ఫోకస్

మతాంశాలపై జాగ్రత్త అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) తీసుకువస్తే మంచిదే కాని ఇది ఏ మతాచారాలకు వ్యతిరేకంగా ఉందన్న భావన ప్రజల్లో రాకూడదు. ఒక మతాచారాల్లో ప్రభుత్వం తలదూర్చడం మంచిది కాదు. ఒకే దేశం.. ఒకే చట్టం అనడంలో తప్పు లేదు. కాని మనది లౌకికరాజ్యం. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కుల్లో మతస్వేచ్ఛ ప్రధానమైంది. మతాలకు సంబంధించి ప్రజలకు కొన్ని విశ్వాసాలుంటాయి. ఈ విశ్వాసాలకు విఘాతం కలుగుతోందన్న భావన ఏ మతానికి చెందిన ప్రజల్లో కూడా కనిపించకూడదు. ముస్లింల వివాహాలకు సంబంధించి ముస్లిం పర్సనల్ లా (షరియా లా మీద ఆధారపడి ఉన్న చట్టం) ఉంది. వివాహం అయిన దంపతులు విడాకులు తీసుకోవాలంటే భర్త మూడుసార్లు ‘తలాక్’ అంటే సరిపోతుంది. అయితే దీనికీ కొన్ని షరతులు ఉన్నాయి. ఇది ముస్లింలందరికీ ఆమోదయోగ్యంగా కొనసాగుతోంది. ముస్లింలు అంతా ఈ అంశంపై వ్యతిరేకంగా ఉంటే ముస్లిం పర్సనల్ లాలోనే మార్పులు చేసే అవకాశం ఉందేమో పరిశీలించాల్సి ఉంటుంది. ఒక మతాచారాపై భారత రాజ్యాంగంతో వత్తిడి తీసుకురావడం సముచితం కాదు. కేవలం ముస్లిం పర్సనల్ లాకు అనుగుణంగానే కాకుండా, కొంతమంది ముస్లింలు తమ వివాహాలను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. అన్ని మతాలకు చెందిన వారు కూడా వివాహాలను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుంది.
మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ముస్లింలలో కూడా మార్పులు వస్తున్నాయి. ముస్లిం మహిళలు ఉన్నత చదువులు చదువుతున్నారు. హైదరాబాద్‌లోని షాదన్ తదితర కాలేజీల్లో వేలాది మంది ముస్లిం యువతులు చదువుకుంటున్నారు. బాగా చదివి, ఉన్నత ఉద్యోగాల సంపాదించి, ఆర్థికంగా బలపడుతున్నారు. అంటే ముస్లిం మహిళలు కూడా ఆర్థికంగా బాగానే సంపాదిస్తున్నారని స్పష్టమవుతోంది. దాంతో సామాజికంగా ఊహించని విధంగా మార్పులు వస్తున్నాయి. మహిళలను తక్కువగా చూస్తే వౌనంగా ఉండటం లేదు.
ఈ పరిస్థితిలో ఒక మతానికి, మతాచారాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒక మతానికి సంబంధించిన అంశాలపై కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు ఆ మతానికి సంబంధించిన పెద్దలను, పీఠాధిపతులను సంప్రదించాల్సిన అవసరం ఉంది. సహనానికి భారతదేశం మారుపేరన్న విషయం మరువరాదు.
విడాకుల విషయానికి వస్తే అది కేవలం ముస్లింలకే పరిమితం కాలేదు. హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మతాల్లో కూడా వందలు, వేలాది మంది విడాకులు తీసుకుంటున్నారు. మహిళా కోర్టులకు వెళితే అనేకమంది యువతీ, యువకులు విడాకుల కోసం కోర్టుల్లో కేసులు వేసి, వాదించుకుంటున్నారు. రోజూ కలహించుకుంటూ, జీవించలేని పరిస్థితి ఉంటేనే ఎవరైనా విడాకులు కావాలని భావిస్తారు. ఇది ఏ మతానికో, ఏ కులానికో పరిమితం కాలేదు. అందువల్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, నింపాదిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- హెచ్‌జె దొర డిజిపి (రిటైర్డ్) ఆంధ్రప్రదేశ్