ఫోకస్

నైతిక విలువలు ప్రబోధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో ఎలా బాధ్యతలతో, నీతి నిజాయితీగా బతకాలి అని నైతిక విలువల గురించి ప్రభోదించాల్సిన బాధ్యత మొదట తల్లిదండ్రులపైనే ఉంది. అవి నేర్పించకుండా మన పిల్లలు ఎంతో గొప్పగా, లగ్జరీగా బతుకుతున్నారంటూ సంతోషిస్తే సరిపోదు. వారి ప్రతి కదలికను ఒకకంట కనిపెడుతూ ఉంటేనే అనర్థాలు జరగవు. పిల్లలపట్ల తల్లిదండ్రులు అటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే వారూ పెద్దయ్యాక, వారి పిల్లలకూ నేర్పిస్తారు. అప్పుడే సమాజంలో ప్రశాంతత నెలకొంటుంది. చాలామంది తల్లిదండ్రులు వృత్తి, వ్యాపారాల్లో బిజీగా ఉంటూ పిల్లల నడవడికలపై అశ్రద్ధ చేస్తున్నారు. అటువంటి కుటుంబాల్లోనే బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల దేవిరెడ్డి విషయంలోనూ అదే జరిగిందన్న విమర్శ లేకపోలేదు.
ఆధునిక సమాజంలో, ముఖ్యంగా పట్టణాల్లో చాలా మంది లగ్జరీ జీవితాన్ని కోరుకుంటున్నారు. మంచిదే కానీ, ప్రవర్తన ఎలా ఉంటున్నది, పిల్లల స్నేహితులు ఎటువంటి వారు ఉన్నారు, మంచి నడవడిక ఉన్నవారేనే, వారు ఎక్కడెక్కడికి వెళుతున్నారు అనే కోణంలో పరిశీలన చేయాలి. అమ్మాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని, మగపిల్లాడు కాబట్టి స్నేహితులతో గడిపేసి వస్తాడులే అనే అజాగ్రత్తతో ఉండకూడదు. ఆడపిల్ల అయినా, మగపిల్లాడైనా సమానంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా టివీల్లో కొన్ని సీరియళ్ళు, కొన్ని సినిమాలు యువతను చెడగొట్టేలా ఉంటున్నాయి. వాట్సప్, ఫేస్‌బుక్ వంటివి వినియోగంలోనూ తప్పులు చేస్తున్నారు. దీనిని ఎవరు కట్టడి చేయాలి? అంటే తల్లిదండ్రులే చూసుకోవాలి. ఏదైనా ఘోరం జరిగితే ప్రభుత్వం ఏమి చేస్తున్నది? ఈ పోలీసులు ఏమి చేస్తున్నారంటూ ఆడిపోసుకుంటే నష్ట నివారణ జరుగుతుందా? ప్రభుత్వంపైనో, పోలీసులపైనో నెపం వేయకుండా తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు సమాజంలో నైతిక విలువలతో బతకడం గురించి నేర్పించాలి. అంతేకాదు వారికీ బాధ్యతల గురించి తెలియజేయాలి.
గతంలో అంటే ఓ పది, పదిహేనేళ్ళ క్రితం ఇంతగా ఘోరాలు జరగలేదు. రాను, రాను క్రైం రేటు ఎందుకు పెరుగుతున్నాయంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం కావడమే. మరోవైపు ‘పబ్’ల సంస్కృతి పెరుగుతోంది. లోగడ ఇటువంటివి లేవు. పైగా ఈ ‘పబ్’లపై నియంత్రణ ఉండడం లేదు. పబ్‌లు, బారులు ఏవైనా రాత్రి 10 గంటలకో, 11 గంటలకో మూసి వేయాలి కానీ రాత్రంతా కొనసాగేలా పోలీసులు అనుమతించడం కూడా సరైంది కాదు. ఇంకా చెప్పాలంటే కుటుంబాల జీవన శైలి మారి, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. ఇది కూడా కారణం అని చెప్పవచ్చు. ఉమ్మడి కుటుంబాల్లో భయం-్భక్తి అనేవి ఉండేవి. పిల్లలను ఎక్కడో వసతి గృహాల్లో చదివిస్తూ, తల్లిదండ్రులు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగ లేదా వృత్తి, వ్యాపారాల్లో ఉంటున్నారు. ఇవన్నీ కూడా కారణాలని చెప్పవచ్చు. మళ్లీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వస్తుందనే ఆశిస్తున్నాను. ఏదైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతలు, నైతిక విలువల గురించి ప్రభోదించినప్పుడే సమాజంలో అశాంతికి చోటు ఉండదు.

- బి. సంధ్యా రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు, మదర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు