ఫ్లాష్ బ్యాక్ @ 50

సిపాయి చిన్నయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నేహబృందంతో కలిసి సినీ లలిత గీతాలు ఆలపిస్తూ ఆనందంగా కాలం గడిపేవారు జివిఆర్ శేషగిరిరావు. సినిమాల్లో గాయకునిగా రాణిస్తావంటూ స్నేహితులిచ్చిన ప్రోత్సాహంతో మద్రాస్ వెళ్లారు. దారిలో చేతి సంచి, సొమ్ము పోగొట్టుకొని మద్రాస్ పాండీబజారు చేరారు. అక్కడ తోటి కళాకారుల అనుభవాలు గ్రహించి, గాయకునిగా కంటే దర్శకత్వంలో ప్రతిభ చూపాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా సురేష్ మూవీస్ దర్శకత్వశాఖలో సహాయకునిగా చేరారు. కొన్ని చిత్రాలకు పనిచేశాక వీరి సామర్థ్యాన్ని గ్రహించిన సురేష్ మూవీస్ అధినేత డి రామానాయుడు, 1968లో నిర్మించిన ‘పాపకోసం’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతను శేషగిరిరావుకు అప్పగించారు. ఆ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా దర్శకుడిగా శేషగిరిరావుకు మరో చాన్స్ ఇచ్చారు నిర్మాత రామానాయుడు. అదే -1969లో సురేష్ మూవీస్ సంస్థలో అక్కినేని ద్విపాత్రాభియంగా రూపొందిన సినిమా -సిపాయి చిన్నయ్య. ఆ తరువాత శేషగిరిరావు ఇతర నిర్మాణ సంస్థలు రూపొందించిన సంబరాల రాంబాబు, బస్తీ కిలాడీలు, పట్టిందల్లా బంగారం, ఆడదాని అదృష్టం, నేనూ మనిషినే, అమ్మాయి శపథం (1975) వంటి పది చిత్రాలకు పైగా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత అనారోగ్యంతో నడి వయసులోనే స్వర్గస్తులయ్యారు.
ప్రముఖ తమిళ రచయిత తొరయూర్ కె మూర్తి సమకూర్చిన కథతో -సిపాయి చిన్నయ్య సినిమా రూపొందింది. ఈయన అంతకుముందు సురేష్ మూవీస్‌లో ‘ద్రోహి’ చిత్రానికి, ఇంకా పలు చిత్రాలకు కథలు అందించటం గమనార్హం. అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయంతో సురేష్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన సిపాయి చిన్నయ్య సినిమా 1969 అక్టోబర్ 30న విడుదలైంది.
కథ: తొరయూర్ కె మూర్తి
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
ఫొటోగ్రఫీ: పి భాస్కర్‌రావు
కలర్ ఫొటోగ్రఫీ అండ్ ట్రిక్స్: ఎస్‌ఎస్ లాల్
ఎడిటింగ్: కెఏ మార్తాండ్
కళ: వి రాజేంద్రకుమార్
నృత్యం: చిన్ని, సంపత్, కెఎస్ రెడ్డి
సంగీతం: ఎంఎస్ విశ్వనాథన్
స్టంట్స్: రాఘవులు అండ్ పార్టీ
అసోసియేట్ దర్శకు: కె బాపయ్య, కె ధర్మరాజు
దర్శకులు: జివిఆర్ శేషగిరిరావు
నిర్మాత: డి రామానాయుడు

ఓ గ్రామానికి చెందిన జమీందారీ కుటుంబంలో జన్మించిన భాస్కర్ (అక్కినేని నాగేశ్వర రావు) నౌకాదళాధిపతిగా విధి నిర్వహిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన చిన్నయ్య సిపాయిగా నౌకాదళంలో పని చేస్తుంటాడు. వారిరువురూ ఒకే రూపురేఖలు కలిగివుంటారు. భాస్కర్ తల్లి సుభద్రమ్మ (పండరీబాయి) పేద సాదలపట్ల దయగల వ్యక్తి. భాస్కర్ తమ్ముడు శేఖర్ (జగ్గయ్య) పేదవాళ్లకు వడ్డీలకు డబ్బులిచ్చి, బాకీ తీర్చనివారిని బాధిస్తుంటాడు. భాస్కర్, చిన్నయ్య సెలవులకు తమ గ్రామానికి వస్తారు. భాస్కర్‌కు సోదరుడి వరుస కోదండం (ప్రభాకర్‌రెడ్డి). భాస్కర్‌ని అంతంచేసి ఆస్తిని పొందాలని చూస్తుంటాడు. భాస్కర్ అత్తకూతురు శోభ (్భరతి). ఒకరినొకరు ఇష్టపడతారు. చిన్నయ్య, భార్య కన్నమ్మ (కెఆర్ విజయ) అన్యోన్యమైన జంట. భాస్కర్ పుట్టిన రోజున సొరచేప కానుకగా తెచ్చిన చిన్నయ్య, శేఖర్ కారణంగా భాస్కర్ చేత చెంపదెబ్బ తింటాడు. అలిగి వెళ్లిన చిన్నయ్య కోసం వెళ్లిన భాస్కర్ కొంత డబ్బు, స్వీట్స్ సంచిలో పెట్టి ఇస్తాడు. సముద్రం మీద షికారు వెళదామని భాస్కర్ కోరడంతో, ఇంటికెళ్లి వస్తానని చెప్పి తిరిగి వచ్చిన చిన్నయ్యకు భాస్కర్ కనిపించడు. గంగన్న (సత్యనారాయణ), అమావాస్య (రాజ్‌బాబు) అతన్ని కొట్టి సముద్రంలో పడేస్తారు.
భాస్కర్‌కోసం వెతికి చిన్నయ్య ఒక్కడే తిరిగొస్తాడు. భాస్కర్ మరణించాడని తెలిస్తే సుబద్రమ్మ తట్టుకోలేదని, అందుకు భాస్కర్ స్థానంలోకి రమ్మని చిన్నయ్యను శేఖర్ కోరటంతో.. తప్పక ఆ బాధ్యత నిర్వహిస్తాడు చిన్నయ్య. ఈక్రమంలో కన్నమ్మకు పల్లీయుడు గంగయ్యతో మనువు నిశ్చయించబడుతుంది. సముద్రంలోకి నెట్టబడిన భాస్కర్ బ్రతికి మరో ఊరి పల్లీయుల సాయంతో కోదండం ఇంటికి చేరతాడు. అక్కడ కోదండం దుర్బుద్ధి తెలుసుకున్న భాస్కర్, శోభతోసహా తన ఊరు బయలుదేరగ.. దారిలో కోదండం సిద్ధంచేసిన కారు బాంబునుంచి తప్పించుకొని చిన్నయ్య వద్దకు బయలుదేరతాడు. అక్కడ అతన్ని అంతం చేయాలనుకున్న గంగన్న, మిగిలిన రౌడీలతో పోరాడి చివరకు అందరూ కలవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
జమీందారిలో గుమాస్తా చొక్కారావుగా నాగభూషణం, ప్రభాకర్‌రెడ్డి సలహాదారుడు కైలాసంగా రావి కొండలరావు, పల్లెవారిలో పెద్దగా మిక్కిలినేని, వారి బామ్మగా ఋష్యేంద్రమణి ఇతరులు నటించారు.
దర్శకులు శేషగిరిరావు అక్కినేని ద్విపాత్రాభినయ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. స్క్రీన్‌మీద ఇద్దరూ ఒకేసారి కనిపించే సందర్భాల్లో.. చిన్నయ్య చేత భాస్కర్ మందు తాగించటం, సిగరెట్ ముట్టించటం, గదిలో ఇద్దరూ ప్రక్కపక్కనే ఉండి మాట్లాడుకోవటం, చిన్నయ్యను లెంపకాయ కొట్టి అవమానించే సందర్భం, తిరిగి అతనికి క్షమాపణ చెప్పటంతో ఇద్దరూ కారువద్ద కలుసుకోవటం, చిత్రం చివరలో పోరాటాలు ఎంతో సహజంగా చిత్రీకరించారు. జమీందారు అయిన శేఖర్, జమీలోని కూలీలను వడ్డీ, అప్పు బకాయిల కోసం వేధించటం; పేదవారి వేదన; అది చూసిన తల్లి పండరీబాయి మనది జమీందారి కుటుంబం కాక వడ్డీ వ్యాపార కుటుంబమైందని బాధపడటం; తనవద్ద పనిచేసే గుమాస్తా తమతో భోజనం చేయటం నామర్ధా అని భావించే జగ్గయ్యను చూసి తల్లి, అన్న భాస్కర్ మందలించటం; భోజనం చేస్తున్న నాగభూషణం రియాక్షన్ ఎంతో సహజంగా చూపించారు. తన తల్లిని కాపాడుకోవటానికి చిన్నయ్యను బ్రతిమాలి భాస్కర్‌గా తెచ్చిన శేఖర్, అతను పేదవాళ్లపట్ల కరుణచూపటంతో ఆగ్రహించి తన హద్దుల్లో ఉండమని హెచ్చరించటం, చిత్రం చివరలో చిన్నయ్య త్యాగాన్ని గుర్తించి క్షమాపణ కోరటం, అదే విధంగా తన భార్యను వదిలి భాస్కర్‌గా వచ్చిన చిన్నయ్య వేదన, అందుకు కన్నమ్మ దుఃఖం ఓ పాటలో హృదయం ద్రవించేలా చిత్రీకరించారు. ఆ గీతం -ఓ హోహో ఆ నావ దాటిపోయింది (గానం: ఘంటసాల, పి సుశీల. ఎంతో ఆర్దతతో కూడిన గీతం విశిష్ట రచయిత దేవులపల్లి రచనలో మరింతగా అలరించేలా సాగటం మెచ్చదగిన అంశం). క్లైమాక్స్ ఫైట్‌లో సముద్రంలోని స్టీమర్‌పై రాత్రి పూట జరిగేలా చిత్రీకరణ, అలాగే పెద్ద బావిలో తొలత చిన్నయ్యను నెట్టగా అతడు భాస్కర్ సాయంతో బయటపడటం, దానిలో చివరకు గంగన్నపడి మరణించటం లాంటి సన్నివేశాలను ఎంతో ఎఫెక్ట్‌లో చిత్రీకరించారు.
చిత్రంలో ఇతర గీతాలు: భారతి, ఏఎన్‌ఆర్‌లపై యుగళ గీతం -అమ్మాయి ముద్దు తప్పా (గానం: ఘంటసాల, ఎల్‌ఆర్ ఈశ్వరి; రచన: ఆరుద్ర). మరో ఆరుద్ర గీతం -ఒరే మావా ఏసుకోరా చుక్క (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి). కెఆర్ విజయపై చిత్రీకరించిన మరో ఆరుద్ర గీతం -నారాజు నవ్వులు పలికించి (గానం: పి సుశీల). మరో గీతం.. సిపాయి చిన్నయ్య తన ఊరు వెళ్తుండగా పాడే చిరస్మరణీయ దేశభక్తి గీతం -నా జన్మభూమి ఎంత అందమైన దేశము (గానం: ఘంటసాల, రచన: ఆరుద్ర). దాశరథి రచించగా సినిమాలో భాస్కర్ పుట్టినరోజున విజయలలిత నృత్యంపై చిత్రీకరించిన గీతం -తాజాగా ఉంది లేత రోజా (గానం: పి సుశీల బృందం). కెఆర్ విజయ, అక్కినేని బృందంపై చిత్రీకరించిన మరో హుషారు గీతం -పడవా వచ్చిందే పిల్లా.. పండగ వచ్చిందే (గానం: ఘంటసాల, పి సుశీల బృందం, రచన: మనసుకవి ఆత్రేయ).
‘సిపాయి చిన్నయ్య’ చిత్రంలో కొన్ని పాటలు నేటికీ శ్రోతలను అలరించటం.. అందులో ముఖ్యంగా ‘నా జన్మభూమి’ చెప్పుకోదగ్గ దేశభక్తి గేయంగా ప్రతివానినోటా నేటికీ పలకటం విశేషాంశం. గజేంద్ర మోక్షంలోని ‘లావొక్కింతయులేదు’ పద్యం చొక్కారావుతో చిత్రీకరణ చేయించారు. ఇలా కొన్ని తమాషాలతో, సెంటిమెంటుతో కూడిన వైవిధ్య భరిత చిత్రంగా సిపాయి చిన్నయ్య నిలిచింది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి