరామ్ దర్శకులు.
1918 అక్టోబరు 8న పేకేరులో జన్మించారు పేకేటి శివరామ్. 1937లో మద్రాస్ వెళ్లి కొంతకాలం కెమెరా డిపార్ట్‌మెంటులో, 1945లో హెచ్‌ఎంవి గ్రామ్‌ఫోన్ రికార్డు సంస్థలో ఇన్‌ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలో ఘంటసాలతో లలిత గీతాలు పాడించి ప్రైవేట్ రికార్డు చేశారు. ప్రతిభా, వినోద నిర్మాణ సంస్థల్లో ప్రొడక్షన్ వ్యవహారాలు నిర్వహించే రోజుల్లో ‘శాంతి’ (1952) చిత్రంలో నటి సావిత్రి సరసన హాస్య నటుడిగా చిత్రరంగంలో ప్రవేశించి, 1953లో దేవదాసులో భగవాన్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. అప్పటినుంచి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో హాస్య నటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 100కు పైగా చిత్రాల్లో నటించారు. మద్రాసులో ఒకవిందులో మిత్రునితో సాగించిన సినీరంగం, నిర్మాణ కార్యక్రమాల విశే్లషణ వీరిని కన్నడ చిత్ర రంగానికి దర్శకునిగా, ‘చక్రతీర్థ’ కన్నడ నవల చిత్రరూపానికి సారథిని చేసింది. ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. తరువాత వీరు 1971 కన్నడంలో రూపొందించిన ‘కుల గౌరవం’ చిత్రం (రాజ్‌కుమార్, భారతి, జయంతిలతో), దాన్ని తెలుగులో యన్‌టిఆర్‌తో 1972లో నిర్మించిన కులగౌరవం చిత్రానికి వీరే దర్శకులు (రాజ్‌కుమార్, యన్‌టి రామారావు మూడు పాత్రలు పోషించారు) కావటం విశేషం. శ్రీదేవి కంబైన్స్ 1968లో నిర్మించిన చుట్టరికాలు తరువాత, 1969లో అదే సంస్థ నిర్మించిన ‘భలే అబ్బాయిలు’కు దర్శకత్వం వహించారు.
‘భలే అబ్బాయిలు’ చిత్రానికి 1965లో వచ్చిన ‘వక్త్’ హిందీ చిత్రం మూలం. ఈ చిత్ర కథారచయిత ఇందిరా ఆనంద్ తొలుత రాజ్‌కపూర్ సోదరులు ముగ్గురూ ఈ పాత్రలు పోషిస్తే బాగుంటుందని రాజ్‌కపూర్‌కి కథను చెప్పటం, వారికి నచ్చటం జరిగింది. కాని కొంత తాత్సారం కావటంతో నిర్మాత బిఆర్ చోప్రాకు ఈ ప్రాజెక్టు గురించి రచయిత వివరించారు. దానికి చోప్రా అంగీకరించి ‘వక్త్’గా యష్ చోప్రా దర్శకత్వంలో రాజ్‌కుమార్, సునీల్‌దత్, శశికపూర్ కాంబినేషన్‌లో నిర్మించారు. రచయిత ఆశించినట్టు శశికపూర్ పాత్ర వారే పోషించగా, సాధన, బలరాజ్ సహాని, మదన్‌పురి, రెహమాన్, అచలాసహదేవ్, షర్మిలా టాగోర్ ఇతర పాత్రలు పోషించారు. సంగీతం రవి సమకూర్చారు. ఈ చిత్రం గీతాలపరంగా హిట్‌కావటం, కథా సన్నివేశపరంగా బాక్సాఫీస్ హిట్ సాధించిన టాప్ టెన్ చిత్రాల్లో ఒకటిగా నిలవటం విశేషం.
