ఫ్లాష్ బ్యాక్ @ 50

ఆదర్శ కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా జిల్లాలో 1924 అక్టోబర్ 31న జన్మించారు కొల్లి ప్రత్యగాత్మ. తాతినేని ప్రకాశరావువద్ద ‘ఇల్లరికం’ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. వీరి ప్రతిభను గుర్తించిన ప్రసాద్ ఆర్ట్స్ అధినేత ఏవి సుబ్బారావు, ‘ఇల్లరికం’ తరువాత 1961లో వారు రూపొందించిన ‘భార్యాభర్తలు’ చిత్రానికి దర్శకునిగా ప్రత్యగాత్మను ఎన్నుకున్నారు. ఆ చిత్రం అఖండ విజయం సాధించి నిర్మాతకు, దర్శకునిగా ప్రత్యగాత్మకు ప్రశంసనీయమైన గుర్తింపు తెచ్చింది. తరువాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ‘కులగోత్రాలు’, ‘పునర్జన్మ’, ‘మనుషులు-మమతలు’ చిత్రాలకు ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు. కెపి ఆత్మ 7 హిందీ చిత్రాలకు, 20కి పైగా తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
1969లో అక్కినేని నాగేశ్వరరావు సినీ రజితోత్సవం సందర్భంగా నటించిన చిత్రం, ప్రసాద్ ఆర్ట్స్ ప్రై లిమిటెడ్ నిర్మించిన సినిమా -ఆదర్శ కుటుంబం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కె ప్రత్యగాత్మ నిర్వహించారు. జూన్ 6, 1969లో సినిమా విడుదలైంది.
*
మాటలు: ఆత్రేయ
నృత్యం: చిన్ని, సంపత్
సంగీతం: యస్ రాజేశ్వరరావు
ఛాయాగ్రహణం: పిఎస్ సెల్వరాజ్
కళ: జివి సుబ్బారావు
ఎడిటింగ్: కె కృష్ణస్వామి
నిర్మాత: ఏవి సుబ్బారావు
దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ
*
ఆ ఊళ్లో మోతుబరి భూస్వామి రాఘవేంద్రరావు (నాగయ్య). భార్య రాజ్యలక్ష్మి (హేమలత). వారికి నలుగురు కుమారులు. పెద్దవాడు పట్ట్భా (గుమ్మడి), పెద్ద కోడలు జానకి (అంజలిదేవి). ఇంటి ఖర్చులు, జమలు పట్ట్భా, వంటా వార్పూ, పెట్టుపోతలు జానకి నిర్వహిస్తుంటారు. రెండో కుమారుడు ప్రకాశం (నాగభూషణం) గ్రామ రాజకీయాల్లో పాల్గొని ప్రెసిడెంటుగా విధులు నిర్వహిస్తుంటాడు. అతని భార్య జయ (ఎస్ వరలక్ష్మి), వారికొక కుమారుడు వాసు. మూడో కుమారుడు శారీరక దారుఢ్యాన్ని పెంచుకుంటూ పోటీల్లో పాల్గొంటుంటాడు. అతని భార్య రమ (గీతాంజలి). నాల్గవ కుమారుడు ప్రసాద్ (అక్కినేని నాగేశ్వర రావు). పట్నంలో చదువుతూ తనతోటి సహాధ్యాయిని, డాక్టరు చదివిన సరోజ (జయలలిత)తో ప్రేమలో పడతాడు. రాఘవేంద్రరావు కూతురు అనిత. ఆమె భర్త రే చీకటితో బాధపడుతూ సరిగ్గా ఏ పనీ చేయని సూర్యం (పద్మనాభం). అత్తవారింట్లోనే తిష్టవేయమని తల్లి దుర్గమ్మ (సూర్యాకాంతం) హెచ్చరికతో అక్కడే కాలం గడుపుతుంటాడు. ఈ ఇంటి పరిస్థితులు చక్కదిద్దాలని సరోజను పట్నంలో రిజిస్టర్ మ్యారేజీ చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు ప్రసాద్. ఆమె సాయంతో తాను తాగుడు వ్యసనానికి బానిసైనట్టు, అప్పులు చేసినట్టు నమ్మించి ఇంటిని, ఆస్తిని అప్పులకు జమ అయ్యిందని చెప్పించి.. కుటుంబ సభ్యులంతా వేరుపడేలా చేస్తాడు. దాంతో అందరూ తమ తమ బాధ్యతలను గుర్తించి చివరకు ఒకటి కావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఇంకా సాక్షిరంగారావు, సురభి బాలసరస్వతి, విజయలలిత నటించారు. ఈ చిత్రంలో చిన్న కొడుకుగా అక్కినేని హుషారైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తల్లిదండ్రులను, అన్నలను ఎదిరించకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకోవటం, వ్యసనపరుడైనట్టు నమ్మించి ఆస్తిని కాపాడటం, భార్య సరోజను ముందుంచుతూ వెనుక సూత్రధారిలా వ్యవహరించే సన్నివేశాలను రక్తికట్టించారు. ‘ఏయ్ ఏయ్‌రా చూస్తాను’ అంటూ సాగే హుషారైన గీతంలోనూ ఆయన ప్రత్యేకత చూపించారు.
దర్శకుడు ప్రత్యగాత్మ దర్శకత్వం ప్రతిభ ఆదర్శ కుటుంబంలో చూస్తాం. ఉమ్మడి కుటుంబాల్లో వ్యక్తుల మధ్య బాంధవ్యాలు, పరిస్థితులనుబట్టి వారి మానసిక ప్రవృత్తుల్లో మార్పులను ఎంతో వివరంగా, సున్నితంగా, సందేశాత్మకంగా విశే్లషిస్తూ కథను, దానికితగ్గ సన్నివేశాలను రూపొందించారు. తోడికోడళ్ల మధ్య విసవిసలు, తమ బంధువుల అమ్మాయితో మరిదికి వివాహం జరపాలని తోటికోడళ్ల ఆరాటం, ఒక వ్యక్తి కష్టంపై అందరూ ఆధారపడటం, ఆస్తి లెక్కలు అడిగితే తమ ఎలక్షన్ ఖర్చులు తెలుస్తాయని ఒకరు, కుస్తీపోటీల లెక్కలు బయటకు వస్తాయని మరొకరు కిమ్మనకుండా ఉండటంలాంటి సన్నివేశాలను సహజ సిద్ధంగా రూపొందించారు. అలాగే, ప్రసాద్ పెళ్లి వైభవంగా జరగాలని తల్లిదండ్రుల పట్టుదల, తోడికోడలు జానకి కూతురు పెళ్లికి 10 లక్షలు ఖర్చవుతుందన్న బెంగతో -ఆమె కూతురుకి వైధవ్యయోగం వుందని, జాతకాన్ని మరో తోడికోడలు జయ చెప్పించటం, తనకు మగ బిడ్డలు పుట్టలేదని, తన కూతురి పెళ్లి జయ చెడగొట్టిందన్న అక్కసుతో, వారి కొడుకు వాసుకు జానకి పాలలో విషం కలపటం, అది భగ్నమవటం, ఆ విషయం ప్రసాద్, సరోజలు గ్రహించటం... వేరుపడిన తరువాత ఎవరికివారు బాధ్యతగా ప్రవర్తించటం, భర్త ప్రకాశం ఎన్నికలలో ఓడిపోవటంతో జయ సొంతంగా పాల వ్యాపారం ప్రారంభించటం, వాసుకు అమ్మవారుపోస్తే జానకి అతన్ని తన ఇంటిలో జాగ్రత్తగా చూడటం, అందుకోసం మూడు రోజులు ఉపవాసం చేయటం, ఇవి జయలో మార్పునకు నాంది పలికి విద్యావంతుడైన తన తమ్ముడితో జానకి కూతురు పెళ్లి నిశ్చయం చేయటం, భర్తకు సరైన సంపాదన లేదని పుట్టిల్లుచేరిన రమ అక్కడ విదిలింపులకు, నిరసనలకు లోనై కూలి పనిచేస్తూ గౌరవంగావున్న భర్తవద్దకు చేరటం, వయసులో పెద్దవారైనా రాజ్యలక్ష్మి, రాఘవేంద్ర దంపతులు తమ ఇంటివద్ద కాయగూరలు పండించటం, అన్నదమ్ములు ఏకమై ఉమ్మడి వ్యవసాయం చేయటం, ఇదంతా ప్రసాద్ ప్రయత్నం అని తెలిశాక అందరూ తమ తప్పులు అంగీకరించటం, అందరికి విడివిడిగా సరోజ తాతగారు (రమణారెడ్డి) ఇళ్లు కట్టించటం.. ఇలా ప్రతి సన్నివేశాన్నీ ఎంతో విపులంగా, సహజంగా (సరోజ బావగారికి కుటుంబ నియంత్రణ గూర్చి చెప్పటం వంటివికూడా) రూపొందించి ఆసక్తికరంగా చిత్రీకరించారు.
పరిణితి చెందిన పాత్రధారులు కావటంతో నటీనటులంతా తమ పాత్రోచితమైన పరిపక్వత నటనలో చూపించారు. ముఖ్యంగా గుమ్మడి వేరుపడిన సందర్భంలో.. చివర తమ్ముళ్లు, తల్లి తనను సహాయం కోరిన సన్నివేశంలో అతి సహజంగా తన స్పందన చూపటం ఎన్నదగిన అంశం.
చిత్రంలోని గీతాలు:
జయలలిత, నాగేశ్వరరావు, విద్యార్థుల బృందంపై చిత్రీకరించిన గీతం -హల్లో సారూ ఓ దొరగారు (రచన: కొసరాజు, గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, ఘంటసాల బృందం). మరో కొసరాజు రచన.. రామాయణం హరికథ -సూర్యవంశమునందునా (గానం: ఘంటసాల, జయదేవ్ బృందం). వీరిదే మరో గీతాన్ని కుటుంబ సభ్యుల వ్యవసాయంపై చిత్రీకరించారు. అది -చేరుూ చేరుూ కలిపి (గానం: ఘంటసాల, పి సుశీల బృందం). నాగభూషణంపై చిత్రీకరించిన మరో కొసరాజు రచన -ఏడుకొండల వెంకటేశ్వరా (గానం: ఘంటసాల). ఎమ్యూజిమెంట్ పార్క్‌లో విజయలలిత, ఏఎన్నార్‌పై చిత్రీకరించిన ఆత్రేయ గీతం -ఏయ్ ఏయ్ రా చూస్తావేరా (గానం: పి సుశీల, ఘంటసాల). సి నారాయణరెడ్డి రచించిన, ఘంటసాల, పి సుశీల గానం చేసిన యుగళగీతం (ఏఎన్నార్, జయలలితపై తొలి రేయి గీతంగా చిత్రీకరణ) -బిడియమేలా ఓ చెలి పిలిచే నినే్న కౌగిలి). పాటలన్నీ ఎస్ రాజేశ్వరరావు సంగీతంతో అలరించేలా సాగుతాయి.
కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలను ఎలా కాపాడుకోవాలో విశే్లషిస్తూ రూపొందిన ఆదర్శ కుటుంబం చిత్రం ప్రేక్షకుల మన్నన పొందింది. నేటికీ వీక్షకులు కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఈ చిత్రానికి (1969) ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డ్’ బహూకరించింది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి