ఫోకస్

పరీక్ష నిర్వహణ కేంద్రాలుగా మారాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయాలు అనేవి ప్రస్తుతం పరీక్షా నిర్వహణ కేంద్రాలుగా మారిపోయాయి. అసలు వీటి స్థాపన వెనుక ఉన్న ఉద్దేశమే గాడితప్పింది. కేవలం పరీక్షల నిర్వహణను సులభతరం చేసేందుకు చాలా ఎక్కువ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసినట్లు ఉంది. దీనివల్ల వైస్ చాన్సలర్ అనే పోస్టు కేవలం ఒక పరిపాలనాధికారిగా మారిపోతోంది తప్ప విద్యావ్యవస్థకు ఉన్నతమైన కేంద్రబిందువుగా ఉండి అద్భుతమైన శక్తిసామర్థ్యాలతో చురుకైన అకడమిక్ లీడర్‌షిప్ అనేది పోతోంది. విసిల నియామకాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిన మాట వాస్తవమే. కానీ ఆ వ్యవస్థలో అటువంటి పరిస్థితి రాకుండా అడ్డుకట్ట వేయాలి తప్ప ప్రక్షాళన పేరుతో మరో కొత్త పద్ధతిని అలవర్చుకోవడం అంటే అది మరీ విపరీత పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. వైస్ చాన్సలర్ అనే వ్యక్తి ఒక సబ్జెక్ట్‌లోనే మొత్తం ఫెర్‌ఫెక్ట్‌గా ఉంటే సరిపోదు. అకాడమిక్‌గా అన్ని రంగాల్లో విశేష అనుభవం కలిగి ఉండాలి. గతంనుంచీ జరుగుతున్నది ఇదే. కానీ మధ్యలో విసిల నియామకం, దాని రూపురేఖలు క్రమేణా మారిపోయాయ. విద్యావ్యవస్థపై నియమించిన తొలి కమిటీ అయిన రాధాకృష్ణ కమిటీ అప్పట్లో చెప్పింది కూడా సంస్కరణల గురించే. విశ్వవిద్యాలయం అనేది ప్రపంచంలో ఉన్న విజ్ఞానాన్ని అందించే దిశగా ప్రయత్నం జరగాలని చెప్పారు. దీనికితోడుగా ప్రాంతీయంగా ఉన్న కొన్ని సబ్జెక్టులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని కూడా చెప్పారు. ప్రాంతీయంగా ప్రాధాన్యతతో కూడిన అంశాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని విస్మరించకుండా ఉన్నతస్థాయి విజ్ఞానాన్ని విశ్వవిద్యాలయాలు అందించాల్సి ఉంటుందని రాధాకృష్ణ కమిటీ తెలిపింది. కాబట్టి కొన్ని సంస్కరణలు ఈ దిశగా రావాల్సిన అవసరం ఉంది. మరో ముఖ్యమైన అంశం రిజర్వేషన్లు. విశ్వవిద్యాలయంలో అటు ఉద్యోగాల్లోనూ, ఇటు విద్యార్థులకు అందించే రిజర్వేషన్లు ఉండాలి. దానిని ఎవరూ కాదని చెప్పలేం. కానీ రిజర్వేషన్ల ద్వారా వచ్చే ప్రయోజనాలు ఎంతవరకు ఫలిస్తున్నాయి, దానివల్ల వచ్చే సౌకర్యాలు ఏమిటి అనే అంశంపై మాత్రం పెద్దఎత్తున సమీక్ష జరగాల్సి ఉంది. విసిల నియామకంలో ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాన్ని కంట్రోల్ చేయాలి. అన్ని రంగాల్లో నిష్ణాతులను విసిలుగా నియమించాల్సి ఉంటుంది. కానీ రాజకీయ ఒత్తిళ్లు, సిఫార్సులకు తలొగ్గడం మంచిది కాదు. ఇంకా కావాలంటే కర్ణాటకలో ఉన్న విధానం మేరకు ప్రో చాన్సలర్‌గా ఎవరినైనా పెట్టుకుని చాన్సలర్‌గా వ్యవహరించే గవర్నర్ వద్దకు ప్రతి అంశం వెళ్లకుండా కావాలంటే చేసుకోవచ్చును. కర్ణాటకలో విద్యాశాఖ మంత్రి ప్రో చాన్సలర్‌గా వ్యవహరించి ఆ బాధ్యతలు చూస్తున్నారు. అంతేగానీ అలంకారప్రాయంగా విసి పోస్టును మార్చే ప్రయత్నం జరిగితే మంచిది కాదు.

- ప్రొఫెసర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ మాజీ వైస్ చాన్సలర్, ద్రవిడ యూనివర్శిటీ