ఫోకస్

పాలనలో నామమాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర పరిపాలనలో గవర్నర్ పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రాజ్యాంగం గవర్నర్‌కు అధికారాలు కల్పించినప్పటికీ, అవి నామమాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులు (జిఓలు) గవర్నర్ పేరుతో విడుదల అవుతున్నప్పటికీ, వాటితో గవర్నర్‌కు ఎలాంటి సంబంధం ఉండటం లేదు. ఏ జీఓలో ఏముందో, ఏ జీఓ ఎందుకు వెలువరిస్తున్నారో గవర్నర్ ముందస్తు అనుమతి ఏమీ తీసుకోరు. ప్రభుత్వ నిర్ణయాలకు మంత్రివర్గం బాధ్యత వహిస్తుంది. మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలన్నింటికీ గవర్నర్ కట్టుబడే ఉండాలి. మంత్రివర్గానికి గవర్నర్ జవాబుదారీగా ఉండాలి. గవర్నర్ సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతాడంటే అది ఆయన/ఆమె రాజీనామాపైనే. గవర్నర్ పోస్టుకు రాజీనామా చేసే అంశంపై సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం ఒక్కటే ఉంటుంది. ఆ రాజీనామాను కూడా కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. మరొక సందర్భంలో గవర్నర్ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీకీ మెజారిటీ లేని సందర్భంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏదైనా రాజకీయ పార్టీని ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత శాసనసభలో గవర్నర్ ఆదేశాల మేరకు మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అధికారాన్ని కూడా స్వతంత్రంగా ఉపయోగించుకునేందుకు వీలులేదు. కేంద్ర ప్రభుత్వం సలహాలు, సూచనల మేరకే ఏ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పిలవాలో ఆదేశిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్ పోస్టు ఒక ఉత్సవ విగ్రహం లాంటిదే. గవర్నర్ ప్రజల చేత ఎన్నుకునేవారు కాదు. ఏ రాష్ట్రంలో ఎవరిని గవర్నర్‌గా నియమించాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. గవర్నర్ పదవీకాలం ఐదేళ్లుగా ఉంటుంది. గవర్నర్‌గా ఒక వ్యక్తి పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఐదేళ్ల కాలానికి ముందే కేంద్రంలో ప్రభుత్వం మారితే, గవర్నర్ పోస్టుకు ఆ వ్యక్తి రాజీనామా చేయడం నైతిక బాధ్యత. అయితే కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వానికి అంగీకారయోగ్యమైతే అప్పటి వరకు ఉన్న గవర్నర్లను కొనసాగించవచ్చు. లేదనుకుంటే గవర్నర్ చేత రాజీనామా కోరడమో, పదవినుండి తొలగించడమో చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉండే రాజకీయ పార్టీ తమకు అనుకూలమైన వారిని గవర్నర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులనే నియమిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పరిపాలనలో అనుభవం ఉండి రాజకీయాలకు సంబంధం లేనివారిని కూడా నియమిస్తూ ఉంటారు. చట్టసభల్లో పార్టీమారే విషయంలో గవర్నర్ ఆ శాసనసభ స్పీకర్ సలహా పాటించాల్సి వస్తుంది. స్పీకర్ నిర్ణయాన్ని గవర్నర్‌కు ప్రశ్నించే అధికారం ఉండదు. అలాంటి సందర్భాలలో హైకోర్టుకు మాత్రమే స్పీకర్ నిర్ణయంపై ప్రశ్నించే అధికారం ఉంటుంది.
ముఖ్యమంత్రినే గవర్నర్‌గా నియమించాలన్న చర్చ వస్తున్నప్పటికీ, రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పదవి ఉండక తప్పదు. నామమాత్రమైనా ఈ పదవిని కొనసాగించాల్సిందే!

- ఎస్. రామచంద్రరావు మాజీ అడ్వకేట్ జనరల్, ఆంధ్రప్రదేశ్.