ఫోకస్

ఎన్నికల అక్రమాలు ఆగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల వేదిక భారతదేశానిదే. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఎన్నికల నిర్వహణలో ఎన్నో సంస్కరణలు వచ్చాయి. సంస్కరణల లక్ష్యం ఒక్కటే- దేశంలో ప్రజాస్వామ్యం మరింత పరిఢవిల్లేలా చేయడం. ఎన్నికల అక్రమాలను నిరోధించడం, అర్హులైన అభ్యర్థులు, ప్రజాసేవకులను చట్టసభలకు పంపించడం. ఎన్ని సంస్కరణలు వచ్చినా ఇంకా కొన్నిచోట్ల కులం, మతం, వర్గం ప్రాబల్యంతోపాటు ధనం ప్రభావం కూడా కనిపిస్తూనే ఉంది. ఎన్నికల జాబితాల్లో పేర్ల నమోదు నుండి ఎన్నికల ఫలితాలను ప్రకటించే వరకూ అన్ని దశలనూ ఎన్నికల సంఘం సంస్కరించింది. ఓటర్లకు మరింత తేలికైన పద్ధతులను, సౌకర్యాలను కల్పించడంతోపాటు గోప్యతను పాటించడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అందులో భాగంగానే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వచ్చాయి. గతంలో ఎన్నికల బ్యాలెట్‌లు చేతికి ఇవ్వడం, బ్యాలెట్‌లలో గుర్తులను సరిగా వేయకపోవడం లేదా సూచనలను పాటించకపోవడం వల్ల చెల్లిన ఓట్ల సంఖ్య కంటే చెల్లని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న సందర్భాలు లేకపోలేదు. బ్యాలట్‌లను పార్టీల వారీ విడదీయడం, వాటిని కౌంట్ చేయడం, గణాంకాల్లో లోటుపాట్లు, ఇతర ఇబ్బందులను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఒక భాగం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు. దానిపై అవగాహన పెంచుకున్న తర్వాత దేశంలో ఐటిరంగం విప్లవాత్మకంగా అభివృద్ధి సాధించిన తర్వాత ఈవిఎంల పనితీరుపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఈవిఎంలలో ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని కొంతమంది నిపుణులు వాదిస్తున్నారు. ఏ పార్టీకి ఓటు వేసినా, ఒకే పార్టీకి ఓటు వేసేలా చేయవచ్చనేది ఈ వాదన. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఈవిఎంల సామర్థ్యం విషయంలో అనేక వివాదాలు చెలరేగాయి. హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించిన తీరు చూసిన తర్వాత ఈవిఎంలలో ఏమైనా జరిగిందా అనే అనుమానాలను చాలామంది వ్యక్తం చేశారు. ఈ వివాదాల కారణంగా ఓటు వేసిన తర్వాత ఏ పార్టీకి లేదా అభ్యర్థికి ఓటు వేశారో తెలియజేసే ఒక రసీదు పత్రాన్ని ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ పత్రాన్ని ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ ట్రయిల్ లేదా వివిపిఎటి అని వ్యవహరిస్తున్నారు. అయితే ఈ రసీదులు కేవలం కొన్ని నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా మాత్రమే జారీచేశారు. ఈ రసీదులు ఇవ్వాలంటే దేశవ్యాప్తంగా ఉన్న ఈవీఎంలకు ప్రింటర్లను కనెక్టు చేయాలి. ఈ ప్రతిపాదనలను గత ఏడాది ఫిబ్రవరిలోనే ఆమోదించారు. ఇందుకు దాదాపు 14 లక్షల ప్రింటర్లు అవసరం అవుతాయని అంచనా. ఇందుకు 1860 కోట్లు వ్యయం అవుతుంది. ఎన్నికలు లేని సమయంలో ఈవీఎంలను ఆరుబయటే ఉంచడం జరుగుతోంది. మళ్లీ వాటిని వాడేటప్పుడు చిప్‌లను మార్చినట్టయితే ఇతరులు ఎవరూ యంత్రంలో మార్పులు చేయడానికి వీలుండదు, ఒక చిప్‌నకు వంద రూపాయిలు ఖర్చవుతుంది, దానికి సైతం నిధులు ఇవ్వకపోవడంతో చిప్‌ల మార్పుకూడా జరగడం లేదు. ఈవీఎంలలో ఫలితాలను తారుమారు చేయడానికి, మోసాలకు పాల్పడ్డానికి వీలుందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ డిఆర్‌డిఓకు చెందిన ప్రొఫెసర్ ఎస్ సంపత్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ ఇందిరేశన్, ఎలక్ట్రానిక్ అండ్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ డాక్టర్ సి రావు కాసరబాదాలతో కమిటీని వేసింది. ఈ కమిటీ ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని నివేదిక ఇచ్చింది. అయినా ఆరోపణలు ఆగడం లేదు. దాంతో ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో రసీదును ఇచ్చే చర్యలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి చేపట్టారు. వోటింగ్ మిషన్‌ల పనితీరుపట్ల ఓటర్లకు మరింత విశ్వసనీయత కల్పించేందుకు ఈ ఎన్నికల్లో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీపీఏటి) రూపొందించారు. ఈవీఎంలతో పాటు వీవీపీఏటీ ప్రింటర్‌ను తయారుచేసి మొదటిసారిగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో వినియోగించారు. ఓటర్లు ఓటును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లినపుడు సంబంధిత అభ్యర్థి చిహ్నంపై ఓటు వేయగానే దానికి సంబంధించిన వీవీపీఏటి మిషన్‌లోని స్క్రీన్‌పై ఓటుకు సంబంధించి చిహ్నం ఏడు సెకన్లు కనిపించడంతోపాటు పేపర్‌పై చిహ్నంతో కలిపి ముద్రించబడుతుంది. ఓటింగ్ పూర్తయిన వెంటనే ఓటింగ్ మిషన్‌తోపాటు వీవీపీఏటికి సీలు వేస్తారు. దీంతో మిషన్‌లో పోలైన ఓట్లతోపాటు ప్రింటర్‌లో ఎన్ని ఓట్లు వేశారో చూసుకోవడం, అవకతవకలు జరిగినట్టు అనుమానాలు వస్తే వీవీపీఏటిలో ముద్రించిన ఓట్లను లెక్కించేందుకు కూడా వీలుంటుంది. ఒక్కో మిషన్‌లో 1500 ఓట్ల డాటాను పొందుపరిచారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వీటిని దేశ వ్యాప్తంగా అమలుచేసే అవకాశం ఉంది.... అపుడైనా ఎన్నికల అక్రమాలు ఆగుతాయో లేదో చూడాల్సిందే. ఈ అంశంపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.
* * *