ఫోకస్

కూర‘గాయాల’కు మందుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్‌లో కూరగాయల ధరలు రెండింతలు పెరిగిపోయాయి, దాంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు, వర్షాభావం, సాగు తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నా, మధ్యలో దళారీల మోసం కూడా సుస్పష్టం. రైతు తనకు గిట్టుబాటు ధర లేదని వాపోతుండగా, కొనుగోలుదారుడు ధరలతో మొర్రో అంటున్నాడు. రైతుకు అంతతక్కువ మొత్తం చేతికి అందిన తర్వాత కొనుగోలుదారుడి దగ్గరకు వచ్చేసరికి ఈ ధరలు ఆకాశానికి ఎలా అంటుతున్నాయి? ఇదో పెద్ద విశే్లషణీయ అంశం. ఊహించని రీతిలో పెరిగిన ధరలతో సామాన్యుడు కూరగాయలు కొనాలంటేనే వణుకుతున్నాడు. రెండుపూటలా తృప్తిగా తినలేక కడుపుమాడ్చుకునే పరిస్థితి వచ్చింది. ఒకపక్క నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటగా, అంతకుమించి కూరగాయల ధరలు పెరిగిపోయాయి. వీటికి పెరిగిన చమురు ధరలు తోడవడంతో అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ధరలు పెరిగాయి కదా అని నిత్యావసరాల వాడకాన్ని తగ్గించుకున్న సగటు మానవుడు కూరగాయల వినియోగాన్ని సైతం తగ్గించుకోలేకపోతున్నాడు. నిత్యం వినియోగించే ఉల్లిగడ్డలు, టమోటా, పచ్చిమిర్చి, వంకాయ, బీర, బీన్స్, క్యారట్, తదితర కూరగాయలు ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఉల్లిగడ్డలు 70 రూపాయిలు, టమోటా 40 రూపాయిలు పచ్చిమిర్చి వంద రూపాయిలు, వంకాయలు 40 రూపాయిలు, బెండకాయలు 60 రూపాయిలు, బీరకాయలు 60 రూపాయిలు చొప్పున విక్రయిస్తున్నారు. ఈ ధరలు ఊరు నుండి ఊరుకు, మార్కెట్ నుండి మార్కెట్‌కు మారుతున్నాయి. కొన్నింటి ధరలు తక్కువ ఉండగా, మరికొన్నింటి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ధరలను అదుపుచేస్తామని ప్రకటనలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం ఇవేవీ అమలుకావడం లేదు. పెరిగిన ఈ ధరలతో అన్నదాతైనా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడా అంటే అదీ లేదు. మార్కెట్‌కు తీసుకొచ్చిన కూరగాయలను వ్యాపారులు దళారులతో కలిసి రైతన్నను నిండా ముంచుతున్నారు. రైతుల వద్ద కిలో 15 రూపాయిలకు కొనుగోలు చేసి, మార్కెట్‌లో వాటిని కిలో 40 రూపాయిల వరకూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఢిల్లీలో అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సఫల్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసినా, అవి ఆశించిన ఫలితాలను సాధించడం లేదు, కొన్నిచోట్ల రైతు బజార్లు లేకపోవడంతో రైతు మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నారు. చివరికి ఇరు రాష్ట్రాల్లో కరివేపాకును సైతం దిగుమతి చేసుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం, వెల్లుల్లి ఇలా అన్నింటికీ సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు ఒకేచోట ఉండేలా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో హార్టికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. దీంతోపాటు ఇప్పటికే ఉద్యానవన శాఖ నిర్వహించిన సర్వేల్లో ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. ఆ అభిప్రాయానికి అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కూరగాయలు, పండ్ల ఉత్పత్తి పెంచి నగర, జిల్లాల అవసరాలకు పోను చుట్టుపక్కల రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా ప్రణాళికలు ఏర్పాటు చేయాలి, నిజామాబాద్ బోధన్ నుండి నాందేడ్, నల్లగొండ జిల్లా కోదాడ, సూర్యాపేటల నుండి గుంటూరు, విజయవాడ మార్కెట్లకు, గద్వాల్ నుండి కర్నూలుకు, ఖమ్మం నుండి చత్తీస్‌ఘడ్‌కు పంపించేలా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాలో మూడు నాలుగు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా జిల్లాకు మూడు నాలుగు క్లస్టర్లు గుర్తించాలి, అక్కడి పరిస్థితులకు డిమాండ్‌కు అనుగుణంగా పండ్లు, కూరగాయలు పండించేలా ప్రణాళికలు రూపొందించాలి. ఈ క్రమంలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కూరగాయల పెంపకంపై నైపుణ్యాన్ని సాధించేందుకు అవసరమైతే సిబ్బందిని ఇజ్రాయిల్ పంపిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కూరగాయల సాగును యాంత్రీకరించడం, అంతర్జాతీయ స్థాయిలో సత్ఫలితాలను సాధించిన పద్ధతులను అమలుచేయడం, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం, ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, మార్కెటింగ్, స్టోర్ చేసుకునే గిడ్డంగులను నెలకొల్పడం వంటి చర్యలతో మరిన్ని ఫలితాలు సాధించవచ్చనేది అందరి అభిప్రాయంగా ఉంది. కూరగాయల ధరలపై రైతు ఉద్యమ నేతల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.