ఫోకస్

రాజ్యాంగ సవరణ చేస్తేనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాపులకు రిజర్వేషన్లు కల్పించడం అనేది రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న నిబంధనవల్ల కాపులను ఎపి ప్రభుత్వం బిసిల్లో చేర్చినా జరిగే పని కాదు. రాజ్యాంగ సవరణ కోసం పట్టుబట్టినా కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయి. కాపులను బిసిల్లో కలుపుతామని చెప్పి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి శాస్ర్తియత లేని హామీ ఇచ్చింది. ఒకవైపు కాపులు తమను బిసిల్లో కలిపి రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతుంటే, మరోవైపు బిసిలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని నిబంధనలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే పులి మీద స్వారీలా ఉంది. కాబట్టి వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం ఏమంటే - హామీలు ఇచ్చేటప్పుడు ముందూ వెనకా ఆలోచించాలి. అప్పుడే ఇబ్బంది ఉండదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికి ఎన్నికల్లో గెలవాలనే యావ ఎక్కువ, అందుకు ఏదో నోటికొచ్చిన హామీలు ఇచ్చేయడం, తర్వాత వివాదం సృష్టించి వదిలివేయడం. ఇది సరైన పద్దతి కాదు. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, చేస్తే చేస్తామని, లేదంటే కాదని చెప్పాలి. అంతేకాని పరిస్థితి విషమించే వరకు తీసుకువెళ్లిన తర్వాత హడావుడిగా ప్రకటనలు చేయడం ఏమిటి? ఇప్పుడు కాపుల రిజర్వేషన్ అంశం కూడా ఇదే దారిలో ఉంది. ముద్రగడ ఆమరణ దీక్షతో కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదిక హడావుడిగా ఇవ్వడం సాధ్యం కాదని చెబుతోంది. ఇప్పుడు మళ్లీ ఆలస్యం కాక తప్పదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. అది సాధ్యం కాలేదు. అందుకు అనేక న్యాయపరమైన చిక్కులు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కెసిఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశ చూపించారు. అక్కడా అమలు చేయలేని పరిస్థితి. కెసిఆర్ ప్రభుత్వం తప్పుడు హామీని ఇచ్చి చేతులు దులుపుకుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అయినా సరే ఇలాంటి సున్నితమైన విషయాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఎపిలో కాపులను బిసిల్లో ఒకవేళ చేర్చినా బిసిల నుంచి పెద్దఎత్తున నిరసన రావడం ఖాయం. అంతెందుకు ఎపిలోని తెలుగుదేశం పార్టీలోనే ఏకాభిప్రాయం వచ్చే అవకాశం లేదు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే పార్టీలోని బిసిలు ఊరుకోరు. ఇవ్వకపోతే కాపులు ఊరుకోరు. ఇలా ఏకగ్రీవ అనుమతి లభించే అవకాశం కనిపించడం లేదు. అలాంటి పరిస్థితిలో ఈ రిజర్వేషన్ల అంశం ఎలా కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది.

- కె.నారాయణ సిపిఐ, జాతీయ కార్యదర్శి