ఫ్లాష్ బ్యాక్ @ 50

కథానాయిక మొల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1945లో వచ్చిన ‘మాయాలోకం’ చిత్రంతో నటుడిగా ప్రస్థానం మొదలెట్టారు పద్మనాభం. పలు చిత్రాల్లో మంచి హాస్యనటుడిగా ప్రత్యేకత సాధించారు. రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ ద్వారా సినిమాల్లో నటిస్తూనే నాటకాల్లోనూ పలు పాత్రలు ధరించి ఉభయ రంగాల్లో మన్ననలు అందుకున్నారు. రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ బ్యానర్‌పై తొలిసారిగా యన్టీ రామారావు, సావిత్రి కాంబినేషన్‌లో -దేవత చిత్రం రూపొందించి నిర్మాతయ్యారు. తరువాత పొట్టిప్లీడరు, శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రాలను రూపొందించారు. ఈ మూడు చిత్రాలకూ హేమాంబరధరరావు దర్శకుడు. తరువాత వీరు రూపొందించిన చిత్రం -శ్రీరామకథ. తొలిసారి పద్మనాభం దర్శకత్వం చేపట్టిన చిత్రమిది. తరువాత 1970లో నిర్మించిన చిత్రమే -కథానాయిక మొల్ల. ఈ చిత్రానికీ పద్మనాభమే దర్శకుడు. ఈ సినిమా నిర్మించాలనుకున్న తరువాత.. కథ కోసం మొల్ల జీవిత విశేషాలపై అధ్యయనం చేశారు. తెలుగు సాహితీ చరిత్రలో మొట్టమొదటి కవయిత్రి మొల్ల. ఆమె రామాయణాన్ని 6 కాండాల పద్యకావ్యంగా రచించి శ్రీరామచంద్రునికి అంకితం చేసింది. అదే మొల్ల రామాయణం. ఆమె తండ్రి ఆత్మకూరి కేసన అని, అందుచే వారు నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన వారని, ఆమె 16వ శతాబ్దికి చెందినది కాబట్టి శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందినారనే పలు విషయాలతో మొల్ల చరిత్రను ప్రముఖ జర్నలిస్టు ఇంటూరి వెంకటేశ్వరరావు ‘కుమ్మరి మొల్ల’ నవల పేరిట రాశారు. నిర్మాత ఎల్‌వి ప్రసాద్ ఆ నవల రైట్స్ తీసుకున్నారు. అయితే, నవలాంశానే్న చిత్రంగా రూపొందించాలని నిర్ణయించుకున్న పద్మనాభం -ఇంటూరిని రైట్స్ అడిగారు. ఎల్‌వి ప్రసాద్‌కు ఇంటూరి విషయం వివరించి, దాని రైట్స్ పద్మనాభానికి ఇప్పించారు. అలా ‘కథానాయిక మొల్ల’ చిత్రానికి రంగం సిద్ధమైంది. మొల్ల పాత్రకు పద్మనాభం తొలుత కళాభారతి జమునను అనుకున్నారు. అప్పటికావిడ గర్భవతిగా ఉండటంతో -వాణిశ్రీని ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే ఇంటూరి వెంకటేశ్వరరావు, బిఎల్‌ఎన్ ఆచారి, అప్పలాచారి, ఆదుర్తి నరసింహమూర్తి, పద్మనాభం కలిసి రాశారు. 1970 మార్చి 5న విడుదలైన ఈ సినిమా 50ఏళ్లు పూర్తి చేసుకుంది.
*
కళ: అనంతరామ్
కూర్పు: బి హరినారాయణ
మాటలు: బియల్‌ఎన్ ఆచార్య
స్టంట్స్: సత్తిబాబు అండ్ పార్టీ
సంగీతం: ఎస్‌పి కోదండపాణి
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
దర్శకత్వం: పద్మనాభం
*
‘మానవ కల్యాణమునకు మల్లెల పందిళ్లువేసి’ (రచన: సినారె, గానం: ఘంటసాల) అన్న పద్యంతో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్మృతికి చిహ్నంగా సినిమాను ఆయనకు అంకితం చేశారు.
ఆత్మకూరు గ్రామంలో వెనుకబడిన జాతికి చెందిన కుమ్మరి వేతన (గుమ్మడి). వృత్తిపని, కూలి పని చేసుకునేవారికి పెద్దదిక్కు. అతని కుమార్తె మల్లమ్మ (వాణిశ్రీ). ఆ ఊళ్లో కుటిల పండితుడు రామాచారి (నాగభూషణం). అతని అనుయాయులు అవధాని (అల్లు రామలింగయ్య), దౌర్జన్యాలకు పాల్పడే కనకయ్య (మిక్కిలినేని). కొడుకు తిక్కన్న (రాజ్‌బాబు). రామాచారి భార్య సీతమ్మ (హేమలత) భర్త తప్పుడు పనులను వారిస్తుంటుంది. పేదల కష్టం దోచుకొని.. వారిని హింసిస్తున్న రామాచారిని మల్లమ్మ ఎదిరిస్తుంటుంది. మల్లన్న శ్రీశైల శివునిపై రాసిన శతక పద్యాలను రామాచారి తగలబెట్టిస్తాడు. అమ్మవారి జాతర పేరున జరిగే జంతు బలులు జరగకుండా మల్లమ్మ అడ్డుపడుతుంది. అందుకు రామాచారి పేదల గుడిసెలు తగలబెట్టిస్తాడు. మల్లమ్మను, తోటివారిని రాజోద్యోగులచే దండింప చేస్తాడు. మల్లమ్మ వారంలోగా పెళ్లి చేసుకోవాలని ఆంక్ష విధింపచేస్తాడు. దాన్ని ఎదిరించి దూరంగా వెళ్లిన మల్లమ్మ -మహావిష్ణువును భర్తగా పొంది గ్రామానికి తిరిగి వస్తుంది. తెనాలి రామలింగని సూచనతో సంస్కృత భాషలోని రామాయణాన్ని తెలుగులో కేవలం ఐదు రోజుల్లో అనువాదం పూర్తిచేస్తుంది. దుష్టులు తలపెట్టిన ఆటంకాలు ఎదుర్కొని కావ్యం పూర్తిచేసిన మల్లమ్మను శ్రీకృష్ణదేవరాయలు సత్కరించటం, ఆమె కావ్య గానంచేస్తూ శ్రీరామునిలో ఐక్యం చెందటంతో చిత్రం ముగుస్తుంది. చిత్రంలో దేవదాసిగా గీతాంజలి, రాయలసభలో నర్తకిగా జ్యోతిలక్ష్మి, వడ్లమాని విశ్వనాథం, ఏడిద నాగేశ్వరరావు, పెరుమాళ్లు, రామచంద్రరావు తదితరులు నటించారు.
అర్ధవంతమైన, ఆకట్టుకునే సన్నివేశాలతో చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకులు పద్మనాభం. చిత్రం ప్రారంభంలోనే కనకయ్యను మల్లమ్మ ఎదిరించటం, పేదవారిని కనకయ్య దండించటం, తీవ్రంగా వారు గాయపడడం, పేదలకష్టంతో దారులు వేసుకున్న స్వాములు కూలి ఇవ్వకపోవటంలాంటి సన్నివేశాలతో ఆనాటి పరిస్థితులను చక్కగా చూపించారు. గుడిలో దీపంవత్తి కొడి గడుతుండగా మల్లమ్మ నూనెపోసి ఎగత్రోయటం, అందుకు రామాచారి ఆగ్రహంతో మల్లన్న శతకం అగ్నిపాలు చేయటం, తరువాత మహావిష్ణువును మొల్ల కలిసిన సందర్భంలో విష్ణుమూర్తి ఆమెకు తన సోయగంనాడే గమనించానని వివరించటంలాంటి సన్నివేశాలతో ఆసక్తిని రేకెత్తించారు. అమ్మవారికి బలులు ఇవ్వకుండా మల్లమ్మ ఆపిందని.. రామాచారి బృందం వారి ఇళ్లను తగలబెట్టగా, అతనిపై దాడికి వెళ్లిన మల్లమ్మ దేవదాసి రంగనాయకి ఇంటికెళ్లటం, అక్కడ రంగనాయకి మల్లమ్మకు గోదాదేవి-విష్ణువుల కల్యాణ గాథను చక్కని పద్యాలతో, చిత్రాలతో వివరించటంతో మల్లమ్మలో వచ్చిన మార్పులాంటి సన్నివేశాలను అత్యద్భుతంగా తెరకెక్కించారు. తెనాలి రామలింగని తెలివి సూచించటానికి -నర్తకి జ్యోతిలక్ష్మి ఐదు భాషల్లో (తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, హిందీ) పాట, ఐదురకాల దుస్తులతో అద్భుత నాట్యం కనువిందుగా చిత్రీకరించారు. దొంగలపై ఉప్పునీరు చల్లడం, ధనవంతుడు ప్రభాకరరెడ్డి ప్రత్యక్ష పురాణం చెప్పమని పండితులను కోరగా -రామలింగడు ఆంజనేయుని సీతానే్వషణ, లంకాదహనం అభినయించి వస్తువులు తగలబెట్టి చూపటం, మహావిష్ణువును కలియటానికి మొల్ల పడిన శ్రమను ఆమె వేళ్లు చూపుతూ అర్థమయ్యేలా వెల్లడించటం, తానే విష్ణువని తెలియచేయటానికి సముద్రంలో విష్ణువు (హరనాథ్) దశావతారాలు చూపటం, ఊరికి తిరిగొచ్చిన మొల్ల తెనాలి రామలింగని ప్రశ్నలకు చక్కని జవాబులివ్వటం, రామాయణ రచనకు ఐదు రోజుల గడువు, ఆమె తండ్రి జేగంట మ్రోగించటం, దీనికి అడ్డుతగిలిన వారిని ఆంజనేయుడు అడ్డుకోవటం, శ్రీరాముని ఓ గీతంద్వారా ప్రార్థిస్తూ మొల్ల గుడిలో రాముని విగ్రహంలో ఐక్యంకావటం.. ఇలా పలు అర్ధవంతమైన సన్నివేశాలను తీర్చిదిద్ది తన ప్రత్యేకత చూపారు దర్శకులు పద్మనాభం. కథానాయిక మొల్లగా వాణిశ్రీ ఆ పాత్రకు తగిన అభినివేశంతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు పాత్రోచితంగా నటించటం, దేవదాసి రంగనాయకిగా గీతాంజలి ఆ పాత్రకు తగిన సౌమ్యతను, విచక్షణను ముచ్చటైన నటనతో మెప్పించారు.
చిత్ర గీతాలు:
అన్యాయాలకు బలైపోయిన అనాధల్లారా రండి (గానం: పి సుశీల బృందం, రచన: శ్రీశ్రీ). గీతాంజలిపై శ్రీరాముని గుడిలో నృత్యగీతం -తనువూ నీదే మనసూ నీదే (గానం: పి సుశీల, రచన: దాశరథి). జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించిన నృత్యగీతం -నానే చెలువే అందరికి (ఐదు భాషల్లో పాడిన పాట, గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, రచన: వి నరసింహం). లంకాదహనము, ప్రత్యక్ష రామాయణం (గానం: ఘంటసాల బృందం, రచన: అప్పలాచార్య). ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన యుగళగీతం, హరనాథ్-వాణిశ్రీలపై ప్రకృతిలో చక్కని చిత్రీకరణ -దొరవో ఎవరివో నాకొరకే దిగిన దేవరవో (గానం: పి సుశీల, ఘంటసాల, రచన: దేవులపల్లి). వాణిశ్రీ, పద్మనాభంలపై సంవాద పద్యాలు -మీన రూపమున (గానం: పి లీల, మాధవపెద్ది, రచన: సినారె). వాణిశ్రీపై చిత్రీకరించిన -అమ్మనురా పెద్దమ్మనురా (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం, రచన: కొసరాజు). గీతాంజలి, వాణిశ్రీలపై చిత్రీకరించిన గోదాకల్యాణం పద్యం -విందువు వీనుల విందుగా (గానం: ఎస్ జానకి, రచన: మొల్ల). మరికొన్ని మొల్ల రచించిన పద్యాలు -శ్రీమహిమాభిరాముడు, -సుడిగొని రామ పదములు సోకే, -నీల మేఘచ్ఛాయ బోలు దేహంబువాడు (గానం: పి సుశీల). వాణిశ్రీపై చిత్రీకరించిన శ్రీశ్రీ పద్యం -అప్పుడు నే మిధిలకు జని. నేటికీ బహు వాడుకలో, స్మరణలో సాగే కథానాయకి మొల్ల చిత్రంలోని రెండు గీతాలు.. గుమ్మడి తదితరులపై చిత్రీకరించిన -మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసేనయా ఆడించుచున్నాడు (గానం: ఎస్‌పి బాలు, రచన: దాశరథి). మరోగీతం.. క్లైమాక్స్‌లో శ్రీరాముని గుడిలో వాణిశ్రీ అందరిముందూ గానంచేసే (కోరస్ సత్యనారాయణ) గీతం -జగమే రామమయం/ మనసే అగణిత రామమయం (గానం: పి సుశీల, రచన: సినారె).. నేటికీ భక్తిగీతాల్లో సంస్మరణీయంగా నిలవటం విశేషం.
‘కథానాయిక మొల్ల’ చిత్రానికి ప్రభుత్వ ప్రశంసలు దక్కాయి. 1970వ సంవత్సరానికి ‘బంగారు నంది’ అవార్డు లభించింది. పద్మనాభానికి ఈ శుభవార్తను మొట్టమొదట అంజలిదేవి ఫోన్‌చేసి చెప్పి అభినందించారట. ఉత్తమ దర్శకుడిగా పద్మనాభం, ఉత్తమ నిర్మాతగా పురుషోత్తం.. జలగం వెంగళరావు చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు. ఓ మంచి ప్రయత్నానికి లభించిన పురస్కారంగా భావించారు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి