ఫోకస్

మాతృభాష అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదవ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి. కావాలంటే ఇంటర్ నుంచి ఇంగ్లీష్‌లో ఆయా శాస్త్రాల గురించి నేర్పించవచ్చు. మూడవ తరగతి, నాలుగవ తరగతి నుంచి ఇంగ్లీష్ ఐచ్చికంగా చెప్పవచ్చు. కానీ బోధనా మాధ్యమం మాత్రం తెలుగులోనే ఉండాలి. ప్రపంచంలో అనేక దేశాల్లో మాతృభాషలోనే విద్యా బోధన జరుగుతోంది. చెకోస్లవేకియా కోటి మంది జనం ఉన్న దేశం. మాతృభాషలోనే విద్యా బోధన జరుగుతోంది. ఇంజనీరింగ్, సైన్స్, మాథ్స్ వంటివి గతంలో రష్యా భాషలో, ఇప్పుడు ఇంగ్లీష్‌లో చెబుతున్నారు. మిగిలినవన్నీ మాతృభాషలోనే నేర్పిస్తారు. మన సంస్కృతి, సంప్రదాయం, మానవత్వం, పెద్దలను గౌరవించడం, విలువలు ఇవన్నీ తల్లినుంచి మాతృభాషలోనే పిల్లలకు అలవాటు అవుతాయి. తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో, మాతృభాషకు అలాంటి గౌరవం ఇవ్వాలి. చిన్నప్పటినుంచి తల్లి తన పిల్లలకు ప్రేమ, సహనం వంటివాటి గురించి నేర్పిస్తుంది. అంతేతప్ప సైన్స్‌ను నేర్పదు. రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగులోనే పాలన సాగాలి. తమ సమస్యలపై ప్రజలు తెలుగులో విజ్ఞాపన పత్రం అందజేస్తే తెలుగులోనే సమాధానం ఇవ్వాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంఏ తెలుగు చదివారు. తెలుగును ప్రేమిస్తారు. ఒక సభలో ప్రముఖులంతా ఇంగ్లీష్‌లో మాట్లాడితే మీలో తెలుగు అర్థం కాని వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నిస్తే, సభకు హాజరైన వారంతా అర్థం అవుతుంది అని చెప్పడంతో చక్కగా తెలుగులో మాట్లాడారు. ఆయన తెలుగును ప్రేమిస్తారు, గౌరవిస్తారు. తెలుగులో పద్యాలు కూడా చెప్పగలరు. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు లేదా కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణకు చెందుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి ప్రకటించలేదు కానీ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామంటున్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగును అధికార భాషగా అమలు చేసేందుకు అధికార భాషా కమిషన్ ఏర్పాటు చేశారు. తెలుగు అకాడమీ గతంలో ఉండేది ఇప్పుడు అది కూడా లేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి వారు దేనికి ప్రాధాన్యత ఇస్తే ఆ తరువాత వారు కూడా దానికే ప్రాధాన్యత ఇస్తారు. మంత్రులు కూడా తెలుగులోనే మాట్లాడాలి. తెలంగాణలో బడ్జెట్‌ను తెలుగులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం తెలుగులోనే సాగింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బడ్జెట్ ప్రసంగం ఇంగ్లీష్‌లోనే సాగింది, ఇంగ్లీష్‌లోనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. మాతృభాషను పరిరక్షించడానికి పాలకులు తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

త్రిపురనేని హనుమాన్ చౌదరి, ప్రజ్ఞ్భారతి