భలే అబ్బాయిలు చిత్రానికి మాటలు: పినిశెట్టి, సంగీతం: ఘంటసాల, సంగీత సహాయకులు: జెవి రాఘవులు, కళ: వాలి, కూర్పు: బి గోపాలరావు, నృత్యం: జయరాం, స్టంట్స్: భానుప్రసాద్, కెమెరా: చిట్టిబాబు, దర్శకత్వం: పేకేటి శివరామ్, నిర్మాత: తోట సుబ్బారావు
సామాన్య మిల్లు కూలి స్థాయినుంచి లక్షాధికారిగా ఎదిగిన వ్యక్తి కోటేశ్వరరావు(గుమ్మడి). అతని భార్య లక్ష్మి (పండరీబాయి). వారికి ముగ్గురు పిల్లలు బాబ్జీ, చిన్న, బుజ్జి. ముగ్గురూ ఒకే తేదీ ఒకే నెలలో జన్మించారు. ఆ ముగ్గురి పుట్టినరోజు వేడుకలు ఆనందంగా జరుపుకుంటారు. అయితే, ఆ రోజు రాత్రి సంభవించిన భూకంపం కారణంగా కుటుంబం చెల్లాచెదురవుతుంది. బాబ్జి ఓ అనాథ శరణాలయం చేరి వార్డెన్ (అల్లు రామలింగయ్య)ను ఎదిరించి దెబ్బలు తిని అక్కడనుంచి పారిపోతాడు. బుజ్జి తల్లివద్దనే ఉండిపోతాడు. ధనవంతులైన, పిల్లలు లేని రేలంగి, ఛాయాదేవి దంపతులకు చిన్న లభించి, వారి కుమారుడు రవి (కృష్ణ)గా ఎదిగి లాయర్ అవుతాడు. భార్యా పిల్లల కోసం వెతుకుతూ వచ్చిన కోటయ్య, అనాథ శరణాలయం చేరిన బాబ్జి, వార్డెన్ కారణంగా పారిపోయాడని తెలిసుకుని అతన్ని అంతం చేయటంతో పోలీసులు కోటయ్యను అరెస్ట్ చేసి జైలులో పెడతారు. రవిని పెంచుకుంటున్న రేలంగి, ఛాయాదేవి దంపతులకు ఆ తరువాత కుమార్తె రాధ (గీతాంజలి) జన్మిస్తుంది. పారిపోయిన బాబ్జి (రాజా) కృష్ణంరాజుగా, అక్రమ వ్యాపారాలు చేసే ప్రతాప్ (సత్యనారాయణ) వద్ద పెరుగుతాడు. సంఘంలో పెద్దమనిషి రాజాగా వ్యవహరిస్తుంటాడు. జడ్జి మాధవరావు, టిజి కమలాదేవిల కుమార్తె మీనా (కెఆర్ విజయ)ను ప్రేమిస్తాడు. రవి, మీనా అంతకుముందే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. తల్లి లక్ష్మివద్ద పెరిగిన రామూ (రాంమ్మోహన్) బిఏ పూర్తి చేస్తాడు. రాధ, రామూను ప్రేమిస్తుంది. తల్లికి క్యాన్సర్ వల్ల రామూ హైద్రాబాద్ వచ్చి ప్రతాప్‌వద్ద డ్రైవర్‌గా చేరతాడు. మీనాను ప్రేమించిన రాజా, రవిని అంతం చేయాలని వెళ్లి అక్కడ రవి చిన్నప్పటి ఫొటోచూసి అతడు తన తమ్ముడని గ్రహించి, రవి, మీనాలకు పెళ్లి జరగాలని ఆశిస్తాడు. రాధ, రాముల ప్రేమను తిరస్కరించిన రవిని, నువ్వు అనాథవని నిందించటంతో రవి ఇల్లువదిలి వెళ్తాడు. ప్రతాప్ సాయంతో ఈ విషయం పరిష్కరించేందుకు యత్నించిన రాజా, అతని కుట్రవలన జగ్గు (జగ్గారావు) హత్యానేరంలో ఇరుక్కోవటం, అరెస్టయిన రాజాను రవి లాయర్‌గా వాదించి, రామూ సాక్ష్యంతో నిజం నిరూపించి, ప్రతాపే ఈ హత్యకు కారకుడని అరెస్ట్ చేయిస్తాడు. కోర్టు హాలుకు వచ్చిన భార్య లక్ష్మిని కలుసుకున్న కోటయ్య, రామూ తన కొడుకని తెలిసికోవటం, దాంతోపాటే రాజా, రవి కూడా తన బిడ్డలేనని గ్రహించి అంతా ఒక్కటవ్వటం, విధి విలాసం అన్నింటికీ కారణమని కోటయ్య గ్రహించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో ఇంకా కెవి చలం, వల్లభనేని శివరాం (పబ్లిక్ ప్రాసిక్యూటర్), జడ్జి మాధవరావుగా ధూళిపాళ, అతని భార్యగా టిజి కమలాదేవి, ఏడిద నాగేశ్వరరావు నటించారు. నేటివిటీకి తగ్గట్టుగా చిత్రం సన్నివేశాలను దర్శకులు శివరామ్ తీర్చిదిద్దారు. హిందీలో తొలుత బలరాజ్ సహానీ తదితరుల బృందగానాన్ని తెలుగులో పిల్లలకు తల్లి బొట్టుపెట్టి హారతివ్వటం, ఆపైన ఓ పల్లె జంటతో జానపద నృత్యం, పల్లెటూరికి పట్నవాసానికి తేడాలు తెలియచెప్పుతూ -పదవే పోదాము పల్లెటూరికి’ (రచన: కొసరాజు, గానం: ఘంటసాల, యల్‌ఆర్ ఈశ్వరి బృందం) అన్న పాట రూపంలో చూపించారు. తిరిగి పిల్లలు పెద్దయ్యాక రాంమ్మోహన్ పుట్టినరోజున తల్లి హారతిచ్చి గతం గుర్తుకు తెచ్చుకోవటంగా చూపించారు. అలాగే హిందీలో సునీల్‌దత్ -సాధనల మధ్య పూదోటలో సాగిన యుగళ గీతాన్ని తెలుగులో కృష్ణ -కెఆర్ విజయల మధ్య ఫోన్‌లో మాట్లాడుతూ, వారి ఊహలో గీతంగా బృందావన్ గార్డెన్స్‌లోని చక్కని పౌంటెన్స్ మధ్య ఎంతో ఆహ్లాదకరంగా (కలగన్నానే తీయని కలగన్నానే : రచన: దాశరధి, గానం: ఘంటసాల, పి సుశీల) చిత్రీకరించారు. ఇలా చిన్న చిన్న మార్పులతో.. కృష్ణంరాజు, సత్యనారాయణ, జగ్గారావుల మధ్య సన్నివేశాలు, విలనిజాన్ని సాఫ్ట్‌గా చిత్రీకరించటం, కోర్టు సన్నివేశాలు అన్నిటినీ వివరంగా ఉత్సుకత కలిగించేలా రూపొందించారు. ఇక ఈ చిత్రంలో రాజాగా కృష్ణంరాజు చక్కని చిరునవ్వు, కొంత గాంభీర్యం కలిసిన మేనరిజమ్స్‌తో అలవోకగా అభినయించారు. రవి పాత్రలో కృష్ణ సరదాగా, అల్లరిగా, చెల్లెలి మాటలకు, చివర కోర్టులో లాయర్‌గా నిగ్రహాన్ని, గాంభీర్యాన్ని పాత్రకుతగ్గ భావాలతో ప్రదర్శించి మెప్పించారు. అందాల రాణి అని పిలిపించుకుంటూ కెఆర్ విజయ చిరునవ్వుతో కూడిన పాత్రోచిత భావాలను ప్రదర్శించారు. గీతాంజలి, రాంమ్మోహన్ తమ పాత్రలకు తగిన అభినయం చూపటం, వారిపై స్నేహబృందంపై చిత్రీకరించిన గీతం -గులాబీలు పూచే వేళ కోరికలే (రచన: కొసరాజు, గానం: ఎస్ జానకి, ఘంటసాల కోరస్) కూడా వైవిధ్యంగా చిత్రీకరించారు.
హిందీ చిత్ర గీతం ‘ఆగేభీజానే నతూమ్’ను తెలుగులో ‘ఏవౌనో ఈవేళలో ఏముందో ఏనీడలో’ (రచన: సినారె, గానం: ఎస్ జానకి)గా చిత్రీకరించటం గమనార్హం. పార్టీలో కృష్ణంరాజు, కృష్ణ, కెఆర్ విజయ, రేలంగి తదితరులపై సంగీతానికి అనుగుణంగా వారి వారి రియాక్షన్స్ చూపుతూ చిత్రీకరణ సాగించారు. ఈ గీతం ట్యూన్‌తోనే ఇంతకుముందు వచ్చిన ‘అసాధ్యుడు’ చిత్రంలో ‘కలలే కన్నానురా ఆశతో ఉన్నానురా’ పాట (ఒకే ట్యూన్‌తో రెండు పాటలు) రూపొందటం విశేషం.
చిత్రంలోని ఇతర గీతాలు:
కృష్ణ, కెఆర్ విజయ, కృష్ణంరాజు, రేలంగి, ఇంటిలో అతిథుల మధ్య పియానోపై ఆనందంగా సాగే గీతం -ఆనందము నాలో పొంగేను/ అనురాగము అలలై’ (రచన: దాశరథి, గానం: పి సుశీల). అంతకుముందు ఇంటిలో కెఆర్ విజయ పాడుకుంటుండగా, కృష్ణంరాజు గమనిస్తున్నట్టు చిత్రీకరించిన గీతం -ఎవరో ఈనాడు నామదిలో చేరెనులే (రచన: దారశథి, గానం: పి సుశీల). కాలగతిని తెలియచేస్తూ గుమ్మడి, పండరీబాయి, వారి పిల్లలు చిన్న, బుజ్జి, బాబ్జిలపై సాగే గీతం -కాలమే విధిరూపము మానవాళికి దీపము (రచన: శ్రీశ్రీ, గానం: ఘంటసాల). ‘భలే అబ్బయిలు’ చిత్రం చక్కని కుటుంబ కథాచిత్రంగా, మంచి పాటలు, సంగీతంతో జనరంజకంగా నిలిచింది. ఈ చిత్రాన్ని 1981లో మళయాళంలో ‘కోలీలాకంమేం’ అన్న టైటిల్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నటించిన నటుడు జయన్ క్లైమాక్స్ షూటింగ్‌లో విమాన ప్రమాదంలో మరణించారు. ఆ చిత్రానికి రచన, దర్శకత్వం ఎన్ సుందరం. నిర్మాత సివి హరిహరన్. మధు, జయన్, ఎన్ నంబియార్, కెఆర్ విజయ, సుమలత నటించారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథమ్ సమకూర్చారు. 1981 ఫిబ్రవరి 13న ఆ చిత్రం విడుదలైంది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి