ఫ్లాష్ బ్యాక్ @ 50

మా నాన్న నిర్దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యస్ భావన్నారాయణ తన బంధువైన వైవి రావు (డిటెక్టివ్ కథా రచయిత) భాగస్వామ్యంతో గౌరీ పిక్చర్స్ బ్యానర్‌పై 1964లో తొలిసారి నిర్మించిన చిత్రం -తోటలోపిల్ల కోటలోరాణి. తరువాత పలు వైవిధ్యమైన చిత్రాలను పలు బ్యానర్లపై రూపొందించారు. 1970లో కెవి నందనరావు (కె వాయునందనరావు) దర్శకుడిగా, భావన్నారాయణ సమర్పణలో ఎస్‌విఎస్ బ్రదర్స్ రూపొందించిన చిత్రం -మానాన్న నిర్దోషి.
కృష్ణా జిల్లా బందరుకు చెందిన వాయునందనరావు సినిమా దర్శకత్వానికి ఆకర్షితులై మద్రాస్ వెళ్లారు. అక్కడ ప్రముఖ దర్శకుడు యోగానంద్‌ని పరిచయం చేసుకుని సహాయ దర్శకునిగా కొంతకాలం పనిచేశారు. తరువాత మరో ప్రముఖ దర్శకుడు సిఎస్ రావువద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి, సహ దర్శకునిగానూ కొన్ని చిత్రాలకు బాధ్యత వహించారు. 1968లో ‘సతీ అరుంధతి’ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. తరువాత 1970లో జగత్‌జెట్టీలు, మానాన్న నిర్ధోషి, 1971లో రౌడీరంగడు, నిజరూపాలు (1974) వంటి చిత్రాలకు దర్శకత్వం నిర్వహించారు. ప్రముఖ నటుడు, నిర్మాత యస్‌వి రంగారావువద్దా కొన్ని చిత్రాలకు సహాయ దర్శకత్వం వహించిన కెవి నందనరావువద్ద ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సహ దర్శకునిగా పని చేయటం విశేషం. అందుకు కృతజ్ఞతగా దాసరి నారాయణరావు 1981లో నిర్మించిన జయసుధ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను కెవి నందనరావుకు అప్పగించటం మరింత విశేషం.
కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన సాంఘిక చిత్రం -మానాన్న నిర్దోషి. అంతకుముందు తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించినా, తెలుగులో బాలనటిగా శ్రీదేవి నటించిన తొలి చిత్రంగా -మానాన్న నిర్దోషి ఓ ప్రత్యేకత నిలుపుకుంది. జనవరి 30, 1970న విడుదలైన ఈ చిత్రం 50 వసంతాలు పూర్తి చేసుకుంది.

కథ: శారదాంబ
మాటలు: పాలగుమ్మి పద్మరాజు
సంగీతం: పెండ్యాల
నృత్యం: చిన్ని, సంపత్
ఫొటోగ్రఫీ: విఎస్‌ఆర్ స్వామి
కూర్పు: ఆర్ హనుమంతరావు
సమర్పణ: ఎస్ భావనారాయణ
నిర్మాతలు: ఎస్‌విఎస్ బ్రదర్స్
దర్శకత్వం: కెవి నందన్‌రావు.

గ్రామంలో ఆదర్శవంతుడైన డాక్టరు కృష్ణ (కృష్ణ). ఆ ఊరి జమీందారు రాజా చిన్నారావు (గుమ్మడి వేంకటేశ్వర రావు). గ్రామ ప్రజల సంక్షేమం కోరి మంచినీటి ట్యాంక్ నిర్మించే విషయంలో కృష్ణ, చిన్నారావు మధ్య అపోహలు తలెత్తుతాయి. ముందు కృష్ణను అపార్థం చేసుకున్నా, అతని మంచితనం మెచ్చి ప్రేమించి, ప్రేమింప చేసుకుంటుంది చిన్నారావు కుమార్తె రాధ (విజయనిర్మల). తండ్రి వారి వివాహానికి అంగీకరించడు. దీంతో ఇల్లొదిలి వెళ్లిపోయిన రాధ, కృష్ణను పెళ్లాడి ఆనందంగా జీవిస్తుంటుంది.
చిన్నారావు మేనల్లుడు నాగేష్ (నాగభూషణం). చిన్నారావు ఆస్తిని చేజిక్కించుకోవాలని యత్నిస్తుంటాడు. ఆస్తిపరుడు చక్రపాణి (నాగయ్య) కుమార్తె కస్తూరి (శుభ), ఆమె చెల్లెలు రమాప్రభ. వ్యసనపరుడైన నాగేష్‌కు ఆస్తి దక్కకూడదని తన ఆస్తికి డాక్టరు కృష్ణను ట్రస్టీగా నియమిస్తూ చక్రపాణి వీలునామా వ్రాస్తాడు. దాంతో డాక్టర్‌మీద కక్ష పెంచుకున్న నాగేష్, డాక్టర్ చక్రపాణికి ఇచ్చిన మందులో విషం కలుపుతాడు. అది త్రాగి చక్రపాణి మరణించటం, డాక్టర్ కృష్ణను అనుమానించి పోలీసులు అరెస్ట్ చేస్తారు. కృష్ణకు 15ఏళ్లు జైలు శిక్ష పడడంతో, రాధ ఒంటరిగా తన బిడ్డతో జీవిస్తుంటుంది. రాధ కొడుకు చిన్నా (ఏడేళ్ల బేబి శశి) తండ్రి జైలులో ఉన్నాడని, హంతకుడని తెలుసుకుంటాడు. తండ్రిని కలుసుకున్న సందర్భంలో అతను నిర్దోషి అని గ్రహిస్తాడు. తన మరదలు సుధ (బేబీ శ్రీదేవి)తో కలిసి నాగేష్ గ్రామం వెళ్తాడు చిన్నా. చాకచక్యంగా అతన్ని పోలీసులకు పట్టించి, తండ్రిని నిర్దోషిగా విడుదల చేయిస్తాడు.
ఈ చిత్రంలో జమీందారు సోదరిగా సూర్యాకాంతం, పోలీస్ సూపర్నెంటుగా మిక్కిలినేని, కృష్ణ స్నేహితుడిగా రాజ్‌బాబు, నాగభూషణం ప్రేయసిగా విజయలలిత, మాస్టర్ విశే్వశ్వరరావు తదితరులు నటించారు.
దర్శకులు నందనరావు చిత్రంలోని సన్నివేశాలను అర్ధవంతంగా, సహజంగా తీర్చిదిద్దారు. గ్రామ ప్రజల మంచికోరి జమీందారును ఎదిరించే వ్యక్తిగా, ఆదర్శ వైద్యునిగా కృష్ణ పాత్రను రూపొందించారు. మొదట హీరోపట్ల కోపం పెంచుకున్న రాధ, నిజం గ్రహించి అతన్ని ప్రేమించి వివాహం చేసుకోవటం; అన్యాయంగా శిక్షపడిన కృష్ణ, రాధను జైలుకు రావొద్దని, తమ బిడ్డకు విషయం తెలియ చేయొద్దని కోరటం; ఆత్మాభిమానం కలిగిన రాధ తన భర్తను కేసునుంచి తప్పించటానికి లాయర్ సాయం కోసం తండ్రివద్దకు వచ్చి తిరస్కరణకు గురవ్వటం; గర్భవతిగా రాధ పలుపాట్లు పడటం, కథానుసారంగా విలన్ నాగభూషణం భార్యను, మరదలిని ఇబ్బంది పెట్టడం; రాధను, ఆమెకు సాయపడుతున్న రాజ్‌బాబుపై సూర్యకాంతం అనుచితంగా నిందలువేయటం వంటి సన్నివేశాలను ఎంతో భావయుక్తంగా నడిపించారు. స్కూలు వార్షికోత్సవంలో మాస్టర్ చిన్న, బాలలపై చిత్రీకరించిన నృత్యగీతం -చిన్నారి పాపల్లారా/ విన్నారా దేవుని.. (గానం: పి సుశీల, ఎస్ జానకి బృందం). బ్లాక్ అండ్ వైట్ చిత్రంలో పాటను రంగుల్లో చిత్రీకరించటం విశేషం. నిజం తెలుసుకున్న చిన్నా తండ్రివద్దకెళ్లి అతన్ని వేణుగోపాలస్వామి గుడికి తీసుకెళ్లి ప్రమాణం చేయించటం, దానికి సూపర్నెంట్ అంగీకారం తీసుకోవటం లాంటి సన్నివేశాలను క్రమపద్ధతిలో రూపొందించి, సన్నివేశానికి తగిన భావన కలిగేలా తీర్చిదిద్దారు. మరదలు సుధతో కలిసి పాడే పాట -ఎంతెంత దూరం (గానం: పి సుశీల, ఎస్ జానకి). వారిరువురూ ఊరుచేరాక వేణుగోపాలస్వామి గుడిలో కృష్ణలీలల చిత్రాలను చూపుతూ ఒక్కొక్క పద్యాన్ని వినిపించటం; ఎంతో సాహసంతో ఇరువురూ తప్పించుకునే ప్రయత్నాలు; చివరలో నాగభూషణం చేత ‘నేను హత్యచేసి ఎనిమిదేళ్లయినా ఎవరూ కనిపెట్టలేదు. ఈ చిన్నవాడు పట్టుదలతో సాధించాడు’ అని చిత్రకథకు వివరణ ఇవ్వటం బావుంటుంది.
రాధ, కృష్ణల మధ్య ప్రేమగీతం -ఏమండి అబ్బాయిగారు/ ఏమండి అమ్మాయిగారూ (గానం: ఎస్పీ బాలు, ఎస్ జానకి). అవుట్‌డోర్‌లో తోటలో యుగళగీతం సరదాగా చిత్రీకరించారు. తరువాత వారిరువురి తొలిరేయి గీతం, చిత్రంలోని హిట్ సాంగ్ -అలకలు తీరిన కన్నుల ఏమనే ప్రియా. చంద్రుడు, పిల్లగాలుల్లో అలరించే మృదుమధుర ప్రణయగీతంగా సమర్థమైన చిత్రీకరణలో ముచ్చట గొలుపుతుంది. దర్శకుని భావాలు పాటలు, కృష్ణలీలల పద్యాల చిత్రీకరణలో ప్రతిఫలించాయి అనుకోవాలి.
సన్నివేశాలకు తగిన నటనతో నటీనటులు మెప్పించారు. ఆదర్శవంతమైన డాక్టరుగా కృష్ణ, అతనికి తగిన ఇల్లాలిగా విజయనిర్మల, ఆవేశపూరితుడైన జమీందారుగా, తరువాత కన్నకూతురి క్షేమంకోరే తండ్రిగా గుమ్మడి, గయ్యాళి అత్తగా తల్లిగా బామ్మగా సూర్యాకాంతం, చివరలో కొడుకువద్ద డబ్బు తీసుకుంటూ అతనిచేత గాయపడి, మనవడి క్షేమంకోరే సన్నివేశంలో తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఈ చిత్రంలో ముగ్గురు బాలనటుల నటన ప్రశంసనీయంగా, ప్రేక్షకుల మెప్పుపొందేలా సాగటం, ఎంతో సహజంగా వారి హావభావాలు ప్రదర్శించటం విశేషం. బేబీ శ్రీదేవి తన ముద్దు ముద్దు మాటలతో ముచ్చటగొలిపే నటన చూపటం, తరువాతి కాలంలో ఆమె హీరో కృష్ణ సరసన నాయికగా పలు చిత్రాల్లో మెప్పించటం అరుదైన విశేషం.
పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చిన చిత్రంలో గీతాలన్నీ సి నారాయణరెడ్డే రాశారు. కొన్ని పాటలు నేటికీ శ్రోతలను అలరించటం ఆనందదాయకం. ఈ చిత్రంలోని ఇతర గీతాల్లో.. రమాప్రభ, కృష్ణ, విజయనిర్మలపై -అమ్మదొంగా చెమ్మచెక్క (ఎస్ జానకి), మరో గీతం -ఏప్రిల్ పూల్ అన్నయ్య (ఎస్ జానకి), విజయనిర్మలపై చిత్రీకరించిన జోలపాట -ఓ చిన్న నీకన్న పెన్నిధి ఎవరు (పి సుశీల, రమణ), నాగభూషణం, విజయలలితపై -నిషాలో నువ్వు నిషాలో నేను ఉసిగొలిపే (ఎస్ జానకి) చిత్రీకరించారు. చిత్రంలో ఘంటసాల ఎస్ జానకితో కలిసి పాడిన తమాషా పేరడి గీతం -మీరజాలగలడా నా యానతి పాటకు -మీరజాలగలనా నీ ఆనతి ఓ లలనా.. ఒక్కొక్క నవ్వుకు ఒక్కొక్క వంద అంటూ నాగభూషణం, విజయలలితల నృత్యంతో సాగుతుంది.
‘మానాన్న నిర్దోషి’ చిత్రం బాలనటిగా శ్రీదేవి తొలి చిత్రంగా గుర్తింపు సంతరించుకుంది. సినిమాపై అద్భుతమైన నటనతో బాలనటులు మెప్పించటం ఓ ప్రత్యేకత అనుకోవాలి.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి