ఫోకస్

యువతా ఆలోచిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువత గాడి తప్పుతోంది అనేది అందరి విమర్శ. విమర్శ చేసేవారు యువతను సన్మార్గంలో ఉంచేందుకు ప్రయత్నించాలి. యువత గాడితప్పితే ఆ తప్పు వారిదికాదు... సమాజానిదే. ఎందుకంటే ఏ ఒక్కరూ కావాలని తప్పుదారి పట్టరు. పరిసరాలు, పరిస్థితుల ప్రభావం వారిని తప్పుదారి పట్టిస్తాయి. వాటిని అర్థం చేసుకుని లోతైన ఆలోచన చేసిననాడు, ఆ లోపాలకుపరిష్కారం సూచించిననాడు యువత శక్తివంతంగా తయారవుతుంది.
నిజానికి నేటి యువత దేశంకోసం, సమాజంకోసం, పరిసరాలకోసం ఆలోచిస్తోంది. పరిణామాలను సన్నిహితంగా పరిశీలిస్తోంది, సమస్యలకు సరికొత్త పరిష్కారాలను కనుగొంటోంది. సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం చేసే దిశగా యువతకు మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని యువసంపద మన దేశానికే సొంతం. అది యువత దృష్టిలో ఉంచుకోవాలి, దేశాభివృద్ధికి పాడుపడాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి మిగిలేది మనం చేసే మంచి పనులే అని వారికి తెలియజేయాలి, యువత తమ ప్రతిభకు పదును పెట్టి సమాజ దృష్టితో ఆలోచించాలి. ఆధునికతలో, అభివృద్ధిలో దేశం ముందుకు వెళ్లడానికి యువత ఒక ఉద్యమంలా ఆకలిపై, పేదరికంపై, అవినీతిపై, అనారోగ్యంపై, పరిశుభ్రతపై పోరాడాలి. మూఢత్వం, తీవ్రవాదం, ఉగ్రవాదం, మతోన్మాదాలకు దూరంగా ఉండాలి. తను ప్రేరణ పొందుతూ ఇతరులకు ప్రేరణ కలిగిస్తూ నైతికతతో ముందుకు సాగాలి. సమాజంలో ఉండే సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి. సమాజ గతిలో ప్రగతిలో పురోగతిలో కీలకపాత్ర పోషించాలి. యువత ముందు అనేక సవాళ్లున్నాయి. వ్యక్తిగత సమస్యలున్నాయి, సామాజికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాడు, వాటి పరిష్కారానికి తానే పూనుకోవాలి. సంకుచిత పరిధిలో తనకు తానుగా బందీగా ఉండకుండా, మానసికంగా పరాధీనులుగా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించగలగడం, విషమ పరిస్థితులను ఎదురొడ్డి నిలిచే ఆత్మస్థైర్యం, ఆత్మబలంతో ముందుకు సాగాలి, మానసిక బలాన్ని బుద్ధిబలాన్ని పెంపొందించే స్ఫూర్తినిచ్చే పుస్తకాలను చదవడం, ఆ దిశగా ప్రయత్నాలు చేయడంద్వారా అనుకున్నది సాధించగలుగుతారు. మొత్తంమీద మార్పుకోసం ప్రయత్నించే ధైర్యం చేయాలి, మంచి భావనలు, ఆశావాహ దృక్పధం, ఏదైనా సాధించగలనన్న పట్టుదల ఉండాలి, ఉన్నతమైన ఆలోచనలతో స్తబ్దంగా కాకుండా ప్రవహించే నదిలా చైతన్యంతో సాగాలి... అపుడే సరికొత్త ప్రపంచానికి నేటి యువత నాంది పలుకుతుంది.

-ప్రొఫెసర్ జి సూర్యనారాయణ, మాజీ చైర్మన్, ఎపిపిఎస్‌సి