ఫోకస్

స్వేచ్ఛ ముసుగులో పెడత్రోవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్న మాట వాస్తవమే. దీనికి అనేక రకాల కారణాలున్నాయి. పాశ్చాత్య పోకడలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల స్వేచ్ఛ స్వాతంత్య్రాల ముసుగులో యువత పెడదారి పడుతున్నారు. కాలం మారుతోంది. దానికి అనుగుణంగానే సమాజంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులతో జీవనశైలిలో పెనుమార్పులు సంభవించాయి. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉండడం వల్ల ఇబ్బందులు పెరుగుతూ వస్తున్నాయి. యువత తలోదారిలో ప్రయాణించడం, మానవ సంబంధాలకు ఉన్న మంచి ఉద్దేశాలను పట్టించుకునే సమయం కూడా లేకపోవడం వల్ల దారితప్పుతున్నారు. నూతన ఆర్థిక సంస్కరణలు ఏనాడైతే ఊపందుకున్నాయో, ఆనాటి నుంచి సమాజంలో ఒకరకమైన నైతికవిలువలు పతనానికి దారితీసిందని చెప్పాలి. సమాజంలో వస్తున్న మార్పులను యువత అందిపుచ్చుకుని మంచికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప చెడ్డప్రయోజనాలకు వినియోగించకూడదు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునాతన జీవనశైలితో దుర్వినియోగం ఎక్కువ జరుగుతోంది. చదువు, విలువలు ఉన్నప్పటికీ డబ్బే ప్రధానంగా మారింది. తెలివితేటలు, విద్యార్హతలు ఉన్నప్పటికీ డబ్బు లేకపోతే చేతకాని వాళ్లుగా మిగిలిపోతున్నారు. ప్రతిభకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కొన్ని విషయాల్లో తెలుగు రాష్ట్రాలు కొంచెం ఫర్వాలేదని చెప్పాలి. గురజాడ, కందుకూరి వీరేశలింగం వంటి గొప్పవాళ్లు మన తెలుగుగడ్డపై జన్మించడం, వాళ్ల కారణంగా కొందరు అదేబాటలో నడవడంవల్ల ఆ రోజుల నుంచి సమాజంలో కొంతవరకు మంచి జరిగింది. అయితే కాలక్రమంలో నూతన సరళీకృత విధానాలు, పెట్టుబడిదారీ వ్యవస్థ పెరిగిపోవడం వల్ల జీవనశైలిపై తీవ్ర ప్రభావం కనిపించింది. దీనిద్వారా వ్యవస్థలో అనూహ్యమైన పరిణామాలు, మార్పులు వచ్చి మానవ సంబంధాలు బెడిసికొట్టే వరకు వెళ్లాయి. ఐద్వావంటి సంఘాలు పోరాడ్డంవల్ల కొంతలో కొంతైనా సమాజంలో మార్పుకోసం ప్రయత్నం జరుగుతోంది. మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోవడం, యాసిడ్ దాడులు, వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం వంటి సంఘటనలు పెరిగిపోతూ వచ్చాయి. ఒకరిని చూసి మరొకరు దుర్వ్యసనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని చట్టబద్ధంగా అరికట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. యువత కష్టపడే మనస్తత్వంకన్నా, తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదించవచ్చనే భ్రమలో ఉండిపోయారు. లగ్జరీగా ఉండాలనే ఆలోచనేతప్ప నైతిక విలువలు అనేది పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో సమాజంలో యువతలో స్వంతంగా మార్పువస్తే తప్ప ప్రభుత్వాలు చేయగలిగింది లేదు. కానీ యువత ఆ పోకడ నుంచి బయటపడే ప్రయత్నం చేయడం లేదు.

- బి.హైమావతి, ఐద్వా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.