ఫోకస్

ప్రధాన మంత్రి చొరవ చూపాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కోర్టులకు సంబంధించి నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చొరవ చూపాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబులను కూచోబెట్టి ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం చూడాలి. ప్రస్తుతం రగులుతున్న న్యాయవాదులు, న్యాయమూర్తుల ఆందోళనకు ఇదే తుదిపరిష్కారం. దేశంలో జుడిషియరీ ఆఫీసర్లు రోడ్డు ఎక్కడం ఇదే మొదటిపర్యాయం. అంటే న్యాయవ్యవస్థ సంక్షోభంలో పడ్డదని స్పష్టమవుతోంది. న్యాయాధికారులు ఆందోళనకు దిగాల్సి రావడం దురదృష్టకరం. మొత్తం న్యాయవ్యవస్థకే ఇది కనువిప్పు కలిగించే అంశంగా భావించాల్సి ఉంటుంది. విధిలేని పరిస్థితిలోనే న్యాయాధికారులు ఆందోళనకు దిగారని స్పష్టమవుతోంది. ఒక పర్యాయం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆటోమెటిక్‌గా అన్ని విభాగాలు, అన్ని శాఖల్లో విభజన జరిగితే సమస్య ఉత్పన్నం అయ్యేదికాదు. పదిసంవత్సరాల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడిరాజధానిగా ఉండేలా విభజన సమయంలో కేంద్రం ప్రకటించింది. ఆనాటి పరిస్థితికి ఆ నిర్ణయం సరిపోయింది. ప్రస్తుతం ప్రశాంతవాతావరణం లేదు. ఉద్విగ్నమైన పరిస్థితి కొనసాగుతోంది. జలవివాదాలు, ఉద్యోగ విభజన వివాదాలు, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల వివాదం, కోర్టు విభజన తదితర అంశాలన్నీ సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైందే ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందని, నీటి పంపిణీలో న్యాయం జరగలేదని, నిధులు సరిగ్గా ఇవ్వడం లేదనే అంశాలపైనే. రాష్ట్ర విభజన అనంతరం కూడా కోర్టులకు సంబంధించి ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరగడం వల్లనే న్యాయవాదులు, న్యాయాధికారులు ఆందోళన బాట పట్టారు. ఆందోళన చేస్తున్న న్యాయాధికారులను సస్పెండ్ చేయడం సాంకేతికంగా కరెక్ట్ కావచ్చేమో కాని, ప్రస్తుతం ఏర్పడి ఉన్న వాతావరణం, ఆందోళనను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రమశిక్షణాపరమైన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. ఉద్యోగుల విభజన 58:42 శాతం చొప్పున ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగింది. ఇదే సూత్రం న్యాయవ్యవస్థ, కోర్టుల్లో కూడా జరగాలి కదా! అలా జరగక పోవడం వల్లనే ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితిలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రధాన మంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలోని ఒక రాష్ట్రంలో ఆందోళన జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా న్యాయవ్యవస్థ రగిలిపోతుంటే ప్రజాస్వామ్య విధానంలోనే ప్రధాని జోక్యం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.

- డాక్టర్ కె. నారాయణ సిపిఐ జాతీయ నాయకుడు