ఫ్లాష్ బ్యాక్ @ 50

లక్ష్మీకటాక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పింజల సుబ్బారావు మచిలీపట్నంలో జన్మించారు. నటునిగా, కొంతకాలం ప్రొడక్షన్ మేనేజర్‌గా చిత్ర పరిశ్రమలో అనుభవం సంపాదించారు. వేస్ట్ ఫిల్మ్ కొనుగోలు -అమ్మకం వ్యాపారాన్నీ కొద్దిరోజుల పాటు నిర్వహించారు. చిత్ర నిర్మాణంపట్ల మక్కువతో తొలుత ఒక తమిళ చిత్రాన్ని ‘రాజద్రోహి’ టైటిల్‌తో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ‘నానళ్’ అనే తమిళ చిత్రాన్ని ‘హంతకులొస్తున్నారు జాగ్రత్త’ పేరిట తెలుగు చిత్రంగా రూపొందించారు. తరువాత పిఎస్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు చిత్రాలు రూపొందించారు. 1968లో ‘రణభేరి, ‘పేదరాశి పెద్దమ్మకథ’ చిత్రాలు నిర్మించిన వీరు -1970లో యన్టీ రామారావు, కెఆర్ విజయ కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం లక్ష్మీకటాక్షం.
పలు చిత్ర విచిత్ర సంఘటనలు, భయంకరమైన కత్తియుద్ధాలు, జంతువుల విచిత్ర విన్యాసాలు, హీరో సాహసాలు ప్రతిబింబించేలా పలు జానపద చిత్రాలను రూపొందించి -జానపద బ్రహ్మగా ఘనత వహించిన బి విఠలాచార్య దర్శకత్వంలో ‘లక్ష్మీకటాక్షం’ తీర్చిదిద్దబడింది. 1970 ఫిబ్రవరి 12న విడుదలై 50ఏళ్లు పూర్తి చేసుకుంది.
*
కథ: హెచ్‌వి సుబ్బారావు
మాటలు: చిల్లర భావన్నారాయణ
కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
నృత్యం: కెఎస్ రెడ్డి
స్టంట్స్: శివయ్య
సంగీతం: కె కోదండపాణి
ఫొటోగ్రఫీ: హెచ్‌ఎస్ వేణు
కూర్పు: గోవిందస్వామి
దర్శకత్వం: బి విఠలాచార్య
నిర్మాత: పింజల సుబ్బారావు.
*
ఈ చిత్రానికి మాటలు, కొన్ని పాటలు సమకూర్చిన చిల్లర భావన్నారాయణ తొలుత నాటక రచయితగా ప్రసిద్ధులైనారు. మంచి సాహిత్య అభినివేశం, భాషపట్ల పట్టుగల వీరు నిర్మాత పింజల సుబ్బారావు రూపొందించిన ‘సుగుణసుందరి కథ’, ‘పేదరాశి పెద్దమ్మకథ’, ‘లక్ష్మీకటాక్షం’ వంటి జానపద చిత్రాలకు మాటలు, కొన్ని పాటలు వ్రాశారు. అలాగే కొన్ని చిత్రాల్లో నటునిగా చిన్న చిన్న పాత్రలు పోషించారు. ప్రపంచంలో మానవులంతా కాంక్షించేది ఆ మహాలక్ష్మిదేవి కృపా కటాక్షాలేనన్న విషయం ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు.
మహాతపోనిధి కోదండపాణేశ్వరుడు (మిక్కిలినేని), అతని శిష్యులైన ప్రచండుడు (సత్యనారాయణ), వినయానంద (బాలయ్య)కు అష్టైశ్వర్యాలతో కూడిన లక్ష్మీభాండాగారం గురించి చెబుతాడు. ఆ సంపద లోకకల్యాణం కోసం వినియోగించాలంటాడు. దురాశాపరుడైన ప్రచండుడు నిధిని పొందాలనుకుంటాడు. ఆ నిధి శృంగారపు రాకుమారుని వలనే సాధ్యమవుతుందని గ్రహిస్తాడు. మహారాణి (హేమలత) ప్రసవించిన బిడ్డను తస్కరించి తనవద్ద కులవర్ధనుడనే పేరుతో పెంచి పెద్ద చేస్తాడు. నిధిని సాధించటానికి తొలుత అష్ట అండాలు యువరాజుతో సేకరింపచేసి, అతన్ని విసరికొడతాడు. ఈ చర్యకు అడ్డుపడిన వినయుని కుక్కగా మార్చేస్తాడు. వినయానందుని వలన తన విద్యలు, జ్ఞానం తిరిగి గ్రహించిన కులవర్ధనుడు, ప్రచండుని కలుసుకుంటాడు. అతనితో కలిసి లక్ష్మీభాండాగారం కోసం బయలుదేరతాడు. పురంధర రాజ్యంలో ఆ నిధి ఉందని తెలుసుకుంటారు. ఆ దేశపు మహారాణి హేమమాలిని, కులవర్ధనుని పరాక్రమం మెచ్చి అతని సాయంతో నిధి సాధించాలని అనుకుంటుంది. పలు ఆటంకాలు ఎదుర్కొని కులవర్ధనుడు నిధిని సాధిస్తాడు. మాతాపితలను హింసించి.. హేమమాలినిని, నిధిని పొందాలని పన్నాగం పన్నిన ప్రచండుని కులవర్ధనుడు ఓడించటం, అదే సమయంలో గురువు ప్రంచండుని శపించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. హెచ్‌వి సుబ్బారావు సమకూర్చిన కథకు తగిన పదునైన సంభాషణలతో చిల్లర భావన్నారాయణ చిత్రాన్ని అలరింపచేశారు. కెఆర్ విజయ, యన్టీఆర్‌ల మధ్య సరస సంభాషణలు, భావుకతతో కూడిన మాటల విసుర్లు, ఒకరినొకరు కవ్వించుకోవటం, రెచ్చగొట్టడం ముచ్చటగా సాగాయి. యన్టీ రామారావు, కెఆర్ విజయల నటన చిత్రానికి ప్రత్యేకతగా నిలవటం ఎన్నదగిన అంశం.
వైవిధ్యభరితంగా జానపద చిత్రాలను రూపొందించగల విఠలాచార్య -అనేక మెలికలున్న కథను ఆసక్తికరంగా, జనరంజకంగా తీర్చిదిద్దారు. లక్ష్మీభాండాగారపు వివరాలు, శృంగారపుర రాజ సింహాసనంలో, పురందర రాజ్యంలో, అలాగే ఒక భాండంలో, ఆ భాండాన్ని శృంగారపుర మహారాణి పగిలిన అండాలతో పాయసం వండి అందులో కత్తిముంచి భాండం కోయటం; తొలుత ప్రచండుడు నిధికోసం ప్రయత్నించి చెట్టు తొర్రలో అండం తెచ్చి వినాయకుని చెవిలో పెట్టడం, అతనికి భంగపాటు; తిరిగి యన్టీఆర్‌ను పెంచి పెద్దచేసి.. అతనిద్వారా గుహలో అండాలు సంపాదించి అతన్ని శక్తిహీనునిగా మార్చటం, వినయానందుని కుక్కగా మార్చటం; గుహలో పాపనాశన తీర్థంలో మునిగి వారు తిరిగి శక్తులు పొందటం; పద్మరేఖ హస్తం కోసం గాలింపులు; పురప్రజలు దానికోసం వాతలు వేసుకోవటం; వినయానందుని సూచనపై హేమమాలిని (కెఆర్ విజయ) చెలికత్తె వేషంలో శృంగారపుర అంతఃపురంలో యువరాజును కలుసుకోవటం; అతన్ని తన సైన్యంతో బంధింపచేసి ప్రచండుని, మహారాజు (ప్రభాకరరెడ్డి)ని వదలివేయటం; కులవర్థనునికి నిజం తెలియచేసి అతని ప్రేమను పొందటం; మధ్యలో వీరిని శపించబోయిన ప్రచండుని శక్తులను వినయానందుడు భగ్నంచేయటం; లక్ష్మీభాండాగారం చేరిన కులవర్ధనునికి లక్ష్మీప్రసన్నం కలగటంలాంటి సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. చక్కని స్వాగత నృత్యగీతం -స్వాగతం క్షాతవనజనజైత (గానం: ఎస్ జానకి, పి లీల బృందం), -్ధన్యోస్మి త్రైలోక్యమాతా (ఘంటసాల), -శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు (గానం: ఎస్ జానకి) -జయజయ మహాలక్ష్మీ (బృందగానం), -గత సువిజ్ఞాన ప్రకాశం మరల కల్పించినావు (గానం: ఘంటసాల). ఈ పద్యాలు, గీతాలను రచించింది చిల్లర భావన్నారాయణ. జలకాలాడుతున్న కెఆర్ విజయ, చెలికత్తెలు, చాటునుంచి చూస్తున్న యన్టీఆర్‌లపై చక్కని సెట్టింగ్స్ మధ్య ఆకట్టుకునేలా చిత్రీకరించిన వీరిదే మరో గీతం -నా మనసు సుగంధం/ నా మనసు మకరందం (గానం: పి సుశీల, విజయలక్ష్మీశం).
అంతకుముందు గుర్రాలపై సైనికుల ఛేజింగ్‌లు; సింగారిలో కులవర్ధనుడు గుర్రంపై దౌడుతీయటం, సైనికులు వెంబడించటం; పావురం ద్వారా హేమమాలిని రహస్య వర్తమానం పంపటం; చిత్ర ప్రారంభంలో పదునైన కత్తితో దాడిచేసిన జగ్గారావును వట్టి చేతులతో యన్టీఆర్ ఎదిరించటం.. లాంటి ఎన్నో థ్రిల్లింగ్‌లు, కొత్త కొత్త ట్విస్టులకు తగిన సన్నివేశాలను కథానుగుణంగా దర్శకుడు తీర్చిదిద్దటంతో మహత్తర జానపద చిత్రంగా నిలిచి, లక్ష్మీకటాక్షం విజయం సాధించి ప్రశంసలు పొందటం హర్షణీయాంశం.
చిత్రగీతాలు:
పాటల చిత్రీకరణలోనూ అదే ఒరవడి సాగటం మరింత సొబగుకూర్చింది. తొలుత మేకలు తోలుతూ రాజశ్రీపై చిత్రీకరించిన సినారే పాట -హైరే పైరగాలి ఆగి ఆగి విసిరింది (గానం: ఎస్ జానకి). కెఆర్ విజయ, యన్టీఆర్‌లపై -అమ్మమ్మమ్మ తెలిసిందిలే. తోటలో పూల చెట్లమధ్య ఆనందంగా సాగే మరో గీతం -రా వెనె్నల దొరా/ కన్నియను చేరా (గానం: సుశీల, ఘంటసాల). రాజశ్రీ, యన్టీఆర్‌లపై చిత్రీకరించిన మరో గీతం -కిలకిల బుల్లెమ్మా (రచన: కొసరాజు, గానం: ఘంటసాల, ఎస్ జానకి). ఘంటసాల గానం చేయగా యన్టీఆర్‌పై చిత్రీకరించిన పద్యం -శుక్లాంబరధరం విష్ణుం శ్లోకం. చిత్రం చివరలో ప్రచండుడు సత్యనారాయణ, మహారాజు ప్రభాకరరెడ్డి, హేమలతలపై గుహలో చిత్రీకరించిన గీతం, జ్యోతిలక్ష్మి నృత్యగీతం -అందాల బొమ్మను నేను చెలికాడా (గానం:ఎల్‌ఆర్ ఈశ్వరి, రచన: విశ్వప్రసాద్).
చిత్రంలో నటీనటులంతా మెచ్చదగిన రీతిలో తమ పాత్రలను సమర్ధంగా పోషించారు. ప్రచండునిగా సత్యనారాయణ ఆ పాత్రకు తగిన క్రౌర్యాన్ని చూపించి మెప్పించగా, వినయానందగా బాలయ్య రౌద్రం, శాంతం సన్నివేశానుగుణంగా చూపించి బ్యాలెన్స్‌గా నటించి ప్రత్యేకత చూపటం విశేషాంశం. చిత్రంలో ఇంకా కెకె శర్మ, జగ్గారావు, కాశీనాథ్ తాత, హాస్యజంటగా బాలకృష్ణ -్ధన్యశ్రీ, యమున నటించారు.
చక్కని కథాసంవిధానంతో, అలరించే నటీనటుల నటసామర్థ్యం, మహాలక్ష్మీ కృపాకటాక్షాలను వివరించే పద్యాలు, స్తుతులతో రూపొందిన చిత్రం పర్వదినాలలో టీవీ మాధ్యమంలో ప్రసారమవుతూ ఇప్పటికీ అలరిస్తుంది. ‘శుక్రవారపు పొద్దు’ పద్యం శ్రోతల మనసులో నిత్యనూతనంగా నిలిచి చిత్రాన్ని గుర్తు చేస్తుండటం అరుదైన విశేషం. చిత్ర గీతాలు సంగీత కార్యక్రమాల్లో వీనులవిందుగా శ్రోతలను రంజింప చేస్తున్నాయి.

-సీవీఆర్ మాణిక్వేశ్వరి