ఫోకస్

అలా.. పార్టీలు మారొచ్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగునాట పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అపహాస్యం చేసే విధంగా రాజకీయాలు సాగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ తన బలాన్ని పెంచుకునేందుకు లేదా విపక్ష పార్టీని బలహీనపరిచేందుకు చట్టాల్లోని లొసుగులను ఆసరా చేసుకుని ప్రజాప్రతినిధులను లోబరచుకోవడం, ఫిరాయింపులకు ప్రోత్సహించడమనే విధానం కొనే్నళ్లుగా కొనసాగుతోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు తెలుగుదేశం పార్టీనుంచి, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితినుంచి ఎడపెడా ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇప్పుడు అదే మంత్రాన్ని అటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, ఇటు తెలంగాణలో టిఆర్‌ఎస్ అనుసరిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్ష పార్టీ అభ్యర్థుల్ని టిఆర్‌ఎస్ నేతలు ప్రలోభ పరచి, తమ పార్టీలోకి చేర్చుకోవడంతో ఫిరాయింపుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. అరవై, డెబ్భై దశకాల్లో అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర అసెంబ్లీల్లోనూ ఫిరాయింపులు జోరుగా సాగేవి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మారిన ఈ ఫిరాయింపుల ప్రహసనానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు 1 మార్చి 1985లో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 52వ సవరణ ద్వారా సవరించారు. ఆ తర్వాత కూడా 191 ఆర్టికల్‌కు రెండు దఫాలు సవరణలు తెచ్చారు.
ఇంత పకడ్బందీగా తెచ్చినా చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని ఫిరాయింపులను నాయకమ్మన్యులు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. తెలంగాణలో తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారం- పార్టీ ఫిరాయింపులకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై సనత్‌నగర్ నియోజకవర్గంనుంచి గెలిచిన తలసాని, తదనంతర పరిణామాల్లో టిఆర్‌ఎస్‌లో చేరి, మంత్రిపదవిని అలంకరించారు. ఒక పార్టీనుంచి గెలిచి, మరో పార్టీలోకి మారి ఏకంగా మంత్రి పదవిని చేపట్టడం వివాదాస్పదంగా మారింది. అదేమంటే- తాను ఎప్పుడో రాజీనామా చేశానని, తన రాజీనామా స్పీకర్‌వద్ద పెండింగ్‌లో ఉందనేది తలసాని వాదన. వాస్తవానికి ఒక పార్టీనుంచి గెలిచి, మరో పార్టీలో చేరి, అధికారిక పదవి చేపట్టడాన్ని ఫిరాయింపుల నిరోధక చట్టం నిషేధిస్తోంది. ఇలా పార్టీ మారిన వారు తమ మునుపటి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, పదవిని చేపట్టవచ్చు. అయితే ఆరు నెలలల్లోగా మళ్లీ చట్టసభకు పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. అయితే అనర్హత పిటిషన్ స్పీకర్ వద్దే పెండింగ్‌లో ఉండటం వల్ల పోటీ చేసి గెలవాల్సిన అవసరం లేకుండానే పదవిలో కొనసాగే ‘వెసులుబాటు’ తలసాని వంటి వారికి లభిస్తోంది. ఫిరాయింపులకు పాల్పడిన సభ్యులపై అనర్హత వేటు వేసేందుకు పదో షెడ్యూల్‌లో కాల వ్యవధిని పేర్కొనకపోవడం ప్రభుత్వాలకు కలసి వస్తోంది. చట్టసభల్లో స్పీకర్ నిర్ణయాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకునే వెసులుబాటును రాజ్యాంగం కల్పించకపోవడం కూడా ఫిరాయింపుల చట్టంలోని మరో లొసుగు.
ఒక పార్టీనుంచి చట్టసభకు ఎన్నికై, చట్టసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే మరో పార్టీలో చేరడం ఫిరాయింపుల పర్వంలోని ఒక అంశం కాగా, ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులను సామ దాన భేద దండోపాయాలననుసరించి తమ పార్టీలోకి చేర్చుకోవడం మరో అంశం. దీంతో అభ్యర్థుల్లేక ఎన్నిక ఏకగ్రీవం అయిన ఉదంతాలు ఇటీవల తెలంగాణలో జరిగిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో చోటు చేసుకున్న విచిత్రం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ నాడు విపక్ష అభ్యర్థులు ఫిరాయించడం రాజకీయ పార్టీల నేతలనే కాదు...సభ్య సమాజాన్నీ విస్మయ పరచింది.
ఫిరాయింపుల పర్వం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఒకప్పుడు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఫిరాయింపులకు పెట్టింది పేరు. ‘ఆయారామ్, గయారామ్’గా ఈ వ్యవహారం ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ ఫిరాయింపులు జరగని రాష్ట్రాలు అరుదనే చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో సభ్యుల అనర్హత పిటిషన్లపై స్పీకర్ వైఖరిని నిరసిస్తూ విపక్ష పార్టీల నేతలు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించినంతవరకూ స్పీకర్‌దే తుది నిర్ణయమన్న సుప్రీం, రెండు నెలలపాటు వేచి చూడాలనే నిర్ణయానికి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్న రాజకీయ పార్టీల వైఖరిని సరిదిద్దడమెలా? చట్టానికి మరో సవరణ తీసుకురావలసిన అవసరం ఉందా? వంటి విషయాలపై అనుభవజ్ఞులు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీల నేతలు ఏమంటున్నారో ఈ వారం ‘పోకస్’లో చూద్దాం.
* * *