ఫోకస్

పశువుల కన్నా హీనంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల తంతు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంది. సంతలో పశువుల కన్నా హీనంగా ప్రజా ప్రతినిధులను కొంటున్నారు, అలాగే అమ్ముడుపోతున్నారు. విలువలను గాలికొదిలేసి పదవులే పరమార్థంగా భావించి డబ్బు, అధికారానికి అమ్ముడుపోవడం దురదృష్టకరం. మనల్ని నమ్ముకుని గెలిపించిన ప్రజలకు ద్రోహం చేయడం నీచాతినీచం. అధికార పార్టీ బలం పెంచుకోవడానికి ఆరాటపడ్డం తప్ప స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అనేది పట్టించుకోవడం లేదు. అసలు స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలంటే ముందే ఏ పార్టీ గెలుస్తుందనేది తేలిపోతుంది. దాని లెక్క దానికుంటుంది. స్థానిక సంస్థల్లో ఏ పార్టీ బలం ఎంత ఉందో ఆ లెక్క ప్రకారం ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు. ఇది సాధారణంగా జరిగేది. అంతేగాని అధికారం, బలం ఉంది కదా అని మిగిలిన పార్టీల ప్రజాప్రతినిధులను బలవంతంగా తమ పార్టీలోకి లాక్కుంటున్నారు. ఇందుకు ప్రలోభాలు, పదవులు ఎరవేస్తున్నారు. అలా లొంగకపోతే బెదిరింపులకు దిగి అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. విలువలకు తిలోదకాలిచ్చి అనైతికంగా, నిస్సిగ్గుగా అధికార పార్టీలో చేరుతున్నారు. ఇక్కడ కొనేవాడు ఎంత ప్రమాదకరమో, అమ్ముడుపోవడమూ అంతే ప్రమాదం. అసలు మండలి ఎన్నికల విశిష్టతను పోగొట్టేవిధంగా అధికార పార్టీలు ఇలాంటి ఎన్నికల్లో కండబలం, అధికార బలాన్ని వినియోగిస్తున్నాయి. ఇంత బాహాటంగా పార్టీల ఫిరాయింపులు జరుగుతుంటే ఇటు కేంద్ర ఎన్నికల సంఘంగానీ, రాష్ట్ర ఎన్నికల సంఘంగానీ కళ్లప్పగించి చూస్తోంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. క్యాంపులు నిర్వహించి బేరసారాలు జరపడం, బాహాటంగా పార్టీ మారుతున్నట్లు ప్రజాప్రతినిధులు ప్రకటిస్తున్నా తమకేమీ పట్టనట్లు ఎన్నికల సంఘం వ్యవహరించడం సరికాదు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. తాము ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఒక పార్టీ తరఫున గెలిస్తే ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసి మరోపార్టీకి చేరాలి. ఇది సాధారణ సూత్రం. ఇందుకు విరుద్ధంగా నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితికి ఎన్నికల సంఘం కూడా బాధ్యత వహించాలి. ప్రజాప్రతినిధులు స్వయంగా ప్రకటించినప్పుడు సీరియస్‌గా పట్టించుకుని సుమోటోగా ఇలాంటి విషయాలను స్వీకరించి అటువంటి వారికి నోటీసులు జారీ చేసి చర్యలు చేపట్టాలి. అందుకు ఎన్నికల సంఘం నడుంబిగిస్తే కొంతలో కొంత మార్పు వస్తుంది. నిశ్శబ్దంగా ఉండడం మంచిది కాదు. అంతా చట్టం ప్రకారం చేయాలని భావించకుండా తక్షణమే స్పందించాలి. ఎమ్మెల్యేలే పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ, మరో పార్టీలో చేరితే చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా దిక్కూ మొక్కూ లేదు. ఇకనైనా ఎన్నికల కమిషన్ బాధ్యతగా వ్యవహరించాలి.

- కె.నారాయణ సిపిఐ, జాతీయ కార్యదర్శి