ఫోకస్

ప్రజల విశ్వాసం చూరగొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం చూరగొనాలి. గత అరవై సంవత్సరాల నుండి కేంద్రంలో ఉండే ప్రభుత్వ విధానాలే ఆ రాష్ట్రంలో అశాంతికి మూలకారణం. భారత స్వాతంత్య్రానికి ముందు హైరాబాద్ రాష్ట్రం తరహాలోనే జమ్మూ కాశ్మీర్‌లో రాజరికం ఉండేది. అక్కడ మెజారిటీ ప్రజలు ముస్లింలు కాగా, హిందువు రాజుగా ఉండేవాడు. భారత్ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డ తర్వాత జమ్మూ కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా మార్చేందుకు అక్కడి రాజు ప్రయత్నించారు. నిజాం రాజు తరహాలోనే జమ్మూ-కాశ్మీర్ రాజు కూడా స్వతంత్ర జమ్మూకాశ్మీర్ దేశాన్ని ప్రకటించుకునేందుకు యత్నాలు చేశారు. ఈ పరిస్థితిలో రాచరికానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. హిందూ రాజుకు వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లా నేతృత్వంలో భారీఎత్తున పోరాటం జరిగింది. జమ్మూ కాశ్మీర్ స్వతంత్య్ర దేశంగా ఉండవద్దని భారత్‌లో కలవాలనేది పోరాటం చేసినవారి ప్రధాన లక్ష్యం. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు హక్కులు ఉండేవి. భారత్‌లో జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా కలిసినా ప్రజల హక్కులకు భంగం వాటిల్లకుండా చట్టం చేయాలన్నది ప్రధాన ఉద్దేశంగా ఉండేది. అందుకు అనుగుణంగా రాజ్యాంగంలో 370 ఆర్టికల్‌ను పొందుపరిచారు. అంటే జమ్మూకాశ్మీర్ భారత్‌లో కలవాలని, అదే సమయంలో ప్రజల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా రాజ్యాంగ ప్రకారం హక్కులు ఉండాలన్నది ఈ ఆర్టికల్ ఉద్దేశం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అక్కడి ప్రజల హక్కులను హరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటూ వస్తోంది. ప్రజలకు కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతూ వస్తోంది. దాని పర్యవసానంగా జమ్మూకాశ్మీర్ ప్రజలు ఆందోళన బాట చేపట్టారు. యువత తీవ్రవాదంవైపు మళ్లారు. ఇదే అదనుగా భావించిన పొరుగు దేశమైన పాకిస్తాన్ జమ్మూకాశ్మీర్ యువతకు మద్ధతు ఇస్తూ వస్తోంది. గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు పూర్తిబాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రవాదాన్ని అణచివేయాలన్న కారణాన్ని చూపుతూ భారీఎత్తున సైన్యాన్ని జమ్మూకాశ్మీర్‌లో దించింది. దాంతో మానభంగాలు, లూఠీలు కొనసాగుతున్నాయి.
ఈ పరిస్థితిలో పాకిస్తాన్‌లోని తీవ్రవాదులు తరచూ భారత సైన్యంపై దాడి చేస్తున్నారు. ఈ దాడులను అందరూ, అన్ని దేశాలు ఖండించాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే భారత్-పాక్‌ల మధ్య యుద్ధం అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. జఠిలమైన జమ్మూకాశ్మీర్ సమస్య పరిష్కారానికి చర్చలే ప్రధానంగా ఉపయోగపడతాయి. జమ్మూకాశ్మీర్ ప్రజల విశ్వాసం చూరగొనడానికి చర్చలే ప్రధానంగా తోడ్పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పాక్‌తో యుద్ధం చేయాలన్న ఆలోచన వల్ల సామాన్య ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదు.

- తమ్మినేని వీరభద్రం సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి