ఫ్లాష్ బ్యాక్ @ 50

తల్లా- పెళ్లామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిఖ్యాత నట సార్వభమునిగా ఎనలేని కీర్తి గడించారు నటులు నందమూరి తారక రామారావు. నటనతోపాటు దర్శకత్వంపట్ల అభినివేశంతో నటుడిగా వంద చిత్రాలు పూర్తిచేసిన పిమ్మట -తమ ఎన్‌ఏటి బ్యానర్‌పై రూపొందించిన ‘సీతారామకల్యాణం’, ‘గులేబకావళి కథ’ చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. కాని టైటిల్స్‌లో దర్శకునిగా పేరు వేసుకోలేదు. ‘శ్రీకృష్ణపాండవీయం’ (1966) చిత్రం నుంచి టైటిల్స్‌లో తొలిసారిగా దర్శకునిగా యన్‌టి రామారావు పేరు వేసుకోవటం ప్రారంభించారు. అలా తరువాత 13 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలా 1970లో యన్‌టిఆర్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో రూపొందిన చిత్రం తల్లా- పెళ్లామా. టైటిల్స్‌కు ముందు -యన్‌టిఆర్ గడ్డం కింద చేయిపెట్టుకుని చిరునవ్వుతో ఆలోచిస్తున్న భంగిమలో ఉంటే, ఆయన ఆలోచన నుంచి తల్లి శాంతకుమారి, భార్య చంద్రకళ నడచిరావటం.. తల్లా-పెళ్లామా టైటిల్ కార్డు పడటం, తరువాత మిగిలిన సాంకేతిక నిపుణుల పేర్లు రావటం అప్పట్లో ఓ ప్రత్యేకత.
ఈ చిత్రానికి సంభాషణలు జూనియర్ సముద్రాలగా ప్రఖ్యాతిగాంచిన సముద్రాల రామానుజాచార్య సమకూర్చారు. తండ్రి సముద్రాల రాఘవాచార్య (సీనియర్ సముద్రాల) వలెనే సినీ గేయ రచయితగా ఈయన ప్రసిద్ధులు. వీరు కొంతకాలం వాహినీ స్టూడియోలో శబ్దగ్రహణ విభాగంలో పనిచేసి, వినోదావారి ‘శాంతి’ చిత్రం ద్వారా గీత రచయితగా ప్రస్థానం ప్రారంభించారు. జయసింహ, గులేబకావళి కథ, బ్రతుకుతెరువు, పాండురంగ మహత్యం.. ఇలా పలు చిత్రాల గీత రచయితగా ప్రసిద్ధులైనారు. ఈయనను యన్‌టి రామరావు సంభాషణల రచయితగా ప్రోత్సహించారు. ఆ వరుసలో పలు చిత్రాలకు మాటలు సమకూర్చారు రామానుజాచార్య. తల్లా-పెళ్లామా చిత్రం 1970 జనవరి 8న విడుదలై యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యన్‌టి రామారావు, మాటలు: సముద్రాల రామానుజాచార్య, కళ: కృష్ణారావు, కూర్పు: జెడి జోషి, సంగీతం: టీవీ రాజు, నృత్యం: వెంపటి సత్యం, ఛాయాగ్రహణం: జె సత్యనారాయణ, స్టంట్స్: సాంబశివరావు, స్వామినాథన్, నిర్మాణ నిర్వహణ: జి కృష్ణ, నిర్మాత: ఎన్ త్రివిక్రమరావు
రమణమ్మ (శాంతకుమారి)కు ఇద్దరు కుమారులు. పెద్దవాడు ప్రభాకర్ (నాగభూషణం) ఉద్యోగం వచ్చి పెళ్లికాగానే భార్యతో మద్రాసు వెళ్లిపోతాడు. తండ్రి గతించిన వార్త తెలిసినా తల్లివద్దకు రాలేనంత బిజీగా వుంటాడు. రెండో కుమారుడు సుధాకర్ (యన్‌టి రామారావు) ఎఫ్‌ఏసి పూర్తిచేసి, పట్నంవెళ్లి బిఏ పూర్తి చేయాలని కాలేజీలో చేరతాడు. పట్నంలో ధనవంతుడైన రావ్‌బహదుర్ పరమానంద్ (రేలంగి) విద్యార్థులను తన రాజకీయాలకు ఉపయోగించుకునే వ్యక్తి. సుధాకర్ ఆ విషయంలో రావ్‌బహదుర్‌ను ఎదిరించటం, అతని వ్యక్తిత్వం నచ్చిన రావ్‌బహదూర్ కూతురు పద్మ (చంద్రకళ) సుధాకర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంటుంది. భర్తతో పల్లెటూరు వచ్చిన పద్మ అక్కడ అత్తగారి పద్ధతులు సరిపడక గొడవ పడి, అత్తగారి ఆదేశంతో భర్తను తీసుకొని పట్నం వస్తుంది. మద్రాసులో ప్రభాకర్ తాహతుకిమించిన గొప్పలతో అప్పులపాలై ఉద్యోగం పోగొట్టుకుంటాడు. బుద్ధిమంతుడైన అతని కొడుకు కృష్ణ (మాస్టర్ హరికృష్ణ) నాయనమ్మను కలవాలని, వారి పల్లెటూరు వచ్చి ఆమె చివరి దశలో అండగా ఉంటాడు. పట్నంవెళ్లిన సుధాకర్, భార్యకు బుద్ధిచెప్పాలని తాగుబోతుగా, తిరుగుబోతుగా నటిస్తాడు. పద్మ నుంచి కుమారుడిని దూరంగా ఉంచుతాడు. భర్త ప్రవర్తన నచ్చక తండ్రి సూచనపై కోర్టులో విడాకులు కోరుకున్న పద్మకు, జడ్జిముందు సుధాకర్ వెల్లడించిన నిజాలతో పరివర్తన చెంది భర్తను క్షమాపణ కోరుకుంటుంది. తన బిడ్డ, భర్తతో అత్తగారివద్దకు బయలుదేరుతుంది. ప్రభాకర్ తన భార్యతో తల్లివద్దకు చేరుకుంటాడు. వీరు వచ్చే సమయానికి ముందే రమణమ్మ మనవడి చేతిలో మరణిస్తుంది. అందరూ ఆమె ఆత్మశాంతికి ప్రార్థన చేయటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో పట్నంలో హాస్టల్ వార్డెన్‌గా ప్రభాకర్‌రెడ్డి కనిపిస్తాడు. ఇంకా సత్యనారాయణ, చలపతిరావు, జగ్గారావు, ఛాయాదేవి, ముక్కామల, వంగర, రావికొండలరావు, విజయలలిత, నాగభూషణం, దేవిక, బాలకృష్ణ, కెవి చలం, నల్లరామ్మూర్తి నటించారు.
పరిణితి చెందిన నటనతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా రాణించిన నందమూరి తారక రామారావు ఈ చిత్రంలోనూ ఎంతో నిండుతనంతో కూడిన నటనతో ఒప్పించటమే కాదు, దర్శకునిగా వైవిధ్యభరితమైన సన్నివేశాలను తీర్చిదిద్దారు. చిత్రం ప్రారంభంలో -స్కూర్ ఫైనల్ పాసయ్యానని తల్లికి చెప్పటం, తండ్రి కోరికమేరకు బిఏ చదవాలని నిశ్చయించుకోవటం, సెలవుల్లో రిక్షా లాగటం వంటి కాయకష్టం పనులు చేసి.. పట్నంలో జరిగిన ఇంటర్వ్యూలో ఆ సంగతి చెప్పి సీటు సంపాదించటం వంటి సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. వార్షికోత్సవంలో తెలుగువారి కీర్తి తెలిపే -తెలుగుజాతి మనది (గానం: ఘంటసాల, మధ్యలో వచ్చాడన్నా వచ్చిండన్నా అన్న పదాలు యన్టీఆర్ పలకటం ఓ నూతన ప్రయోగంగా ఉత్తేజితులను చేసింది) నృత్య నాటిక విద్యార్థులతో కలసి ప్రదర్శించి రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని అందించారు. ధనవంతుల అమ్మాయితో -తన ఇంటిని, తల్లిని, తండ్రిని, అంతస్థును ఫొటోలు చూపటం ద్వారా వ్యత్యాసం తెలియచెప్పటంలో వైవిధ్యాన్ని చూపించారు. తల్లిని కనిపెట్టుకుని ఉన్నపుడు భార్య మనసు నొచ్చుకున్న సందర్భంలో తల్లే కొడుకును ఇంటినుంచి వెళ్లిపొమ్మని శాసించటం, ఆ సమయంలో ఆమె వ్యధ, తిరిగి నీ ఇంటికి వస్తాను అనే నిర్ణయంతో భార్యతో కలిసి పట్నం వెళ్లటం, మహిళా సంఘాలలో డబ్బున్న మామగారిని ఇబ్బందులు పెట్టడం, తాగుబోతుగా నటించి.. తరువాత చాటుగా తల్లి ఫొటోకు క్షమాపణ చెప్పటం, గారాబంగా పెరిగిన భార్యచే వంట పనిచేయించటంలాంటి సన్నివేశాలు ఆహ్లాదంగాను, సందర్భోచితంగా ఉంటాయి. బిడ్డ కలిగాక పాలు ఇవ్వనీయకుండా చేయటం.. విడాకులు కోరిన సందర్భంలో ఈ నిజాలను కోర్టులో ఎంతో స్పందనతో గంభీరంగా వివరించటం, తన బిడ్డకు దూరమై భార్య ఎంతగా బాధపడుతోందో, తను దూరమై తన తల్లీ అంతే బాధపడుతుందని ఆమెకు తెలియచేయాలనుకున్న అంశాన్ని పట్టుతో చిత్రీకరించి మెప్పించారు. ఇక అన్న ప్రభాకర్ గొప్పలకుపోయి అప్పులు పాలవటం, వారి కుమారుడు కృష్ణ చిన్ననాటి నుంచి వివేకం, పొదుపు, మంచితనం లక్షణాలతో పెరిగి నాయనమ్మ కోసం వెళ్లటం, ఆమెతో ఎంతో ప్రేమగా గడపటం, వారి ఆప్యాయత తెలిపే గీతం -మమతలెరిగిన నా తండ్రి (గానం: శాంతకుమారి, రచన: సినారె), మనుమని చేతిలో బామ్మ కన్నుమూయటం.. ఇలా ప్రతి ముఖ్య సన్నివేశాలను ఎంతో పద్ధతిగా, అర్ధవంతంగా తీర్చిదిద్దటం.., మధ్యలో మహిళా మండలి పేర డాంబికాలు, విద్యార్థులను రాజకీయ నాయకులు పావులుగా వాడుకోవటం వంటి విషయాలను ఎంతో నిబద్ధతతో రూపొందించి మెప్పించారు. ‘ఆడపడుచు’ చిత్రంలో యన్‌టిఆర్ సోదరిగా, ‘మాతృదేవత’ చిత్రంలో కూతురిగా, ‘నిండుమనసు’ చిత్రంలో మరదలిగా ఎంతో సాత్విక నటనతో మెప్పించిన నటీమణి చంద్రకళ. ఈ చిత్రంలో యన్‌టిఆర్ ప్రేయసిగా, భార్యగా ఎంతో హుషారైన నటన కనబర్చారు. భర్తమాటకు ఎదురుచెప్పని ఇల్లాలుగా దేవిక, పేదవాడైన అల్లునిపట్ల నిరసన, డబ్బు, డాబుగల మామగారిగా రేలంగి ఓ వేరైటీని చూపించారు. మనుమనిగా మాస్టర్ హరికృష్ణ బామ్మతో అనుభూతి, ఆప్యాయతలను ఎంతో గంభీరంగా పరిణతితో కూడిన భావాలను చూపారు. ఇక తల్లిగా, అత్తగారిగా, నాయనమ్మగా, శాంతకుమారి ఎంతో పరిపుష్టితో కూడిన భావాలలో ఆర్ధ్రత, అనుభూతిని ప్రేక్షకులకు అందించి ఆమెకు ఆమే సాటి అనిపించుకున్నారు.
‘తల్లా-పెళ్లామా’ చిత్రంలో కొసరాజు ఒక్క గీతం రాశారు. అది మాస్టర్ హరికృష్ణపై చిత్రీకరించిన -బ్రహ్మం తాత చెప్పింది (గానం: పి సుశీల బృందం). మిగిలిన గీతాలు సి నారాయణరెడ్డి రాశారు. విజయలలితపై చిత్రీకరించిన క్లబ్ సాంగ్ -కాలం ఈ కాలం (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి). కాలేజీలో విద్యార్థులతో కలిసి యన్‌టి రామారావు, ఇతరులపై చిత్రీకరించిన ప్రబోధ గీతం -తెలుగుజాతి మనది (ఘంటసాల, యన్‌టి రామారావు బృందం). చంద్రకళ, యన్‌టి రామారావుపై చల్లని వెనె్నలలో నైట్ ఎఫెక్ట్‌తో ఇంగ్లీషు పదాలు, తెలుగు అర్థాలతో హృద్యంగా సాగించిన యుగళ గీతం -ఓ బంగారు గూటిలోని చిలకా పేద ముంగిట్లో వాలానని (గానం: ఘంటసాల, పి సుశీల). మామగారి ఇంట్లో తాగినట్టు నటనలో యన్‌టిఆర్, నౌకర్లపై చిత్రీకరించిన గీతం -తాగితే తప్పేముంది’ (గానం: ఘంటసాల, యన్‌టి రామారావు). జ్యోతిలక్ష్మి, యన్‌టిఆర్‌లపై రంగుల్లో చిత్రీకరించిన ఖవ్వాలీ గీతం -నువ్వు నవ్వుతున్నావు/ నేను నవ్వుతున్నాను (గానం: మహ్మద్ రఫీ, ఎస్ జానకి బృందం). చిత్రం చివర్లో భార్య, తల్లి ప్రత్యేకతల గూర్చి సినారె రాసిన పద్యాలు ఘంటసాల గానంలో -మనిషి జన్మకు జ్ఞానకాంతికి మాతృదేవత, మొదట రక్తి పిదప ముక్తి పదము చూపునదే కళత్రము, పూజలందెడి మూర్తి జనని ప్రేమనందెడి మూర్తి గృహిణి -అంటూ సాగుతాయి. టీవీ రాజు సంగీతంలో ఈ చిత్ర గీతాలు జనరంజకంగా రూపుదిద్దుకున్నాయి.
తల్లాపెళ్లామా చిత్రం ఘన విజయం సాధించింది. చిత్రాన్ని హిందీలో నిర్మాత, దర్శకుడు యల్‌వి ప్రసాద్ తమ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘జుదాయి’గా నిర్మించారు. 1974న రూపొందిన చిత్రంలో జితేంద్ర, లీనాచంద్రవర్కర్ జంటగా రేలంగి వేషం మదనపురి, శాంతకుమారి పాత్రను దుర్గాఖోటే పోషించారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘పెరియివిదాయ్ పేరిట’ నిర్మించారు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి