ఫ్లాష్ బ్యాక్ @ 50

మళ్లీ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు సి పుల్లయ్య కుమారుడు సి శ్రీనివాసరావు. వైవిధ్యభరితమైన సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలను సమర్ధంగా తీర్చిదిద్ది తనకంటూ ప్రత్యేకత సాధించుకున్నారు. వీరి దర్శకత్వంలో జి కృష్ణారావు సమర్పణలో నిర్మాత టి సూర్యనారాయణ నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. కృష్ణ, విజయనిర్మల జోడీగా 1970 ఫిబ్రవరి 14న విడుదలైన సినిమా 50ఏళ్లు పూర్తి చేసుకుంది.
*
బ్యానర్: మిత్ర ప్రొడక్షన్స్
కథ: మల్లియం రాజ్‌గోపాల్
మాటలు: ఆరుద్ర
సంగీతం: కెవి మహదేవన్
నృత్యం: రాజు, శేషు
కూర్పు: ఆర్ హనుమంతరావు
కళ: పి వెంకట్రావు
ఛాయాగ్రహణం: జికె రాము
దర్శకత్వం: సిఎస్ రావు
నిర్మాత: టి సూర్యనారాయణ
*
‘మరుగేలరా ఓ రాఘవా’ కీర్తన బ్యాక్‌గ్రౌండ్ వస్తుంటే టైటిల్స్‌పడ్డాక కథ మొదలవుతుంది.
పలుకుబడి, ఆస్తి, అంతస్తువున్న వ్యక్తి జానకిరామయ్య (నాగయ్య). అతని భార్య సీత (హేమలత). తల్లి నిర్మలమ్మ, కుమారుడు మోహన్ (ప్రభాకర్‌రెడ్డి), కోడలు జయ (ఉదయచంద్రిక), కుమార్తె విజయలక్ష్మి (విజయనిర్మల). జానకిరామయ్య స్నేహితుడు ధర్మారావు (రేలంగి) ఓ వకీలు. అతని భార్య రాజ్యం (సూర్యాకాంతం). ఆమె తమ్ముడు పాపారావు (రాజ్‌బాబు). ధర్మారావు స్నేహితుడు చలమయ్య (మిక్కిలినేని), అతని మేనల్లుడు వేణుగోపాల్ (కృష్ణ), సోదరి విజయలక్ష్మి (అనిత). తల్లిదండ్రులు లేని ఆ ఇద్దరినీ చలమయ్య పెంచి పెద్ద చేస్తాడు. లక్ష్మి కాలేజీలో చదువుతుంటుంది. వేణు ఉద్యోగం చేస్తుంటాడు. ధర్మారావు సూచనతో చలమయ్య మేనల్లుడు వేణు మంచితనం గురించి తెలుసుకున్న జానకిరామయ్య, తన కుమార్తె విజయకు అతనితో వివాహం జరిపిస్తాడు. వేణు చెల్లెలిని ఇంట్లో అంతా లక్ష్మి అని పిలవటం అలవాటు. వేణు చెల్లెలు లక్ష్మి, మెడిసిన్ చదువుతున్న శేఖర్ (కృష్ణంరాజు) ప్రేమించుకుంటారు. కట్నంకోసం ఆశపడిన శేఖర్ తండ్రి ధూళిపాళ, తన కొడుక్కి వేరే సంబంధం ఖాయం చేస్తాడు. అది తప్పించుకోవటానికి శేఖర్ పిచ్చివాడిగా నటిస్తాడు. శేఖర్‌కు పెళ్లి కుదిరిందని తెలుసుకున్న లక్ష్మి ప్రమాదానికి గురై మరణిస్తుంది. లక్ష్మి, శేఖర్‌ల ప్రేమ విషయం తెలిసిన విజయ, భర్తకు ఆ సంగతి చెప్పబోయినా వీలుకాదు. శేఖర్ లక్ష్మికి వ్రాసిన ఉత్తరంలో అతడు విజయగా ప్రేమించింది తన సోదరి అని తెలియక, తన భార్య తప్పు చేసిందని భావించి.. వేణు ఆమెకు కోర్టుద్వారా విడాకులిస్తాడు. పుట్టింట్లో విచారంతోవున్న విజయ పరిస్థితులు మరింత అస్తవ్యస్తంగా మారటం, మోహన్ ఇచ్చిన పేపరు ప్రకటన ద్వారా శేఖర్, వేణు ఇంటికి వచ్చి జరిగిన నిజం వెల్లడించటం, తన ప్రేయసి మరణానికి చింతించటం, నిజం తెలుసుకున్న వేణు నిరాశతో వెనుదిరిగిన విజయను గుడిలో కలుసుకొని క్షమాపణ కోరి.. విడాకులద్వారా వేరైనవారు దాన్ని రద్దుచేసికొని తిరిగి మళ్లీ పెళ్లి చేసుకోవటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఇంకా కాలేజీ లెక్చరర్ శేఖర్‌గా సత్యనారాయణ (గెస్ట్‌గా), ఆనందమోహన్, కృష్ణంరాజు స్నేహితుడు ప్రసాద్‌గా లవకుశ నాగరాజు కనిపిస్తారు.
చిత్ర ప్రారంభంలో విజయనిర్మల ఎంతో చురుకుగా కనిపిస్తుంది. తాత, బామ్మ తల్లీదండ్రి, అన్నా వదినలకు దగ్గరుండి కాఫీ, కావాలిసినవి అందించే సన్నివేశంతో ఆమె స్వభావాన్ని వెల్లడిస్తారు. పెళ్లిచూపుల్లో ఒద్దిక; వివాహం జరిగాక భర్తతో అన్యోన్యత, అనురాగం; ఆడపడుచు లక్ష్మితో చనువు; ఆమె ప్రేమ విషయం గ్రహించి మంచిచెడ్డలు వివరించటం, ఆమె ప్రేమలేఖలు తనవద్ద దాచటం; అన్నకు చెప్పవద్దన్న ఆడపడుచు మాట మన్నించటం, దాని కారణంగానూ వారిద్దరి పేర్లలో విజయ అనే సారూప్యత; అలాగే తన లెక్చరర్ శేఖర్ (సత్యనారాయణ) లక్ష్మి ప్రియుడు శేఖర్ (కృష్ణంరాజు) ఒకపేరే కావటంతో జరిగే అపార్థాలు లాంటి సన్నివేశాలను దర్శకుడు పట్టుతో తెరకెక్కించారు. ఎంతో మక్కువతో ప్రేమించిన భార్యను వేణు అపార్థం చేసుకోవటం, వ్యాపారం దివాళా తీసి అప్పులపాలు కావటం, పుట్టింట్లో విజయ విచారం, భర్త కోర్టుద్వారా విడాకులు కోరినపుడు.. తన శీలం నెపంగా చూపి విడాకులు కోరవద్దని భర్తను వేడుకోవటం, అలాగే విడాకులు పొందాక భర్తమీద మనోవర్తి కోసం దావా వేయటం, కోర్టుద్వారా వచ్చే మనోవర్తి కారణంగా తన భర్త మనస్సులో తానుంటానన్న భావనే తన బలమని విజయ చెప్పటం, అల్లుడి పట్ల జానకిరామయ్య కోపం ప్రదర్శించటం, చెల్లెలి కాపురం నిలబెట్టడానికి వెళ్లిన మోహన్, వేణుతో ఘర్షణపడే సన్నివేశాలను ఎంతో ఉదాత్తంగా, సున్నితంగా చిత్రీకరించారు. వేణుచే దెబ్బలుతిన్నా పట్టించుకోకుండా మోహన్ అనునయించటం, తండ్రికి, భార్యకు విషయం చెప్పకపోవటం, భర్త అనారోగ్యం గురించి తెలిసి వెళ్ని విజయను వేణు అవమానించగా, తన బాధను గుడిలో అమ్మవారితో చెప్పుకుంటూ విజయ తెలివి తప్పటం, నిజం తెలుసుకున్న వేణు ఆమెకోసం గుడిలో తల కొట్టుకోవటం, కృష్ణంరాజు చాటునుంచి దేవిని ప్రార్థించటం... ఇలా పలు ఆకట్టుకునే అర్ధవంతమైన సన్నివేశాలతో చిత్రాన్ని దర్శకులు తీర్చిదిద్దారు. మధ్యలో రాజ్‌బాబు, అతని ప్రేమ పెళ్లి విడాకులు వంటి చిన్ని చిన్ని సన్నివేశాలు కథాగమనానికి మార్పు కలిగించినా, అనాలోచితంగా ఆవేశంలో తీసుకునే నిర్ణయాల ఫలితాలను చక్కగా విశే్లషిస్తూ దానికి తగ్గట్టు ఆరుద్ర పదునైన సంభాషణలు సన్నివేశాలకు మరింత హంగు తెచ్చాయి. జయాపజయాల విషయాన్ని పక్కనపెడితే, కుటుంబసమేతంగా చూడతగిన చిత్రంగా మళ్లీ పెళ్లిని పరిగణించొచ్చు.
కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నవారు, మళ్లీ దాన్ని కోర్టు ద్వారానే రద్దు చేసుకోవాలని వకీలు ధర్మారావు (రేలంగి)చే చెప్పించి వారికి మళ్లీ పెళ్లి చేయటాన్ని టైటిల్ జస్ట్ఫికేషన్‌గా ముగింపునివ్వటం విశేషం.
చిత్రంలోని గీతాలు
ఆరుద్ర రచనలో (1)
కృష్ణంరాజు, అనితలపై యుగళగీతం -ఆగమంటే ఆగలేను (రచన: ఆరుద్ర, గానం: పి సుశీల, ఎస్‌పి బాలు). దేవాలయంలో విజయనిర్మలపై -అమ్మా భవానీ జననీ (రచన: ఆరుద్ర, గానం: ఎస్ జానకి). -ఇదే నా భారతీయమేనా ఇది సదాచారమేనా (రచన: ఆరుద్ర, గానం: ఘంటసాల). పెళ్లికూతురు, పెండ్లికొడుకును చేస్తుండగా విజయనిర్మల, కృష్ణపై చిత్రీకరించిన పద్యాలు -శుభముహూర్తంబున సొంపుగా పెళ్లి కూతురును (రచన: ఆరుద్ర, గానం: ఘంటసాల).
విజయనిర్మల, మరో ఆరుద్ర గీతం -మలయ పవనాలు వీచి (గానం: ఎస్ జానకి), రాజ్‌బాబు, రేణులపై చిత్రీకరించిన క్లబ్ సాంగ్ -ఈ చిన్నది లేత వయసుది ఎవరిది, ఎవరిది (గానచ: యల్‌ఆర్ ఈశ్వరి, రచన: అప్పారావు). -జీవితం ఎంతో తియ్యనిది అది అంతా నీలో (గానం: పి సుశీల, రచన: అప్పారావు). ఇదే పాటను సినిమాలో మరోసారి ఎస్పీ బాలు పాడతారు.
తొందరపాటు నిర్ణయాలు ఎటువంటి అనర్థాలకు దారితీస్తాయో తెలియచేస్తూ, పాత్రల మనో విశే్లషణ పరిపూర్ణంగా చిత్రీకరిస్తూ రూపొందించిన చిత్రం మళ్లీ పెళ్లి. ప్రధాన పాత్రధారులైన కృష్ణ, విజయనిర్మల పరిపూర్ణమైన నటనతో మెప్పించగా, మిగిలిన పాత్రధారులు పాత్రోచితంగా నటించారు. ‘మళ్లీ పెళ్లి’ యావరేజి చిత్రంగా నిలిచింది. అంతగా ప్రేక్షకులకు చేరువకాలేకపోయినా, టీవీ ప్రసారాల్లో అర్థవంతమైన కథాచిత్రంగా మన్నన పొందింది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి